ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

గ్రామ ప్రాంతాల్లో వైద్య వృత్తి నిపుణుల సంఖ్యను పెంచి వారి సేవల లభ్యతను మెరుగుపరచే దిశగా చర్యలు


* నమోదైన అలోపతి వైద్యులు 13,86,150 మంది ఉండగా, ఆయుష్ వైద్య వ్యవస్థలో నమోదైన ప్రాక్టీషనర్లు 7,51,768 మంది.. డాక్టరు-జనాభా నిష్పత్తి 1:811గా ఉంటుందని ఓ అంచనా

* జిల్లా, రెఫరల్ ఆసుపత్రులను అభివృద్ధిపరచడం ద్వారా 157 వైద్య కళాశాలల ఏర్పాటుకు చర్యలు.. వీటిలో ఇప్పటికే పనిచేస్తున్న 131 మెడికల్ కాలేజీలు

* కేంద్ర రంగ పథకంలో భాగంగా కొత్త ఎయిమ్స్ ల ఏర్పాటుకు 22 ఎయిమ్స్ లకు ఆమోదం.. వీటిలో 19 ఎయిమ్స్ లలో అండర్‌గ్రాడ్యుయేట్ కోర్సులు ఈసరికే ఆరంభం

* గ్రామీణ ప్రాంతాల జనాభాకు సమాన ఆరోగ్యసంరక్షణ సేవల కల్పనకు ఎంబీబీఎస్ పాఠ్యప్రణాళికలో ఫ్యామిలీ అడాప్షన్ ప్రోగ్రాముకు స్థానం

* ఎన్ఎంసీలో డిస్ట్రిక్ట్ రెసిడెన్సీ ప్రోగ్రాంలో భాగంగా, వైద్య కళాశాలల పీజీ రెండో, మూడో సంవత్సరం విద్యార్థులకు జిల్లా ఆసుపత్రుల్లో పోస్టింగులు

* కష్టమైన ప్రాంతాలలో సేవలందిస్తున్న సిబ్బందికి నగదేతర ప్రోత్సాహకాలు ..వారు తమకు నచ్చిన పోస్ట్‌గ్రాడ్యుయేట్ కోర్సుల్లో చేరే అవకాశంతోపాటు గ్రామీణ ప్రాంతాలలో బస ఏర్పాట్లను మెరుగుపరిచే దిశగా తీసుకొనే చర్యలకు కూడా ఎన్‌హెచ్ఎంలో చోటు

* వైద్యులకు బహుళ ప్రావీణ్యాలను అలవరచే ప్రణాళిక కూడా ఎన

Posted On: 01 APR 2025 2:08PM by PIB Hyderabad

ప్రస్తుతానికి, దేశంలో మొత్తం 1,18,190 ఎంబీబీఎస్ సీట్లతో పాటు 74,306 పోస్ట్ గ్రాడ్యుయేట్ సీట్లు ఉన్నాయి.

నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) అందజేసిన సమాచారం ప్రకారం, ఇంగ్లిషు వైద్యం చేసే 13,86,150 మంది నమోదైన డాక్టర్లుండగా, ఆయుష్ వైద్య వ్యవస్థలో 7,51,768 మంది నమోదైన ప్రాక్టీషనర్లు ఉన్నారని ఆయుష్ మంత్రిత్వ శాఖ తెలిపింది. అలోపతి (ఇంగ్లిషు వైద్యం), ఆయుష్ వ్యవస్థలలో 80 శాతం మంది నమోదైన ప్రాక్టీషనర్ల సేవలు అందుబాటులో ఉన్నాయనుకొంటే, దేశంలో వైద్యుడు, జనాభా.. ఈ రెండిటి నిష్పత్తి 1:811గా ఉందని అంచనా.. ఈ లెక్కన ప్రతి 811 మందికి ఒక వైద్యుడు ఉన్నారు.

దేశంలో డాక్టరు- వైద్య వృత్తినిపుణుల సంఖ్యను పెంచడానికి ప్రభుత్వం చేపడుతున్న చర్యలు, తీసుకొంటున్న నిర్ణయాలలో ఈ కింది అంశాలు భాగంగా ఉన్నాయి:

· జిల్లా, రెఫరల్ ఆసుపత్రిని ఉన్నతీకరించడం ద్వారా కొత్త వైద్య కళాశాలను ఏర్పాటు చేయడానికి ఉద్దేశించిన కేంద్ర ప్రాయోజిత పథకం. దీనిలో భాగంగా 157 మెడికల్ కాలేజీలకు ఆమోదం తెలిపారు. వీటిలో 131 కొత్త వైద్య కశాశాలలు ఇప్పటికే తమ కార్యకలాపాలను మొదలుపెట్టాయి.

· ఇప్పటికే పనిచేస్తున్నరాష్ట్ర ప్రభుత్వ, కేంద్ర ప్రభుత్వ వైద్య కళాశాలలను పటిష్టపరచడానికీ స్థాయి పెంచడానికీ ఉద్దేశించిన కేంద్ర ప్రాయోజిత పథకం. దీని ద్వారా ఎంబీబీఎస్, పీజీ సీట్లను పెంచనున్నారు.

· ‘‘ప్రధాన మంత్రి స్వాస్థ్య సురక్ష యోజన (పీఎంఎస్ఎస్‌వై) పరిధిలోని ‘‘సూపర్ స్పెషాలిటీ బ్లాకులను నిర్మించడం ద్వారా ప్రభుత్వ వైద్య కళాశాలల స్థాయిని పెంచే కార్యక్రమం’’లో భాగంగా మొత్తం 75 ప్రాజెక్టులకు ఆమోదం తెలపగా, వాటిలో 71 ప్రాజెక్టుల పనులు పూర్తి అయ్యాయి.

·  కొత్తగా ఎయిమ్స్ లను ఏర్పాటు చేయడానికి ఉద్దేశించిన కేంద్ర రంగ పథకంలో భాగంగా, 26 ఎయిమ్స్ లకు ఆమోదాన్ని తెలిపారు. వీటిలో 19 ఎయిమ్స్ లలో అండర్‌గ్రాడ్యుయేట్ కోర్సులను ప్రారంభించారు.

గ్రామీణ ప్రాంతాల్లో, మారుమూల ప్రాంతాల్లో వైద్యుల అందుబాటును మెరుగుపరచడానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలు, నిర్ణయాలలో ఈ కింది అంశాలు భాగంగా ఉన్నాయి: -

·  ఎంబీబీఎస్ పాఠ్యప్రణాళికలో ఫ్యామిలీ అడాప్షన్ ప్రోగ్రామ్ (ఎఫ్ఏపీ)ని కూడా కలిపారు. గ్రామాల్లో ఉండే వారికి సైతం సమాన ఆరోగ్యసంరక్షణ సౌలభ్యాన్ని సమకూర్చడం దీని ఉద్దేశం. వైద్య కళాశాలలు గ్రామాలను దత్తత తీసుకోవడం, ఆ గ్రామాల్లోని కుటుంబాలను ఎంబీబీఎస్ విద్యార్థులు దత్తత తీసుకోవడం ఎఫ్ఏపీలో భాగమే.

· ఎన్ఎంసీలలో డిస్ట్రిక్ట్ రెసిడెన్సీ ప్రోగ్రాంలో భాగంగా, వైద్య కళాశాలల పోస్ట్‌గ్రాడ్యుయేట్ విద్యార్థుల్లో రెండో సంవత్సరం, మూడో సంవత్సరం విద్యార్థులను జిల్లా ఆసుపత్రులకు పంపుతారు.

· గ్రామీణ ప్రాంతాలు, మారుమూల ప్రాంతాలలో సేవలను అందిస్తున్న స్పెషలిస్టు డాక్టర్లకు, వారు నివసించే క్వార్టర్లకు వర్తించేటట్లు ‘హార్డ్ ఏరియా అలవెన్సు’ను ఇస్తారు.

· పల్లె ప్రాంతాలు, సుదూర ప్రాంతాలలో సీజేరియన్ సెక్షన్ కాన్పులను నిర్వహించడానికి స్పెషలిస్టుల లభ్యతను పెంచడానికి గాను గైనకాలజిస్టులు, అత్యవసర ప్రసవ సంబంధి సంరక్షణ (ఈఎంఓసీ) శిక్షణను పొందినివారు, శిశువ్యాధిచికిత్సకులు, అనస్తెటిస్టులు, ప్రాణరక్షక నొప్పినివారక నైపుణ్యాలలో (ఎల్ఎస్ఏఎస్) శిక్షణ పొందిన వైద్యులకు గౌరవ భృతిని చెల్లిస్తారు.

· కాన్పు సమయాల్లో తల్లీబిడ్డల మరణాలను తగ్గించే లక్ష్యంతో నిర్వహించే ఏఎన్‌సీ చెకప్, రికార్డింగులను కాలానుగుణంగా నిర్వహించడానికి వైద్యులకు ప్రత్యేక ప్రోత్సాహకాలతోపాటు ఏఎన్ఎంలకు ప్రోత్సాహకం. అలాగే యౌవన దశలో సంతానోత్పత్తి, సెక్సువల్ హెల్త్ సంబంధిత కార్యకలాపాల నిర్వహణకు కూడా ప్రోత్సాహకాలు అందజేయడం.

· స్పెషలిస్టులను ఆకట్టుకోవడానికి వారు కోరేటంత జీతాన్ని ఇచ్చే అవకాశాన్ని రాష్ట్రాలకు కల్పించారు. ‘‘మీకు ఎంత కావాలో చెప్పండి, మేం చెల్లిస్తాం’’ తరహా వ్యూహాల అమలులో సరళత్వానికి చోటిచ్చారు.

· కష్టమైన ప్రాంతాల్లో ఉంటూ సేవలను అందిస్తున్న సిబ్బందికి వారికి నచ్చిన పోస్ట్‌గ్రాడ్యుయేట్ కోర్సులలో చేరడానికి నగదేతర ప్రోత్సాహకాలను అందించడంతోపాటు గ్రామీణ ప్రాంతాలలో వసతి ఏర్పాట్లను మెరుగుపరచడం.. ఈ వెసులుబాట్లను ఎన్‌హెచ్ఎంలో భాగంగా ప్రవేశపెట్టారు.

· స్పెషలిస్టుల కొరతను అధిగమించడానికి ఎన్‌హెచ్ఎంలో భాగంగా వైద్యులకు అనేక నైపుణ్యాలను అలవరచే కార్యక్రమానికి మద్దతివ్వనున్నారు. ఆరోగ్య రంగంలో మెరుగుదల లక్ష్య సాధనను దృష్టిలో పెట్టుకొని ఇప్పటికే అందుబాటులో ఉన్న మానవ వనరులలో నైపుణ్యాలను అభివృద్ధిపరచడం ఎన్ఆర్‌హెచ్ఎం (నేషనల్ రూరల్ హెల్త్ మిషన్)లో మరో ప్రధాన వ్యూహంగా ఉంది.

 కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి శ్రీమతి అనుప్రియ పటేల్ ఈ రోజు రాజ్యసభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో ఈ విషయాలు తెలిపారు.

 

***


(Release ID: 2117371) Visitor Counter : 14