సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
వేవ్స్ బజార్: మీడియా-వినోద రంగాల కోసం విశిష్ట వ్యాపార భాగస్వామ్య కూడలి
Posted On:
03 MAR 2025 4:56PM by PIB Hyderabad
మీడియా-వినోద పరిశ్రమ అసాధారణ డిజిటల్ రూపాంతరీకరణకు గురవుతుండగా, ‘వేవ్స్ (WAVES) బజార్’ ఈ పరిణామ క్రమంలో కీలకపాత్ర పోషిస్తోంది. ఇది ప్రపంచవ్యాప్త వినోదావరణ పర్యావరణ వ్యవస్థలో నిపుణులు, వాణిజ్యం, సృష్టికర్తల అనుసంధానం లక్ష్యంగా రూపొందిన విప్లవాత్మక ఆన్‌లైన్ విపణి. నిరంతర సహకారానికి ప్రోత్సాహం ‘వేవ్స్ బజార్’ ధ్యేయం. ఇది మీడియా-వినోద పరిశ్రమకు విశిష్ట వాణిజ్య కూడలిగా తోడ్పాటునిస్తుంది. నైపుణ్య పరిధి విస్తరణ, కొత్త అవకాశాల అన్వేషణ, ఉన్నత-విలువల భాగస్వామ్యాలలో పాలుపంచుకునేలా నిపుణులకు చేయూతనిస్తుంది.
వేవ్స్ బజార్కు శ్రీకారం
న్యూఢిల్లీలోని నేషనల్ మీడియా సెంటర్‌లో 2025 జనవరి 27న వేవ్స్ బజార్ ప్రారంభమైంది. కేంద్ర సమాచార-ప్రసార; రైల్వే, ఎలక్ట్రానిక్స్-సమాచార సాంకేతిక శాఖల మంత్రి శ్రీ అశ్వినీ వైష్ణవ్, సాంస్కృతిక-పర్యాటక శాఖ మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షెఖావత్ దీనికి సంయుక్తంగా శ్రీకారం చుట్టారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సమాచార-ప్రసార, సాంస్కృతిక శాఖల కార్యదర్శులు శ్రీ సంజయ్ జాజు, శ్రీ అరుణిష్ చావ్లా సహా ప్రముఖ చిత్రనిర్మాత శ్రీ శేఖర్ కపూర్, ప్రసార భారతి సీఈవో శ్రీ గౌరవ్ ద్వివేది పాల్గొన్నారు.
వేవ్స్ బజార్ అంటే...
‘వేవ్స్ బజార్’ అంటే- చలనచిత్ర, టెలివిజన్, యానిమేషన్, గేమింగ్, ఎక్స్‌టెండెడ్ రియాల్టీ (ఎక్స్‌ఆర్), ప్రకటనలు, సంగీతం, సౌండ్ డిజైన్, రేడియో వగైరాలుసహా మీడియా-వినోద రంగంలోని భాగస్వాములను ఏకీకృతం చేసే ఒక ప్రత్యేక ఆన్‌లైన్ విపణి. ఇది విక్రేతలు-కొనుగోలుదారుల మధ్య వారధిగా నిలిచే వేదిక. ఇది పరిశ్రమలోని నిపుణులకు నైపుణ్య ప్రదర్శన సౌలభ్యం కల్పించడమే కాకుండా భవిష్యత్ వినియోగదారులతో సంధానానికి, అర్థవంత సహకారానికి తోడ్పడుతుంది.
మీరు నిర్మాణ భాగస్వామి కోసం అన్వేషించే చిత్రనిర్మాతలా... సముచిత వేదిక కోసం ఎదురుచూసే ప్రకటనదారులా... పెట్టుబడిదారుల కోసం వేచిచూసే గేమ్ డెవలపర్లా... ప్రపంచ ప్రేక్షకులకు ప్రతిభానైపుణ్యాలు చాటాలని ఉవ్విళ్లూరే కళాకారులా... మీరెవరైనా సరే- ‘వేవ్స్ బజార్’ మీకు చేయూతనిస్తుంది. ఆ మేరకు పరిశ్రమ నిపుణులు ఒక నెట్‌వర్క్గా ఏర్పడి, పరస్పర సహకారంతో వ్యాపారాభివృద్ధి కోసం చైతన్యశీల వేదికను సమకూరుస్తుంది.
వేవ్స్ బజార్ విశిష్టతలు - ప్రయోజనాలు
· పరిశ్రమలో సమగ్ర సంధానం: చలనచిత్ర, టెలివిజన్, సంగీతం, గేమింగ్, యానిమేషన్, ప్రకటనలు, ఎక్స్‌ఆర్, ఎఆర్, విఆర్, వర్ధమాన సాంకేతిక రంగాలకు ఏకీకృత వేదిక.
· అంతర్జాతీయ సౌలభ్యం – సామీప్యం: సరిహద్దుల ఆవలదాకా మీ వ్యాపార విస్తరణకు వీలు. వినోద పరిశ్రమలోని అంతర్జాతీయ భాగస్వాములతో సంధాన సౌలభ్యం.
· నిరంతర నెట్‌వర్కింగ్ - సహకారం: సారూప్య నిపుణులు, సేవా ప్రదాతలు, కొనుగోలుదారులు, పెట్టుబడిదారులతో సంధానం, సంప్రదింపులు, సహకార సౌలభ్యం.
· క్రమబద్ధ క్రయ-విక్రయ లావాదేవీలు: సేవా ప్రదాతలు, భవిష్యత్ వినియోగదారుల మధ్య నిరంతర, పరస్పర కార్యకలాపాలకు వీలు కల్పించే వ్యవస్థీకృత, వినియోగ సౌలభ్యంగల వేదిక.
· విభిన్న జాబితాల కింద అవకాశాలు: చలనచిత్ర నిర్మాణ సేవలు, విఎఫ్‌ఎక్స్, ప్రకటనలు, సౌండ్ డిజైన్, సంగీతం కూర్పు, గేమింగ్, యానిమేషన్ వంటి అనేక విభాగాలలో విక్రేతలు తమ సేవల గురించి ప్రకటించవచ్చు.
· పరిశ్రమ సంబంధిత కార్యక్రమాలు – విక్రయ వేదికల సౌలభ్యం: ‘వేవ్స్’ వేదిక పరిధిలో నిర్దిష్ట పరిశ్రమ కార్యక్రమాలు, పెట్టుబడిదారులతో సమావేశాలు, ప్రత్యేక విక్రయ వేదికల సౌలభ్యం.
వేవ్స్ బజార్ సోపాన క్రమం
వేవ్స్ బజార్ బహుళ సోపాన క్రమంలో ఉంటుంది. మీడియా-వినోద పరిశ్రమలోని నిర్దిష్ట విభాగానికి తగినట్లు రూపొందించిన ఈ క్రమం కిందివిధంగా ఉంటుంది:
1. వేవ్స్ బజార్ - ప్రకటన సేవల కోసం ప్రపంచ ఆన్‌లైన్ విపణి
ప్రకటనల సంబంధిత సేవల-సదుపాయాల అన్వేషణలో ప్రకటనదారులు, మార్కెటర్లు, మీడియా కొనుగోలుదారులకు తోడ్పడే ప్రత్యేక వేదిక. ముద్రణ నుంచి డిజిటల్ దాకా; బహిరంగ (అవుటాఫ్ హోమ్-ఒఒహెచ్) ప్రకటనల వరకుగల బాండ్ల సోపానాన్ని సముచిత మీడియా భాగస్వాములతో సంధానిస్తూ వారి ప్రచార పరిధిని మరింత పెంచుతుంది.
2. ప్రత్యక్ష (లైవ్) కార్యక్రమాలకు విశిష్ట విపణి
ప్రత్యక్ష వినోద రంగంలోని కార్యక్రమ నిర్వాహకులు, విక్రేతలు, సేవా ప్రదాతలను ఒకచోటకు చేర్చే వేదిక. సంగీతోత్సవాలు, సమావేశాలు లేదా కార్పొరేట్ కార్యక్రమాలన్నీ సజావుగా సాగేలా సహకరించే భాగస్వాముల అన్వేషణలో ఈ సోపానం తోడ్పడుతుంది.
3. యానిమేషన్ – విఎఫ్‌ఎక్స్ సేవల కోసం ప్రపంచ విపణి
యానిమేషన్ స్టూడియోలు, విజువల్ ఎఫెక్ట్స్ కళాకారులు, నిర్మాణానంతర కార్యక్రమాల సంస్థ (పోస్ట్-ప్రొడక్షన్ హౌస్)లు తమ నైపుణ్యాన్ని ప్రదర్శించగల ఓ కూడలి. దీనిద్వారా తమ యానిమేషన్, విఎఫ్‌ఎక్స్ అవసరాలకు తగిన ప్రతిభను చిత్రనిర్మాతలు, గేమ్ డెవలపర్లు, బ్రాండ్‌లు అన్వేషించవచ్చు.
4. ఎక్స్ఆర్, విఆర్, ఎఆర్ సేవలకు ప్రపంచ విపణి
ఇది ఎక్స్‌టెండెడ్ రియాల్టీ నిపుణుల కోసం రూపొందించిన విభాగం. ఈ మేరకు వీక్షకులను తాదాత్మ్యంలో ముంచెత్తే సారాంశ సృష్టి కోసం అన్వేషించే వ్యాపార సంస్థలతో వర్చువల్ రియాలిటీ (విఆర్), ఆగ్మెంటెడ్ రియాలిటీ (ఎఆర్) మిక్స్‌డ్ రియాలిటీ (ఎంఆర్) రంగాల్లోని ఆవిష్కర్తలను సంధానిస్తుంది.
5. సినిమాల కోసం ప్రపంచ విపణి
ఇది చిత్రనిర్మాతలు, పంపిణీదారులు, పెట్టుబడిదారుల కోసం రూపొందిన ఏకగవాక్షం. సారాంశ సృష్టికర్తలు, ఫైనాన్షియర్ల మధ్య అంతరం తగ్గించడం ద్వారా చలనచిత్ర ప్రాజెక్టుల భాగస్వామ్యం, ప్రదర్శన, కొనుగోలు వగైరాలకు సహకారంతోపాటు అవకాశాల అన్వేషణకు తోడ్పడుతుంది.
6. గేమ్ డెవలపర్లకు సముచిత విపణి
గేమింగ్ డెవలపర్లు, స్టూడియోలు, ప్రచురణకర్తలకు ఇది చేయూతనిస్తుంది. ఈ మేరకు పెట్టుబడిదారులు, వాయిస్ ఆర్టిస్టులు, స్వరకర్తలు, మార్కెటింగ్ నిపుణులతో సంబంధాల సౌలభ్యం కల్పిస్తూ పరస్పర వినోదాన్ని మరింత ఉన్నతస్థాయికి చేర్చడంలో సాయపడుతుంది.
7. రేడియో - పాడ్‌కాస్ట్ కోసం ప్రపంచ విపణి:
రేడియో స్టేషన్లు, పాడ్‌కాస్టర్లు, ఆడియో కంటెంట్ సృష్టికర్తలు తమ సేవలను ప్రదర్శించడమే కాకుండా ప్రాయోజకుల అన్వేషణకు, నిరంతరం విస్తరించే డిజిటల్ ఆడియో రంగంలోని ప్రాజెక్టులపై వారికి సహకరించే విశిష్ట వేదిక.
8. కామిక్స్... ఇ-బుక్స్ కోసం ప్రపంచ విపణి:
రచయితలు, ఇలస్ట్రేటర్లు, ప్రచురణకర్తలు తమ కథలను ప్రపంచ ప్రేక్షకులకు చేరువ చేయడంలో పంపిణీదారులు, సారాంశ సృష్టి వేదికలతో సంధానితులు కావచ్చు. డిజిటల్, భౌతిక రూపాల్లో సృజనాత్మక పరిశ్రమ వృద్ధికి ఇది ఎంతగానో దోహదం చేస్తుంది.
9. వెబ్ సిరీస్‌లకు ప్రపంచ విపణి:
ప్రపంచవ్యాప్త వీక్షకులను ఆకట్టుకునే సరికొత్త ప్రతిభాన్వేషణ, ప్రాజెక్టుల ఇతివృత్తాలు, ఎపిసోడ్‌ల సృష్టి వగైరాలకు సహకారంలో ఓటీటీ వేదికలు, స్వతంత్ర సృష్టికర్తలు, డిజిటల్ స్టూడియోలకు ఈ వేదిక తోడ్పడుతుంది.
10. సంగీతం - ధ్వని ముద్రణకు ప్రపంచ విపణి:
స్వరకర్తలు, సౌండ్ డిజైనర్లు, నిర్మాణ సంస్థల కోసం ఏర్పాటైన విశిష్ట వ్యవస్థ ఇది. వాస్తవ సంగీత కూర్పు, ఆడియో సౌలభ్యాల కోసం అన్వేషించే చిత్రనిర్మాతలు, ప్రకటనదారులు, గేమింగ్ కంపెనీలను ఈ వేదిక సంధానిస్తుంది.
వేవ్స్ బజార్‌లో ఎవరు భాగస్వాములు కావచ్చు?
మీడియా, వినోదం, సృజనాత్మక రంగాల నిపుణులందరికీ వేవ్స్ బజార్ ఆహ్వానం పలుకుతోంది. ఏదో ఒకటని కాకుండా కింది వర్గాలకూ ఇందులో స్థానం ఉంటుంది:
విక్రేతలు:
· చలనచిత్ర నిర్మాతలు, స్టూడియోలు- మీ చలనచిత్ర ప్రాజెక్టుల జాబితాను ప్రదర్శించవచ్చు. పంపిణీదారులు, పెట్టుబడిదారులు, విక్రయ ఏజెంట్లతో సంధానం కావచ్చు.
· యానిమేషన్ – విఎఫ్‌ఎక్స్ స్టూడియోలు – చిత్రనిర్మాతలు, గేమింగ్ డెవలపర్ల నైపుణ్య ప్రదర్శనకు తోడ్పాటు.
· గేమింగ్ - ఎక్స్‌ఆర్ డెవలపర్లు- మీ గేమ్ ప్రాజెక్టుల కోసం పెట్టుబడిదారులు, భాగస్వాములు, భవిష్యత్ వినియోగదారులను అన్వేషించవచ్చు.
· సంగీతం - ధ్వని ముద్ర నిపుణులు- మీ కూర్పు, స్కోరింగ్, సౌండ్ డిజైన్ సేవల గురించి ప్రచారం చేసుకోవచ్చు.
· ప్రకటనలు - మార్కెటింగ్ ఏజెన్సీలు- మీడియాలో ప్రచారం కోసం అన్వేషించే బ్రాండ్లు, వ్యాపారాలతో సంధానం కావచ్చు.
· రేడియో - పాడ్‌కాస్ట్ సృష్టికర్తలు- మీకు ప్రాచుర్యం, ఆర్జనకు అవకాశాల లభ్యత.
· రచయితలు - ఇ-బుక్ ప్రచురణకర్తలు- నిర్మాణ సంస్థలు, వేదికలు, సారాంశ కొనుగోలుదారులతో సంధానితులు కావచ్చు.
కొనుగోలుదారులు:
· కంటెంట్ కొనుగోలు చేసే చలనచిత్ర నిర్మాణ సంస్థలు, ఓటీటీ వేదికలు
· ప్రకటన భాగస్వాముల కోసం అన్వేషించే మీడియా ఏజెన్సీలు, బ్రాండ్లు
· యానిమేషన్, సౌండ్ సేవల కోసం చూసే గేమ్ డెవలపర్లు
· ప్రచార కార్యక్రమాల్లో సహకారం కోసం అన్వేషించే ఈవెంట్ నిర్వాహకులు
· సృజనాత్మక సారాంశం కోసం అన్వేషించే ప్రభుత్వ రంగ సంస్థలు
వేవ్స్ బజార్ ఎలా పనిచేస్తుంది?
వేవ్స్ బజార్ వెబ్‌సైట్- వేవ్స్ బజార్ వెబ్‌సైట్ (wavesbazaar.com)ను సందర్శించి మీ అవసరాలకు తగినట్లు అన్వేషించండి.
సైన్ అప్ - ప్రొఫైల్ సృష్టి- వేదికలో పూర్తిస్థాయి అవకాశాల సౌలభ్యం కోసం కొనుగోలుదారు, విక్రేత లేదా పెట్టుబడిదారుగా నమోదు చేసుకోండి.
మీ సేవలు లేదా ప్రాజెక్ట్ అవసరాల జాబితా- మీ ప్రతిభను ప్రదర్శించండి లేదా మీ వ్యాపారాసక్తులకు అనుగుణంగా అందుబాటులోగల జాబితాలను అన్వేషించండి.
సంధానం కండి - సహకరించండి- పరిశ్రమ నిపుణులతో నెట్‌వర్క్ ఏర్పరచుకోండి. సమావేశాలు ఏర్పాటు చేసుకుని, విజయవంతమైన భాగస్వామ్యాలు ఏర్పరచుకోండి.
మీ వ్యాపారాన్ని పెంచుకోండి- మీ మార్కెట్‌ను విస్తరించుకోండి... కొత్త ఆదాయ మార్గాలను అన్వేషించడంతోపాటు దీర్ఘకాలిక భాగస్వామ్యాలను ఏర్పరచుకోండి.
వేవ్స్ బజార్ పరిశ్రమను ఎలా మలుపు తిప్పుతుంది:
వేగంగా వృద్ధి చెందుతున్న డిజిటల్ రంగంలో వినోద నిపుణుల సంధానం, వ్యాపార విధానాల్లో వేవ్స్ బజాన్ విప్లవాత్మక మార్పులు తెస్తుంది. భౌగోళిక అవరోధాల తొలగింపు ద్వారా నిర్మాణాత్మక, విభాగ-నిర్దిష్ట విపణి సౌలభ్యం కల్పిస్తుంది. పరిశ్రమలోని సంస్థలు సముచిత భాగస్వాములను వేగంగా అన్వేషించేందుకు, మెరుగైన ఒప్పందాలపై చర్చతోపాటు వ్యాపార సామర్థ్య విస్తరణకు వేదికను సమకూరుస్తుంది.
· వేవ్స్ బజార్‌లో ఇవాళే చేరండి... ప్రపంచ వినోద పరిశ్రమలో అపార అవకాశాల అందుకోండి!
· వేవ్స్ బజార్ డాట్‌కామ్ (wavesbazaar.com)లో తక్షణం నమోదు చేసుకోండి
· నవీకరణలు, పరిశ్రమపై సాలోచన దృక్పథం కోసం సామాజిక మాధ్యమాల్లో మమ్మల్ని అనుసరించండి.
వేవ్స్-2025 గురించి...
కేంద్ర ప్రభుత్వం 2025 మే 1 నుంచి మహారాష్ట్రలోని ముంబయిలో మీడియా - వినోద రంగంలో కీలక ఘట్టమైన తొలి ‘వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ సమ్మిట్’ (వేవ్స్)ను నిర్వహిస్తుంది.
మీరు పరిశ్రమ నిపుణుడు, పెట్టుబడిదారుడు, సృష్టికర్త లేదా ఆవిష్కర్త అయితే, ఈ వేదికతో సంధానానికి, సహకారానికి, ఆవిష్కరణలకు, తోడ్పాటునివ్వడానికి ఇదొక విశిష్ట అంతర్జాతీయ వేదిక అవుతుంది.
మన దేశ సృజనాత్మక శక్తిసామర్థ్యాలు ఇనుమడించడంతోపాటు కంటెంట్ సృష్టికి, మేధా సంపత్తి-సాంకేతిక ఆవిష్కరణలకు కూడలిగా భారత్ అగ్రస్థానం వేవ్స్ సమ్మిట్ సిద్ధమైంది. బ్రాడ్‌కాస్టింగ్, ప్రింట్ మీడియా, టెలివిజన్, రేడియో, ఫిల్మ్స్, యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్స్, సౌండ్ అండ్ మ్యూజిక్, అడ్వర్టైజింగ్, డిజిటల్ మీడియా, సోషల్ మీడియా వేదికలు సహా జనరేటివ్ ఎఐ, ఆగ్మెంటెడ్ రియాలిటీ, వర్చువల్ రియాలిటీ, ఎక్స్‌టెండెడ్ రియాలిటీ తదితర పరిశ్రమలు, రంగాలపై ఇది దృష్టి సారిస్తుంది.
ఇంకా ఏవైనా సందేహాలున్నాయా? ఇక్కడ నివృత్తి చేసుకోండి.
రండి... కలిసి ప్రయాణిద్దాం! (త్వరలో ప్రారంభయ్యే) ‘వేవ్స్’కు నమోదు చేసుకోండి!
****
(Release ID: 2107952)
|