ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్‌లో రూ.33,700 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి, పనులు ప్రారంభించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ


ఈ రోజు నవరాత్రి, నూతన సంవత్సర శుభ సందర్భంలో ఛత్తీస్‌గఢ్‌లో మూడు లక్షల పేద కుటుంబాల నూతన గృహప్రవేశం: ప్రధానమంత్రి

పేద గిరిజనులకు మెరుగైన ఆరోగ్య సదుపాయాలు, వైద్య చికిత్స అందించేందుకు కృషిచేస్తున్న ప్రభుత్వం: ప్రధానమంత్రి

గిరిజన సమాజాల అభివృద్ధి కోసం ప్రభుత్వ ప్రత్యేక ప్రచారం: ప్రధానమంత్రి

Posted On: 30 MAR 2025 6:17PM by PIB Hyderabad

 

మౌలిక సదుపాయాల అభివృద్ధి, సుస్థిర జీవనోపాధిని పెంపొందించాలనే తన నిబద్ధతకు అనుగుణంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్‌లో రూ.33,700 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, వివిధ అభివృద్ధి పనుల ప్రారంభాలు చేసి, పలు అభివృద్ధి ప్రాజెక్టులను  దేశానికి అంకితం చేశారు. నూతన సంవత్సర శుభారంభం, నవరాత్రి మొదటి రోజు వంటి శుభ సందర్భంలో ఈ పనులు ప్రారంభించడం సంతోషంగా ఉందన్న శ్రీ నరేంద్ర మోదీ, మాతా మహామాయ భూమిగా, మాతా కౌసల్య మాతృభూమిగా ఛత్తీస్‌గఢ్ ప్రాముఖ్యాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. నవరాత్రి మొదటి రోజున ఛత్తీస్‌గఢ్‌లో ఉండటం తనకు దక్కిన గౌరవంగా పేర్కొన్న ఆయన, ఇటీవల భక్త శిరోమణి మాతా కర్మ గౌరవార్థం పోస్టల్ స్టాంప్ జారీ చేసిన సందర్భంగా అందరికీ అభినందనలు తెలిపారు. నవరాత్రి పండుగ రామనవమి వేడుకలతో ముగుస్తుందన్న మోదీ, ఛత్తీస్‌గఢ్‌లో రాముడి పట్ల ఉన్న ప్రత్యేక భక్తిని, ముఖ్యంగా తమ మొత్తం ఉనికిని రాముడి నామానికి అంకితం చేసిన రామనామి సమాజ అసాధారణ అంకితభావాన్ని కొనియాడారు. ఛత్తీస్‌గఢ్ ప్రజలను శ్రీరాముని మాతృమూర్తి కుటుంబ సభ్యులుగా అభివర్ణించిన ఆయన వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

ఈ శుభ సందర్భంలో మోహభట్ట స్వయంభు శివలింగ మహాదేవ్ ఆశీస్సులతో ఛత్తీస్‌గఢ్‌లో అభివృద్ధిని వేగవంతం చేసే కార్యక్రమాలను చేపట్టినట్లు వివరించారు. పేదలకు ఇల్లు, పాఠశాలలు, రహదారులు, రైల్వేలు, విద్యుత్, గ్యాస్ పైప్‌లైన్‌లు సహా రూ.33,700 కోట్లకు పైగా విలువైన నిధులతో చేపట్టిన ప్రాజెక్టుల ప్రారంభోత్సవం, శంకుస్థాపనలను ఆయన ప్రస్తావించారు. ఛత్తీస్‌గఢ్ పౌరుల సౌకర్యాలను మరింత మెరుగుపరచడం, కొత్త ఉపాధి అవకాశాలను సృష్టించడం ఈ ప్రాజెక్టుల లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. ఈ అభివృద్ధి కార్యక్రమాల ద్వారా పురోగతి సాధించిన రాష్ట్ర ప్రజలకు ప్రధానమంత్రి అభినందనలు తెలిపారు.

ఆశ్రయం కల్పించడం వెనక ఉన్న సాంస్కృతిక ప్రాముఖ్యతను ప్రస్తావిస్తూ, దానిని గొప్ప ధర్మంగా అభివర్ణించిన శ్రీ నరేంద్ర మోదీ, పేదల సొంతింటి కలను నెరవేర్చడంలో అసమానమైన ఆనందం ఉందన్నారు. నవరాత్రి, నూతన సంవత్సర శుభ సందర్భంగా, ఛత్తీస్‌గఢ్‌లోని మూడు లక్షల పేద కుటుంబాలు నేడు నూతన గృహప్రవేశం చేస్తున్నాయన్నారు. ఆయా కుటుంబాలకు ఆయన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. గతంలో ఛత్తీస్‌గఢ్‌లోని లక్షల కుటుంబాల సొంతింటి కల ఏళ్లపాటు అధికారుల ఫైళ్లలో మగ్గిపోయేదని, తన నాయకత్వంపై ప్రజలు నమ్మకం ఉంచడం వల్ల నేడు వారు సొంతింటి కలను సాకారం చేసుకోగలిగారన్నారు. శ్రీ విష్ణు దేవ్ నాయకత్వంలో మొదటి మంత్రివర్గ సమావేశంలో 18 లక్షల ఇళ్లను నిర్మించాలని నిర్ణయం తీసుకోగా, వాటిలో ఇప్పటికే మూడు లక్షల గృహాలు పూర్తవడం ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనమని ఆయన వ్యాఖ్యానించారు. వీటిలో చాలా గృహాలు గిరిజన ప్రాంతాల్లోనే ఉన్నాయని, బస్తర్, సుర్గుజాలోని కుటుంబాలకు ప్రయోజనం చేకూరుస్తున్నాయని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. తాత్కాలిక ఆశ్రయాల్లో తరతరాలుగా కష్టాలను అనుభవించిన కుటుంబాలకు ఈ గృహాలు ఒక ముఖ్యమైన కానుకగా ప్రధానమంత్రి అభివర్ణించారు.

"ఈ ఇళ్లను నిర్మించడంలో ప్రభుత్వం సహాయం అందించినప్పటికీ, లబ్ధిదారులు తమ కలల ఇల్లు నమూనా ఎలా ఉండాలో వారే స్వయంగా నిర్ణయించుకున్నారు" అని శ్రీ నరేంద్ర మోదీ తెలిపారు. ఈ గృహాలు కేవలం నాలుగు గోడలు మాత్రమే కాదు, వారి జీవితాల్లో వచ్చిన గణనీయమైన మార్పు అని ఆయన స్పష్టం చేశారు. ఈ ఇళ్లను మరుగుదొడ్లు, విద్యుత్, ఉజ్వల గ్యాస్ కనెక్షన్లు, పైపుల ద్వారా నీరు వంటి ముఖ్యమైన సౌకర్యాలతో సమకూర్చడానికి చేసిన ప్రయత్నాలను ఆయన ప్రధానంగా ప్రస్తావించారు. ఈ కార్యక్రమంలో మహిళలకు గణనీయమైన ప్రాధాన్యం దక్కిందన్న ప్రధానమంత్రి, ఈ గృహాల్లో ఎక్కువ భాగం మహిళల పేరుమీదే మంజూరైనట్లు తెలిపారు. మొదటిసారిగా, తమ పేర్లపై ఆస్తిని నమోదు చేసుకున్న వేలాది మంది మహిళలు సాధించిన విజయాన్ని ఆయన ప్రశంసించారు. ఈ మహిళల ముఖాల్లో కనిపిస్తున్న ఆనందం, వారి ఆశీర్వాదాలకు కృతజ్ఞతలు తెలిపిన శ్రీ నరేంద్ర మోదీ, వీటిని తన గొప్ప ఆస్తులుగా అభివర్ణించారు.

లక్షలాది ఇళ్ల నిర్మాణం వల్ల గ్రామాల్లోని స్థానిక చేతివృత్తులవారు, మేస్త్రీలు, కార్మికులకు ఉపాధి అవకాశాలు కల్పించడమే కాకుండా, ఈ ఇళ్లకు ఉపయోగించే సామాగ్రిని స్థానికంగానే సేకరించడం వల్ల, చిన్న దుకాణదారులు, రవాణా నిర్వాహకులకు ఇది ప్రయోజనం చేకూరుస్తుందని ప్రధానమంత్రి తెలిపారు. ఈ గృహనిర్మాణ ప్రాజెక్టులు ఛత్తీస్‌గఢ్‌లో గణనీయమైన ఉపాధిని సృష్టించాయని, అనేక మంది జీవనోపాధికి దోహదపడ్డాయని ఆయన పేర్కొన్నారు.

ఛత్తీస్‌గఢ్ ప్రజలకు తమ ప్రభుత్వం ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేరుస్తోందని స్పష్టం చేసిన శ్రీ నరేంద్ర మోదీ, వివిధ పథకాల ద్వారా పెద్ద సంఖ్యలో లబ్ధిదారులు ప్రయోజనం పొందుతున్నారనీ, ప్రభుత్వ హామీల అమలు సైతం వేగంగా జరుగుతోందన్నారు. ఛత్తీస్‌గఢ్ మహిళలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చామని, వరి రైతులకు రెండేళ్ల పెండింగ్ బోనస్‌ల పంపిణీ, పెరిగిన మద్దతు ధర ప్రకారం వరిధాన్యం సేకరించడం వంటి పలు హామీల అమలును ఆయన ప్రస్తావించారు. దీని ద్వారా లక్షలాది రైతు కుటుంబాలకు వేల కోట్ల రూపాయలను అందించాయన్నారు. నియామక పరీక్షల కుంభకోణాల వంటి గత ప్రభుత్వ అవినితీపై విమర్శలు చేసిన ప్రధానమంత్రి, తమ ప్రభుత్వం పారదర్శకంగా దర్యాప్తు చేయడంతో పాటు, న్యాయబద్ధంగా పరీక్షలను నిర్వహించిందని గుర్తుచేశారు. నిజాయితీగా పనిచేస్తున్న ప్రభుత్వానికి పెరుగుతున్న మద్దతుతో ప్రజల్లో విశ్వాసం బలపడిందన్నారు. ఛత్తీస్‌గఢ్‌లో అసెంబ్లీ, లోక్‌సభ, ఇప్పుడు మునిసిపల్ ఎన్నికల్లో సాధించిన విజయాలే దీనికి నిదర్శనమని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. తమ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు అఖండమైన మద్దతు అందిస్తున్న ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సంవత్సరంతో ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం అవతరించి 25 ఏళ్లు పూర్తవుతున్న సందర్భం గురించి ప్రస్తావిస్తూ, అటల్ బిహారీ వాజ్‌పేయి శత జయంతి ఉత్సవాలు జరుపుకొంటున్న ఈ సంవత్సరంలోనే రాష్ట్ర రజతోత్సవాలు కూడా రావడం సంతోషంగా ఉందని శ్రీ నరేంద్ర మోదీ తెలిపారు. ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం 2025ని "అటల్ నిర్మాణ్ వర్ష్"గా పాటిస్తున్నట్లు ఆయన తెలిపారు, "మేం దీనిని నిర్మించుకున్నాం, దీనిని అభివృద్ధి చేసుకుంటాం" అనే నినాదం పట్ల ప్రభుత్వానికి గల నిబద్ధతను పునరుద్ఘాటించారు. ఈరోజు శంకుస్థాపన జరిగిన, ప్రారంభించిన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు ఈ తీర్మానంలో భాగమేనని ఆయన స్పష్టం చేశారు.

అభివృద్ధి ప్రయోజనాలు ఆ ప్రాంతానికి చేరని పరిస్థితుల్లో ఛత్తీస్‌గఢ్‌ను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాల్సి వచ్చిందని ప్రధానమంత్రి తెలిపారు. గత ప్రభుత్వం అభివృద్ధిని అందించడంలో పూర్తిగా విఫలమైందనీ, వారు చేపట్టిన ప్రాజెక్టుల్లో అవినీతి జరిగిందని విమర్శించారు. తమ ప్రభుత్వం ప్రజల శ్రేయస్సుకు ప్రాధాన్యమిస్తుందన్న ప్రధానమంత్రి, వారి జీవితాలను, సౌకర్యాలను, వారి పిల్లలకు అవకాశాలను మెరుగుపరచడంపై ప్రభుత్వం పూర్తిగా దృష్టి సారించిందని స్పష్టం చేశారు. ఛత్తీస్‌గఢ్‌లోని ప్రతి గ్రామానికి అభివృద్ధి పథకాలను తీసుకురావడానికి చేసిన ప్రయత్నాలను ఆయన ప్రస్తావించారు.

మారుమూల గిరిజన ప్రాంతాల్లో పురోగతిని వివరిస్తూ, అక్కడ మొదటిసారి నాణ్యమైన రహదారులు ఏర్పాటవుతున్నాయనీ, ఈ కార్యక్రమంలో భాగంగా కొత్త రైలు ప్రారంభం సహా అనేక ప్రాంతాలకు రైలు సేవలను ప్రారంభించామని ప్రధానమంత్రి తెలిపారు. గతంలో వెనకబడిపోయిన ప్రాంతాలకు నేడు విద్యుత్, పైపుల ద్వారా నీరు, మొబైల్ టవర్ల ఏర్పాటు వంటి సదుపాయాలు అందుబాటులోకి తెచ్చామన్నారు. కొత్త పాఠశాలలు, కళాశాలలు, ఆసుపత్రుల నిర్మాణం గురించి ఆయన వ్యాఖ్యానిస్తూ, ఈ కార్యక్రమాలు ఛత్తీస్‌గఢ్ రూపురేఖలను మారుస్తున్నాయన్నారు.

పూర్తిగా విద్యుదీకరించిన రైలు నెట్‌వర్క్ ఉన్న రాష్ట్రాల్లో ఒకటిగా ఛత్తీస్‌గఢ్ సాధించిన విజయాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తూ, దీనిని ఒక ముఖ్యమైన మైలురాయిగా ప్రధానమంత్రి అభివర్ణించారు. రాష్ట్రంలో ప్రస్తుతం సుమారు రూ.40,000 కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టులు కొనసాగుతున్నాయనీ, వివిధ ప్రాంతాలు, పొరుగు రాష్ట్రాలతో రైలు కనెక్టివిటీని మెరుగుపరచడానికి ఈ సంవత్సరం బడ్జెట్‌లో రూ.7,000 కోట్లు కేటాయించామని ఆయన పేర్కొన్నారు. అభివృద్ధికి బడ్జెట్ మద్దతు, నిజాయితీ గల ఉద్దేశం రెండూ అవసరమన్న శ్రీ నరేంద్ర మోదీ, గత ప్రభుత్వ అవినీతి, అసమర్థత గిరిజన ప్రాంతాల్లో పురోగతికి ఆటంకం కలిగించిందని విమర్శించారు. ఛత్తీస్‌గఢ్‌లో సమృద్ధిగా నిల్వలు ఉన్నప్పటికీ, గత ప్రభుత్వాలు విద్యుత్ ప్లాంట్లను నిర్లక్ష్యం చేయడం వల్ల రాష్ట్రం విద్యుత్ కొరతను ఎదుర్కొందని పేర్కొంటూ, బొగ్గును నిల్వల గురించి ఆయన ప్రస్తావించారు. ఈ సమస్యలను పరిష్కరించడానికి, రాష్ట్రానికి ఆధారపడదగిన విద్యుత్‌ను అందించేందుకు తమ ప్రభుత్వం కొత్త విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తోందని ఆయన తెలిపారు.

సౌరశక్తిపై దృష్టి సారించడం, విద్యుత్ బిల్లులను తొలగించడం, విద్యుత్ ఉత్పత్తి ద్వారా కుటుంబాలు ఆదాయాన్ని సంపాదించడానికి వీలు కల్పించడం లక్ష్యంగా 'పీఎం సూర్యగర్ ముఫ్త్ బిజిలి పథకం' ప్రవేశపెట్టామని పేర్కొన్న ప్రధానమంత్రి, సౌర ఫలకాలను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ప్రతి ఇంటికి ₹78,000ల ఆర్థిక సహాయం అందిస్తోందని తెలిపారు. ఛత్తీస్‌గఢ్‌లో రెండు లక్షలకు పైగా కుటుంబాలు ఇప్పటికే ఈ పథకం కోసం నమోదు చేసుకున్నాయని, గణనీయమైన ప్రయోజనాలను పొందడం కోసం మిగతా వారు సైతం దీనిలో చేరాలని పిలుపునిచ్చారు.

ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి గ్యాస్ పైప్‌లైన్‌లను అందించడంలో గల సవాళ్ల పరిష్కారం కోసం ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను ప్రధానమంత్రి ప్రస్తావిస్తూ, గ్యాస్, మౌలిక సదుపాయాల్లో అవసరమైన పెట్టుబడులను నిర్లక్ష్యం చేసిన గత ప్రభుత్వంపై విమర్శలు చేశారు, ఈ ప్రాంతంలో గ్యాస్ పైప్‌లైన్‌లను వేయడానికి జరుగుతున్న పనులను ప్రధానంగా ప్రస్తావించారు. ఈ పైప్‌లైన్‌లు.. పెట్రోలియం ఉత్పత్తుల కోసం ట్రక్ రవాణాపై ఆధారపడటాన్ని తగ్గిస్తాయని, వినియోగదారుల ఖర్చులను తగ్గించడంతో పాటు, సీఎన్‌జీ వాహనాల వినియోగానికి వీలుకల్పిస్తాయని ఆయన పేర్కొన్నారు. రెండు లక్షలకు పైగా ఇళ్లను చేరుకునే లక్ష్యంతో పైపుల ద్వారా వంట గ్యాస్ అందించే కార్యక్రమం ద్వారా ఆయా కుటుంబాలకు ప్రయోజనం కలుగుతుందని ఆయన వ్యాఖ్యానించారు. గ్యాస్ లభ్యత ఛత్తీస్‌గఢ్‌లో కొత్త పరిశ్రమల స్థాపనకు దోహదపడుతుందని, గణనీయమైన ఉపాధి అవకాశాలను సృష్టిస్తుందని కూడా ప్రధానమంత్రి స్పష్టం చేశారు.

దశాబ్దాలుగా గత ప్రభుత్వం అనుసరించిన విధానాలను ప్రస్తావిస్తూ, ఛత్తీస్‌గఢ్ సహా ఇతర రాష్ట్రాల్లో నక్సలిజం పెరగడానికి అవి దోహదం చేశాయని ప్రధానమంత్రి విమర్శించారు. అభివృద్ధి, వనరులు లేని ప్రాంతాల్లో నక్సలిజం వృద్ధి చెందిందని, ఈ సమస్యలను పరిష్కరించే బదులు, అటువంటి జిల్లాలు వెనుకబడినవిగా ప్రకటించి, వారి బాధ్యత నుంచి వారు తప్పించుకున్నారని ఆయన పేర్కొన్నారు. గత ప్రభుత్వ పాలనలో ఛత్తీస్‌గఢ్‌లోని అనేక జిల్లాల్లో అత్యంత వెనుకబడిన గిరిజన కుటుంబాలు ఎదుర్కొన్న నిర్లక్ష్యాన్ని ప్రధానమంత్రి వివరించారు. దీనికి విరుద్ధంగా, పేద గిరిజన వర్గాల అవసరాలను తీర్చడానికి తమ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను ప్రస్తావిస్తూ, మరుగుదొడ్ల సదుపాయం కల్పించిన స్వచ్ఛ భారత్ అభియాన్, రూ.5 లక్షల వరకు ఉచిత చికిత్స అందించే ఆయుష్మాన్ భారత్ పథకం, 80% తగ్గింపుతో మందులను అందించే ప్రధానమంత్రి జన ఔషధి కేంద్రాల ఏర్పాటు వంటి పలు కార్యక్రమాలను ప్రధానమంత్రి ఉదహరించారు.

గిరిజన సమాజాన్ని నిర్లక్ష్యం చేస్తూ.. సామాజిక న్యాయం కోసం పోరాడుతున్నామని చెప్పుకునే వారిని ప్రధానమంత్రి విమర్శించారు. గిరిజన సమాజాల అభివృద్ధి పట్ల తమ ప్రభుత్వ నిబద్ధతను వివరించిన శ్రీ నరేంద్ర మోదీ, "ధర్తీ ఆబా జన్ జాతీయ ఉత్కర్ష్ అభియాన్" ప్రారంభించుటను ప్రస్తావించారు. ఈ పథకం ద్వారా గిరిజన ప్రాంతాల్లో సుమారు రూ.80,000 కోట్లు పెట్టుబడి పెట్టబడుతున్నామనీ, దీని ద్వారా ఛత్తీస్‌గఢ్‌లోని దాదాపు 7,000 గిరిజన గ్రామాలు ప్రయోజనం పొందుతున్నాయని ఆయన తెలిపారు. ముఖ్యంగా వెనకబడిన గిరిజన సమూహాలు ఎదుర్కొంటున్న ప్రత్యేక సవాళ్లను ప్రస్తావించిన శ్రీ నరేంద్ర మోదీ, వారికోసం మొదటిసారిగా "పీఎమ్ జన్‌మన్ యోజన"ను ప్రవేశపెట్టినట్లు పేర్కొన్నారు. ఈ పథకం కింద, ఛత్తీస్‌గఢ్‌లోని 18 జిల్లాల్లో 2,000 కంటే ఎక్కువ స్థావరాలను అభివృద్ధి చేస్తున్నట్లు ఆయన వ్యాఖ్యానించారు. దేశవ్యాప్తంగా గిరిజన స్థావరాల కోసం 5,000 కిలోమీటర్ల రహదారులకు ఆమోదం లభించిందనీ, ప్రధానమంత్రి జన్‌మన్ యోజన కింద ఛత్తీస్‌గఢ్‌లోనే దాదాపుగా వాటిలో సగం అంటే 2,500 కిలోమీటర్ల రహదారులు నిర్మించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా అనేక మంది లబ్ధిదారులు సొంత గృహాలను కూడా పొందారని ప్రధానమంత్రి గుర్తుచేశారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల హాయాంలో ఛత్తీస్‌గఢ్‌లో జరుగుతున్న వేగవంతమైన అభివృద్ధిని ప్రముఖంగా ప్రస్తావిస్తూ, సుక్మా జిల్లా ఆరోగ్య కేంద్రానికి జాతీయ నాణ్యతా ధ్రువీకరణ పత్రం అందడం, అనేక సంవత్సరాల తర్వాత దంతేవాడలో ఆరోగ్య కేంద్రాన్ని తిరిగి ప్రారంభించడం వంటి విజయాలు కొత్త విశ్వాసాన్నిచ్చాయని శ్రీ నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఈ ప్రయత్నాలు నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో శాశ్వత శాంతితో కూడిన కొత్త యుగానికి నాంది పలుకుతున్నాయని ఆయన స్పష్టం చేశారు. ఛత్తీస్‌గఢ్‌లో సానుకూల మార్పులకు నిదర్శనంగా డిసెంబర్ 2024లో తన "మన్ కీ బాత్" కార్యక్రమంలో చర్చించిన బస్తర్ ఒలింపిక్స్‌ను ప్రస్తావిస్తూ, రాష్ట్ర పురోగతిని ప్రతిబింబించే వేలాది మంది యువత ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొనడాన్ని ఆయన గుర్తు చేశారు. ఛత్తీస్‌గఢ్ యువత ఉజ్వల భవిష్యత్తు గురించి ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు, రాష్ట్రం కొత్త విద్యా విధానాన్ని సమర్థంగా అమలు చేయడాన్ని ప్రశంసించారు. ఛత్తీస్‌గఢ్‌లో దాదాపు 350 పాఠశాలలతో సహా దేశవ్యాప్తంగా 12,000ల కంటే ఎక్కువ ఆధునిక పీఎమ్ శ్రీ పాఠశాలల స్థాపనను ఆయన ప్రధానంగా ప్రస్తావించారు, ఇవి ఇతర పాఠశాలలకు నమూనాలుగా పనిచేస్తాయి, రాష్ట్ర విద్యా వ్యవస్థను ఉన్నతీకరిస్తాయని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు.

ఛత్తీస్‌గఢ్‌లోని ఏకలవ్య మోడల్ స్కూల్స్ చేస్తున్న అద్భుతమైన కృషిని, నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో పాఠశాలలను తిరిగి ప్రారంభించడాన్ని ప్రధానమంత్రి ప్రశంసించారు. రాష్ట్రంలో విద్యా సమీక్ష కేంద్రాన్ని కూడా ఆయన ప్రారంభించారు, దేశ విద్యా వ్యవస్థకు ఒక ముఖ్యమైన ముందడుగుగా దీనిని ఆయన అభివర్ణించారు. ఈ కార్యక్రమం విద్య నాణ్యతను పెంచుతుందని, తరగతి గదుల్లో ఉపాధ్యాయులు, విద్యార్థులకు ఎప్పటికప్పుడు మద్దతును అందిస్తుందని ఆయన స్పష్టం చేశారు.

వైద్యం, ఇంజినీరింగ్ చదువులను హిందీలో చదివేందుకు వీలు కల్పించే నూతన జాతీయ విద్యా విధానం ద్వారా మరో వాగ్దానాన్ని నెరవేర్చడాన్ని ప్రస్తావిస్తూ, ఈ కార్యక్రమం గ్రామీణ యువత, వెనుకబడిన వర్గాలు, గిరిజన కుటుంబాలకు గల భాషాపరమైన అవరోధాలను తొలగిస్తుందని, వారు తమ కలలను సాధించడంలో సహాయపడుతుందని శ్రీ నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. గత సంవత్సరాల్లో శ్రీ రమణ్ సింగ్ వేసిన బలమైన పునాదిని మరింత బలోపేతం చేయడానికి ప్రస్తుత ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను పునరుద్ఘాటించారు. రాబోయే 25 సంవత్సరాల్లో ఈ పునాదిపై ఒక గొప్ప అభివృద్ధి నిర్మాణాన్ని నిర్మించాలని ఆయన ఆకాంక్షించారు.

ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని వనరులు, ఆకాంక్షలు, సామర్థ్యాన్ని గురించి ప్రస్తావిస్తూ తన 50వ వార్షికోత్సవాన్ని జరుపుకొనే నాటికి దేశంలోని అగ్రగామి రాష్ట్రాల్లో ఒకటిగా అభివృద్ధి సాధించాలనే లక్ష్యాన్ని నిర్దేశించిన ప్రధానమంత్రి, రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి అభివృద్ధి ప్రయోజనాలు చేరేలా ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తుందని హామీ ఇస్తూ తన ప్రసంగాన్ని ముగించారు.

ఈ కార్యక్రమంలో ఛత్తీస్‌గఢ్ గవర్నర్ శ్రీ రామెన్ డేకా, ముఖ్యమంత్రి శ్రీ విష్ణు దేవ్ సాయి, కేంద్ర మంత్రులు శ్రీ మనోహర్ లాల్, శ్రీ తోఖాన్ సాహు, ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ స్పీకర్ శ్రీ రమణ్ సింగ్, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.

నేపథ్యం

దేశవ్యాప్తంగా విద్యుత్ రంగాన్ని మెరుగుపరచడానికి ప్రధానమంత్రి కట్టుబడి ఉన్నారు. దీనికి అనుగుణంగా, సరసమైన, విశ్వసనీయ విద్యుత్తును అందించడం కోసం, విద్యుత్ ఉత్పత్తిలో ఛత్తీస్‌గఢ్‌ స్వావలంబన సాధించేలా అనేక చర్యలు తీసుకున్నారు. బిలాస్‌పూర్ జిల్లాలో ఉన్న రూ. 9,790 కోట్లకు పైగా విలువైన ఎన్‌పీటీసీ సిపత్ సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ స్టేజ్-III (1x800మెగావాట్స్) నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ పిట్ హెడ్ ప్రాజెక్ట్ అధిక విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంతో.. అత్యాధునిక అల్ట్రా-సూపర్‌క్రిటికల్ సాంకేతికతపై ఆధారపడి ఉంటుంది. రూ. 15,800 కోట్లకు పైగా విలువైన ఛత్తీస్‌గఢ్ స్టేట్ పవర్ జనరేషన్ కంపెనీ లిమిటెడ్ (సీఎస్‌పీజీసీఎల్) మొదటి సూపర్ క్రిటికల్ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ (2X660మెగావాట్స్) పనులను ఆయన ప్రారంభించారు. రూ. 560 కోట్లకు పైగా విలువైన వెస్ట్రన్ రీజియన్ ఎక్స్‌పాన్షన్ స్కీమ్ (డబ్ల్యూఆర్ఈఎస్) కింద పవర్‌గ్రిడ్ మూడు విద్యుత్ ప్రసార ప్రాజెక్టులను ప్రధానమంత్రి జాతికి అంకితం చేశారు.

వాయు కాలుష్యాన్ని తగ్గించడం, పరిశుద్ధ ఇంధన పరిష్కారాలను అందించడం వంటి భారత నికర-సున్నా ఉద్గార లక్ష్యాలకు అనుగుణంగా, కోరియా, సూరజ్‌పూర్, బలరాంపూర్, సుర్గుజా జిల్లాల్లో భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్) ఆధ్వర్యంలోని సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ (సీజీడీ) ప్రాజెక్టుకు ప్రధానమంత్రి శంకుస్థాపన చేశారు. ఇందులో 200 కి.మీ.లకు పైగా హై ప్రెజర్ పైప్‌లైన్, 800 కి.మీ.లకు పైగా ఎండీపీఈ (మీడియం డెన్సిటీ పాలీఇథిలీన్) పైప్‌లైన్, రూ.1,285 కోట్లకు పైగా విలువైన బహుళ సీఎన్‌జీ డిస్పెన్సింగ్ ఔట్‌లెట్‌లు ఉన్నాయి. రూ.2210 కోట్లకు పైగా విలువైన 540 కి.మీ.లకు పైగా విస్తరించి ఉన్న హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌పీసీఎల్) విశాఖ-రాయ్‌పూర్ పైప్‌లైన్ (వీఆర్‌పీఎల్) ప్రాజెక్టుకు కూడా ఆయన ఈ సందర్భంగా శంకుస్థాపన చేశారు. ఈ బహుళ ఉత్పత్తి (పెట్రోల్, డీజిల్, కిరోసిన్) పైప్‌లైన్ సంవత్సరానికి 3 మిలియన్ మెట్రిక్ టన్నులకు పైగా సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.

ఈ ప్రాంతంలో కనెక్టివిటీని మెరుగుపరచడంపై దృష్టి సారిస్తూ, మొత్తం 108 కి.మీ పొడవు గల ఏడు రైల్వే ప్రాజెక్టులకు ప్రధానమంత్రి శంకుస్థాపన చేశారు, రూ. 2,690 కోట్లకు పైగా విలువ గల మొత్తం 111 కిలోమీటర్ల పొడవైన మూడు రైల్వే ప్రాజెక్టులను జాతికి అంకితం చేశారు. అభన్‌పూర్-రాయ్‌పూర్ మార్గంలో మందిర్ హసౌద్ ద్వారా ప్రయాణించే ఎంఈఎంయు రైలు సేవలను ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఛత్తీస్‌గఢ్‌లో భారతీయ రైల్వేలోని 100% విద్యుదీకరణ పూర్తయిన రైలు నెట్‌వర్క్‌ను కూడా ఆయన జాతికి అంకితం చేశారు. ఈ ప్రాజెక్టులు రద్దీని తగ్గిస్తాయి, కనెక్టివిటీని మెరుగుపరుస్తాయి, ఈ ప్రాంతం అంతటా సామాజిక, ఆర్థిక వృద్ధిని పెంపొదిస్తాయి.

ఈ ప్రాంతంలో రహదారుల మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తూ, 2 వరుసల తారు రోడ్డుగా అప్‌గ్రేడ్ చేసిన ఎన్‌హెచ్-930 (37 కి.మీ)లో ఝల్మాల నుంచి షెర్పార్ వరకు గల సెక్షన్‌ను, ఎన్‌హెచ్-43 (75 కి.మీ) లోని అంబికాపూర్-పాతల్‌గావ్ సెక్షన్‌ను ప్రధానమంత్రి జాతికి అంకితం చేశారు. ఎన్‌హెచ్-130D (47.5 కి.మీ) లోని కొండగావ్-నారాయణపూర్ సెక్షన్‌ను 2 వరుసల తారు రోడ్డుగా అప్‌గ్రేడ్ చేసే పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. రూ. 1,270 కోట్లకు పైగా విలువైన ఈ ప్రాజెక్టుల ద్వారా గిరిజన, పారిశ్రామిక ప్రాంతాలు మరింత అందుబాటులోకి రావడంతో పాటు, ఈ ప్రాంత సమగ్ర అభివృద్ధికి ఊతమిస్తాయి.

అందరికీ విద్యను అందించాలనే తన నిబద్ధతకు అనుగుణంగా, రాష్ట్రంలోని 29 జిల్లాల్లో 130 పీఎమ్ శ్రీ పాఠశాలలు, రాయ్‌పూర్‌లో విద్యా సమీక్ష కేంద్రం (వీఎస్‌కె) వంటి రెండు ప్రధాన విద్యాసంబంధ కార్యక్రమాలను ప్రధానమంత్రి ప్రారంభించారు. పీఎమ్ స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా పథకం కింద 130 పాఠశాలలను అప్‌గ్రేడ్ చేయనున్నారు. ఈ పాఠశాలల్లో మంచి నిర్మాణాత్మక మౌలిక సదుపాయాలు, స్మార్ట్ బోర్డులు, ఆధునిక ప్రయోగశాలలు, గ్రంథాలయాల ద్వారా అధిక-నాణ్యత గల విద్యను అందించనున్నారు. రాయ్‌పూర్‌లోని వీఎస్‌కె వివిధ విద్యా సంబంధిత ప్రభుత్వ పథకాల ఆన్‌లైన్ పర్యవేక్షణ, డేటా విశ్లేషణకు వీలు కల్పిస్తుంది.

గ్రామీణ కుటుంబాలకు సరైన గృహ వసతి కల్పించడం, వారి ఆరోగ్యం, భద్రత, మొత్తం జీవన నాణ్యతను మెరుగుపరచడం పట్ల తన నిబద్ధతను నెరవేర్చుతూ, ప్రధానమంత్రి ఆవాస్ యోజన - గ్రామీణ (పీఎమ్ఎవై-జీ) కింద 3 లక్షల మంది లబ్ధిదారులు నూతన గృహ ప్రవేశం చేయనుండగా, ఈ పథకం ద్వారా సొంతింటి కల నెరవేర్చుకున్న కొన్ని కుటుంబాలకు ప్రధానమంత్రి ఇంటి తాళాలను అందజేసారు.

 

 

***

 

MJPS/SR


(Release ID: 2117068) Visitor Counter : 12