గనుల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

సముద్రంలో గనుల తవ్వకానికి లైసెన్సులు

प्रविष्टि तिथि: 02 APR 2025 2:25PM by PIB Hyderabad

     సముద్ర ప్రాంతాల్లో ఖనిజాన్వేషణకు సంబంధించి “ఆఫ్‌షోర్ ఏరియాస్ మినరల్స్ (డెవలప్‌మెంట్ అండ్ రెగ్యులేషన్) చట్టం-2002”కు అనుగుణంగా 13 ఆఫ్‌షోర్‌ గనుల తొలిదశ వేలం ప్రక్రియకు కేంద్ర ప్రభుత్వం 28.11.2024న శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా వీటికి ‘కాంపోజిట్ లైసెన్స్’... అంటే- అన్వేషణ లైసెన్స్ సహా ఉత్పాదన లీజు మంజూరు చేసింది. ఈ మేరకు కేరళ తీరంలో 3 గనుల నుంచి నిర్మాణ ఇసుక, గుజరాత్ తీరంలో 3 గనుల నుంచి సున్నపు మట్టి, గ్రేట్ నికోబార్ ద్వీపంలో 7 గనుల నుంచి పాలీమెటాలిక్ నోడ్యూల్స్-క్రస్ట్ వెలికితీత కార్యకలాపాలకు అనుమతి ఇచ్చింది.

 

   అయితే, “ఆఫ్‌షోర్ ఏరియాస్ ఆపరేటింగ్ రైట్ రూల్స్-2024”లోని నిబంధన 5(2) ప్రకారం... ఏదైనా సముద్ర ప్రాంత తవ్వకపు కార్యకలాపాల హక్కు మంజూరుకు ముందు పర్యావరణ-అటవీ-వాతావరణ మార్పు, మత్స్య శాఖ సహా అన్ని భాగస్వామ్య మంత్రిత్వ శాఖలు/విభాగాలతో ముందస్తు సంప్రదింపులు తప్పనిసరి.

 

   ఈ నేపథ్యంలో పైన పేర్కొన్న గనులకు వేలం ప్రక్రియ ప్రకటనకు ముందు పర్యావరణ-అటవీ-వాతావరణ మార్పు, మత్స్య శాఖ సహా అన్ని భాగస్వామ్య మంత్రిత్వ శాఖలు/విభాగాలతో గనుల మంత్రిత్వ శాఖ ముందస్తు సంప్రదింపులు చేపట్టగా, వాటినుంచి ఎలాంటి అభ్యంతరాలూ వ్యక్తం కాలేదు.

 

   మరోవైపు సముద్ర జీవజాతుల సంరక్షణ దిశగా తీరప్రాంత రాష్ట్రాలు, దీవుల పరిధిలో 130 సముద్ర రక్షిత ప్రాంతాలుసహా 106 తీరప్రాంత, సముద్ర ప్రదేశాలను గుర్తించారు. అటుపైన సముద్ర జాతుల సంరక్షణపై నిశిత పర్యవేక్షణ లక్ష్యంగా కీలక తీరప్రాంత, సముద్ర జీవవైవిధ్య ప్రాంతాలకు ప్రాధాన్యం ఇచ్చారు. ఈ ప్రాంతాలను మినహాయించి ఆఫ్‌షోర్ గనుల ప్రదేశాల జాబితాలను రూపొందించారు.

 

   “ఆఫ్‌షోర్ ఏరియాస్‌ మినరల్‌ (ఆక్షన్‌) రూల్స్‌-2024” నిర్దేశాల ప్రకారం- కార్యకలాపాల హక్కు అమలుకు ముందుగా ఉత్పత్తి కార్యక్రమాలు చేపట్టడానికి వర్తించే చట్టాల ప్రకారం బిడ్డర్లు అవసరమైన అన్ని అనుమతులు, ఆమోదాలు, లైసెన్సులు, నిరభ్యంతర పత్రాలు వంటివి పొందాల్సి ఉంటుంది.

 

   “ఆఫ్‌షోర్ ఏరియాస్ మినరల్ కన్జర్వేషన్ అండ్ డెవలప్‌మెంట్ రూల్స్-2024” నిబంధనల ప్రకారం- ఉత్పత్తి ప్రణాళికకు అనుగుణంగా మాత్రమే ఉత్పత్తి కార్యకలాపాలు చేపట్టాల్సి ఉంటుంది. ఇందులో ఇతరత్రా అంశాలతోపాటు పర్యావరణ, సామాజిక-ఆర్థిక ప్రాథమిక సమాచారం, ప్రభావ అంచనా, ఉపశమన చర్యలను సూచించే పర్యావరణ నిర్వహణ ప్రణాళిక అంతర్భాగంగా ఉంటుంది.

 

   అంతేకాకుండా లాభాపేక్ష రహిత, స్వయంప్రతిపత్తి సహిత “ఆఫ్‌షోర్ ఏరియాస్ మినరల్ ట్రస్ట్‌”ను ఏర్పాటు చేయాలని చట్టంలోని సెక్షన్ ‘16ఎ’ నిర్దేశిస్తోంది. దీని ప్రకారం- ఎస్‌.ఒ.3246(ఇ) ద్వారా “ఆఫ్‌షోర్ ఏరియాస్ మినరల్ ట్రస్ట్” 09.08.2024న ఏర్పాటవగా, దీని పాలకమండలితోపాటు కార్యనిర్వాహక కమిటీలో తీరప్రాంత రాష్ట్రాలకూ సభ్యత్వం కల్పించారు.

 

   ఈ ట్రస్టుకు సమకూరే నిధులను నిర్దిష్ట కార్యకలాపాల కోసం వినియోగిస్తారు. ఈ మేరకు  ఇతరత్రా అంశాలతోపాటు ఆఫ్‌షోర్ ప్రాంతాల సంబంధిత పరిశోధన, పరిపాలన, అధ్యయనంపై  వ్వయాల కోసం వెచ్చిస్తారు. అలాగే ఆఫ్‌షోర్ ప్రాంతాల్లో కార్యలాపాల వల్ల పర్యావరణంపై ప్రతికూల ప్రభావాల తగ్గింపు, ఆయా ప్రాంతాల్లో ఏవైనా విపత్తులు సంభవిస్తే ఉపశమన కార్యకలాపాలు చేపట్టడం సహా అన్వేషణ లేదా ఉత్పత్తి కార్యకలాపాలతో ప్రభావితమయ్యే వ్యక్తుల ఆసక్తులు-ప్రయోజనార్థం ఉపయోగిస్తారు.

 

      కేంద్ర బొగ్గు-గనుల శాఖ మంత్రి శ్రీ జి.కిషన్‌ రెడ్డి ఇవాళ లోక్‌సభలో ఒక ప్రశ్నపై ఇచ్చిన   లిఖితపూర్వక సమాధానంలో ఈ సమాచారం వెల్లడించారు.

 

***


(रिलीज़ आईडी: 2117911) आगंतुक पटल : 34
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Tamil