రక్షణ మంత్రిత్వ శాఖ
‘‘భారత్‌లో ఏర్పాటు చేస్తున్న అంతర్జాతీయ స్థాయి మౌలిక సదుపాయాలను వినియోగించుకొని అత్యాధునిక సాంకేతికతల్లో రాణించాలి’’: హైదరాబాద్‌లో జరిగిన జాతీయ సైన్స్ దినోత్సవంలో యువతకు పిలుపునిచ్చిన రక్షణ మంత్రి
‘‘క్లిష్టమైన సాంకేతిక సమస్యలకు పరిష్కారాలు ఉంటే ప్రతికూల పరిస్థితుల్లో సైతం దేశం దృఢంగా, సురక్షితంగా ఉంటుంది’’
2047 నాటికి వికసిత్ భారత్‌ను సాధించే దిశగా భారతీయ యువత సామర్థ్యాన్ని ఉపయోగించుకొనేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది: శ్రీ రాజ్‌నాథ్ సింగ్
Posted On:
28 FEB 2025 2:43PM by PIB Hyderabad
శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించుకొని నూతనంగా ఆవిర్భవిస్తున్న సాంకేతికత (ఫ్రాంటియర్ టెక్నాలజీ)ల్లో రాణించాలని రక్షణ మంత్రి శ్రీ రాజ్ నాథ్ సింగ్ యువతకు పిలుపునిచ్చారు. ఈ అంశంలో అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న మౌలిక సదుపాయాలను ఉపయోగించుకోవాలని సూచించారు. జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా తెలంగాణలోని హైదరాబాద్‌లో రెండు రోజుల పాటు నిర్వహించే సైన్స్, టెక్నాలజీ మహోత్సవం విజ్ఞాన్ వైభవ్‌ను ఈ రోజు ఆయన ప్రారంభించారు.
‘‘హార్డ్‌వేర్ నుంచి సాఫ్ట్‌వేర్ ఆధారితంగా- యుద్ధం మారిపోతున్నది. కృత్రిమ మేథ, క్వాంటమ్ కంప్యూటింగ్, మెషీన్ లెర్నింగ్, క్లీన్ - టెక్ తదితర నూతన సాంకేతికతలు అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో వాటిని అందుకోవడంలో మనం ముందు ఉండాలి. క్లిష్టమైన సాంకేతిక సవాళ్లకు పరిష్కారాలు ఉన్నట్లయితే.. విపత్కర పరిస్థితుల్లో సైతం భారత్ దృఢంగా, భద్రంగా ఉంటుంది. మన యువత శాస్త్రీయ దృక్పథాన్నీ, విమర్శనాత్మక ఆలోచనా ధోరణినీ అవలంబిస్తూ.. సాధారణ స్థాయిని అధిగమించి ముందుకు వెళ్లాలి’’ అని శ్రీ రాజనాథ్ సింగ్ అభిలషించారు. ‘‘మానవాళికి సైన్స్ అనేది ఓ అందమైన బహుమతి. దాన్ని దుర్వినియోగం చేయకుండా, సమాజాభివృద్ధికి ఉపయోగించాలి’’ అని మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం చెప్పిన మాటలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం దేశ భద్రత, రక్షణ కోసం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొనేందుకు కట్టుబడి ఉందని రక్షణ మంత్రి స్పష్టం చేశారు. దేశ భవిష్యత్తుకు ఈ రంగంలో విద్య చాలా అవసరమని అన్నారు. భారతీయ యువతకు అపారమైన సామర్థ్యం ఉందని, దానిని వికసిత్ భారత్ 2047 లక్ష్య సాధన కోసం ఉపయోగించుకొనేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని తెలిపారు.
దేశంలో శాస్త్రీయ విద్య రూపురేఖలను మారుస్తూ, సృజనాత్మకత, విమర్శనాత్మక ఆలోచనా ధోరణి, ఆవిష్కరణలను ప్రోత్సహించడమే లక్ష్యంగా రూపొందిన జాతీయ విద్యా విధానం 2020 గురించి శ్రీ రాజనాథ్ సింగ్ చర్చించారు. దీనిని ఈ ఏడాది జాతీయ సైన్స్ దినోత్సవం ఇతివృత్తమైన ‘వికసిత్ భారత్ కోసం సైన్స్, ఆవిష్కరణల్లో అంతర్జాతీయ స్థాయిలో నాయకత్వం వహించేలా భారతీయ యువతకు సాధికారత కల్పించడం’ కూడా ప్రతిఫలిస్తోందని తెలియజేశారు. సైన్సులో ఆవిష్కరణలు, అంతర్జాతీయ నాయకత్వం దిశగా పురోగతి సాధించాలన్న భారత్ ఆకాంక్షకు ఈ ఇతివృత్తం ప్రతిబింబమని ఆయన వివరించారు.
తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ సుదీర్ఘ కాలంగా సైన్సు, సాంకేతిక ఆవిష్కరణలకు హైదరాబాద్ కేంద్రంగా ఉందని తెలిపారు. విజ్ఞాన్ వైభవ్ 2025 కార్యక్రమంలో పాల్గొని పెద్ద లక్ష్యాలను నిర్దేశించుకోవాలని, ఆవిష్కరణలపైదృష్టిపెట్టాలని యువతను ఆయన కోరారు.
ఈ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన ప్రదర్శనను 30,000 మందికి పైగా విద్యార్థులు సందర్శించారు. దీనిలో ఏర్పాటు చేసిన 200కు పైగా స్టాళ్ల ద్వారా డీఆర్డీవో, ప్రముఖ భారతీయ సంస్థలు అభివృద్ధి చేసిన అత్యాధునిక రక్షణ, ఏరోస్పేస్ సాంకేతికతల గురించి తెలుసుకునే అవకాశం విద్యార్థులకు లభిస్తుంది. అంతర్జాతీయంగా సాంకేతిక రంగంలో భారత్‌ను అగ్రస్థానంలో నిలిపే దిశగా యువతలో ఆసక్తిని పెంపొందించడం, ఆవిష్కరణలకు స్ఫూర్తినివ్వడం, స్టెమ్ రంగాల్లో కెరీర్ కొనసాగించేలా వారిని ప్రోత్సహించడానికి, తర్వాతి తరం శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు, టెక్నో-ప్రెన్యూయర్లను ప్రోత్సహించడమే ఈ ఎగ్జిబిషన్ లక్ష్యం.
రక్షణ విభాగ కార్యదర్శి, డీఆర్డీవో ఆర్ అండ్ డీ ఛైర్మన్ డాక్టర్ సమీర్ వి కామత్, ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు డాక్టర్ జి సతీష్ రెడ్డి, డీఆర్డీవోకు చెందిన డైరెక్టర్ జనరళ్లు, డైరెక్టర్లు, ప్రభుత్వ రంగ సంస్థల సీఎండీలు, పరిశ్రమల అధినేతలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
ప్రఖ్యాత శాస్త్రవేత్త సర్ సీవీ రామన్ సైన్సు రంగంలో చేసిన సేవలకు గుర్తింపుగా జాతీయ సైన్స్ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. ఈ సందర్భంగా డీఆర్డీవో, ఏఈఎస్ఐ, కలామ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ యూత్ ఎక్సలెన్స్ సంయుక్తంగా విజ్ఞాన్ వైభవ్ కార్యక్రమాన్ని నిర్వహించాయి. విధాన రూపకర్తలు, శాస్త్రవేత్తలు, పారిశ్రామిక దిగ్గజాలు, విద్యావేత్తలు, యువ ఆవిష్కర్తలను ఒక్క చోట చేర్చి దేశ భవిష్యత్తును రూపొందించడంలో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించి, వాటిని ప్రదర్శించే వేదికను ఏర్పాటు చేసింది. స్వయం సమృద్ధిని, వికసిత్ భారత్ 2047 లక్ష్యాన్ని సాధించే దిశగా, శాస్త్రీయ నైపుణ్యం, ఆవిష్కరణలు, సహకారంతో మార్గాన్ని సుగమం చేస్తుంది.
***
(Release ID: 2106942)
Visitor Counter : 23