ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌ ఫ‌ర్మేశన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

బ్యాంకింగ్.. ఆర్థిక సేవలు.. బీమా (బిఎఫ్‌ఎస్‌ఐ) రంగాల్లో సైబర్ భద్రతకు మద్దతుగా తొలి ‘డిజిటల్ ముప్పుల నివేదిక-2024’ను ఆవిష్కరించిన భారత్‌

· దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక వంటి రంగాల రక్షణలో ఏకీకృత సైబర్ భద్రత చట్రం అవసరాన్ని ప్రస్ఫుటం చేసిన మంత్రిత్వ శాఖ కార్యదర్శి ఎస్‌.కృష్ణన్‌

· రంగాలవారీగా భద్రత అంతరాలతోపాటు రాబోయే సైబర్ ముప్పులను గుర్తించి ‘బీఎఫ్‌ఎస్‌ఐ’ సంస్థల రక్షణ వ్యవస్థల బలోపేతానికి మార్గాలు సూచించిన నివేదిక

· ముప్పుల ముందస్తు గుర్తింపు.. భవిష్యత్‌ ప్రమాదాలపై అంచనాలతో నేర శక్తులకన్నా ఆర్థిక సంస్థలు ముందంజలో ఉండేవిధంగా దీర్ఘకాలిక సైబర్ పునరుత్థాన శక్తి కల్పించడం ఈ నివేదిక ధ్యేయం: సెర్ట్‌-ఇన్‌ డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్ సంజయ్ బహల్‌

Posted On: 07 APR 2025 5:27PM by PIB Hyderabad

దేశంలో బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, బీమా (బీఎఫ్‌ఎస్ఐ) రంగాల్లో సైబర్ భద్రత బలోపేతం, పునరుత్థాన శక్తి పెంపు లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఓ కీలక చర్య చేపట్టింది. ఇందులో భాగంగా ఎలక్ట్రానిక్స్‌-ఐటీ మంత్రిత్వ శాఖ పరిధిలోని ‘సెర్ట్‌-ఇన్‌’, సీఎస్‌ఐఆర్‌టీ -ఎఫ్‌ఐఎన్‌’, అంతర్జాతీయ సైబర్‌ భద్రత సంస్థ ‘ఎస్‌ఐఎస్‌ఏ’ల సంయుక్త సహకారంతో 

‘డిజిటల్ ముప్పు నివేదిక-2024’ను ఆవిష్కరించింది. ‘బీఎఫ్‌ఎస్ఐ’ రంగాల్లో ప్రస్తుత, భవిష్యత్‌ సైబర్‌ ముప్పులపై సమగ్ర విశ్లేషణ, పటిష్ఠ రక్షణ వ్యూహాల రూపకల్పనలో ఇది తోడ్పడుతుంది.


ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిధిలోని ఆర్థిక సేవల విభాగం కార్యదర్శి శ్రీ ఎం,నాగరాజు, ఎలక్ట్రానిక్స్-ఐటీ శాఖ కార్యదర్శి శ్రీ ఎస్.కృష్ణన్, కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్‌ (సెర్ట్‌-ఇన్‌) డైరెక్టర్ జనరల్ డాక్టర్ సంజయ్ బహల్‌, ‘ఎస్‌ఐఎస్‌ఎ’ వ్యవస్థాపకుడు-సీఈవో దర్శన్ శాంతమూర్తి ఈ నివేదికన సంయుక్తంగా ఆవిష్కరించారు.

సహకారాత్మక సైబర్‌ రక్షణ వ్యూహం

ఈ సందర్భంగా ఎలక్ట్రానిక్స్-ఐటీ మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ ఎస్.కృష్ణన్ మాట్లాడుతూ- ఆర్థిక రంగంలో డిజిటల్‌ సాంకేతిక పరిజ్ఞానం శరవేగంగా వృద్ధి దూసుకుపోతున్న నేపథ్యంలో దానితో సమాంతరంగా ఎదురయ్యే సైబర్‌ ముప్పుల తీవ్రతను ప్రముఖంగా ప్రస్తావించారు. ఈ మేరకు “బీఎఫ్‌ఎస్‌ఐ సంస్థలతో కూడిన వ్యవస్థ స్వభావం పరస్పర అనుసంధానితం. దీనివల్ల ఒకే సైబర్ దాడి యావత్‌ వ్యవస్థపై దుష్ప్రభావం చూపగలదు. గురిపెట్టిన సంస్థకు అతీతంగా ఇతర అనుసంధానిత సంస్థలనూ దెబ్బతీసే ప్రమాదం ఉంటుంది. కాబట్టి, జాతీయ స్థాయిలోనే కాకుండా రంగాలవారీగానూ సమన్వయ సహిత సైబర్ భద్రత చర్యలు చేపట్టడం అత్యావశ్యకం అన్నది స్పష్టమవుతుంది. సకాలంలో సైబర్ నేరాల గుర్తింపు-ప్రతిస్పందన-నష్ట నివారణ దిశగా నియంత్రణ సంస్థలు, పరిశ్రమ భాగస్వాములు, అంతర్జాతీయ సైబర్ భద్రత సంస్థల మధ్య సహకారం తప్పనిసరి. ఈ విషయంలో ‘సెర్ట్-ఇన్’, సీఎస్‌ఐఆర్‌టీ-ఎఫ్‌ఐఎన్’లు కీలకపాత్ర పోషిస్తాయి. ఆ మేరకు ‘ఎస్‌ఐఎస్‌ఏ’ సహకారంతో ఈ నివేదికను రూపొందించాయి. ‘బీఎఫ్‌ఎస్‌ఐ’ సంస్థలు రక్షణ వ్యవస్థలను సమకూర్చుకోవడంలో, ఆర్థిక స్థిరత్వ ముప్పు తగ్గించడంలో, అధునాతన సైబర్ దాడులను సమర్థంగా ఎదుర్కోవడంలో సమష్టి సైబర్ భద్రత వ్యూహం రూపకల్పనకు ఇది తోడ్పడుతుంది” అని వివరించారు.

ఆర్థిక స్థిరత్వానికి సైబర్ భద్రతే పునాది

ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిధిలోని ఆర్థిక సేవల విభాగం కార్యదర్శి శ్రీ ఎం.నాగరాజు మాట్లాడుతూ- బలమైన సైబర్ రక్షణ వ్యవస్థలు ఎంతో కీలకమని స్పష్టం చేశారు. ఆర్థిక స్థిరత్వం, నమ్మకానికి సంబంధించి ఆర్థిక సేవల్లో సైబర్ భద్రత విస్తృత ప్రభావాలను ప్రస్ఫుటం చేశారు. ఈ మేరకు “సైబర్ భద్రత అంటే ఇకమీదట ఐచ్ఛిక రక్షణ కాదు.. నేటి డిజిటల్ శకంలో ఆర్థిక స్థిరత్వానికి పునాది అదే. భారత ‘బీఎఫ్‌ఎస్‌ఐ’ రంగం వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో డిజిటల్ లావాదేవీలకు రక్షణ నియంత్రణపరమైన అవసరం మాత్రమేగాక ఆర్థిక అత్యావశ్యక అంశం. అందుకే జాతీయ సైబర్ భద్రత సంస్థలు, పరిశ్రమ అగ్రగాముల మధ్య సంయుక్త కృషితో ‘బీఎఫ్‌ఎస్‌ఐ’ కోసం డిజిటల్ ముప్పుల నివేదిక-2024 రూపొందింది. సాంకేతికత, నియంత్రణానుసరణ, ముప్పులపై నిశిత నిఘా తదితరాలను ఏకీకృతం చేసే సమగ్ర విధానం ఆవశ్యకతను ఇది ప్రస్ఫుటం చేసింది. ఆర్థిక సంస్థల దుర్బలత్వంపై అంచనాలు, వాటి రక్షణ వ్యవస్థల బలోపేతం, పెరుగుతున్న అధునాతన ముప్పుల కాలంలో సైబర్ పునరుత్థాన శక్తి రూపకల్పనలో ఇది వాటికొక వ్యూహాత్మక బృహత్ప్రణాళికగా ఉపయోగపడుతుంది” అన్నారు.

‘బీఎఫ్‌ఎస్‌ఐ’ రంగానికి సైబర్ భద్రత వ్యవస్థ రూపకల్పనలో ఈ నివేదిక సమగ్ర విశ్లేషణను సమకూరుస్తుంది. ముందువరుస సైబర్ భద్రత ప్రదాతలు, జాతీయ సంస్థలు, ఆర్థిక రంగ నేర ప్రతిస్పందన బృందాలను ఒకే వేదికపైకి తెస్తుంది. ఆ మేరకు సహకారాత్మక స్వభావం, డిజిటల్ ముప్పుల తగ్గింపులో చురుకైన, నిఘా ఆధారిత విధానం ఆవశ్యకతను స్పష్టం చేస్తుంది.

అంతర్జాతీయ డిజిటల్‌ రూపాంతరీకరణలో ‘బీఎఫ్‌ఎస్‌ఐ’ రంగం అత్యంత కీలకం. ప్రపంచవ్యాప్తంగా 2028 నాటికి డిజిటల్‌ చెల్లింపుల విలువ 3.1 ట్రిలియన్‌ డాలర్లుగానూ, బ్యాంకింగ్‌ రంగంలో రాబడిలో వీటి వాటా 35 శాతంగానూ ఉంటాయని అంచనాలు పేర్కొంటున్నాయి. డిజిటల్ లావాదేవీలవైపు మార్పులో ఈ వేగం సైబర్ నేరగాళ్ల దాడికి తగిన వేదికగానూ మారుతుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత ముప్పులతోపాటు భవిష్యత్‌ దుర్బలత్వాల పరిశీలన సహా వ్యవస్థల స్థాయి కార్యకలాపాలను ప్రభావితం చేసే నిర్దిష్ట నిరోధక వ్యూహాల వైపు పూర్తిగా మళ్లడంలో డిజిటల్ ముప్పుల నివేదిక-2024 ప్రత్యేక ఉపకరణంగా ఉపయోగపడుతుంది. రంగాలవారీ ముప్పుల నుంచి రక్షణలో అంతరాలతోపాటు భవిష్యత్తు-దృక్పథ విశ్లేషణతో నేటి-రేపటి సైబర్ ముప్పులను ఎదుర్కొనేలా తగిన వ్యూహాలతో ఆర్థిక సంస్థలను సన్నద్ధం చేస్తుంది.

డిజిటల్ ముప్పుల నివేదిక-2024తో సైబర్‌ భద్రతపై బహుకోణీయ అవగాహన

ఎలక్ట్రానిక్స్‌-ఐటీ మంత్రిత్వ శాఖ పరిధిలోని ‘సెర్ట్-ఇన్’ డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ సంజయ్‌ బహల్‌ మాట్లాడుతూ- “సైబర్ భద్రత అన్నది సంస్థలకు వేర్వేరుగా రక్షణ కల్పించడానికి పరిమితం కాదు... ఇది యావత్‌ వ్యవస్థకు భద్రతనివ్వడానికి ఉద్దేశించినది. నేటి అత్యాధునిక అనుసంధాన ప్రపంచంలో సైబర్‌ ముప్పులు మునుపటికన్నా వేగంగా విస్తరిస్తున్నాయి. కాబట్టి సహకారాత్మక నిఘా భాగస్వామ్యం తప్పనిసరి. ఈ నేపథ్యంలో ఆర్థిక సంస్థలు తమ శత్రువులకన్నా ముందంజలో ఉండాలన్నా, రాబోయే ముప్పులకు అనుగుణంగా దీర్ఘకాలిక సైబర్ పునరుత్థాన శక్తి రూపకల్పనలో వాటికి సాధికారత లభించాలన్నా ఇదెంతో అవసరం.  ఆర్థిక సైబర్ భద్రతలో ప్రపంచ ప్రమాణాలను నిర్దేశించడంలో భారత్‌ నిబద్ధతను ఇలాంటి కార్యక్రమాలు ప్రస్ఫుటం చేస్తాయి. అంతేకాదు, డిజిటల్ లావాదేవీలు పెరిగేకొద్దీ అవి సురక్షితంగా, విశ్వసనీయంగానే కాకుండా భవిష్యత్ ముప్పుల నుంచి నష్టనివారణకు తగినవిగా ఉండేలా చూసుకుంటాయి” అని వివరించారు.

‘ఎస్‌ఐఎస్‌ఏ’ నిర్వహించిన ఫోరెన్సిక్ పరిశోధనలతో రూపొందిన ప్రత్యక్ష ప్రపంచ నిఘా, ‘సెర్ట్-ఇన్’ సైబర్ భద్రత పర్యవేక్షణ, ఆర్థిక రంగ ఉదంతాలపై ‘సీఎస్‌ఐఆర్‌టీ-ఎఫ్‌ఐఎన్’ ప్రతిస్పందన నైపుణ్యం తదితరాలను ఈ నివేదిక ఏకీకృతం చేస్తుంది. తద్వారా రాబోయే ముప్పులపై బహుకోణీయ అవగాహన కల్పిస్తుంది. కీలక దాడి మూలాలను గుర్తించడం, సరికొత్త ప్రతికూల వ్యూహాలు, భద్రతలో నిరంతర అంతరాల గుర్తింపు ద్వారా ప్రస్తుత సవాళ్లను ఈ నివేదిక వివరిస్తుంది. అంతేకాకుండా ప్రజలు, ప్రక్రియలు, సాంకేతికతలన్నిటా నిరోధక, నిఘా రక్షణ చర్యల అమలులో ఆర్థిక సంస్థలకు అనుసరణీయ, ఆచరణాత్మక సిఫారసులు కూడా చేస్తుంది.

చివరగా ‘ఎస్‌ఐఎస్‌ఏ’ వ్యవస్థాపకుడు-సీఈవో దర్శన్ శాంతమూర్తి నివేదిక ప్రాధాన్యాన్ని వివరిస్తూ- “సహకారాత్మక విధానంలో సైబర్ భద్రత పునరుత్ధాన శక్తికి రూపకల్పన చేశాం. వాస్తవ ప్రపంచ ముప్పులపై నిఘా, జాతీయ సైబర్ భద్రతపై అవగాహన, ముప్పు ఉదంతాలపై ఆర్థిక రంగ ప్రతిస్పందన ఏకీకరణ ద్వారా ఆర్థిక సంస్థలు రాబోయే ముప్పుల నుంచి సురక్షితంగా ఉండగల కార్యాచరణాధారిత మేధకు ఈ నివేదిక దోహదం చేస్తుంది. మా నిబద్ధత ఈ అవగాహనలకు అతీతంగా విస్తరించింది. భారత ‘బీఎఫ్‌ఎస్‌ఐ’ రంగంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా పునరుత్ధాన శక్తిని బలోపేతం చేయడం, డిజిటల్ లావాదేవీలు సురక్షితంగా, సజావుగా, రాజీలేని రీతిలో సాగే విధంగా భవిష్యత్తును తీర్చిదిద్దడం మా లక్ష్యం” అని విశదీకరించారు.

ఆర్థిక సంస్థలు, నియంత్రణ వ్యవస్థలు, భద్రత నిపుణులు సంయుక్తంగా సైబర్ ముప్పులపై చురుకైన వైఖరి అనుసరించేలా చర్యలకు సిద్ధం చేయడమే ‘బీఎఫ్‌ఎస్‌ఐ’ కోసం రూపొందించిన డిజిటల్ ముప్పుల నివేదిక-2024 లక్ష్యం. నేడు ఏఐ ఆధారిత దాడులు, అధునాతన మోసపూరిత వ్యూహాలు, నిబంధనానుసరణ సంక్లిష్టతల నేపథ్యంలో పెరుగుతున్న సవాళ్ల రీత్యా వర్ధమాన సైబర్ భద్రత వ్యవస్థ సజావుగా సాగిపోయేలా ఈ నివేదిక వ్యూహాత్మక మార్గదర్శకత్వం వహిస్తుంది.

‘ఎస్‌ఐఎస్‌ఏ’ గురించి

డిజిటల్ చెల్లింపుల పరిశ్రమ కోసం ప్రపంచ ఫోరెన్సిక్స్ ఆధారిత సైబర్ భద్రత పరిష్కరాలు చూపే సంస్థ ‘ఎస్‌ఐఎస్‌ఎ.’ బలమైన నిరోధక, నిఘా, దిద్దుబాటుకు తగిన సైబర్ భద్రత మార్గాలతో తమ వ్యాపారాల రక్షణకు ఈ సంస్థ తోడ్పడగలదని ప్రముఖ సంస్థలన్నీ విశ్వసిస్తాయి. సమస్య పరిష్కారానికి ప్రాధాన్యం, మానవ-కేంద్రక విధానం ‘ఎస్‌ఐఎస్‌ఏ’ అనుసరించే ప్రమాణాలు కాబట్టే, వ్యాపార సంస్థలు ఈ నమ్మకం పెంచుకున్నాయి. తదనుగుణంగా ఈ సంస్థ 40కిపైగా దేశాల్లో 2,000కు మించి, వినియోగదారుల సంస్థలకు వాస్తవిక భద్రత కల్పనలో ఫోరెన్సిక్ నిఘా-అధునాతన సాంకేతికతల శక్తిని సమకూరుస్తుంది.
 

డిజిటల్‌ త్రెట్‌ రిపోర్ట్‌ కోసం  ఇక్కడ క్లిక్   చేయండి


(Release ID: 2119914) Visitor Counter : 11