ప్రధాన మంత్రి కార్యాలయం
ఉత్తరాఖండ్‌లోని హర్శిల్‌లో శీతాకాల పర్యాటక కార్యక్రమం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Posted On:
06 MAR 2025 2:07PM by PIB Hyderabad
గంగా మాతకు జయహో!
గంగా మాతకు జయహో!
గంగా మాతకు జయహో!
భారత్ మాతా కీ జై!
భారత్ మాతా కీ జై!
భారత్ మాతా కీ జై!
భారత్ మాతా కీ జై!
ఉత్తరాఖండ్ సోదరీసోదరులారా! మీకందరికీ నా శుభాకాంక్షలు...
నమస్కారం!
ఈ వేదికపై ఆసీనులైన నా సోదరుడు, చురుకైన ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ థామ్ గారు, కేంద్ర మంత్రి శ్రీ అజయ్ టమ్టాగారు, రాష్ట్ర మంత్రి సత్పాల్ మహరాజ్ గారు, పార్లమెంటులో నా సహ సభ్యులైన బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షులు మహేంద్ర భట్ గారు, మాలా రాజ్యలక్ష్మిగారు, ఎమ్మెల్యే సురేష్ గారు, ఇతర ప్రముఖులు, సభకు హాజరైన సోదరీసోదరులారా!
మున్ముందుగా రాష్ట్రంలోని మానా గ్రామంలో కొద్ది రోజుల కిందటి ప్రమాదంపై ప్రగాఢ విచారం వ్యక్తం చేస్తున్నాను. ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు నా సంతాపం ప్రకటిస్తున్నాను. ఈ సంక్షుభిత సమయంలో దేశ ప్రజల సంఘీభావం బాధిత కుటుంబాలకు ఎంతో ఆత్మస్థైర్యాన్నిచ్చింది.
మిత్రులారా!
ఈ ఉత్తరాఖండ్... సమృద్ధ ఆధ్యాత్మిక శక్తి సమన్విత దేవభూమి. నాలుగు అనంత తీర్థయాత్రా సంభరిత దివ్య ధామాలు దైవదత్తాలు. జీవదాత గంగామాతకు నెలవైన ఈ శీతాకాల ప్రదేశం.. వీటన్నింటి నడుమ ఇవాళ మరోసారి మీ అందరినీ, మీ కుటుంబాలను కలుసుకోవడం నాకు దక్కిన భాగ్యం. గంగామాత కృపతోనే దశాబ్దాలుగా ఉత్తరాఖండ్‌కు సేవ చేసే అదృష్టం నాకు లభించింది. ఆమె ఆశీర్వాదం వల్లనే నేను కాశీకి చేరువై, పార్లమెంటు సభ్యుడుగా నేడు ఆ నగరానికి సేవ చేసే అవకాశం దొరికిందన్నది నా ప్రగాఢ విశ్వాసం. అందుకే, గంగామాత స్వయంగా నన్నిక్కడికి రప్పించిందని కాశీలో ప్రకటించాను. అలాగే గంగామాత కొన్ని నెలల కిందట నన్ను దత్తపుత్రుడుగా స్వీకరించిందనే భావన నాలో కలిగింది. ఇది ఆ తల్లి నాపై కురిపించిన ప్రేమ... తన బిడ్డపై ఆమెకుగల అనురాగం. కాబట్టే, నేనీ రోజున ఆమె పుట్టినిల్లు వంటి ముఖ్వా గ్రామానికి వచ్చాను. ఇక్కడి ముఖిమఠ్-ముఖ్వాలో మాత దర్శన భాగ్యంతోపాటు ఆమెను పూజించే అదృష్టం కూడా నాకు లభించింది.
మిత్రులారా!
హర్శిల్ గడ్డపై అడుగుపెట్టిన నేపథ్యంలో నా సోదరి భులియా ఆదరాభిమానాలు కూడా నాకు గుర్తుకొచ్చాయి. ఆ కుటుంబం నాకు తరచూ హర్శిల్ రాజ్మా, ఇతర స్థానిక ఉత్పత్తులు పంపుతుంటారు. వారి ఆప్యాయతానురాగాలకు, కానుకలకు నేను సదా కృతజ్ఞడినై ఉంటాను.
మిత్రులారా!
కొన్నేళ్ల కిందట నేను కేదారనాథుని ఆలయంలో స్వామి పాద దర్శనం, పూజలు చేసిన సందర్భంగా- ఈ దశాబ్దం ఉత్తరాఖండ్‌దేననే నా మనోభావన అసంకల్పితంగా నా నోటివెంట వెలువడింది. ఆ మనోభావనలు, మాటలు నావే అయినా, ఆ కేదారనాథుడే స్వయంగా వాటికి జవజీవాలిచ్చాడు. కేదారనాథ స్వామి ఆశీస్సులతో నా ఆలోచనలు, మాటలన్నీ క్రమేణా వాస్తవ రూపం దాలుస్తున్నాయి. ఆ మేరకు ఈ దశాబ్దం ఉత్తరాఖండ్ సొంతమవుతోంది. రాష్ట్ర పురోగమనానికి కొత్త బాటలు పడుతున్నాయి. ఏయే ఆకాంక్షలతో ఉత్తరాఖండ్ ఆవిర్భవించిందో, ఈ రాష్ట్ర ప్రగతికి ఎలాంటి సంకల్పాలు నిర్దేశించుకున్నామో... ఆ దిశగా సరికొత్త విజయాలతో, నిత్యం ఒక లక్ష్యం చేరుకుంటూ స్వప్న సాకారం చేసుకుంటున్నాం. ఈ దిశగా శీతాకాల పర్యాటకాన్ని మరో ముఖ్యమైన దశగా పరిగణించాల్సి ఉంది. తద్వారా ఉత్తరాఖండ్ ఆర్థిక సామర్థ్య సద్వినియోగానికి మార్గం సుగమం కాగలదు. ఈ విధమైన వినూత్న కృషికి శ్రీకారం చుట్టిన ధామీగారితోపాటు ఉత్తరాఖండ్ ప్రభుత్వానికి అభినందనలు తెలుపుతూ, ఈ రాష్ట్రం వేగంగా ముందంజ వేయాలని ఆకాంక్షిస్తున్నాను.
మిత్రులారా!
రాష్ట్ర పర్యాటక రంగాన్ని ఏడాది పొడవునా... 365 రోజులూ వైవిధ్యభరితం చేయడం ఉత్తరాఖండ్ ప్రభుత్వ కీలక బాధ్యత. రాష్ట్రంలో నిరంతర పర్యాటకాన్ని నేను ఆకాంక్షిస్తున్నాను. ఈ రోజుల్లో ‘అకాలం-సకాలం’ అనేవి చెల్లవు. సీజన్ల ‘ఆఫ్-ఆన్’ అనే మాటకు తావులేదు. పర్వత పర్యాటకం ప్రస్తుతం కాలానుగుణమైనది... అంటే- మార్చి, ఏప్రిల్, మే, జూన్ నెలల్లో పెద్ద సంఖ్యలో పర్యాటకులు వస్తారన్నది మీకందరికీ తెలిసిందే. ఆ తర్వాత సహజంగానే ఈ సంఖ్య బాగా తగ్గిపోతుంది. శీతాకాలంలో అనేక హోటళ్లు, రిసార్టులు ఆతిథ్య గృహాలు (హోమ్‌స్టే) ఖాళీగానే దర్శనమిస్తాయి. ఏడాదిలో అధిక కాలం కొనసాగే ఈ అసమతౌల్యం ఉత్తరాఖండ్ ఆర్థిక మందగమనానికి దారితీయడమేగాక పర్యావరణానికి సవాలుగా పరిణమిస్తుంది.
మిత్రులారా!
దేశవిదేశీ పర్యాటకులు శీతాకాలంలో ఉత్తరాఖండ్ సందర్శనకు వస్తే, ఈ దేవభూమి తేజస్సు ఏమిటో అనుభవంలోకి వస్తుందన్నది వాస్తవం. ముఖ్యంగా పర్వాతరోహణ (ట్రెక్కింగ్), మంచు కొండలపై జారుడు విన్యాసాలు (స్కీయింగ్) వంటి సాహస క్రీడలు శీతాకాల పర్యాటకంలో అద్భుతానుభూతినిస్తాయి. అలాగే శీతాకాల ఆధ్యాత్మిక తీర్థయాత్రలకు ఉత్తరాఖండ్ ఎంతో ప్రత్యేకం. ఈ సమయంలో అనేక యాత్రా ప్రదేశాల్లో అనుసరించే ప్రత్యేక ఆచార-సంప్రదాయాలు మన దృష్టికి వస్తాయి. ఉదాహరణకు... ముఖ్వా గ్రామాన్ని సందర్శించండి- ఇక్కడ పాటించే ఆధ్యాత్మిక ఆచార వ్యవహారాలు మన అద్భుత, ప్రాచీన సంప్రదాయంలో భాగం. ఈ నేపథ్యంలో ఏడాది పొడవునా... అంటే- 365 రోజుల పర్యాటకం అనే రాష్ట్ర ప్రభుత్వ దృక్కోణంతో సందర్శకులకు దైవికానుభవ సంధానం లభిస్తుంది. దీంతోపాటు స్థానికులకు ఏడాది పొడవునా ఉపాధి అవకాశాల సౌలభ్యం కలుగుతుంది. తద్వారా రాష్ట్ర ప్రజలకు.. ముఖ్యంగా యువతరానికి ఎంతో ప్రయోజనం చేకూరుతుంది.
మిత్రులారా!
ఉత్తరాఖండ్‌ను అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి మా ద్వంద్వ సారథ్య ప్రభుత్వం కృషి చేస్తోంది. అన్నికాలాలకూ అనువైన చార్‌ధామ్ రహదారి, ఆధునిక ఎక్స్ ప్రెస్ వే, రైల్వే, విమాన-హెలికాప్టర్ సేవల విస్తరణ తదితరాలతో గత దశాబ్దంలో రాష్ట్రం వేగంగా పురోగమించింది. ఇక కేంద్ర ప్రభుత్వం ఉత్తరాఖండ్ కోసం నిన్ననే అనేక కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ మేరకు కేదార్‌నాథ్, హేమకుండ్ రోప్‌వే ప్రాజెక్టుల నిర్మాణానికి కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. కేదార్‌నాథ్ రోప్‌వే పూర్తయితే 8 నుంచి 9 గంటలు పట్టే ప్రయాణం దాదాపు 30 నిమిషాల్లోనే పూర్తవుతుంది. తద్వారా వృద్ధులు, పిల్లలు, మహిళలకు కేదార్‌నాథ్ యాత్ర సులభమవుతుంది. ఈ రోప్‌వే ప్రాజెక్టుల కోసం రూ.వేల కోట్లు ఖర్చు కానుండగా, యాత్రికులకు సమయం, వ్యయం చాలావరకూ తగ్గిపోతాయి. అందుకే ఈ ప్రాజెక్టులకు ఆమోదముద్రపై రాష్ట్రంతోపాటు యావద్దేశానికీ నా అభినందనలు.
మిత్రులారా!
రాష్ట్రంలోని పర్వత ప్రాంతాల్లో పర్యావరణ హిత నిప్పుగూళ్లు (ఫైర్‌ప్లేస్)గల వసతి గృహాలు, సకల సౌకర్యాల ప్రాంగణాలు, హెలిపాడ్ సదుపాయాలు వంటి సదుపాయాల కల్పనపై ఇప్పుడు ప్రభుత్వ దృష్టి సారించింది. జమ్మూ కాశ్మీర్‌లోని అమర్‌నాథ్ మంచులింగం తరహాలోగల తిమ్మర్‌సెయిన్ మహదేవ్ ఆలయం, మానా-జాదుంగ్ గ్రామాల వంటివి ఉత్తరాఖండ్‌లో దర్శనీయ స్థలాలు. ఒకనాడు... అంటే- 1962లో భారత్‌పై చైనా దాడి చేసినపుడు ఈ రెండు గ్రామాలను ఖాళీ చేయించిన సంగతి దేశవాసులలో చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు లేదా విస్మరించి ఉండవచ్చు. కానీ, మేం మరచిపోలేం... అందుకే ఆ రెండు గ్రామాల పునరావాసానికి కృషి చేశాం. అంతేకాదు... వీటిని పర్యాటక ప్రదేశాలుగా రూపుదిద్దుతున్నాం. కాబట్టే, గడచిన దశాబ్దంలో ఉత్తరాఖండ్‌కు పర్యాటకుల సంఖ్య భారీగా పెరిగింది. ఈ మేరకు 2014 నాటికి చార్‌ధామ్ పర్యాటకుల సంఖ్య ఏటా 18 లక్షలు కాగా, ఏటికేడు పెరుగుతూ ఏకంగా 50 లక్షలకు పెరిగింది. ఈ నేపథ్యంలో 50 పర్యాటక గమ్యాలకు బడ్జెట్‌లో ప్రత్యేక కేటాయింపులు చేశాం. ఈ నిధులతో అక్కడి హోటళ్లకు మౌలిక సదుపాయాల స్థాయి కల్పిస్తాం. తద్వారా పర్యాటకులకు సౌకర్యలు పెరగడంతోపాటు స్థానికంగా ఉపాధి అవకాశాలు ఇనుమడిస్తాయి.
మిత్రులారా!
ఉత్తరాఖండ్ సరిహద్దు ప్రాంతాలకూ పర్యాటక రంగ ప్రయోజనాలు లభించే దిశగా కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. సరిహద్దులలో ఒకనాడు దేశానికి ‘చిట్టచివరి గ్రామాలు’గా పరిగణించబడినవన్నీ నేడు ‘ప్రవేశ గ్రామాలు’గా రూపొందాయి. ఆ గ్రామాల సర్వతోముఖాభివృద్ధి లక్ష్యంగా ‘సాధికార గ్రామాల కార్యక్రమం’ అమలు చేశాం. ఆ కార్యక్రమం కింద రూపాంతరం చెందిన వాటిలో ఈ ప్రాంతంలోని 10 గ్రామాలు కూడా ఉన్నాయి. ఆ గ్రామాలకు చెందిన కొందరు నేటి కార్యక్రమంలో పాల్గొంటున్నారని నాకు సమాచారం అందింది. ఇక 1962లో చైనా దాడి ప్రభావిత గ్రామాల గురించి నేనిప్పుడే ఉటంకించాను. అలాంటి వాటిలో నెలాంగ్, జాదుంగ్ గ్రామాల పునరావాసానికి చర్యలు చేపట్టాం. ఇందులో భాగంగా జాదుంగ్ వరకూ బైక్ ర్యాలీని ఇప్పుడే ప్రారంభించాను. ఆయా ప్రాంతాల్లోని ప్రజలకు ‘ఆతిథ్యగృహ’ (హోమ్‌స్టే) నిర్మాణం కోసం ‘ముద్ర’ పథకం కింద ఆర్థిక సహాయం అందిస్తామని ప్రకటించాం. ఈ దిశగా ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఇప్పటికే దృష్టి సారించింది. దీంతో దశాబ్దాలుగా మౌలిక సదుపాయాలే కరవైన గ్రామాలు నేడు సరికొత్త ‘ఆతిథ్యగృహాల’ను ప్రారంభిస్తున్నాయి. ఈ పరిణామం పర్యాటక రంగ ప్రగతికి దోహదం చేయడమేగాక స్థానికుల ఆదాయార్జన మార్గంగా మారడం గమనార్హం.
మిత్రులారా,
ఈ రోజు గంగామాత జన్మ స్థలమైన ఈ పవిత్ర భూమి నుంచి దేవభూమి, దేశ నలుమూలల, తూర్పు-పడమర-ఉత్తర-దక్షిణం, మధ్య ప్రాంతాలకు చెందిన వారికి, ముఖ్యంగా యువ తరానికి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాను.
మిత్రులారా,
శీతాకాలంలో దేశంలోని చాలా ప్రాంతాల్లో పొగమంచు ఉండి సూర్యుడు కూడా కనిపించని పరిస్థితి ఉంటుంది. అలాంటి సమయంలో పర్వతాలపై వచ్చే సూర్యరశ్మిని అక్కడి ప్రజలు ఆస్వాదిస్తారు. ఇది ఒక ప్రత్యేక కార్యక్రమంగా మారొచ్చు. మరి గర్వాలీలో దీన్ని ఏమని పిలుస్తాం? 'ఘమ్ తపో పర్యాతన్', అవునా! 'ఘమ్ తపో పర్యాతన్'. దీనికోసం దేశం నలుమూలల నుంచి ప్రజలు ఉత్తరాఖండ్‌లో తప్పక పర్యటించాలి. ముఖ్యంగా కార్పొరేట్ ప్రపంచానికి చెందిన స్నేహితులు శీతాకాల పర్యాటకంలో భాగం కావాలి. సభలు, సమావేశాలు, ప్రదర్శనలు నిర్వహించేందుకు శీతాకాలం, దేవభూమి కంటే మంచి ప్రదేశం మరొకటి ఉండదు. కార్పొరేట్ ప్రపంచంలోని పెద్దలు నిర్వహించే సెమినార్ల కోసం ఉత్తరాఖండ్‌కు రావాలని, ఇక్కడి మైస్ రంగంలో అవకాశాలను అన్వేషించాలని నేను కోరుతున్నాను. ప్రజలు ఇక్కడకు వచ్చి యోగా, ఆయుర్వేదం ద్వారా ద్వారా పునరుత్తేజం పొందొచ్చు, తిరిగి శక్తిని నింపుకోవచ్చు. దేశంలోని విశ్వవిద్యాలయాలు, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలలోని యువ స్నేహితులందరూ శీతాకాల పర్యటనల కోసం ఉత్తరాఖండ్‌ను ఎంచుకోవాలని నేను అభ్యర్థిస్తున్నాను.
మిత్రులారా,
పెళ్లిళ్లకు సంబంధించిన మన ఆర్థిక వ్యవస్థ వేల కోట్ల విలువైనది. పెళ్లిళ్ల కోసం వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంటారు. ఇది చాలా పెద్ద ఆర్థిక వ్యవస్థ. భారత్‌లో పెళ్లి చేసుకోవాలి అని నేను దేశ ప్రజలను కోరిన విషయం మీకు గుర్తుండే ఉంటుంది. ఈ రోజుల్లో ప్రపంచంలోని ఇతర దేశాలకు పెళ్లి కోసం వెళ్తుంటారు. ఇక్కడ ఏం లోటు ఉంది? ఇక్కడ ఖర్చు చేయండి. ఈ విషయంలో ఉత్తరాఖండ్ కంటే గొప్ప ప్రాంతం ఏముంటుంది. శీతాకాలంలో డెస్టినేషన్ పెళ్లిల కోసం దేశ ప్రజలు ఉత్తరాఖండ్‌కు ప్రాధాన్యత ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. అలాగే భారత సినీ పరిశ్రమల నుంచి కూడా నాకు చాలా అంచనాలు ఉన్నాయి. సినిమాలకు సంబంధించి అత్యంత స్నేహపూర్వక రాష్ట్రంగా ఉత్తరాఖండ్ అవార్డును అందుకుంది. ఇక్కడ ఆధునిక సౌకర్యాలు శరవేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. అందువల్ల చలికాలంలో సినిమా షూటింగులకు ఉత్తరాఖండ్ యావత్ భారతదేశానికి ఇష్టమైన గమ్యస్థానంగా మారే సామర్థ్యం ఉంది.
మిత్రులారా,
శీతాకాల పర్యాటకం ప్రపంచంలోని అనేక దేశాలలో బాగా ప్రాచుర్యం పొందింది. ఉత్తరాఖండ్‌లో శీతాకాల పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు, దీనికి సంబంధించి ఇలాంటి దేశాల నుంచి మనం చాలా విషయాలు నేర్చుకోవచ్చు. ఉత్తరాఖండ్ పర్యాటక రంగానికి సంబంధించిన వివిధ భాగస్వాములు, హోటళ్లు, రిసార్టులన్నీ ఆయా దేశాలను అధ్యయనం చేయాలని నేను కోరుతున్నాను. నేను ఇప్పుడు ఇక్కడ ఉన్నాను కదా.. నేను ఒక చిన్న ప్రదర్శనను చూశాను. అది నన్ను చాలా ఆకట్టుకుంది. వారి ఊహించి వేసిన చిత్రాలు, చూపించిన ప్రదేశాలు, తయారు చేసిన అధునిక సృష్టి, వివిధ ప్రదేశాలను తెలిపే ప్రతి చిత్రం చాలా ఆకట్టుకున్నాయి. నేను మరోసారి ఇక్కడకు వచ్చి నా 50 సంవత్సరాల నాటి జీవితాన్ని మీ మధ్య గడుపుడూ.. ప్రతి ప్రాంతాన్ని సందర్శించే అవకాశం కోసం అన్వేషించాలని అనిపిస్తోంది. ప్రతి ప్రాంతాన్ని చాలా చక్కగా చూపించారు. విదేశాల్లో చేసిన అధ్యయనాల నుండి వచ్చే కార్యాచరణ అంశాలపై చురుకుగా పనిచేయాలని నేను ఉత్తరాఖండ్ ప్రభుత్వాన్ని కోరుతున్నాను. స్థానిక సంప్రదాయాలు, సంగీతం, నృత్యం, వంటకాలను ప్రోత్సహించాలి. ఇక్కడ చాలా వేడి నీటి బుగ్గలు ఉన్నాయి. కేవలం బద్రీనాథ్‌లో మాత్రమే కాదు మరెన్నో ఇతర ప్రాంతాల్లో కూడా ఉన్నాయి. ఆయా ప్రాంతాలను ఆరోగ్య కేంద్రాలుగా కూడా అభివృద్ధి చేయొచ్చు. శీతాకాల యోగా కార్యక్రమాలను ప్రశాంతమైన మంచు ప్రాంతాలలో నిర్వహించొచ్చు. శీతాకాలంలో ఉత్తరాఖండ్‌లో సంవత్సరానికి ఒకసారి తమ శిష్యుల కోసం యోగా శిబిరాన్ని నిర్వహించాలని మహర్షులు, మఠాలు, దేవాలయాల అధిపతులు, యోగా గురువులందరినీ కోరుతున్నాను. శీతాకాలంలో వన్యప్రాణుల సఫారీకి సంబంధించి ఉత్తరాఖండ్ ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చే సామర్థ్యం ఉంది. అంటే 360 డిగ్రీల విధానంతో ముందుకు సాగి ప్రతి స్థాయిలో పనిచేయాలి.
మిత్రులారా,
సౌకర్యాల అభివృద్ధితో పాటు ప్రజలకు సమాచారం అందించడం కూడా అంతే ముఖ్యం. దీని కోసం నేను దేశంలోని యువ కంటెంట్ క్రియేటర్లకు విన్నవిస్తున్నాను. ఈ రోజుల్లో సామాజిక మాధ్యమాల్లో పెద్ద సంఖ్యలో ఇన్‌ఫ్లూయెన్సర్లు, కంటెంట్ క్రియేటర్లు ఉన్నారు. వారంతా నా ఉత్తరాఖండ్, నా దేవభూమికి సేవ చేయొచ్చు. ఇంట్లో కూర్చొని వారి పని చేసుకోవచ్చు. దేశంలో పర్యాటక రంగాన్ని వేగవంతం చేయడంలో, ప్రజలకు సమాచారం అందించడంలో మీరు చాలా పెద్ద పాత్ర పోషించగలరు. మీరు ఇప్పటికే పోషించిన పాత్రను మరింత విస్తరించాల్సిన అవసరం ఉంది. ఉత్తరాఖండ్‌లో శీతాకాల పర్యాటకాన్ని ప్రచారం చేయటంలో మీరు కూడా భాగం కావాలి. రాష్ట్ర ప్రభుత్వం ఒక పెద్ద పోటీని నిర్వహించాలని నేను కోరుతున్నాను. ఈ కంటెంట్ క్రియేటర్లు, ఇన్‌ఫ్లూయెన్సర్లు శీతాకాల పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి 5 నిమిషాల వీడియోను రూపొందించాలి. వారందరికి పోటీ పెట్టి, ఉత్తమ చిత్రాన్ని రూపొందించిన వ్యక్తికి మంచి బహుమతి ఇవ్వాలి. దేశం నలుమూలల నుంచి ఇందులో పాల్గొనాలని ప్రజలను కోరాలి. చాలా ప్రచారం ప్రారంభమౌతుంది. ఇలాంటి పోటీలు జరిగినప్పుడు కొత్త ప్రదేశాలను అన్వేషిస్తారు. కొత్త సినిమాలు తీస్తారు. వాటి గురించి ప్రజలకు తెలియజేస్తారు. ఇది ఖచ్చితంగా జరుగుతుందని నేను భావిస్తున్నాను.
మిత్రులారా,
రాబోయే సంవత్సరాల్లో ఈ రంగంలో వేగవంతమైన అభివృద్ధిని చూస్తామని నేను విశ్వసిస్తున్నాను. 365 రోజులు, సంవత్సరం పొడవునా జరిగే పర్యాటకం విషయంలో ప్రచారానికి, ఉత్తరాఖండ్ సోదర సోదరీమణులందరికీ మరోసారి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందిస్తున్నాను.
మీరంతా నాతో పాటు అనండి-
గంగా మాతాకీ- జై
గంగా మాతాకీ- జై
గంగా మాతాకీ- జై
ధన్యవాదాలు
గమనిక: ఇది ప్రధాన మంత్రి ప్రసంగానికి తెలుగు అనువాదం. వాస్తవ ప్రసంగం హిందీలో ఉంది.
***
(Release ID: 2109063)
|