కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
డిజిటల్ మోసాలు, కుంభకోణాల కోసం టెలికాం వనరులను దుర్వినియోగపరచడాన్ని అడ్డుకోవడానికి కలిసి పనిచేయనున్న టెలికమ్యూనికేషన్ల విభాగం (డీఓటీ), వాట్సాప్
* శిక్షణ ప్రధాన వర్క్‌షాపులు, పౌరుల్లో అవగాహన పెంచే ప్రచార ఉద్యమాల నిర్వహణతో డిజిటల్ సురక్షను పెంచడమే ఈ భాగస్వామ్యం ధ్యేయం
* ఆన్‌లైన్ స్కాములు, స్పామ్‌పై ధ్వజమెత్తుతూ ‘స్కాం సే బచో’ పేరిట ప్రచార ఉద్యమం
* యూజర్ సేఫ్టీ సామగ్రిని ఎక్కువ మంది చెంతకు చేర్చడానికి వీలుగా ప్రాంతీయ భాషలలో అనువాదం
Posted On:
17 MAR 2025 8:29PM by PIB Hyderabad
ఆన్‌లైన్ కుంభకోణాలు, స్పామ్.. వీటికి వ్యతిరేకంగా మెటా చేపట్టిన ‘స్కాం సే బచో’ (ఈ హిందీ మాటలకు కుంభకోణం బారి నుంచి రక్షణను పొందండి అని భావం) ప్రచార ఉద్యమ పరిధిని విస్తరించడానికి టెలికమ్యూనికేషన్ల విభాగం (డీఓటీ) వాట్సాప్‌తో జట్టు కట్టింది. ఈ సహకారంలో భాగంగా, డీఓటీ, వాట్సాప్.. డిజిటల్ సురక్షను, చైతన్యాన్ని పెంచడానికి అనునమానాస్పద మోసపూరిత కమ్యూనికేషన్లను గుర్తించే, వాటిని రిపోర్టు చేసే విషయంలో పౌరులకు మరింత ఎక్కువ అవగాహనను కలిగించేందుకు కలిసి పనిచేయనున్నాయి.
సైబర్‌నేరాలు, ఆర్థిక మోసాలకు పాల్పడే వారు టెలికాం వనరులను ఉపయోగించుకోవడాన్ని నిరోధించడానికి డీఓటీ అనేక కార్యక్రమాలను అమలు చేస్తోంది. పౌరులకు సేవ చేయడమే ప్రధానంగా సంచార్ సాథీ కార్యక్రమాన్ని ఒక పోర్టల్ (https://sancharsaathi.gov.in) రూపంలోను, ఒక మొబైల్ యాప్ రూపంలోను అభివృద్ధిపరిచింది. దీనివల్ల అనుమానాస్పద మోసపూరిత కాల్స్‌ను, సందేశాలను పౌరులు రిపోర్టు చేయగలగడం, వారి మొబైల్ కనెక్షన్ సమాచారాన్ని అందుకోవడంతోపాటు ఇతర సౌకర్యాలకు తోడు పోగొట్టుకున్న, లేదా దొంగతనానికి గురైన మొబైల్ హ్యాండ్‌సెట్లను బ్లాక్ చేయడంలోగాని, ట్రేస్ చేయడంలోగాని వారిని సమర్థులుగా తీర్చిదిద్దాలన్నదే ఈ కార్యక్రమం ధ్యేయం. డీఓటీలోని డిజిటల్ ఇంటెలిజెన్స్ ప్లాట్‌ఫాం (డీఐపీ) టెలికాం వనరుల దుర్వినియోగాన్ని గుర్తించడంతోపాటు ఆ దుర్వినియోగంపై తదనంతర చర్యలు తీసుకోవడానికి బ్యాంకులు, ఎల్ఈఏల వంటి 550 ఆసక్తిదారుల (స్టేక్‌హోల్డర్స్)కు డిజిటల్ రహస్య సమాచారాన్ని ఇవ్వడం, తాను కూడా అలాంటి సమాచారాన్ని పుచ్చుకోవడం చేస్తూవస్తోంది.
డిజిటల్ సురక్ష, క్షేత్ర స్థాయి అవగాహన..ఈ రెంటిని పెంపొందించే దిశగా వేసిన ఒక ముఖ్యమైన అడుగు అని చెప్పుకొనేటట్లు ఈ కార్యక్రమంలో డీఓటీ అధికారులు, ‘సంచార్ మిత్ర’లు, టెలికాం సేవా ప్రదాత సంస్థలు (టీఎస్‌పీలు), క్షేత్ర విభాగాల కోసం ‘ట్రయిన్-ది-ట్రయినర్’ (శిక్షణనిచ్చే వ్యక్తిని తీర్చిదిద్దండి) తరహా వర్క్‌షాపులు ఓ భాగంగా ఉంటాయి. వాట్సాప్ సైతం ‘సంచార్ సాథీ’ని మరింత మంది చెంతకు చేర్చే ఉద్దేశంతో తన ప్లాట్‌ఫాం ద్వారా సంచార్ సాథీ కార్యక్రమం అందిస్తున్న పౌర ప్రధాన సేవల పరిధిని విస్తరించే పద్ధతుల్ని అన్వేషించడానికి డీఓటీతో కలిసి పనిచేయనుంది.
కేంద్ర కమ్యూనికేషన్లు, ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ మంత్రి శ్రీ జ్యోతిరాదిత్య సింధియా తో మెటా చీఫ్ గ్లోబల్ అఫైర్స్ అధికారి శ్రీ జోయెల్ కప్లాన్ ఈ రోజు సమావేశమై కమ్యూనికేషన్ల విభాగం (డీఓటీ)కి, మెటాకు మధ్య ప్రస్తుతం కొనసాగుతున్న సహకారం ఎంత ప్రభావవంతంగా ఉందీ చర్చించారు. డీఓటీలోని డిజిటల్ ఇంటెలిజెన్స్ యూనిట్‌కు వాట్సాప్ సహకరిస్తుండడంతోపాటు సైబర్‌నేరాలకు, ఆర్థిక మోసాలకు ఒడిగట్టడానికి టెలికాం వనరులను దుర్వినియోగం చేస్తుండడంపై ముందస్తుచర్యలను చేపట్టడానికి డీఐపీ ద్వారా అందుకున్న సమాచారాన్ని సైతం ఉపయోగించుకొంటోంది.
భాగస్వామ్య విషయమై కేంద్ర కమ్యూనికేషన్లు, ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ మంత్రి శ్రీ జ్యోతిరాదిత్య సింధియా మాట్లాడుతూ, ‘‘భారత్ డిజిటల్ మార్పు మార్గంలో మునుముందుకు దూసుకుపోతున్న క్రమంలో, మా పౌరుల సురక్షకు, భద్రతకు పెద్ద పీట వేయడం మాకు అన్నింటి కన్నా ప్రాధాన్యం ఉన్న అంశం. మెటాతో మేం ఏర్పరచుకొన్న భాగస్వామ్యం మోసపూరిత కమ్యూనికేషన్లు, సైబర్ బెదరింపుల నుంచి మా ప్రజలను కాపాడాలన్న నిబద్ధతను బలపరుస్తుంది. వాట్సాప్‌కు ఉన్న విస్తృత డిజిటల్ మాధ్యమ పరిధి ప్రయోజనాల్ని వినియోగించుకొంటూ మేం మా డిజిటల్ అనుబంధ విస్తారిత వ్యవస్థ (డిజిటల్ ఇకోసిస్టమ్) అందరికీ సురక్షితంగా, ఎలాంటి ఆటుపోటులనైనా సరే తట్టుకొని దృఢంగా నిలదొక్కుకొనేటట్లు చూసే ప్రయత్నాలను పటిష్టపరుస్తున్నాం’’ అన్నారు.
మెటా చీఫ్ గ్లోబల్ అఫైర్స్ అధికారి శ్రీ జోయెల్ కప్లాన్ మాట్లాడుతూ, ‘‘కుంభకోణాలు, ఆన్‌లైన్ మోసాల బారిన పడకుండా ప్రజలను కాపాడడానికి అన్నిటి కన్నా మంచి పద్ధతి ఏదంటే వారు ఏయే విషయాలపైన దృష్టిని సారించాలో, సురక్షితంగా ఉండటానికి వారు ఏమేం చేయగలరనేది వారు తెలుసుకొనేటట్టుగా చూడడమే. ఈ కారణంగానే టెక్నాలజీ మీద, వనరుల మీద మెటా భారీ పెట్టుబడులు పెడుతోంది.. ఇలా చేస్తూ, మోసగాళ్ల కన్నా ఓ రెండడుగులు ముందే ఉండేందుకు ప్రయత్నిస్తుంటుంది. అదే సమయంలో ప్రజలకు వారికి అవసరపడే సమాచారాన్ని సైతం ఇస్తూ ఉంటుంది. డీఓటీతో కలిసి పనిచేయడం వల్ల, పౌరులకు సురక్షతను అందించాలన్న ప్రభుత్వ నిబద్ధతకు మేం మా సాంకేతిక ప్రావీణ్యాల్ని జోడించడానికి వీలు చిక్కడంతోపాటు భారతీయులకు వారు సురక్షితంగా ఉండడానికి అవసరమైన జ్ఞానాన్ని వారికివ్వడంలో కూడా మేం సహాయపడగలుగుతాం’’ అన్నారు.
డీఓటీతో జట్టు కట్టి సమాచార ప్రధాన సంపత్తులను వాట్సాప్ తాను కూడా తీర్చిదిద్దనుంది. దీంతో ఆన్‌లైన్ కుంభకోణాలను, స్పామ్‌ను గుర్తించడాన్ని, రిపోర్టు చేయడాన్ని యూజర్లకు నేర్పవచ్చు. వీటిలో ‘సంచార్ సాథీ’పై లభ్యమవుతున్న వివిధ రకాల మోసాలు, హెచ్చరిక సంకేతాలు, రిపోర్టు చేసే విధానాలు కూడా ఓ భాగం అవుతాయి. గరిష్ఠ స్థాయి లభ్యత కోసం అన్ని విధాల యూజర్ సేఫ్టీ సామగ్రిని హిందీ, బెంగాలీ, మరాఠీ, తమిళం, తెలుగు, కన్నడం, మలయాళం, గుజరాతీ సహా ప్రాంతీయ భాషల్లోకి అనువాదం చేస్తారు.
అభివృద్ధిపరిచిన పరిష్కారాలను అమలుచేస్తూ వేర్వేరు ఆసక్తిదారులతో కలిసి పనిచేస్తూ టెలికాం వవనరుల దుర్వినియోగాన్ని అరికట్టడానికి డీఓటీ నిరంతర నిబద్ధతతో ముందుకు సాగుతోంది. అంతకంతకు మార్పులకు లోనవుతున్న డిజిటల్ అనుబంధ విస్తారిత వ్యవస్థలో పౌరుల్లో అవగాహనను కలిగించడం వల్ల వారి ప్రయోజనాలను కాపాడడంలో సహాయకారిగా ఉంటుంది.
***
(Release ID: 2112214)
Visitor Counter : 8