రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
జాతీయ రోప్‌వేల అభివృద్ధి కార్యక్రమం ‘పర్వతమాల పరియోజన’లో భాగంగా
ఉత్తరాఖండ్ రాష్ట్రంలో గోవింద్‌ఘాట్ నుంచి హేమ్‌కుండ్ సాహిబ్ జీ వరకు 12.4 కి.మీ. మేర రోప్‌వే ప్రాజక్టు అభివృద్ధికి మంత్రిమండలి ఆమోదముద్ర
Posted On:
05 MAR 2025 3:09PM by PIB Hyderabad
గోవింద్‌ఘాట్ నుంచి హేమ్‌కుండ్ సాహిబ్ జీ వరకు 12.4 కిలోమీటర్ల మేర రోప్‌వే ప్రాజెక్టు నిర్మాణానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన ఆర్థిక వ్యవహారాల మంత్రివర్గ కమిటీ (సీసీఈఏ) ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టును రూ.2,730.13 కోట్ల మొత్తం మూలధన వ్యయంతో డిజైన్, బిల్డ్, ఫైనాన్స్, ఆపరేట్ అండ్ ట్రాన్స్‌ఫర్ (డీబీఎఫ్ఓటీ) పద్ధతిలో అభివృద్ధి చేయనున్నారు.
గోవింద్‌ఘాట్ నుంచి 21 కిలోమీటర్ల దూరాన గల హేమ్‌కుండ్ సాహిబ్ జీకి ఎత్తయిన కఠినమార్గంలో ప్రస్తుతం ప్రయాణించాల్సి వస్తోంది. కాలినడకనగానీ, లేదా చిన్న గుర్రాలపైనగానీ, లేదా డోలీగానీ ఈ యాత్రను పూర్తి చేస్తున్నారు. హేమ్‌కుండ్ సాహిబ్ జీని చూడాలనుకునే యాత్రికులకూ, అలాగే ‘వేలీ ఆఫ్ ఫ్లవర్స్’ను చూడాలనుకొనే పర్యాటకులకూ సౌకర్యవంతంగా ఉండడంతోపాటు గోవింద్‌ఘాట్, హేమ్‌కుండ్ సాహిబ్ జీ గురుద్వారా మధ్య అన్ని రుతువుల్లోనూ చిట్టచివరి అడుగు వరకు సానుకూల ప్రయాణానికిగాను ఇకపై రోప్‌వే పద్ధతిని ప్రవేశపెట్టనున్నారు.
రోప్‌వేను ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్య విధానంలో అభివృద్ధి చేస్తారు. గోవింద్‌ఘాట్ నుంచి ఘాంగరియా వరకు 10.55 కి.మీ. మార్గంలో మోనోకేబుల్ డిటాచబుల్ గోండోలా (ఎమ్డీజీ) రూపంలోనూ, ఘాంగరియా నుంచి హేమ్‌కుండ్ సాహిబ్ జీ వరకు గల 1.85 కి.మీ. మార్గంలో అత్యంత ఆధునిక ట్రైకేబుల్ డిటాచబుల్ గోండోలాతో (3ఎస్) కలిపేదిగా ఉండి, నిరంతరాయ యాత్రకు ఉపయోగపడుతుంది. ఒక గంటలో ఒక దిశలో 1,100 మంది ప్రయాణికులను చేరవేసే సామర్థ్యం (పీపీహెచ్‌పీడీ)తో దీని డిజైనును రూపొందిస్తారు. ఇది ఒక్క రోజులో 11,000 మంది ప్రయాణికులను చేరవేస్తుంది.
ఈ రోప్‌వే ప్రాజెక్టు నిర్మాణ సమయంలోనూ, సందర్శనలు మొదలైన తరువాతా చెప్పుకోదగ్గ స్థాయిలో ఉద్యోగ అవకాశాలను కూడా కల్పిస్తుంది. అంతేకాకుండా ఆతిథ్యం, ప్రయాణం, ఆహార పానీయాలతోపాటు పర్యటనకు సంబంధించిన అనుబంధ పరిశ్రమలను కూడా ఏడాది పొడవునా ప్రోత్సహిస్తుంది.
ఈ రోప్‌వే ప్రాజెక్టును అభివృద్ధిపరచడం సామాజిక అభివృద్ధికీ, ఆర్థిక అభివృద్ధికీ మధ్య సమతౌల్యాన్ని పెంచే దిశలో ఒక ముఖ్య నిర్ణయం. ఇది ఆ ప్రాంతంలో సత్వర ఆర్థిక వృద్ధికి తోడ్పడడంతోపాటు యాత్రికులకు మెరుగైన సంధానాన్ని సమకూరుస్తుంది.
హేమ్‌కుండ్ సాహెబ్ జీ ఉత్తరాఖండ్ రాష్ట్రంలో చమోలీ జిల్లాలో 15,000 అడుగుల ఎత్తున నెలకొన్న అత్యంత ఆరాధనీయ తీర్థయాత్రాస్థలం. ఈ పవిత్ర స్థలంలో ఏర్పాటు చేసిన గురుద్వారాను ఏటా మే మొదలు సెప్టెంబరు మధ్య కాలంలో 5 నెలల పాటు తెరిచి ఉంచుతారు. ప్రతి సంవత్సరం సుమారు 1.5 లక్షల నుంచి 2 లక్షల మంది వరకు యాత్రికులు ఈ గురుద్వారాను దర్శిస్తుంటారు. హేమ్‌కుండ్ సాహిబ్ జీ కి చేసే ప్రయాణం ప్రాచీన గఢ్‌వాల్ హిమాలయాలలో కొలువుదీరిన ప్రఖ్యాత ‘వేలీ ఆఫ్ ఫ్లవర్స్’కు కూడా మార్గాన్ని సుగమం చేయనుంది. ‘వేలీ ఆఫ్ ఫ్లవర్స్’ యునెస్కో ప్రపంచ వారసత్వ స్థలంగా గుర్తింపు పొందిన జాతీయ ఉద్యానవనం.
***
(Release ID: 2108518)
Visitor Counter : 14