నౌకారవాణా మంత్రిత్వ శాఖ
తీరప్రాంత సరకు రవాణా బిల్లు-2024కు లోక్‌సభ ఆమోదం
"దేశంలోని విస్తారమైన, వ్యూహాత్మక సముద్రతీర పూర్తి సామర్థ్యాన్ని వెలికితీసేందుకు ఈ బిల్లు యత్నిస్తుంది. తీరప్రాంత వాణిజ్యానికి ప్రత్యేక చట్టపరమైన ఫ్రేమ్‌వర్క్ అందిస్తుంది" : సర్బానంద సోనోవాల్
"జాతీయ లాజిస్టిక్స్ విధానం దార్శనికతకు అనుగుణంగా బిల్లు: తక్కువ ఖర్చుతో సుస్థిర ప్రత్యామ్నాయ సరకు రవాణాకు ఆస్కారం” : సర్బానంద సోనోవాల్
“ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనిక నాయకత్వంలో 2014 నుంచి తీరప్రాంత కార్గో ట్రాఫిక్ 119 శాతం పెరిగింది. 2030 నాటికి 230 మిలియన్ టన్నులకు చేరుకోవాలన్నది దీని లక్ష్యం“ : సర్బానంద సోనోవాల్
“ నదీతీర, సముద్ర తీర ప్రాంతాల ప్రాంతీయ అభివృద్ధిని ప్రోత్సహిస్తూ జాతీయ తీరప్రాంత, అంతర్గత సరకు రవాణా వ్యూహాత్మక ప్రణాళికను ఏకీకృతం చేయడానికి ఈ బిల్లు ఒక చట్టపరమైన ఫ్రేమ్‌వర్క్ అందిస్తుంది” : సర్బానంద సోనోవాల్
“తీరప్రాంత సరకు రవాణా బిల్లు సహకార సమాఖ్య స్ఫూర్తిపై గట్టిగా ఆధారపడి ఉంది” : సర్బానంద సోనోవాల్
Posted On:
03 APR 2025 8:10PM by PIB Hyderabad
రహదారులు, రైలు మార్గాలపై భారాన్ని తగ్గిస్తూ సముద్రాల మీద అందుబాటు ధరల్లో సుస్థిర విశ్వసనీయ రవాణాను అందించే తీరప్రాంత వాణిజ్యానికి సంబంధించి ప్రత్యేక చట్టపరమైన ఫ్రేమ్‌వర్క్‌కు మార్గం సుగమం చేసే తీరప్రాంత సరకు రవాణా బిల్లు-2024 (కోస్టల్ షిప్పింగ్ బిల్లు)ను లోక్‌సభ ఆమోదించింది. "ఈ బిల్లు భారతదేశ విస్తారమైన, వ్యూహాత్మక తీరప్రాంత పూర్తి సామర్థ్యాన్ని వెలికితీసేందుకు ప్రయత్నిస్తుంది, తీరప్రాంత వాణిజ్యానికి ప్రత్యేక చట్టపరమైన ఫ్రేమ్‌వర్క్ అందిస్తుంది" అని కేంద్ర ఓడరేవులు, సరకు రవాణా, జలమార్గాల మంత్రి శ్రీ సర్బానంద సోనోవాల్ ప్రధానంగా పేర్కొన్నారు.
ఈ బిల్లు తీరప్రాంత వాణిజ్యాన్ని సులభతరం చేస్తూ పోటీని పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. అంతేకాకుండా, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ విస్తృత దార్శనికత అయిన జాతీయ సరకు రవాణా విధానంతో అనుసంధానమై ఉంటుంది. వ్యాపార సరకు రవాణా చట్టం-1958(మర్చంట్ షిప్పింగ్ యాక్ట్) వంటి చట్టంలో వివిధ నిబంధనల్లో ఉన్న కాలపరిమితిలను మార్చుతూ భవిష్యత్తుకు సిద్ధంగా ఉన్న చట్టపరమైన ఫ్రేమ్‌వర్క్‌ను ఈ బిల్లు అందిస్తుంది. ప్రతిపాదిత బిల్లు భారత తీరప్రాంత వాణిజ్యంలో విదేశీ నౌకల నియంత్రణ, అనుమతులకు సంబంధించి కీలక నిబంధనలను ప్రవేశపెడుతోంది. ఇది జాతీయ తీరప్రాంత, అంతర్గత సరకు రవాణా వ్యూహాత్మక ప్రణాళిక రూపకల్పనను తప్పనిసరి చేయటమే కాకుండా తీరప్రాంత సరకు రవాణా విషయంలో జాతీయ డేటాబేస్‌ను ఏర్పాటు చేయనుంది. ఈ బిల్లు భారత సంస్థలు అద్దెకు తీసుకున్న విదేశీ నౌకలను కూడా నియంత్రిస్తుంది. చట్టాలను నేరరహితంగా మార్చాలన్న ప్రభుత్వ ఆలోచనకు అనుగుణంగా వివిధ ఉల్లంఘనలకు జరిమానాలను విధిస్తోంది. సమాచారాన్ని పొందేందుకు, ఆదేశాలను జారీ చేయడానికి, నిబంధనలను అనుసరించేలా చర్యలు తీసుకునేందుకు సరకు రవాణా ప్రాధికార సంస్థ డైరెక్టర్ జనరల్‌ను అనుమతిస్తోంది. అదే సమయంలో దేశంలో క్రమబద్ధమైన, సమర్థవంతమైన తీరప్రాంత సరకు రవాణా ఉండేలా చూసుకునేందుకు మినహాయింపులు, నియంత్రణ పర్యవేక్షణ విషయంలో కేంద్ర ప్రభుత్వానికి అధికారం ఇస్తోంది.
ఈ సందర్భంగా కేంద్ర మంత్రి శ్రీ సర్బానంద సోనోవాల్ మాట్లాడుతూ.. "తీరప్రాంత సరకు రవాణా బిల్లు స్థానిక ఆకాంక్షలను జాతీయ లక్ష్యాలతో సమీకృతం చేస్తుంది. సముద్ర రంగ దార్శనికత 2047 కింద రాబోయే 25 సంవత్సరాల తీరప్రాంత ఆర్థిక వృద్ధికి ఒక ఫ్రేమ్‌వర్క్‌ను అందిస్తుంది. ఇది కీలకమైన విషయాల్లో సరకు రవాణాకు సంబంధించి విదేశీ నౌకలపై ఆధారపడటాన్ని తగ్గించడానికి దారితీస్తూ.. భారతీయ సంస్థల యాజమాన్యం, నిర్వహణలో ఉండే సరకు రవాణా ఏర్పాటు చేసుకోవాలన్న విస్తృత లక్ష్యంతో ఈ బిల్లు ఉంది. ఇది రవాణా ఖర్చులను తగ్గిస్తుంది. హరిత రవాణాను ప్రోత్సహిస్తుంది. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 'మేక్ ఇన్ ఇండియా' దార్శనికతకు ఇది మద్దతిస్తుంది. నౌకా నిర్మాణం, నౌకాశ్రయ సేవలు, నౌకల నిర్వహణలో వేలాది ఉద్యోగాలను సృష్టిస్తుంది. తీరప్రాంత వాణిజ్యం కోసం ప్రత్యేక చట్టం విషయంలో అంతర్జాతీయ ఉత్తమ పద్ధతులకు అనుగుణంగా భారత పరిస్థితులకు తగ్గట్లు ఈ బిల్లును రూపొందించారు. ఈ బిల్లు తీరప్రాంత వాణిజ్యాన్ని ప్రోత్సహించడానికి, అంతర్గత జలమార్గాలు, నదీతీర ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకెళ్లేందుకు ఒక ప్రత్యేకమైన చట్టపరమైన ప్రేమ్‌వర్క్‌ను అందిస్తూ.. అదే సమయంలో రోడ్డు, రైలు మార్గాలపై ఓవర్‍లోడ్ భారాన్ని తగ్గిస్తూ తక్కువ ఖర్చుతో కూడిన విశ్వసనీమైన, సుస్థిరమైన ప్రత్యామ్నాయాన్ని అందిస్తుంది.
తీరప్రాంత సరకు రవాణా బిల్లు-2024 సరకు రవాణా ఖర్చులను తగ్గించడం, సుస్థిరమైన రవాణాను ప్రోత్సహించాలని లక్ష్యంగా పెట్టుకుంది. లాభదాయకమైన, ఉద్గారాలు తక్కువ ఉండే తీరప్రాంత సరకు రవాణా.. తీరికలేకుండా ఉన్న రోడ్డు, రైలు మార్గాలపై భారాన్ని తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. భారతీయ నౌకలకు సాధారణ ట్రేడింగ్ లైసెన్స్ అవసరాన్ని తొలగించడం(క్లాజ్ 3), చట్టపరమైన భారాన్ని తగ్గించటం, వ్యాపార నిర్వహణను సులభతర చేయటం ఈ బిల్లులో ఉన్న కీలక నిబంధనలు. భారత నౌకా నిర్మాణం, నావికులకు ఉపాధి కల్పించే షరతులతో సరకు రవాణా డైరెక్టర్ జనరల్(క్లాజ్ 4) జారీ చేసిన లైసెన్స్ కింద మాత్రమే విదేశీ నౌకలు తీరప్రాంత వాణిజ్యంలో ఉంటాయి. రవాణా మార్గాల ప్రణాళికను మెరుగుపరచడానికి, ట్రాఫిక్‌ను అంచనా వేసేందుకు, తీరప్రాంత సరకు రవాణాను అంతర్గత జలమార్గాలతో అనుసంధానించడానికి రెండు సంవత్సరాలకు ఒససారి జాతీయ తీరప్రాంత, అంతర్గత జలరవాణా వ్యూహాత్మక ప్రణాళికను(క్లాజ్ 8) సవరించటాన్ని ఈ బిల్లు తప్పనిసరి చేస్తుంది. ఈ వ్యూహాత్మక దార్శనికత దేశ సముద్ర రంగంలో దీర్ఘకాలిక వృద్ధి, సుస్థిరతను నిర్ధారిస్తుంది.
ప్రస్తుతం ఉన్న వాస్తవ పరిస్థితుల దృష్ట్యా బిల్లు సమర్థత, భవిష్యత్తుకు సిద్ధంగా ఉన్న ఫ్రేమ్‌వర్క్‌గా దాని పాత్ర గురించి కేంద్ర ఓడరేవులు, సరకు రవాణా, జలమార్గాల మంత్రి శ్రీ సర్బానంద సోనోవాల్ మాట్లాడుతూ.. "కొత్త తీరప్రాంత సరకు రవాణా బిల్లు తీరప్రాంత వాణిజ్య నిబంధనలను ఆధునీకరించి క్రమబద్ధీకరిస్తుంది. వ్యాపార సరకు రవాణా చట్టం- 1958(మర్చంట్ షిప్పింగ్)లోని లోటుపాట్లను తీర్చుతుంది. నౌకల అనుమతులపై మాత్రమే దృష్టి సారించిన దాని పూర్వ చట్టాల మాదిరిగా కాకుండా ఒక దేశంలో వస్తు, మానవ రవాణాను విదేశీ సంస్థ చేపట్టే విషయంలో ఉన్న అంతర్జాతీయ నిబంధనలకు(క్యాబోటేజ్ పద్ధతులు) అనుగుణంగా ముందుచూపుతో కూడిన సమగ్ర ఫ్రేమ్‌వర్క్‌ను అందిస్తుంది. ఇది ప్రక్రియలను సరళతరం చేసి వృద్ధిని ప్రోత్సహిస్తుంది. తీరప్రాంత సరకు రవాణాను భారత ఆధునిక రవాణా నెట్‌వర్క్‌తో ఏకీకృతం చేస్తుంది. సముద్ర రంగంలో సమర్థత, సుస్థిరత, పోటీతత్వాన్ని నిర్ధారిస్తుంది.” అని వ్యాఖ్యానించారు.
లోడ్, అన్‌లోడ్ చేయటానికి నౌకలకు ప్రాధాన్యత ఇవ్వటం, గ్రీన్ క్లియరెన్స్ ఛానల్స్, బంకర్ ఇంధనంపై జీఎస్టీ తగ్గింపుతో సహా కీలక సంస్కరణలను తీరప్రాంత సరకు రవాణా బిల్లు-2024 రూపొందించింది. 2014-15లో 74 మిలియన్ టన్నులుగా ఉన్న తీరప్రాంత కార్గో ట్రాఫిక్ గత దశాబ్దంలో 119 శాతం పెరిగి 2023-24 నాటికి 162 మిలియన్ టన్నులకు చేరుకుంది. ఇది 2030 నాటికి 230 మిలియన్ టన్నులకు చేరుకోవాలన్న లక్ష్యం ఉంది. ఈ బిల్లు చట్టపరంగా స్పష్టతను తీసుకొస్తుంది. చట్టపరమైన నియంత్రణ విషయంలో స్థిరత్వం, పెట్టుబడి అనుకూల విధానాలు ఉండేలా చూసుకుంటుంది. తద్వారా దేశానికి సంబంధించి సముద్రరంగ విషయంలో భద్రతను బలోపేతం చేస్తూ ఆత్మనిర్భర్ భారత్ దార్శనికతను ముందుకు తీసుకువెళ్తుంది.
తీరప్రాంత నౌకాయానాన్ని అంతర్గత జలమార్గాలతో వ్యూహాత్మకంగా అనుసంధానం చేయడం వల్ల వచ్చే అవకాశాలపై సర్బానంద సోనోవాల్ మాట్లాడుతూ… "తీరప్రాంత, అంతర్గత జలమార్గాల ఏకీకరణ దేశంలో నదీతీర, సముద్ర తీర ప్రాంతాల ప్రాంతీయ అభివృద్ధిని ప్రోత్సహిస్తుంది. ఒడిశా, కర్ణాటక, గోవా తదితర రాష్ట్రాల్లో తీరప్రాంత, అంతర్గత జలరవాణా రవాణాను అభివృద్ధి చేయాలన్న దీర్ఘకాలిక దార్శనికతకు ఈ బిల్లు ఊతమివ్వనుంది. బహుళ రాష్ట్రాల గుండా వెళ్లే తీరప్రాంత సరకు రవాణా మార్గాలను అంతర్గత జలమార్గాలతో అనుసంధానం చేయడం అనేది సమిష్టి ప్రణాళిక, సమన్వయానికి దారి తీస్తుంది. ఈ విషయంలో రాష్ట్రాల పాత్రను గుర్తించడం ద్వారా తీరప్రాంత సరకు రవాణా వృద్ధిలో సమ్మిళిత భాగస్వామ్యం ఉండేలా ఈ బిల్లు చూసుకుంటుంది” అని వ్యాఖ్యానించారు.
పారదర్శకత, సమన్వయం, గణాంకాల ఆధారిత నిర్ణయాలను పెంపొందించేందుకు సరకు రవాణాకు సంబంధించి జాతీయ డేటాబేస్‌ను ఈ బిల్లు ప్రవేశపెట్టింది. భారత పౌరులు, ఎన్ఆర్ఐలు, ఓసీఐలు, ఎల్ఎల్‌పీలతో సహా విదేశీ నౌకలను అద్దెకు తీసుకోవడానికి అనుమతించే సంస్థలకు విభజనలను కూడా ఇది విస్తరిస్తుంది. సహకార సమాఖ్య విధానాన్ని ధృవీకరిస్తూ ఈ బిల్లు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కీలక యంత్రాంగాలలో క్రియాశీల ప్రాతినిధ్యాన్ని అందిస్తుంది. ఇది క్రమబద్ధమైన, సమ్మిళిత, సమర్థవంతమైన సముద్ర రంగం విషయంలో భారత నిబద్ధతను బలపరుస్తుంది.
ఈ సందర్భంగా ప్రతిపక్షాల విమర్శలను కేంద్ర మంత్రి తిప్పికొట్టారు. "తీరప్రాంత సరకు రవాణా బిల్లు-2024 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల క్రియాశీల భాగస్వామ్యం ఉండేలా చూసుకోవటం ద్వారా సహకార సమాఖ్య స్పూర్తికి మద్ధతు ఇస్తుంది. క్లాజ్ 8(3) ప్రకారం ప్రధాన ఓడరేవులు, రాష్ట్ర మారిటైం బోర్డులు, నిపుణులతో కూడిన కమిటీ జాతీయ తీరప్రాంత, అంతర్గత సరకు రవాణా వ్యూహాత్మక ప్రణాళికను రూపొందిస్తుంది. వ్యూహం, మార్గాలు, నిబంధనలను రూపొందించడంలో ఇది రాష్ట్రాలకు ప్రత్యక్ష పాత్ర ఉంటుందన్న హామీ ఇస్తోంది. తీరప్రాంత నౌకాయానాన్ని అంతర్గత జలమార్గాలతో అనుసంధానం చేయడం ద్వారా ఈ బిల్లు సమష్టి ప్రణాళికకు వీలు కలిస్తూ.. సబ్ కా సాథ్, సబ్ కా వికాస్‌తో సమ్మిళిత వృద్ధిని ప్రోత్సహిస్తుంది.” అని అన్నారు.
***
(Release ID: 2118810)
Visitor Counter : 17