వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

కొత్త రూపంలో ‘గోలీ పాప్ సోడా’.. ‘అపెడా’ పచ్చ జెండా.. ప్రపంచ మార్కెట్ల కోసం భారత్ రూపొందించిన ప్రఖ్యాత గోలీ సోడా ఇది

* గోలీ సోడాను పున:ప్రారంభించడం భారత దేశీయ పానీయాలను ప్రపంచమంతటా ప్రోత్సహించే దిశగా ఒక పెద్ద ముందంజ

* వినియోగదారుల విశేష ఆదరణతో అమెరికా, బ్రిటన్, ఐరోపా, గల్ఫ్ మార్కెట్లలోకి విజయవంతంగా అడుగుపెట్టిన గోలీ పాప్ సోడా

Posted On: 23 MAR 2025 11:26AM by PIB Hyderabad

కేంద్ర ప్రభుత్వ వాణిజ్య, పరిశ్రమ మంత్రిత్వ శాఖ పరిధిలోని వ్యవసాయ, శుద్ధిచేసిన ఆహార పదార్థాల ఎగుమతి అభివృద్ధి ప్రాధికరణ (‘అపెడా’) సాంప్రదాయక భారతీయ గోలీ సోడాను ప్రపంచ స్థాయిలో పున:పరిచయం చేస్తున్నట్లు సగర్వంగా ప్రకటించింది. దీనిని ‘గోలీ పాప్ సోడా’ అనే కొత్త రూపంలో ప్రవేశపెట్టారు. ఈ ప్రఖ్యాత పానీయం ఒకప్పుడు ఇంటింటా సేవించేవారు.. ఇది తన కొత్త రూపంలో వ్యూహాత్మక అంతర్జాతీయ విస్తరణ కారణంగా ప్రపంచ వేదికపైకి అసాధారణ రీతిలో తిరిగి వస్తోంది.

 

ఈ ఉత్పాదన ఇప్పటికే ప్రపంచ మార్కెట్లలోకి గొప్పగా తన జాడను చాటిచెప్పుకొంది. అమెరికా, బ్రిటన్, ఐరోపా, ఇంకా గల్ఫ్ దేశాలకు పంపించిన సరుకు మంచి ఆదరణకు నోచుకుంది. ఫెయిర్ ఎక్స్‌పోర్ట్స్ ఇండియాతో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కుదుర్చుకోవడం గల్ఫ్ ప్రాంతంలో పెద్ద సంఖ్యలో రిటైల్ స్టోర్స్‌ను నడుపుతున్న సంస్థల్లో ఒకటైన లులు హైపర్‌మార్కెట్‌కు క్రమం తప్పక సరఫరాలు చేసేందుకు తోడ్పడింది. లులు విక్రయకేంద్రాలలో వేల బాటిల్స్‌ను అమ్మకాలకు సిద్ధంగా ఉంచారు. వీటికి ప్రజల నుంచి గొప్ప సానుకూల స్పందన లభిస్తోంది.

 

బ్రిటన్‌లో, గోలీ పాప్ సోడా అడుగు పెట్టీపెట్టడంతోనే ఇది ఒక సాంస్కృతిక మహాఘట్టంగా మారింది. ఇది భారతీయ రుచుల మేళనాన్ని ఒక ఆధునిక రూపంలో అందిస్తే అక్కున చేర్చుకుని ఆదరించే వినియోగదారులను ఎంతో ఆకట్టుకుంటోంది. ఈ పరిణామం భారత సంపన్న పానీయ వారసత్వానికి ప్రపంచ వేదికపై లభించిన ఒక ముఖ్య స్పందనను కూడా సూచిస్తోంది.

 

ఈ మహత్తర విజయానికి గుర్తుగా, అపెడా గత నెల 4న ఏబీఎన్ఎన్ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రారంభ కార్యక్రమానికి దన్నుగా నిలిచింది. ప్రపంచ స్థాయిలో గోలీ పాప్ సోడా అధికారికంగా ప్రారంభమైందని ఈ కార్యక్రమం చాటిచెప్పింది. ఈ కార్యక్రమం ప్రామాణికమైన, అధిక నాణ్యత కలిగిన ఉత్పాదనలను ప్రోత్సహించడం, అంతర్జాతీయ పానీయాల మార్కెట్లో తన ఉనికిని బలోపేతం చేసుకోవడానికి భారత్ ఎంతగా కట్టుబడి ఉందో కూడా స్పష్టంచేసింది.

 

బహుళ జాతీయ పానీయాల కంపెనీల ఆధిక్యం కారణంగా దాదాపు మాయమైపోయిన గోలీ సోడాను మళ్లీ మార్కెట్లోకి ప్రవేశపెట్టడమనేది, ప్రామాణిక, దేశీయ ఆహార, పానీయ ఉత్పాదనలను ప్రోత్సహించడంతోపాటు ఎగుమతి చేయాలన్న భారత్ ప్రయత్నాలలో లభించిన ఒక ప్రధాన విజయం. ఆధునిక ప్యాకేజింగ్ అండదండలతో పాత జ్ఞాపకాలను కలబోసి, ప్రపంచమంతటా సమకాలీన వినియోగదారుల కోసం ఈ ప్రియ పానీయాన్ని జయప్రదంగా మరోసారి పరిచయం చేసింది.

 

గోలీ పాప్ సోడాను అన్నింటి కన్నా ప్రత్యేకంగా నిలబెట్టేది దీని కొత్త ప్యాకేజింగ్.. దీనిలో ఒక అద్వితీయ పాప్ ఓపెనర్ ఉంది. ఇది భారతీయ వినియోగదారులు ఎంతో మక్కువగా గుర్తుకుతెచ్చుకునే గ్యాస్‌తో కూడిన నురగ శబ్దాన్ని ఇస్తుంది. మెరుగైన మార్కెటింగ్ విధానం అంతర్జాతీయ మార్కెట్లను ఆకట్టుకుంది. దీంతో, ఈ పానీయం ఒక మేలైన ఉత్పాదనగా నిలదొక్కుకుంది.

 

 

దీనికి తోడు, ఈ నెల 17 నుంచి 19 దాకా నిర్వహించిన అంతర్జాతీయ ఆహార, పానీయాల కార్యక్రమం (ఐఎఫ్ఈ) లండన్ 2025లో గోలీ పాప్ సోడా ను ప్రదర్శించడానికి అపెడా చొరవ తీసుకుంది. ఈ కార్యక్రమం అంతర్జాతీయ కొనుగోలుదారులతో భారతీయ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, ఎగుమతిదారులు భేటీ కావడానికి, కొత్త కొత్త వాణిజ్య సహకారాలను అన్వేషించడానికి, భారత వివిధ వ్యవసాయ ఉత్పాదనలను, శుద్ధిచేసిన ఆహార ఉత్పాదనలను ప్రపంచవ్యాప్తంగా ప్రోత్సహించడానికి ఒక విలువైన వేదికను అందించింది.

 

గోలీ సోడా పునరుజ్జీవనంతో, గోలీ పాప్ సోడా ఒక పానీయం మాత్రమే కాక, భారత సంపన్న పాకశాస్త్ర వారసత్వానికి, చైతన్యభరిత పానీయ పరిశ్రమకు ఒక నిదర్శనంగా కూడా నిలిచింది. ప్రపంచ మార్కెట్లలో ఈ ఉత్పాదన రోజురోజుకు విజయాలను అందుకొంటూ ఉండడం దేశీయ భారతీయ రుచులు అంతర్జాతీయ దిగ్గజ సంస్థల ఉత్పాదనలతో సైతం సై అంటే సై అని పోటీపడగలుగుతాయని రుజువు చేస్తోంది. భారతీయ ఎగుమతులకు కొత్త దారులను తెరవడంతోపాటు ప్రపంచ ఆహార, పానీయాల రంగంలో భారత్ నాయకత్వాన్ని ఈ సాఫల్యం మరింత పటిష్టపరచగలుగుతుంది.

 

***


(Release ID: 2114240) Visitor Counter : 41