సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
వేవ్స్ 2025లో ‘రెసొనేట్: ది ఈడీఎం ఛాలెంజ్’లో పాల్గొనేవారికి ఎలక్ట్రానిక్ సంగీత దిగ్గజాల మార్గనిర్దేశం
ఈడీఎం ఛాలెంజ్‌లో పాల్గొనాలనే ఆసక్తి ఉన్నవారు నమోదు చేసుకోవడానికి చివరి తేదీ మార్చి 31
Posted On:
11 MAR 2025 6:45PM
|
Location:
PIB Hyderabad
వరల్డ్ ఆడియో విజువల్, ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ (వేవ్స్)లో ప్రధాన కార్యక్రమంగా అలరించేందుకు ‘రెసొనేట్: ది ఈడీఎం ఛాలెంజ్’ సిద్ధమైంది. ఇది ఎలక్ట్రానిక్ డ్యాన్స్ మ్యూజిక్ (ఈడీఎం)లో ప్రపంచ స్థాయి ప్రతిభను ఒక్క చోట చేరుస్తుంది. అలాగే సంగీత స్వరకల్పనలో, ప్రత్యక్ష ప్రదర్శనల్లో ఆవిష్కరణలు, సృజనాత్మకతను, సహకారాన్ని ప్రోత్సహిస్తుంది. క్రియేట్ ఇన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ సహకారంతో ఇండియన్ మ్యూజిక్ ఇండస్ట్రీ (ఐఎంఐ) ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఫ్యూజన్, ఎలక్ట్రానిక్ మ్యూజిక్, డీజేయింగ్ కళల్లో ప్రపంచ సంగీత కేంద్రంగా భారత్ స్థానాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా నిర్దేశించుకుంది.
అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నఈడీఎం ఛాలెంజ్ కోసం అధికారిక విజ్ఞాన భాగస్వామిగా లాస్ట్ స్టోరీస్ అకాడమీతో ఇండియన్ మ్యూజిక్ ఇండస్ట్రీ (ఐఎంఐ) ఇటీవలే ఒప్పందం కుదుర్చుకుంది. ఎలక్ట్రానిక్ సంగీత విద్యలో అగ్రగామి సంస్థగా పేరొందిన లాస్ట్ స్టోరీస్ అకాడమీ ఎంతోమందిని ఎలక్ట్రానిక్ సంగీత కళాకారులుగా తీర్చిదిద్దుతోంది. అంతర్జాతీయ గుర్తింపును సాధించేలా వారికి తోడ్పడుతోంది. ఈడీఎం ఛాలెంజ్‌లో పోటీపడుతున్నవారు తమ నైపుణ్యాలు పెంచుకొనేలా ఈ సంస్థ మార్గనిర్దేశం చేస్తోంది. ప్రపంచ సంగీత రంగంలో విజయం సాధించేలా వారిని సన్నద్ధం చేస్తుంది.
ఈడీఎం ఛాలెంజ్‌లో పాల్గొనేందుకు ఆసక్తి కలిగినవారు నమోదు చేసుకోవడానికి చివరి తేదీ మార్చి 31.

సంగీత, దృశ్య, వినోద రంగాల్లో తమ సృజనాత్మకతను, ప్రతిభను ప్రదర్శించేందుకు ఎలక్ట్రానిక్ సంగీత కళాకారులకు
‘రెసొనేట్: ది ఈడీఎం ఛాలెంజ్’ అసమానమైన వేదికను అందిస్తుంది. ఎలక్ట్రానిక్ డ్యాన్స్ మ్యూజిక్ (ఈడీఎం)ను రూపొందించడంలో అనుభవం ఉన్న అంతర్జాతీయ కళాకారులు, స్వరకర్తలు, గాయకులు, ప్రదర్శకులకు తమ ప్రతిభను నిరూపించుకొనే వేదికను ఈ పోటీలు కల్పిస్తాయి. లాస్ట్ స్టోరీస్ అకాడమీతో కుదుర్చుకున్న తాజా భాగస్వామ్యం ద్వారా నిపుణుల సూచనలు, వ్యక్తిగతంగా మార్గనిర్దేశం, భారతీయ సంగీత రంగంలో విలువైన అవకాశాలు ఈ పోటీల్లో పాల్గొనేవారికి లభిస్తాయి.
ఫ్యూజన్, ఎలక్ట్రానిక్ సంగీతం, డీజేయింగ్ కళలో అంతర్జాతీయ స్థాయిలో భారత్ స్థానాన్ని బలోపేతం చేయడమే ‘రిసొనేట్: ది ఈడీఎం ఛాలెంజ్’ లక్ష్యంగా నిర్దేశించుకుంది. ప్రపంచంలో విభిన్నమైన సంగీత శైలులను మేళవించి, సాంస్కృతికంగా సంపన్నమైన సంగీత బాణీని రూపకల్పన చేయడంపై ఈ పోటీల ప్రధాన ఇతివృత్తం దృష్టి సారించింది.
ఈ పోటీలకు సంబంధించిన మరిన్ని వివరాల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.
వేవ్స్ 2025 గురించి:
పాత్రికేయ, వినోద (ఎం అండ్ ఈ) రంగంలో ముఖ్యమైన కార్యక్రమంగా నిలిచిపోయే ఈ మొదటి విడత వరల్డ్ ఆడియో విజువల్, ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ (వేవ్స్)ను భారత ప్రభుత్వం మహారాష్ట్ర రాజధాని ముంబయిలో మే 1 నుంచి 4 వరకు నిర్వహించనుంది.
ఈ రంగంలో నిపుణులు, పెట్టుబడిదారుడు, రూపకర్త, ఆవిష్కర్త, ఇలా ఏ పాత్రను మీరు పోషిస్తున్నా సరే.. ఈ సమ్మేళనంలో పాల్గొనవచ్చు. పాత్రికేయ, వినోద పరిశ్రమతో అనుసంధానమయ్యేందుకు, సహకారం పెంపొందించుకొనేందుకు, నూతన ఆవిష్కరణలు చేయడానికి, మీ వంతు తోడ్పాటు అందించేందుకు అంతర్జాతీయ వేదికను వేవ్స్ మీకు అందిస్తుంది.
ఇండియాలో దాగున్న సృజనాత్మకతను ప్రోత్సహించి, కంటెట్ రూపకల్పన, మేధోహక్కులు, సాంకేతిక ఆవిష్కరణలకు కేంద్రంగా దేశాన్ని తయారు చేయడమే వేవ్స్ లక్ష్యం. ప్రసార రంగం, పత్రికా మాధ్యమం, టెలివిజన్, రేడియో, చలనచిత్రాలు, యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్స్, శబ్దం - సంగీతం, ప్రకటనలు, డిజిటల్ మీడియా, సామాజిక మాధ్యమ వేదికలు, జనరేటివ్ ఏఐ, ఆగ్మెంటెడ్ రియాల్టీ (ఏఆర్), వర్చువల్ రియాల్టీ (వీఆర్), ఎక్స్టెండెడ్ రియాల్టీ (ఎక్స్‌ఆర్) తదితర రంగాలు, పరిశ్రమలపై దృష్టి సారించింది.
ఇంకా సందేహాలున్నాయా? వాటికి సమాధానాలు ఈ లింక్‌లో దొరుకుతాయి.
రండి, మాతో కలసి ప్రయాణించండి! వేవ్స్ లో పాల్గొనేందుకు ఇప్పుడే రిజిస్టర్ చేసుకోండి.
***
Release ID:
(Release ID: 2111248)
| Visitor Counter:
35