నౌకారవాణా మంత్రిత్వ శాఖ
జాతీయ జలమార్గాల (జెట్టీలు/టెర్మినళ్ల నిర్మాణం) నిబంధనలు, 2025: ఐడబ్ల్యూటీ రంగంలో ప్రైవేటు రంగానికి కొత్త అవకాశాలు
Posted On:
28 FEB 2025 12:27PM by PIB Hyderabad
మౌలికసదుపాయాలను అభివృద్ధి చేయడం, సులభతర వ్యాపార విధానాలను మెరుగుపరచడంలో భాగంగా దేశంలోని జాతీయ జలమార్గాలపై... ప్రైవేటు, ప్రభుత్వం, సంయుక్త భాగస్వామ్యాలతో సహా వివిధ సంస్థలు జెట్టీలు, టెర్మినళ్లు ఏర్పాటు చేయడానికి నిబంధనలు రూపొందించారు.
జాతీయ జల మార్గాలు (జెట్టీలు/టెర్మినళ్ల ఏర్పాటు) నియంత్రణలు-2025ను నౌకాశ్రయాలు, జలరవాణా, జలమార్గాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఇన్‌ల్యాండ్ వాటర్వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐడబ్ల్యూఏఐ) రూపొందించింది. టెర్మినళ్లను ఏర్పాటు చేయడంలో ప్రైవేటు రంగం నుంచి పెట్టుబడులను ఆకర్షించడానికి, ప్రక్రియలను క్రమబద్దీకరించడానికి, భారత్‌లో విస్తృతంగా ఉన్న జల రవాణా వ్యవస్థను సమర్థంగా వినియోగించుకోవడానికి ఈ నిబంధనలను రూపొందించారు.
జెట్టీలు, టెర్మినళ్లు అభివృద్ధి, నిర్వహణలో ప్రైవేటు రంగంతో సహా ఇతర సంస్థలకు పెట్టుబడులు, వాణిజ్యం, ఆర్థికాభివృద్ధిలో కొత్త అవకాశాలను ఈ నిబంధనలు కల్పిస్తాయి. అలాగే రవాణా సామర్థ్యాలను సైతం మెరుగుపరుస్తాయి. ఈ చొరవ రవాణా ఖర్చులను తగ్గించి, కార్గో సేవలను విస్తరిస్తుంది. అలాగే దేశంలో జలమార్గాల రంగంలో వృద్ధికి సహకారం అందిస్తూ జాతీయ ఆర్థిక వ్యవస్థలో కీలకంగా వ్యవహరిస్తుంది.
నిబంధనల్లో ప్రధానాంశాలు
కొత్త నిబంధనల ప్రకారం, జాతీయ జలరవాణాలో అంతర్గత జల మార్గాల టెర్మినల్‌ను అభివృద్ధి చేయాలనుకునే లేదా నిర్వహించాలనుకునే సంస్థలు (ప్రైవేటు రంగంతో సహా) ఏవైనా సరే ఐఏడబ్ల్యూఏఐ నుంచి నిరభ్యంతర పత్రం (ఎన్వోసీ) పొందాలి. ఇప్పటికే ఉన్న, నూతనంగా నిర్మిస్తున్న టెర్మినళ్లు అవి శాశ్వతమైనవైనా లేదా తాత్కాలికమైనవైనా సరే ఈ నిబంధనల కిందకే వస్తాయి. శాశ్వత టెర్మినళ్లను నిర్వాహకులు జీవితకాలం నిర్వహించుకోవచ్చు. తాత్కాలిక టెర్మినళ్లను ఆరంభంలో ఐదేళ్ల పాటు నిర్వహించే అవకాశం ఉంటుంది. తర్వాత అవకాశాన్ని బట్టి పొడిగిస్తారు. టెర్మినల్‌ను అభివృద్ది చేసేవారు లేదా నిర్వహించేవారు సాంకేతిక నమూనాలు, నిర్మాణం విషయంలో బాధ్యులుగా ఉంటారు. అలాగే ఇది వ్యాపార ప్రణాళికకు అనుగుణంగా, సులభంగా చేరుకొనేందుకు వీలుగా ఉండాలి.
టెర్మినల్ దరఖాస్తుల కోసం డిజిటల్ పోర్టల్
టెర్మినల్ అభివృద్ధి చేసేవారు, నిర్వాహకుల నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను క్రమబద్ధీకరించేందుకు ఆన్లైన్ అప్లికేషన్ పోర్టల్‌ను ఐడబ్ల్యూఏఐ అభివృద్ధి చేస్తోంది. ఈ డిజిటల్ వేదిక ప్రభుత్వం అనుసరిస్తున్న సులభతర వ్యాపార విధానాల (ఈఓడీబీ) లక్ష్యానికి అనుగుణంగా సామర్థ్యాన్ని, పారదర్శకతను, అవకాశాలను మెరుగుపరుస్తుంది. ఈ పోర్టల్ ద్వారా దరఖాస్తుదారులు వినతులు సమర్పించవచ్చు వాటి పురోగతులను తెలుసుకోవచ్చు.
ప్రైవేటు భాగస్వామ్యానికి ప్రోత్సాహం, మౌలిక సదుపాయాల అభివృద్ధి
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో, కేంద్ర నౌకాశ్రయాలు, జలరవాణా, జల మార్గాల మంత్రి శ్రీ శర్బానంద సోనోవాల్ మార్గదర్శకత్వంలో ఆర్థికాభివృద్ధిలో జలమార్గాలను కీలకంగా మార్చడంలో ఐడబ్ల్యూఏఐ ముఖ్యమైన పాత్రను పోషించింది. గడచిన దశాబ్దంలో జాతీయ జలమార్గాల్లో సరకురవాణా వేగంగా పెరిగింది. 18 మిలియన్ టన్నుల నుంచి 2023-24 ఆర్థిక సంవత్సరానికి 133 మిలియన్ టన్నులకు చేరుకుంది. సుస్థిరాభివృద్ధిని ప్రోత్సహించాలనే ప్రధానమంత్రి లక్ష్యానికి అనుగుణంగా ప్రైవేటు రంగ భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం, డిజిటలైజేషన్, ప్రక్రియలను క్రమద్ధీకరించడం ద్వారా సులభతర వ్యాపారాన్ని పెంపొందించడమే ఈ కార్యక్రమం లక్ష్యం.
నూతనంగా ప్రారంభించిన జలవాహక్ పథకం, జాతీయ జలమార్గాల్లో ప్రస్తుతం జరుగుతున్న సరుకు రవాణాను 4700 మిలియన్ టన్ను కిలోమీటర్ల నుంచి 17 శాతం పెరుగుదలను ప్రోత్సహించడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఇది ప్రైవేటు రంగ భాగస్వామ్యాన్ని మరింత పెంచుతుందని అంచనా వేస్తున్నారు.
జాతీయ జలమార్గాలు (జెట్టీలు/టెర్మినళ్ల నిర్మాణం) నిబంధనలు, 2025 అమల్లోకి రావడంతో అంతర్గత జలరవాణా టెర్మినళ్ల అభివృద్ధి విస్తరణలో ప్రైవేటు సంస్థలు పెద్ద పాత్రను పోషిస్తూ, ఈ రంగం సంపూర్ణాభివృద్ధికి దోహదం చేస్తాయని అంచనా వేస్తున్నారు.
***
(Release ID: 2107092)
Visitor Counter : 18