కార్మిక, ఉపాధికల్పన మంత్రిత్వ శాఖ
క్లెయిముల పరిష్కారాన్ని సరళీకరించిన ఈపీఎఫ్‌వో... ఈపీఎఫ్
చందాదారులు, సంస్థ యజమానులకు సౌలభ్యం కల్పించే దిశగా రెండు ప్రధాన సంస్కరణలు
చెక్కు/ధ్రువీకరించిన బ్యాంకు పాస్ బుక్ సమర్పించాలన్న నిబంధన తొలగింపుతో 7.7 కోట్ల మంది ఈపీఎఫ్ఓ సభ్యులకు లబ్ధి
యూఏఎన్ తో బ్యాంకు వివరాలను అనుసంధానించడంలో యజమాని ఆమోదం తెలపాలన్న నిబంధన తొలగింపు: అనుమతులు పెండింగ్‌లో ఉన్న దాదాపు 15 లక్షల మంది సభ్యులకు ప్రయోజనం
Posted On:
03 APR 2025 1:41PM by PIB Hyderabad
ఈపీఎఫ్ చందాదారులు, యజమానులకు క్లెయిముల పరిష్కార ప్రక్రియలను సులభతరం చేసే దిశగా ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్ఓ) మరో అడుగు ముందుకేసింది. దీనికోసం రెండు కీలకమైన సరళీకరణలను పరిచయం చేసింది. ఈ చర్యలు క్లెయిముల పరిష్కారాలను క్రమబద్ధీకరిస్తాయి. అలాగే క్లెయిముల తిరస్కరణకు సంబంధించి వచ్చే ఫిర్యాదులను తగ్గిస్తుంది.
1. చెక్కు/ ధ్రువీకరించిన బ్యాంకు పాస్‌బుక్ ఫొటోను సమర్పించాలన్న నిబంధన తొలగింపు
ఆన్లైన్ క్లెయిముకు దరఖాస్తు చేసుకున్న సమయంలో చెక్కు లేదా ధ్రువీకరించిన బ్యాంకు పాసు పుస్తక ఫొటోను అప్లోడ్ చేయాలన్న నిబంధనను ఈపీఎఫ్ఓ పూర్తిగా తొలగించింది. ఈ సరళీకరణను అమల్లోకి తీసుకొచ్చే ముందు కేవైసీ అప్డేట్ చేసిన కొంతమంది చందాదారులకు ప్రయోగాత్మక పద్ధతిలో వర్తింపచేశారు. 2024, మే 28 న ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటి వరకు దీని ద్వారా 1.7 కోట్ల మంది ఈపీఎఫ్ సభ్యులు లబ్ధి పొందారు.
ఈ ప్రయోగం విజయవంతమైన తర్వాత ఈ సడలింపును చందాదారులందరికీ ఈపీఎఫ్ఓ వర్తింపచేసింది. యూనివర్సల్ అకౌంట్ నెంబర్ (యూఏఎన్)తో బ్యాంకు ఖాతా వివరాలను అనుసంధానించే సమయంలో ఈపీఎఫ్ చందాదారుడి పేరును ధ్రువీకరిస్తారు. కాబట్టి ఈ అదనపు పత్రాలు ఇకపై సమర్పించాల్సిన అవసరం లేదు.
ఈ నిబంధనను తొలగించడం ద్వారా దాదాపు 6 కోట్ల మంది చందాదారులకు తక్షణ ప్రయోజనం చేకూర్చేందుకు ఈపీఎఫ్ఓ సిద్ధంగా ఉంది. తక్కువ నాణ్యత/స్పష్టత లేని ఫోటోల కారణంగా క్లెయింలను తిరస్కరించడాన్ని తొలగించడంతో ఈ అంశంలో వచ్చే ఫిర్యాదులు తగ్గుతాయి.
2. యూనివర్సల్ అకౌంట్ నెంబర్ (యూఏఎన్)తో బ్యాంకు ఖాతా వివరాలను అనుసంధానించేటప్పుడు సంస్థ యజమాని ఆమోదించాలన్న నిబంధన తొలగింపు
యూఏఎన్‌తో బ్యాంకు ఖాతాను అనుసంధానించే ప్రక్రియను క్రమబద్ధం చేయడానికి, బ్యాంకు వెరిఫికేషన్ అనంతరం యజమాని ఆమోదం తప్పనిసరన్న నిబంధనను ఈపీఎఫ్ఓ తొలగించింది.
ప్రస్తుతం, ప్రతి సభ్యుడు పీఎఫ్ ఉపసంహరణ నగదు నేరుగా బ్యాంకు ఖాతాకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా బదిలీ కావడానికి దానిని యూఏఎన్ తో అనుసంధానించడం తప్పనిసరి. 2024-25 ఆర్థిక సంవత్సరానికి, 1.3 కోట్ల మంది సభ్యులు తమ బ్యాంకు ఖాతాలను అనుసంధానించాలని కోరుతూ తమ అభ్యర్థనలను సమర్పించారు. వాటిని సంబంధిత బ్యాంకు/ఎన్‌పీసీఐతో సరిపోల్చిన అనంతరం డిజిటల్ సంతకం/ఈ-సైన్ ద్వారా సంస్థ యజమాని ఆమోదిస్తారు.
తమ బ్యాంకు ఖాతాలను యూఏఎన్‌తో అనుసంధానించాలని కోరుతూ రోజుకు దాదాపు 36,000 అభ్యర్థనలు వస్తున్నాయి. వాటిని ధ్రువీకరించేందుకు బ్యాంకులు సరాసరి 3 రోజుల సమయం తీసుకుంటున్నాయి. బ్యాంకు ధ్రువీకరణ పూర్తయిన అనంతరం దాన్ని ఆమోదించేందుకు సంస్థ యజమాని దాదాపుగా 13 రోజుల సమయం తీసుకుంటున్నారు. దీనివల్ల యజమానులపై పని భారం పెరగడంతో పాటు బ్యాంకు ఖాతాల అనుసంధానం ఆలస్యమవుతూ వస్తోంది. పైపెచ్చు ఈ నిర్ధారణ ప్రక్రియకు యజమాని ఆమోదం ఎలాంటి విలువనూ జోడించడం లేదు.
ప్రతి నెలా చందా చెల్లిస్తున్న 7.74 కోట్ల మంది సభ్యుల్లో 4.83 కోట్ల మంది సభ్యులు తమ బ్యాంకు ఖాతాలను ఇఫ్పటికే యూఏఎన్‌కు అనుసంధానించారు. అలాగే, 14.95 లక్షల ఖాతాల అనుసంధానం యజమానుల వద్ద పెండింగ్‌లో ఉంది.
యజమానులకు ‘సులభతర వాణిజ్య విధానాన్ని’, చందాదారులకు ‘జీవన సౌలభ్యాన్ని’ మెరుగుపరిచే ఉద్దేశంతో బ్యాంకు ఖాతాను అనుసంధానించే ప్రక్రియలో యజమాని పాత్రను పూర్తిగా తొలగించారు. తద్వారా యజమానుల వద్ద పెండింగ్‌లో ఉన్న 14.95 లక్షల సభ్యులకు తక్షణ ప్రయోజనం లభిస్తుంది.
పైన పేర్కొన్న సరళమైన ప్రక్రియలు, ఆధార్, ఓటీపీతో పాటు ధ్రువీకరించిన ఐఎఫ్ఎస్సీ ద్వారా కొత్త బ్యాంకు ఖాతాను నమోదు చేయడం లేదా ఇప్పటికే అనుసంధానించిన ఖాతా సంఖ్యను మార్చుకోవడాన్ని సులభతరం చేస్తాయి.
ఇప్పటి వరకు బ్యాంకు ఖాతాను అనుసంధానించని వారు లేదా ఖాతాను మార్చుకోవాలనుకునేవారు పైన పేర్కొన్న సులభమైన పద్ధతులను ఉపయోగించుకోవచ్చు.
***
(Release ID: 2118648)
Visitor Counter : 24