సాంస్కృతిక మంత్రిత్వ శాఖ
సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో ‘‘ఫెస్టివల్ ఆఫ్ లెటర్స్ 2025’’
Posted On:
06 MAR 2025 12:20PM by PIB Hyderabad
కేంద్ర ప్రభుత్వ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని సాహిత్య అకాడమీ తాను ఏటా నిర్వహించే ‘ఫెస్టివల్ ఆఫ్ లెటర్స్’ను (సాహిత్య మహోత్సవం) ఈ నెల 7 నుంచి 12 వరకు న్యూఢిల్లీలోని రవీంద్ర భవన్‌లో నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవాన్ని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్ ప్రారంభించనున్నారు. ప్రముఖ ఇంగ్లిషు నాటక రచయిత శ్రీ మహేశ్ దత్తానీ పురస్కార ప్రదాన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొంటారు. 23 భాషల్లో అందించే సాహిత్య అకాడమీ పురస్కారాలను ఈ కార్యక్రమంలో ప్రదానం చేయనున్నారు. ప్రసిద్ధ రచయిత, పండితుడు శ్రీ ఉపమన్యు చటర్జీ ఈసారి ‘సంవత్సర్’ ఉపన్యాసాన్నిస్తారు.
ఇది ఆసియాలోనే అతి పెద్ద సాహితీ ఉత్సవం. దేశంలో వివిధ ప్రాంతాల నుంచి సుమారు 700 మంది రచయితలు ఈ ఉత్సవంలో పాల్గొననున్నారు. వారు 50కి పైగా భాషలకు ప్రాతినిధ్యం వహిస్తారు. ఈ ఉత్సవంలో 100కు పైగా కార్యక్రమాలు నిర్వహిస్తారు. ‘భారతీయ సాహితీ సంప్రదాయాలు’ ఈ ఉత్సవ ఇతివృత్తంగా ఉంటుంది. ఉత్సవంలో చివరి మూడు రోజులలో ఈ ఇతివృత్తంపై ప్రసిద్ధ ఆలోచనాపరులు, రచయితలు పాల్గొనే ఒక జాతీయ గోష్ఠిని (నేషనల్ సెమినార్) నిర్వహిస్తారు.
యువ రచయతలు, రచయిత్రులు, దళిత రచయితలు, ఈశాన్య ప్రాంతాలకు చెందిన రచయితలు, గిరిజన రచయితలు, గిరిజన కవులు, ఎల్జీబీటీక్యూ రచయితలు, కవులతోపాటు ప్రఖ్యాత రచయితలు, అనువాదకులు, ప్రచురణ కర్తలు, కవులు, విభిన్న రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొంటారు. భారత్లో అత్యధిక వర్గాలను కలుపుకొనిపోయే సాహితీ ఉత్సవంగా ‘ఫెస్టివల్ ఆఫ్ లెటర్స్’కు 1985 నుంచి ఉన్న ప్రతిష్ఠను పరిరక్షించనున్నారు.
ఉత్సవం ఆఖరి రోజు బాలలకు రోజంతా కొనసాగే ‘స్పిన్ ఎ టేల్’ పేరిట కార్యక్రమం ఉంటుంది. ఉత్సవాన్ని నిర్వహించినన్ని రోజులూ... ప్రముఖ రచయితలు, కవులు, అనువాదకులు, ప్రచురణ కర్తలు, విమర్శకులు అనేక విషయాలపై వారి నివేదికలను, సమీక్షలను సమర్పించడంతోపాటు చర్చలలో పాల్గొంటారు.
మూడు రోజుల పాటు సాయంత్రం వేళల్లో రాకేశ్ చౌరసియా (వేణుగానం), నళిని జోషి (హిందుస్తానీ గాత్రం), ఫౌజియా దాస్తాన్గో, రితేశ్ యాదవ్ (దాస్తాన్-ఎ-మహాభారత్) వంటి ప్రసిద్ధ కళాకారుల సాంస్కృతిక ప్రదర్శనలుంటాయి. సాహితీ ప్రియులకూ, భారతదేశంలో సుదీర్ఘకాలంగా నిర్వహిస్తూ వస్తున్న సాహిత్య మహోత్సవ ఆనందానుభూతులను ఆస్వాదించాలని కోరుకునే వారందరికీ ‘ఫెస్టివల్ ఆఫ్ లెటర్స్’ తలుపులు తెరిచి ఉంటాయి. ఈ ఉత్సవానికి ప్రవేశం ఉచితం.
***
(Release ID: 2108826)
Visitor Counter : 31