నౌకారవాణా మంత్రిత్వ శాఖ
‘‘తల్లి ఒడే అన్నింటి కంటే గొప్ప పాఠశాల’’: సర్బానంద సోనోవాల్
Posted On:
03 MAR 2025 7:16AM by PIB Hyderabad
‘‘తల్లి ఒడే ప్రపంచంలో అత్యుత్తమ పాఠశాల’’ అంటూ దేశ నిర్మాణంలో మహిళలు పోషించే కీలకపాత్ర గురించి కేంద్ర నౌకాశ్రయాలు, జల రవాణా, జలమార్గాల మంత్రి శ్రీ సర్బానంద సోనోవాల్ వివరించారు. ఆదివారం దిబ్రూగఢ్ లో జరిగిన ఆల్ అసోం సోనోవాల్ కఛారీ విమెన్స్ అసోసియేషన్ (ఏఏఎస్కేడబ్యూఏ) కేంద్రీయ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ప్రసంగించారు.
ఈ కార్యక్రమంలో శ్రీ సర్బానంద సోనోవాల్ మాట్లాడుతూ మహిళా సాధికారత అంశంలో ప్రభుత్వం కనబరుస్తున్న అంకితభావాన్ని ప్రశంసించారు. ‘‘ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలో, మహిళా సాధికారత కోసం చేస్తున్న ప్రయత్నాలు సుసంపన్నమైన, స్వయం సమృద్ధి కలిగిన సమాజాన్ని సాధించేందుకు మార్గాన్ని ఏర్పాటు చేశాయి’’ అని అన్నారు.
రుగ్వేదాన్ని ఉటంకిస్తూ, చరిత్రలో ప్రగతిశీలమైన, పరిపూర్ణమైన సమాజాన్ని నిర్మించడంలో మహిళలు ముఖ్యమైన పాత్రను పోషించారని కేంద్రమంత్రి పేర్కొన్నారు. ‘‘జ్ఞాన సముపార్జన దిశగా తల్లి తన సంతానాన్ని ప్రోత్సహిస్తుంది. వారిని ధైర్యంగా ముందుకు నడిపిస్తుంది. ప్రయత్నం, పట్టుదల లేకపోతే ఒకరి సామర్థ్యాన్ని గుర్తించడం అసాధ్యం’’ అని కేంద్ర మంత్రి తెలిపారు.
మానవత్వాన్ని, సాంకేతిక పురోగతులను సమతౌల్యం చేయాల్సిన ప్రాధాన్యాన్ని ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. ‘‘అభివృద్ధి అవసరం, కానీ మానవత్వం లేకపోతే అది అసంపూర్ణంగా మిగిలిపోతుంది. మన ముందున్న సవాళ్లను అధిగమించడంలో మానవత్వ విలువలకు మనం ప్రాధాన్యమివ్వాలి’’ అని చెప్పారు.
సాధికారత దిశగా సోనోవాల్ కఛారీ సమాజం
నైపుణ్యం, పట్టుదల, అంకితభావం ద్వారా సోనోవాల్ కఛారీ సమాజం అభ్యున్నతి చెందాల్సిన అవసరం ఉందని సోనోవాల్ అన్నారు. ‘‘విజయానికి అడ్డదారులు లేవు. ప్రతి విజయం పోటీ, సవాళ్లను ఎదుర్కోవడం ద్వారానే వస్తుంది. చదువు, సంప్రదాయం, క్రీడల ద్వారా అసోంలోని వివిధ జాతులు ముందుకు వెళ్లాలి. మాటలతో కాకుండా చేతలతో సోనోవాల్ కఛారీ సమాజ అభ్యున్నతికి కృషి చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉంది’’ అని పేర్కొన్నారు.
మార్పులు తీసుకురావడంలో మహిళలు ముందుండాలని, కష్టపడే తత్వాన్ని, పట్టుదలను అలవరుచుకోవాలని శ్రీ సర్బానంద సోనోవాల్ సూచించారు. ‘‘రోజుకి దాదాపు 18 గంటలు అసమానమైన పట్టుదలతో పనిచేస్తూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ మనకు ఉదాహరణగా నిలుస్తున్నారు. దేశ క్షేమం కోసం ఆయన కనబరుస్తున్న అంకితభావాన్ని మనం అనుకరించాలి’’ అని అన్నారు.
గడచిన దశాబ్దంగా మహిళా సాధికారత కోసం ప్రభుత్వం చేపడుతున్న నిరంతర ప్రయత్నాల గురించి ఆయన వివరించారు. ‘‘భారత్‌లోని మిలియన్ల మంది మహిళలు స్వావలంబన సాధించి దేశ పురోగతికి, ఆర్థికాభివృద్ధికి గణనీయంగా దోహదం చేస్తున్నారు. 2047నాటికి స్వయం సమృద్ధి సాధించిన, అభివృద్ధి చెందిన భారత్ సాధించాలని లక్ష్యంగా మనం నిర్దేశించుకున్నాం. సోనోవాల్ కఛారీ సమాజానికి చెందిన మహిళలు ఈ లక్ష్యసాధనలో కీలకపాత్ర పోషించాలని పిలుపునిస్తున్నాను. సమర్థమైన, సాధికారత సాధించిన మహిళా శక్తి దేశాభివృద్ధిని, సంక్షేమాన్ని వేగవంతం చేస్తుంది’’ అని తెలిపారు.
ఈ కార్యక్రమానికి ఆల్ అసోం సోనోవాల్ కఛారీ విమెన్స్ అసోసియేషన్ (ఏఏఎస్కేడబ్ల్యూఏ) అధ్యక్షురాలు రష్మిరేఖ సోనోవాల్, మాజీ శాసనసభ్యురాలు జ్యోత్స్న సోనోవాల్, రిసెప్షన్ కమిటీ అధ్యక్షురాలు దీపురంజన్ మక్రారి, దిబ్రూఘర్ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ డా.శ్రుతిధార మహంత, ఆల్ అస్సాం సోనోవాల్ కఛారీ విద్యార్థి సంఘం అధ్యక్షురాలు దేవానంద చెలెంగ్, సోనోవాల్ కఛారీ అటానమస్ కౌన్సిల్ మాజీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ సభ్యురాలు దండీ సోనోవాల్, ఇతరులు, స్థానికులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
***
(Release ID: 2108103)
Visitor Counter : 30