వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
దేశం గురించి ప్రపంచానికి చాటి చెప్పే డిజిటల్ రాయబారులే క్రియేటర్లు
రైజ్/డెల్ సమ్మేళనం-2025లో క్రియేటర్లను ఉద్దేశించి ప్రసంగించిన శ్రీ పీయూష్ గోయల్
Posted On:
13 MAR 2025 3:21PM by PIB Hyderabad
సంగీతాన్ని, సృజనాత్మక పరిశ్రమలను, అంకుర సంస్థలను ఒకే వేదిక పైకి తీసుకువచ్చేలా మూడు రోజుల పాటు నిర్వహించిన రైజ్/డెల్ సదస్సు - 2025ను ఉద్దేశించి ఈ రోజు న్యూఢిల్లీలో కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్ ప్రసంగించారు. భారతీయ సృజనాత్మక రంగానికున్న సామర్థ్యాన్ని, దేశ భవిష్యత్తును రూపొందించడంలో డిజిటల్ ఆవిష్కరణల పాత్ర గురించి శ్రీ గోయల్ ప్రసంగించారు.
దేశం గురించి ప్రపంచానికి తెలియజెప్పి, ఆర్థిక వృద్ధికి తోడ్పడాలని సృజనాత్మక పరిశ్రమకు శ్రీ గోయల్ సూచించారు. నమ్మకం, ప్రామాణికతకు ప్రాధాన్యమిచ్చి పని చేయడం, ఫలితం పట్ల బాధ్యతతో, జవాబుదారీతనంతో వ్యవహరించాల్సిన అవసరం గురించి ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ అమృత కాలంలో భారత్ అభివృద్ధికి సృజనాత్మక రంగం దోహదపడేలా నాలుగు ప్రధానాంశాలను ఆయన గుర్తించారు. అవి బాధ్యతాయుతమైన కంటెంట్, కథ చెప్పే విధానంలో సృజనాత్మకత, నైపుణ్యాభివృద్ధి, భారతీయ సృజనాత్మకతను ఎగుమతి చేయడం.
‘‘మీరు కన్న కలలు కచ్చితంగా సాకారమవుతాయి. మీరందరూ కలసి ఒకే వేదిక మీదకు చేరుకున్నప్పుడు, భవిష్యత్తుకు అవసరమైన ముఖ్యమైన అంశాలను రూపొందించేందుకు వీలు కలుగుతుంది’’ అని ఆయన అన్నారు. క్రియేటర్లను డిజిటల్ అంబాసిడర్లుగా వర్ణించిన ఆయన భారత్‌పై ప్రపంచానికున్న ఆలోచనలను మార్చడంలో, మన సాంస్కృతిక విధానాలను విస్తరించడంలో వారు పోషిస్తున్న పాత్ర గురించి వివరించారు.
దశాబ్దం క్రితం దేశంలోని మారుమూల ప్రాంతాల్లో సైతం కంటెంట్ క్రియేటర్లు, అంకుర సంస్థలు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలతో కూడిన నూతన ప్రపంచాన్ని తయారు చేయడమే లక్ష్యంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ డిజిటల్ ఇండియా కార్యక్రమాన్ని ఎలా ప్రారంభించినదీ వివరించారు. తక్కువ ధరకే డేటాని అందుబాటులో ఉంచడం ఈ ప్రభుత్వం అనుసరిస్తున్న డిజిటల్ ఇండియా విధానంలో అత్యంత కీలకమైన అంశమని అన్నారు. ఇదే డేటా వినియోగంలో భారత్‌ను ప్రపంచంలో అతి పెద్ద వినియోగదారుగా మార్చిందని తెలిపారు. ‘‘ఐరోపా, అమెరికా లేదా ఏ ఇతర అభివృద్ధి చెందిన దేశంతోనైనా పోలిస్తే మన దేశంలో డేటా ధరలు చాలా తక్కువే ఉన్నాయి. చౌకగా లభిస్తున్న డేటాను దేశంలో ఉన్న ఉత్తమ ప్రతిభతో అనుసంధానిచినప్పుడు, సృజనాత్మకత, సాంకేతిక రంగంలో మనకోసం ఒక విప్లవం ఎదురుచూస్తూ ఉంటుంది’’ అని పేర్కొన్నారు.
భారతీయ సృజనాత్మక రంగంలో ఉన్న విస్తృత అవకాశాల గురించి శ్రీ గోయల్ వివరించారు. సంప్రదాయ రంగాలైన చలనచిత్రం, నాటకం, థియేటర్లకు మించి గేమింగ్, ఏఐ ఆధారిత కంటెంట్ రూపకల్పన, డిజిటల్ మీడియాలో అవకాశాలు ఉన్నాయని అన్నారు. ఇప్పటికే బిలియన్ డాలర్ల విలువకు చేరుకున్న ఈ పరిశ్రమ, దేశవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో ప్రజలకు ఉపాధి కల్పిస్తోందని తెలిపారు. ‘‘ఒకప్పుడు సృజనాత్మక రంగం అంటే చలన చిత్ర నిర్మాణం, డ్రామా, థియేటర్ - ఇప్పుడు ఇవి భవిష్యత్ సాంకేతికతలైన గేమింగ్, ఏఐ ఉపయోగించుకొని కొత్త తరహా వినోదాన్ని అందిస్తున్నాయి’’ అని అన్నారు.
భవిష్యత్తులో సాధించాల్సిన అభివృద్ధికి తగిన ప్రణాళికను రూపొందించడంలో ఈ తరహా కార్యక్రమాలను ఉపయోగించుకోవాలని రైజ్/డెల్‌లో పాల్గొన్న వారిని శ్రీ గోయల్ ప్రోత్సహించారు. కొత్త సాంకేతికతలను ప్రజలకు పరిచయం చేయడంలో, ఇన్లుయెన్సర్ల పాత్రను గుర్తించిన ఆయన, సుసంపన్నమైన భారతీయ చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాల గురించి తెలుసుకొనేలా ప్రజలకు వారు సహాయపడుతున్నారని అభిప్రాయపడ్డారు. విద్యకు సంబంధించిన అనుబంధ కార్యక్రమాలను అభివృద్ధి చేయవచ్చని, ఇది కంటెంట్ క్రియేటర్లకు పెద్ద ఎత్తున అవకాశాలు కల్పిస్తుందని తెలిపారు. ‘సామాన్యులతో అనుసంధానమయ్యే విషయంలో క్రియేటర్ల ప్రతిభ చాలా ప్రత్యేకమైనది - ఇది అవకాశాల ప్రపంచానికి మార్గం చూపిస్తుంది’’ అని అన్నారు.
తమ సొంత ఆలోచనలను, సాంకేతికతను అభివృద్ధి చేయడంలో వ్యక్తులకు సాయమందించేలా ప్రభుత్వం పోషిస్తున్న పాత్రను శ్రీ గోయల్ వివరించారు. సృజనాత్మకత, ఆడియో-విజువల్ ఆర్ట్స్, కంటెంట్ రూపకల్పనలో అంతర్జాతీయ సమాజంలో విస్తరిస్తున్న దేశ ప్రభావాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కళాకారులను భారత్‌తో సహకారానికి ఆహ్వానించారు. ‘‘ప్రపంచంతో ఎంత బాగా మనం మమేకమైతే.. భారతీయ క్రియేటర్లకు అంత ఎక్కువ అవకాశాలు వస్తాయి. మన కళాకారులకు ప్రపంచవ్యాప్త గుర్తింపు లభిస్తోంది. టెక్నాలజీ ద్వారా ప్రపంచంలో ఉన్న ప్రతి ఇంటికీ మనం చేరుకోగలం’’ అని తెలిపారు.
పర్యాటకాన్ని పెంపొందించడంలో సృజనాత్మకంగా రూపొందించిన విశేషాల సామర్థ్యాన్ని వివరిస్తూ.. మహాకుంభ్‌ను ఉదాహరణగా పేర్కొన్నారు. డిజిటల్ కథనాలు ప్రపంచ ప్రేక్షకులను ఎలా ఆకర్షించగలవో మహాకుంభ్ తెలియజేసిందని అన్నారు. ‘‘దేశానికి సంబంధించిన విశేషాలను ప్రపంచానికి తెలియజేస్తున్నపుడు, అవి పర్యాటకుల్లో ఉత్సుకతను రేకెత్తించి, ఇక్కడికి వారిని ఆకర్షిస్తాయి. అంతేకాకుండా, ఆర్థిక వ్యవస్థకు ఎంతో సహకారం అందిస్తాయి’’ అని అన్నారు. పర్యాటకులకు ఉత్తేజకరమైన, ఆనందదాయకమైన ప్రయాణ అనుభవాన్ని అందించేందుకు అవసరమైన చర్యలు చేపట్టేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలియజేశారు.
ప్రపంచానికి కంటెంట్ రాజధానిగా మారాలనే దేశ లక్ష్యాన్ని పునరుద్ఘాటిస్తూ శ్రీ గోయల్ తన ప్రసంగాన్ని ముగించారు. బాధ్యతాయుతమైన, వినూత్నమైన కంటెంట్‌పై దృష్టి సారించాలని క్రియేటర్లకు పిలుపునిచ్చారు. దేశ ఎగుమతుల ఆదాయాన్ని పెంచడంలో నైపుణ్యాలు, కథనం, చిత్ర దర్శకత్వం, సంగీత స్వర కల్పన, గేమింగ్, డిజిటల్ మీడియా పోషిస్తున్న పాత్ర గురించి వివరించారు. ‘‘కంటెంట్ క్రియేటర్ పరిశ్రమకు భవిష్యత్తు ఈ రైజ్. అభివృద్ధి చెందిన దేశంగా భారత్‌ను తీర్చిదిద్దడంలో ఈ పరిశ్రమ కీలక పాత్ర పోషిస్తుంది. మీ కథలను ప్రపంచానికి చెప్పండి. ఆత్మవిశ్వాసంతో మీ అంకుర సంస్థలను ప్రారంభించండి. భవిష్యత్తు తరాల కోసం వారధిని నిర్మించండి. ప్రభుత్వం, క్రియేటర్లు కలసి ప్రపంచానికి భారత్ గురించి చాటి చెబుదాం’’ అని అన్నారు.
***
(Release ID: 2111328)
Visitor Counter : 14