యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
మార్చి 7, 8 తేదీల్లో హైదరాబాద్ లో ఒలింపిక్ సన్నద్ధత, క్రీడా పరిపాలనపై డాక్టర్ మన్సుఖ్ మాండవీయ అధ్యక్షతన చింతనా శిబిరం
ప్రపంచస్థాయిలో భారత క్రీడానైపుణ్యాలను పెంపొందించే దిశగా వ్యూహాన్ని రచించనున్న రాష్ట్రాలు, నిపుణులు, క్రీడాకారులు
Posted On:
06 MAR 2025 12:05PM by PIB Hyderabad
2028లో జరిగే లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్‌కు అనుసరించాల్సిన వ్యూహం, 2036లో జరిగే వేసవి ఒలింపిక్స్‌ను భారత్‌లో నిర్వహించాలనే ప్రతిపాదనపై చర్చించేందుకు మార్చి 7, 8 తేదీల్లో హైదరాబాద్‌లో చింతనా శిబిరం జరగనుంది. ఈ కార్యక్రమానికి కేంద్ర యువజన వ్యవహరాలు, క్రీడలు, కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ అధ్యక్షత వహిస్తారు.
కన్హా శాంతి వనంలో రెండు రోజుల పాటు నిర్వహించే ఈ కార్యక్రమంలో భారత్‌ను అంతర్జాతీయ క్రీడాశక్తిగా మార్చేందుకు రూపొందించాల్సిన ప్రణాళికపై చర్చిస్తారు. దీనిలో రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల క్రీడా మంత్రులు, క్రీడా శాఖ ఉన్నాధికారులు, కీలకమైన ప్రభుత్వాధికారులు, క్రీడారంగంలో నిపుణులు తమ ఆలోచనలను పంచుకుంటారు. క్రీడా పరిపాలనను మెరుగుపరచడం, క్షేత్రస్థాయిలో ప్రతిభను గుర్తించడం, మౌలిక సదుపాయాల అభివృద్ధి, సమ్మిళితత్వం, సహకారాలను ప్రోత్సహించడంపై ఈ చర్చల్లో దృష్టి సారిస్తారు.
భారతీయ క్రీడా రంగాన్ని అభివృద్ధి చేయాలన్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ లక్ష్యాన్ని ముందుకు నడిపిస్తున్న డాక్టర్ మాండవీయ, దేశ ఒలింపిక్ లక్ష్యాలపై, క్రీడా వ్యవస్థను బలోపేతం చేయడంపై క్రీడానిపుణులతో వ్యూహాత్మక చర్చలు నిర్వహిస్తారు. తాము అనుసరిస్తున్న ఉత్తమ విధానాలు, వినూత్న పద్ధతులను రాష్ట్రాల ప్రతినిధులు ఈ చింతనా శిబిరంలో తెలియజేస్తారు.
చింతనా శిబిరంలో దృష్టి సారించే ప్రధానాంశాలు:
రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల సమన్వయంతో భారత ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాలపై సమీక్ష.
క్రీడల అభివృద్ధి, క్రీడల మౌలిక సదుపాయాల్లో కార్పొరేట్ల భాగస్వామ్యం.
క్షేత్ర స్థాయిలో ప్రతిభాన్వేషణ, ప్రోత్సాహం.
క్రీడల్లో ఉత్తమ పరిపాలనను ప్రోత్సహించడం.
ఖేలో ఇండియా, ఫిట్ ఇండియాను విస్తరించడంపై చర్చలు.
క్రీడల్లో సమ్మిళితత్వాన్ని ప్రోత్సహించడం.
క్రీడాకారులు, కోచ్‌ల సంక్షేమం.
సహకారపూర్వకమైన, ఫలితాల ఆధారిత విధాన ప్రాముఖ్యం గురించి డాక్టర్ మాండవీయ చర్చిస్తూ ‘‘ఇటీవలే ఉత్తరాఖండ్‌లో జరిగిన జాతీయ క్రీడల్లో భారత అథ్లెట్లు సాధించిన విజయం మన అపార సామర్థ్యాన్ని తెలియజేసింది. మన లక్ష్యం స్పష్టంగా ఉంది. ఒలింపిక్స్‌కు తగిన నైపుణ్యాలను సాధించడం, క్రీడల్లో భారత్‌ను ప్రపంచ శక్తిగా మార్చడం, ఆలోచనలను, ఉత్తమ పద్ధతులను పంచుకోవడం ద్వారా సుస్థిరమైన క్రీడా ప్రణాళికను మనం రూపొందించవచ్చు. ఒలింపిక్స్‌కు ఆతిథ్యమివ్వడం జాతీయ లక్ష్యం. ఈ దిశగా మనం అందరూ కలసి ముందడుగు వేయాలి’’ అని అన్నారు.
ఈ చర్చల్లో మాజీ క్రీడాకారుల సామర్థ్యాన్ని వినియోగించుకోవడం కీలకాంశం కానుంది. కోచ్‌లుగా మారగలిగే సత్తా ఉన్న అగ్రశ్రేణి క్రీడాకారులను గుర్తించాల్సిందిగా డాక్టర్ మాండవీయ రాష్ట్రాలకు విజ్ఞప్తి చేశారు. అలాగే క్రీడారంగంలో ఉన్న అంతరాలను తగ్గించేందుకు, నైపుణ్యాలను అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.
భారతీయ క్రీడా రంగంలో గుణాత్మకమైన మార్పులు తీసుకొచ్చే, అంతర్జాతీయ వేదికపై సుదీర్ఘ విజయాలను అందించేందుకు ప్రేరణగా ఈ చింతనా శిబిరం పనిచేస్తుంది.
***
(Release ID: 2108747)
Visitor Counter : 36