ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
మెడికల్ ఆక్సిజన్ నిర్వహణపై మార్గదర్శకాలు జారీ చేసిన కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ
న్యూఢిల్లీ ఎయిమ్స్ సహకారంతో ఆక్సిజన్ నిర్వహణపై జాతీయ సామర్థ్య నిర్మాణ కార్యక్రమ ప్రారంభం
అత్యవసర పరిస్థితులు తలెత్తినప్పుడు ఎదురయ్యే అదనపు డిమాండ్‌కు తగినట్లుగా మెడికల్ ఆక్సిజన్ మౌలిక సదుపాయాల నిర్వహణ, వినియోగం ఉండాలన్న కేంద్ర ఆరోగ్య కార్యదర్శి
దేశవ్యాప్తంగా మెడికల్ ఆక్సిజన్ సదుపాయాలను బలోపేతం చేయడానికి, ఆరోగ్య కేంద్రాల్లో ఆక్సిజన్ నిర్వహణలో
ఒకే విధమైన ఉత్తమ పద్ధతులను అనుసరించే దిశగా వేసిన ముందడుగు
200 మంది ప్రధాన శిక్షణ నిపుణులను తయారు చేయడమే ఈ జాతీయ సామర్థ్య నిర్మాణ కార్యక్రమ లక్ష్యం
Posted On:
27 MAR 2025 1:25PM by PIB Hyderabad
ఢిల్లీలోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్)లో ఈ రోజు జరిగిన శిక్షణ కార్యక్రమంలో మెడికల్ ఆక్సిజన్ నిర్వహణపై జాతీయ మార్గదర్శకాలను కేంద్ర ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. అలాగే ఢిల్లీ ఎయిమ్స్ లో ఆసుపత్రి అడ్మినిస్ట్రేషన్ విభాగం నిర్వహిస్తున్న ఆక్సిజన్ నిర్వహణపై జాతీయ సామర్థ్య నిర్మాణ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించారు.

ఈ సందర్భంగా కేంద్ర ఆరోగ్య కార్యదర్శి శ్రీమతి పుణ్య సలిల శ్రీ వాస్తవ ప్రసంగించారు. ఏవైనా అత్యవసర సందర్భాల్లో, ఎదురయ్యే అదనపు డిమాండ్ కు అనుగుణంగా మెడికల్ ఆక్సిజన్ మౌలిక సదుపాయాల నిర్వహణ, వినియోగం ఉండాలని స్పష్టం చేశారు. కొవిడ్-19 మహమ్మారిని భారత్ ఎదుర్కొన్న తీరు నుంచి నేర్చుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు.
సామర్థ్య నిర్మాణ కార్యక్రమాన్ని వేగవంతం చేయడం, ఆరోగ్య రంగంలో అన్ని స్థాయుల్లోనూ శిక్షణ, అవగాహన ప్రాధాన్యం గురించి ఎయిమ్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఎం. శ్రీనివాస్ వివరించారు.
మెడికల్ ఆక్సిజన్ నిర్వహణ అంశంలో విడుదల చేసిన జాతీయ మార్గదర్శకాలు దేశంలో మెడికల్ ఆక్సిజన్ మౌలిక వసతులను బలోపేతం చేసే దిశగా వేసిన ముందడుగు. ఈ మార్గదర్శకాలు ఆరోగ్య సంరక్షణ కేంద్రాల్లో ఆక్సిజన్ నిర్వహణలో ఒకే విధమైన ఉత్తమ పద్ధతులు అనుసరించేలా చేస్తాయి. అలాగే రోగి భద్రత, సామర్థ్య నిర్మాణం, అత్యవసర సంసిద్ధతపై ప్రధాన దృష్టి సారిస్తూ సమర్థవంతంగా వైద్య ఆక్సిజన్ సేకరణ, నిల్వ, నిర్వహణపై నియమావళిని అందిస్తాయి.

ఎయిమ్స్ సహకారంతో ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడిచే విపత్తు నిర్వహణ సెల్ ఆక్సిజన్ నిర్వహణలో జాతీయ సామర్థ్య నిర్మాణ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. దేశ వ్యాప్తంగా 200 మంది ప్రధాన శిక్షణ నిపుణులను తయారు చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. వారు దేశవ్యాప్తంగా ఆసుపత్రి నిర్వాహకులు, వైద్య అధికారులకు శిక్షణ ఇచ్చి మెడికల్ ఆక్సిజన్ సక్రమ నిర్వహణ, వినియోగంతో పాటు వృధాను తగ్గించేందుకు, చికిత్సా ఫలితాలను మెరుగుపరిచేందుకు సాయపడతారు.
***
(Release ID: 2115765)
Visitor Counter : 42