సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
ఆకాశవాణి ఆరాధన ఛానల్ లో నవరాత్రి ప్రత్యేక కార్యక్రమాలు
Posted On:
28 MAR 2025 7:40PM by PIB Hyderabad
నవరాత్రి శుభ సందర్భంగా ఆకాశవాణి ఆరాధన యూట్యూబ్ చానల్ మార్చి 30 నుంచి ఏప్రిల్ 6 వరకు ప్రత్యేక కార్యక్రమాలను ప్రసారం చేయనుంది. పండుగల వేళ ప్రేక్షకులను భక్తిభావంతో తన్మయులను చేసేలా వీటిని రూపొందించారు.
ఈ శుభదినాల ప్రాశస్త్యాన్ని తెలియజేసేలా ప్రత్యేకంగా రూపొందించిన వరుస కార్యక్రమాలను ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ప్రదర్శిస్తారు. అంతేకాకుండా, ప్రేక్షకుల్లో దైవిక భావాలను కలిగించేలా రోజూ ఉదయం 8:30 నుంచి 8:40 వరకు శక్తి ఆరాధనను ప్రసారం చేయనున్నారు.
అనూప్ జలోటా, నరీందర్ చంచల్, జగ్జీత్ సింగ్, హరి ఓం శరణ్, మహేంద్ర కపూర్, అనురాధ పౌడ్వాల్ వంటి ప్రముఖ కళాకారులతో నిర్వహించే నవరాత్రి భజనలు వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయి. ఈ ప్రదర్శనలు ప్రతిరోజూ సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు ప్రసారంమవుతాయి.
ఆధ్యాత్మిక అనుభవాన్ని మరింత పెంచేలా.. నవరాత్రి వైశిష్ట్యాన్ని వివరించే కథనాలతో ‘దేవి మా కే అనేక్ స్వరూప్’ కార్యక్రమం రోజూ ఉదయం 9 నుంచి 9:30 వరకు ప్రసారమవుతుంది. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ శక్తి పీఠాలపై ప్రత్యేక కార్యక్రమాలను కూడా ఛానల్ లో ప్రసారం చేస్తారు. దుర్గామాత కొలువై ఉన్న పవిత్ర క్షేత్రాలపై విలువైన సమాచారాన్ని ఈ కార్యక్రమం శ్రోతలకు అందిస్తుంది.
రామజన్మోత్సవం రోజు అయోధ్యలోని శ్రీ రామ జన్మభూమి మందిరంలో వైభవంగా నిర్వహించే కార్యక్రమాల ప్రత్యక్ష ప్రసారంతో ఈ నవరాత్రి ఉత్సవాలు ముగుస్తాయి. ఈ ఆధ్యాత్మిక శోభ దేశవ్యాప్తంగా భక్తులను చేరేలా.. ఏప్రిల్ 6న ఉదయం 11:45 నుంచి మధ్యాహ్నం 12:15 వరకు ఈ ప్రత్యేక ప్రసారాన్ని అందిస్తారు.
నవరాత్రి వేళ ఆధ్యాత్మిక భావాల్లో లీనమై, భక్తిపూర్వక వాతావరణంలో పండుగను నిర్వహించుకోవడం కోసం ఆకాశవాణి ఆరాధన యూట్యూబ్ ఛానెల్‌ను వీక్షించవచ్చు.
***
(Release ID: 2116820)
Visitor Counter : 11