బొగ్గు మంత్రిత్వ శాఖ
ఒక బిలియన్ టన్నులు: బలోపేతమవుతున్న భారత ఇంధన భవిష్యత్తు!
దేశంలో ఒక బిలియన్ టన్నుల మార్కును దాటిన బొగ్గు ఉత్పత్తి
Posted On:
21 MAR 2025 3:45PM by PIB Hyderabad
2024-25 ఆర్థిక సంవత్సరంలో మార్చి 20 నాటికి వంద కోట్ల టన్నుల ఉత్పత్తిని చేరుకోవడం ద్వారా బొగ్గు ఉత్పత్తిలో భారత్ ముఖ్యమైన మైలు రాయిని చేరుకుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇంకా పదకొండు రోజులు మిగిలి ఉండగానే గత ఆర్థిక సంవత్సరంలో సాధించిన 997.83 మిలియన్ టన్ను (ఎంటీ)ల బొగ్గు ఉత్పత్తిని అధిగమించింది. ఈ విజయం ఇంధన అవసరాలను తీర్చడంతో పాటు, పారిశ్రామిక, వ్యవసాయ రంగాలను, సంపూర్ణ ఆర్థిక వృద్ధిని నడిపించడంలో దేశం సాధించిన గణనీయమైన పురోగతిని తెలియజేస్తుంది.
ప్రభుత్వ రంగ బొగ్గు సంస్థ (పీఎస్‌యూ)లు, ప్రైవేటు సంస్థలు, 350 బొగ్గు గనుల్లో పనిచేస్తున్న సుమారు 5 లక్షల మంది గని కార్మికుల నిరంతరాయమైన కృషి ద్వారానే బొగ్గు రంగం ఈ విజయాన్ని సాధించింది. వారు ఎన్నో సవాళ్లను తమ అచంచలమైన అంకితభావంతో ఎదుర్కొని ఈ చారిత్రక మైలు రాయిని సాధించడంలో కీలకపాత్ర పోషించారు.
దాదాపు 55 శాతం బొగ్గు వినియోగంపైనే దేశ ఇంధన రంగం ఆధారపడి ఉంది. అలాగే దేశంలో 74 శాతం విద్యుదుత్పత్తి బొగ్గు ఆధారిత విద్యుత్ కేంద్రాల ద్వారానే ఉత్పత్తి అవుతోంది. దేశ ఆర్థికాభివృద్ధిలో, ఇంధన భద్రతను పెంపొందించడంలో బొగ్గుకున్న కీలకమైన ప్రాధాన్యాన్ని ఇవి తెలియజేస్తున్నాయి.
ప్రభుత్వం చేపడుతున్న వ్యూహాత్మక సంస్కరణలు, విధానాలను రికార్డు స్థాయిలో చేసిన బొగ్గు ఉత్పత్తిని ప్రతిబింబిస్తుంది. గనులు, ఖనిజాలు (అభివృద్ధి, నియంత్రణ) చట్టానికి చేసిన సవరణలు, వాణిజ్య వేలం ద్వారా బొగ్గు గనులను ప్రైవేటు సంస్థలకు కేటాయించడం, తదితర చర్యలు దేశీయ బొగ్గు ఉత్పత్తిలో గణనీయమైన పెరుగుదలకు మార్గం సుగమం చేసింది. అలాగే దిగుమతులు తగ్గి విదేశీ మారక నిల్వల పొదుపునకు దోహదపడ్డాయి. గత ఆర్థిక సంవత్సంరంతో పోలిస్తే 2024 ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు బొగ్గు దిగుమతి 8.4 శాతం మేర తగ్గి 5.43 బిలియన్ డాలర్లు (రూ. 42,315.7 కోట్లు) మేర విదేశీ మారక నిల్వలు ఆదా అయ్యాయి.
ఈ విజయం ‘ఆత్మనిర్భర భారత్’ సాధించాలన్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆలోచనకు అనుగుణంగా ఉంది. సుస్థిరాభివృద్ధికి హామీ ఇస్తూనే ఇంధన రంగంలో స్వావలంబన సాధించేందుకు బొగ్గు మంత్రిత్వ శాఖ చేపడుతున్న ప్రయత్నాలను ఈ విజయం తెలియజేస్తుంది.
ఈ విజయం బొగ్గు ఉత్పత్తికి సంబంధించినది మాత్రమే కాదు. దీర్ఘకాలిక ఇంధన భద్రతకు హామీ ఇస్తూ, సంపూర్ణాభివృద్ధి సాధించేలా దేశాన్ని ముందుకు నడిపే దిశగా వేసిన కీలకమైన ముందడుగు. అధునాతన మైనింగ్ పద్ధతులు, రవాణా సౌకర్యాలను మెరుగు పరడచం, సుస్థిర విధానాలను ప్రోత్సహించడం ద్వారా భారత ఇంధన మౌలిక వసతులను బలోపేతం చేయడం, ఆర్థిక స్థిరత్వాన్ని పెంపొందించడంలో బొగ్గు రంగం కీలకపాత్ర పోషిస్తోంది.
వికసిత్ భారత్ 2047 లక్ష్యానికి అనుగుణంగా ఉన్న ఈ విజయం.. ఇంధన రంగంలో భారత్‌ను స్వయం సమృద్ధి సాధించేలా చేస్తుంది. వ్యూహాత్మక సంస్కరణలు, సాంకేతిక పురోగతులు, బాధ్యతాయుతంగా వనరుల నిర్వహణపై దృష్టి సారించడం ద్వారా ఆత్మనిర్భర భారత్ వైపు దేశం ప్రయాణిస్తోంది. భవిష్యత్ తరాలకు స్వావలంబన సాధించిన, ఇంధన భద్రత కలిగిన భవిష్యత్తును రూపొందించడంలో దేశం కనబరుస్తున్న అంచంచలమైన అంకితభావానికి ఈ విజయం నిదర్శనం.
****
Shuhaib T
(Release ID: 2113854)
Visitor Counter : 30