మత్స్య పరిశ్రమ, పశు పోషణ మరియు పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

హైదరాబాద్‌లో మార్చి 8న ‘ఫిషరీస్ స్టార్టప్ కాన్‌క్లేవ్ 2.0

కార్యక్రమానికి హాజరు కానున్న కేంద్ర మంత్రి శ్రీ రాజీవ్ రంజన్ సింగ్,

సహాయ మంత్రులు ప్రొఫెసర్ ఎస్.పి.సింగ్ బఘేల్, శ్రీ జార్జ్ కురియన్


నేషనల్ ఫిషరీస్ డిజిటల్ ప్లాట్‌ఫాం మొబైల్ యాప్‌తోపాటు ‘ఫిషరీస్ స్టార్టప్ గ్రాండ్ ఛాలెంజ్ 2.0’ ఆవిష్కరణ

నాడు పోస్టు చేయడమైనది: 07 MAR 2025 2:46PM by PIB Hyderabad

మత్స్య, పశుసంవర్ధకం, పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ ఆధీనంలో పని చేస్తున్న మత్స్య విభాగం మార్చి 8న తెలంగాణలోని హైదరాబాద్‌లో ఫిషరీస్ స్టార్టప్ కాన్‌క్లేవ్ 2.0ను నిర్వహించనుంది. ఈ కార్యక్రమంలో  కేంద్ర మత్స్య, పశుసంవర్ధకం, పాడి శాఖ మంత్రి, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి శ్రీ రాజీవ్ రంజన్ సింగ్‌, సహాయ మంత్రి ప్రొఫెసర్ ఎస్.పి.సింగ్ బఘేల్, పంచాయతీ రాజ్ శాఖ సహాయ మంత్రి శ్రీ జార్జ్ కురియన్ పాల్గొంటారు. ఇంకా ప్రభుత్వ అధికారులు, మత్స్య పరిశ్రమ రంగంలోని అంకుర సంస్థలు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు కూడా ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు.

మత్స్య రంగంలో నవకల్పనను గురించి చర్చించి, నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి ఈ విషయాలపై ఆసక్తి ఉన్న వర్గాల వారందరినీ స్టార్టప్ కాన్‌క్లేవ్ 2.0 ఒక చోటుకు తీసుకురానుంది. ఈ సందర్భంగా చేపలు, రొయ్యల పెంపకం రంగంలో అంకుర సంస్థలకు, ఈ-కామర్స్ అవకాశాలపైన కూడా చర్చలు నిర్వహిస్తారు. చేపలు పట్టే వృత్తికి సంబంధించిన సేవలు, వనరులను డిజిటల్ మాధ్యమం ద్వారా అందుబాటులోకి తీసుకువచ్చి సువ్యవస్థీకృతం చేసే ప్రధానోద్దేశంతో రూపొందించిన నేషనల్ ఫిషరీస్ డిజిటల్ ప్లాట్‌ఫాం (ఎన్ఎఫ్‌డీపీ) మొబైల్ యాప్‌ను ఈ కాన్‌క్లేవ్‌లో ఆవిష్కరించనున్నారు. అలాగే ‘ఫిషరీస్ స్టార్టప్ గ్రాండ్ ఛాలెంజ్ 2.0’ను కూడా ప్రకటించనున్నారు. మత్స్య రంగంలో సాంకేతిక మార్పులను, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలన్న ప్రభుత్వ నిబద్ధతను ఈ కార్యక్రమం బలోపేతం చేస్తుంది.

దీనికి అదనంగా, మత్స్య రంగంలో అంకుర సంస్థలకు ఔత్సాహిక పారిశ్రామికవేత్త నమూనా అనుమతుల ప్రక్రియను వివరించడం వల్ల ఈ రంగంలో ఆసక్తి ఉన్న నూతన వాణిజ్య సంస్థలను గుర్తించడంతోపాటు వాటికి అవసరమైన మద్దతును అందించడానికి మార్గాన్ని సుగమం చేయనున్నారు. ఇది మత్స్య రంగంలో అంకుర సంస్థల అనుబంధ విస్తారిత వ్యవస్థ (ఎకోసిస్టమ్)ను ఇప్పటికన్నా మరింతగా పటిష్టపరుస్తుంది. టెక్నికల్ ఫీడ్‌బ్యాక్, పరస్పరానుబంధ కార్యక్రమం భారత్‌లో మత్స్య రంగ ఎకోసిస్టమ్‌కు సంబంధించిన లోతైన చర్చలకు, అలాగే జాతీయ మత్స్య పరిశ్రమాభివృద్ధి మండలి (ఎన్ఎఫ్‌డీబీ), భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి (ఐసీఏఆర్) చేపట్టిన ముఖ్య కార్యక్రమాలపైన కూడా సమగ్ర చర్చలకు ఒక వేదికను అందించనుంది. అంతేకాకుండా మత్స్య పరిశ్రమలో ఇప్పటికే కార్యకలాపాలు నిర్వహిస్తున్న అంకుర సంస్థలు సైతం వాటి అనుభవాన్ని ఈ కాన్‌క్లేవ్‌లో పంచుకోనున్నాయి.

నేపథ్యం

భారతదేశంలో చేపలు, రొయ్యల పెంపకం రంగం 3 కోట్ల మందికి జీవనోపాధిని కల్పిస్తోంది. ఈ రంగానికి సంబంధించిన అనుబంధ కార్యకలాపాల్లోనూ ఉద్యోగావకాశాలను కల్పిస్తోంది. 2015 మొదలు, ప్రభుత్వం నీలి విప్లవ పథకం, ఎఫ్ఐడీఎఫ్ (చేపలు, రొయ్యల పెంపకానికి సంబంధించిన మౌలిక సదుపాయాల అభివృద్ధి నిధి), ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన (పీఎంఎంఎస్‌వై), ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి సహ యోజన (పీఎం-ఎంకేఎస్‌ఎస్‌వై) తదితర కార్యక్రమాల అమలు ద్వారా సుస్థిర వృద్ధి సాధన కోసం రూ. 38,572 కోట్లను సమకూర్చింది.

భారత చేపలు, రొయ్యల పెంపకం రంగం శరవేగంగా వృద్ధి చెందుతూ ఈ క్రమంలో మత్స్య పరిశ్రమకు సంబంధించిన 300కన్నా ఎక్కువ అంకుర సంస్థల ఏర్పాటుకు మార్గాన్ని సుగమం చేసింది. దీంతో ఈ రంగంలో సామర్థ్యం, నైపుణ్యం, నవకల్పన జోరందుకుంటున్నాయి. ఈ అంకుర సంస్థలు బ్లాక్‌చైన్, ఇంటర్‌నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఓటీ), కృత్రిమ మేధ (ఏఐ) వంటి ఆధునిక సాంకేతికతల శక్తియుక్తులను వినియోగించుకొంటూ వాణిజ్య సరళిలో లాభసాటి కాగల పరిష్కారాలను కనుగొనే ప్రయత్నాలు చేస్తున్నాయి. వీటి ద్వారా మౌలిక సవాళ్లను పరిష్కరించడం, ఉత్పాదకతను పెంచడం, వినియోగ దశలకు మెరుగులు దిద్దాలని ఈ సంస్థలు నడుం బిగించాయి. నవకల్పననూ, మత్స్య పరిశ్రమలోని అంకుర సంస్థలకు అండదండలను అందించడానికీ మత్స్య విభాగం అనేక కార్యక్రమాలను మొదలుపెట్టింది. ఆసక్తిదారు సంస్థలు జ్ఞానాన్ని పరస్పరం ఇచ్చి పుచ్చుకొనేందుకూ, ఒక సంస్థతో మరొక సంస్థ సహకరించుకొనేందుకూ మత్స్య మంథన్ కార్యక్రమాలు ఒక వేదికగా ఉపయోగపడుతున్నాయి. సరికొత్త ధోరణులను, ఉత్తమ విధానాలను గురించి తెలుసుకోవడానికి వీలుగా చర్చలకు ఈ కార్యక్రమాలు అవకాశం కల్పిస్తున్నాయి. మత్స్య పరిశ్రమలో అంకుర సంస్థల అనుబంధ విస్తారిత వ్యవస్థను పటిష్టపరచడానికి, ఈ విభాగం ప్రత్యేక ఇంక్యుబేషన్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన (పీఎంఎంఎస్‌వై)లో మొదటి లైనాక్-ఎన్‌సీడీసీ ఫిషరీస్ బిజినెస్ ఇంక్యుబేషన్ సెంటర్ (ఎల్ఐఎఫ్ఐసీ)ని 2021లో గురుగ్రామ్‌లో  ప్రారంభించారు. రూ.9 కోట్ల మొత్తం వ్యయంతో చేపలు, రొయ్యల పెంపకానికి ఉద్దేశించిన ఒక బిజినెస్ ఇంక్యుబేషన్ సెంటరును అసోంలో గౌహతి బయోటెక్ పార్కులో ఏర్పాటు చేశారు. కనీసం 100 మత్స్య రంగ అంకుర సంస్థలు, సహకార సంఘాలు, ఎఫ్‌పీఓలు, ఎస్‌హెచ్‌జీలకు సాయం చేయడానికి మరో 3 ప్రతిష్ఠాత్మక సంస్థలు.. మేనేజ్ హైదరాబాద్, ఐసీఏఆర్-సీఐఎఫ్ఈ ముంబయి, ఐసీఏఆర్-సీఐఎఫ్‌టీ కోచి..లను ఇంక్యుబేషన్ సెంటర్లుగా  మత్స్య విభాగం నోటిఫై చేసింది. మత్స్య పరిశ్రమలో అంకుర సంస్థలకు సంబంధించిన అనుబంధ విస్తారిత వ్యవస్థను బలపరచడానికి ఈ విభాగం ఆసక్తిదారుసంస్థలతో క్రమం తప్పక సంప్రదింపుల కోసం అవకాశాన్ని అందిస్తోంది. సవాళ్లను పరిష్కరిస్తూ, ఆర్థిక సహాయాన్ని అందిస్తూ, ఈ రంగంలో వృద్ధికి చోదకశక్తిగా నిలచే సానుకూల విధాన నిర్ణయాలకు రూపకల్పన కూడా చేస్తోంది.

 

***


(రిలీజ్ ఐడి: 2109150) సందర్శకుల సూచీ సంఖ్య : : 76
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: Tamil , English , Urdu , हिन्दी , Marathi