కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
స్పామ్ కాల్స్ ను అదుపులో పెట్టిన ట్రాయ్
Posted On:
19 MAR 2025 3:27PM by PIB Hyderabad
టెలికాం కమర్షియల్ కమ్యూనికేషన్స్ కస్టమర్ ప్రిఫరెన్స్ రెగ్యులేషన్స్ (టీసీసీసీపీఆర్), 2018ని భారతీయ టెలికాం నియంత్రణ ప్రాధికార సంస్థ (ట్రాయ్) ఈ ఏడాది ఫిబ్రవరి 12న సవరించింది. దీనిలో ఇతర అంశాలతోపాటు ఈ కింది నిబంధనలను పొందుపరిచారు:
i. ఏ వినియోగదారైనా స్పామ్‌ను గాని, లేదా తాను కోరని తరహాకు చెందిన వాణిజ్య వర్తమానాన్ని (అన్‌సొలిసిటెడ్ కమర్షియల్ కమ్యూనికేషన్..యూసీసీ) గాని అందుకొంటే అలా అందుకున్న 7 రోజుల లోపల ఫిర్యాదు చేయవచ్చు. ఇంతకు ముందు ఇలా ఫిర్యాదు చేయడానికి 3 రోజుల వ్యవధి మాత్రమే ఉండేది.
ii. నమోదు చేసుకోకుండానే సందేశాలను పంపిస్తే (అన్ రిజిస్టర్డ్ సెండర్స్), ఆ పని చేసిన వర్గాలపై యూసీసీకి గాను చర్య తీసుకోవడానికి యాక్సెస్ ప్రొవైడర్లకు 30 రోజుల వ్యవధి ఉండగా ఈ వ్యవధిని 5 రోజులకు తగ్గించేశారు.
iii. యూసీసీని పంపించే వర్గాలపై వెంటనే చర్య తీసుకొనేటట్లు చూడడానికి, ఆ వర్గాలపై కార్యాచరణ చేపట్టడానికి అనుసరించాల్సిన ప్రమాణాన్ని సవరించి కఠినతరం చేశారు. .ఇదివరకు సెండరుకు వ్యతిరేకంగా గడచిన 7 రోజులలో 10 ఫిర్యాదుల’ కొలబద్దను పాటిస్తుండగా దీనిలో మార్పు చేసి, ‘గత 10 రోజులలో సెండరుకు వ్యతిరేకంగా 5 ఫిర్యాదుల’ కొలమానాన్ని ప్రవేశపెట్టారు.
ఈ సవరణలు అధికారిక రాజపత్రం (అఫీషియల్ గెజిట్)లో ప్రచురించిన తేదీ నుంచి 30 రోజులైన తరువాత అమలులోకి వస్తాయి. అయితే, వీటిలో నుంచి రెగ్యులేషన్ 8, రెగ్యులేషన్ 17ను, రెగ్యులేషన్ 20లోని సబ్-క్లాజులు (ఎ), (బి)లతో పాటు, రెగ్యులేషన్ 21లోని సబ్-క్లాజ్ (బి)ని మాత్రం మినహాయించారు. ఈ నియమాలు అధికారిక రాజపత్రంలో ప్రచురణ అనంతరం 60 రోజులు గడిచాక అమలులోకి వస్తాయి. ఇంతేకాకుండా, స్పామ్ కాల్స్ చేయడానికి ఉపయోగిస్తున్న సెండర్లు, అన్ రిజిస్టర్డ్ టెలీమార్కెటర్ల (యూటీఎంల)కు చెందిన టెలికాం వనరులన్నిటినీ డిస్‌కనెక్ట్ చేయాల్సిందిగాను, ఆ తరహా సెండర్లను ‘బ్లాక్ లిస్టు’లో చేర్చాల్సిందిగాను ట్రాయ్ 2024 ఆగస్టు 13న ఆదేశాలిచ్చింది.
యాక్సెస్ ప్రొవైడర్లు విస్తృత చర్యలు చేపట్టారు. ఫలితంగా, యూటీఎంలకు వ్యతిరేకంగా అందే ఫిర్యాదులు చెప్పుకోదగ్గ స్థాయిలో తగ్గాయి. కిందటి ఏడాది ఆగస్టులో ఈ తరహా ఫిర్యాదులు 1,89,419 రాగా, ఈ ఏడాది జనవరిలో ఈ తరహాకు చెందిన 1,34,821 ఫిర్యాదులే వచ్చాయి. వ్యక్తులను, సంస్థల (ఎన్టిటీల)ను కలిపి 1150కన్నా ఎక్కువగా ‘బ్లాక్ లిస్ట్’లో చేర్చడంతోపాటు 18.8 లక్షల టెలికాం వనరులను డిస్‌కనెక్ట్ చేశారు.
ఈ సమాచారాన్ని కేంద్ర కమ్యూనికేషన్లు, గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్ర శేఖర్ ఈ రోజు లోక్‌సభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో తెలియజేశారు.
***
(Release ID: 2113193)
Visitor Counter : 11