ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

వైద్య ఖర్చుల తగ్గింపునకు చర్యలు


· ఆరోగ్య ఖర్చుల నిమిత్తం పౌరులు సొంతంగా పెట్టే ఖర్చు 2014-15 లో 62.6 శాతం ఉండగా 2021-22 లో 39.4 శాతానికి తగ్గింది

· ఆరోగ్య ఖర్చుల నిమిత్తం ప్రభుత్వం చేసే ఖర్చు 2014-15 లో 29.0 శాతంగా ఉండగా 2021-22లో 48.0 శాతానికి చేరింది

· అత్యవసర మందులను అందుబాటులో ఉంచేందుకు, ఆరోగ్య పరీక్ష సేవలను ఉచితంగా అందజేసేందుకు నేషనల్ ఫ్రీ డ్రగ్స్, ఫ్రీ డయాగ్నోస్టిక్ సర్వీసుల ప్రారంభం

· సమగ్ర, విస్తృత ప్రాథమిక వైద్య సదుపాయాలను అందించేందుకు 1.76 లక్షల ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాల ఏర్పాటు, సేవలు ప్రారంభం

· దేశ జనాభాలో 40 శాతంగా ఉన్న అట్టడుగు నిరుపేద వర్గానికి చెందిన 12.37 కోట్ల కుటుంబాల్లోని 55 కోట్ల లబ్ధిదారులకు, కుటుంబానికి ఏడాదికి అయిదు లక్షల రూపాయల విలువగల ద్వితీయ, తృతీయ శ్రేణి ఆసుపత్రి ఖర్చులను అందించడమే ఏబీ-పీఎంజేఏవై లక్ష్యం

· ప్రధానమంత్రి జాతీయ జన ఔషధి పరియోజన కింద చౌక ధరల్లో నాణ్యమైన జెనరిక్ మందులు అందరికీ అందుబాటులో...

Posted On: 25 MAR 2025 1:51PM by PIB Hyderabad

జాతీయ ఆరోగ్య ఖాతాల (ఎన్ హెచ్ ఏ) అంచనాల ప్రకారం, ఆరోగ్య పరిరక్షణ కోసం పెట్టే మొత్తం వైద్య ఖర్చులో (టీహెచ్ఈ), పౌరులు సొంతంగా చేసే ఖర్చు వాటా (ఓఓపీఈ) క్రమేపీ తగ్గుముఖం పడుతోంది. 2014-15లో ఓఓపీఈ 62.6 శాతం ఉండగా, 2021-22 కల్లా 39.4 శాతానికి తగ్గిపోయింది. అదే సమయంలో ప్రభుత్వం చేసే ఖర్చు (జీహెచ్ఈ) 2014-15లో 29.0 శాతంగా ఉండగా, 2021-22 కల్లా అది 48.0 శాతానికి పెరిగింది. టీహెచ్ఈలో ఓఓపీఈ శాతాన్ని తగ్గించేందుకు కృషి చేస్తున్న ప్రభుత్వం తన వాటాను గణనీయంగా పెంచింది.  

గ్రామీణ ప్రాంతాల వారు సహా అందరికీ అందుబాటులో, చౌక ధరల్లో నాణ్యమైన వైద్య సేవలను అందించేందుకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వివిధ జాతీయ స్థాయి పథకాలను, కార్యక్రమాలను ప్రవేశపెట్టింది. వైద్యసేవల కోసం పౌరులు వ్యక్తిగతంగా చేసే ఖర్చుని ఈ కీలక పథకాలు, కార్యక్రమాలూ గణనీయంగా తగ్గించడంలో దోహదపడ్డాయి. పథకాల్లో కొన్ని:

జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్ హెచ్ ఎం): సార్వజనీన వైద్య సేవలు లక్ష్యంగా, అందరికీ అందుబాటులో చౌకైన వైద్యసేవలను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న ప్రయత్నాలకు  కేంద్రం దన్నుగా నిలుస్తూ జాతీయ ఆరోగ్య మిషన్ ద్వారా అనేక చర్యలను తీసుకుంది. వైద్యసేవల రంగంలో మౌలిక సదుపాయాల మెరుగుదల, వైద్యసేవలను అందించేందుకు సరిపడా సహాయ సిబ్బంది ఏర్పాటు, చౌకైన, నాణ్యమైన ఆరోగ్య సేవలను అందరికీ - ముఖ్యంగా మారుమూల ప్రాంతాల వారికి, బడుగు వర్గాలకీ అందుబాటులోకి తెచ్చేందుకు జాతీయ ఆరోగ్య మిషన్ సహాయపడుతోంది. ప్రజారోగ్య కేంద్రాలను సందర్శించే రోగులు సొంతంగా పెట్టే వైద్య  ఖర్చులను తగ్గించేందుకు, అత్యవసర మందులను అందుబాటులో ఉంచేందుకు, ఆరోగ్య పరీక్ష సేవలను ఉచితంగా అందజేసేందుకు నేషనల్ ఫ్రీ డ్రగ్స్, ఫ్రీ డయాగ్నోస్టిక్ సర్వీసులను  ప్రారంభించారు.

ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు: గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని ఉప ఆరోగ్య కేంద్రాలు(ఎస్హెచ్సీ), ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను (పీహెచ్సీ) 1.76 లక్షల ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు (ఏఏఎం) గా మార్చి, వైద్య సేవలను  తిరిగి ప్రారంభించారు. సమగ్ర, విస్తృతస్థాయి ప్రాథమిక వైద్య సదుపాయాలను పౌరుల నివాసాలకు చేరువలో, అందరికీ అందుబాటులో, ఉచితంగా అందించడం ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాల లక్ష్యం. ఆరోగ్య సమస్యల నివారణ, వ్యాధి నిర్మూలన, రోగులకు సాంత్వన చేకూర్చడం, పూర్వ ఆరోగ్య స్థితిని కల్పించే సేవలను అందించడం లక్ష్యాలు గల ఆరోగ్య మందిరాలు పునరుత్పత్తి, శిశు సంరక్షణ, సంక్రమిత, సాధారణ వ్యాధులు సహా ఇతర ఆరోగ్య సమస్యల పరిష్కారంలో సేవలను అందిస్తాయి.  

ప్రాథమిక, ద్వితీయ, తృతీయ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థల సామర్థ్యాలను అభివృద్ధి చేసే లక్ష్యంతో ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ (పీఎం-అభిం)ను ప్రారంభించారు. ఇప్పటికే ఉన్న జాతీయ ఆరోగ్య సంస్థల బలోపేతం, నూతన వ్యాధుల గుర్తింపు, చికిత్సల కోసం తగిన సంస్థల ఏర్పాటు కూడా ఈ పథకంలోని భాగాలే. కొన్ని కేంద్రీయ అంశాలతో  కూడిన కేంద్ర ప్రభత్వ ప్రాయోజిత పథకమైన పీఎం-అభిం కోసం రూ. 64,180 కోట్లను కేటాయించారు.

దేశ జనాభాలో 40 శాతంగా ఉన్న అట్టడుగు నిరుపేద వర్గానికి చెందిన 12.37 కోట్ల కుటుంబాల్లోని 55 కోట్ల లబ్ధిదారులకు కుటుంబానికి, ఏడాదికి అయిదు లక్షల రూపాయల విలువగల ద్వితీయ, తృతీయ శ్రేణి ఆసుపత్రి ఖర్చులను అందించడమే ఆయుష్మాన్ భారత్ ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన (ఏబీ-పీఎంజే) లక్ష్యం.  ఏబీ-పీఎంజేని అమలు చేస్తున్న రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు తమ సొంత ఖర్చుతో లబ్ధిదారుల సంఖ్యను మరింత విస్తరించాయి. ఇటీవల ఏబీ-పీఎంజే కింద 4.5 కోట్ల కుటుంబాలకు చెందిన 70 ఏళ్ళు, అంతకు పైబడి వయసున్న 6 కోట్ల మంది వయోవృద్ధులకు, వారి సామాజిక-ఆర్థిక స్థితిగతులతో  నిమిత్తం లేకుండా  వయ్ వందన కార్డులను అందజేశారు.

రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ప్రధాన మంత్రి భారతీయ జనౌషధి పరియోజన (పీఎంబీజీపీ) కింద చౌకైన, నాణ్యమైన జనరిక్ మందులను అందరికీ అందుబాటులోకి తెచ్చారు. అఫోర్డబుల్ మెడిసిన్స్ అండ్ రిలయబుల్ ఇంప్లాంట్స్ ఫర్ ట్రీట్మెంట్ (అమృత్) పేరిట కొన్ని ఆసుపత్రులు, సంస్థల్లో  ఫార్మసీలను ఏర్పాటు చేశారు.

కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి శ్రీమతి అనుప్రియా పటేల్ ఈ విషయాలని ఈరోజు రాజ్యసభకి లిఖితపూర్వకంగా తెలియజేశారు.

 

***


(Release ID: 2115100) Visitor Counter : 21