పౌర విమానయాన మంత్రిత్వ శాఖ
పౌర విమానయాన శాఖ మంత్రి శ్రీ రామ్మోహన్ నాయుడు చేతుల మీదుగా చెన్నై విమానాశ్రయంలో ఉడాన్ యాత్రి కెఫే ప్రారంభం
• కోల్‌కతా తరువాత తక్కువ ఖర్చులో ఉడాన్ కెఫే సదుపాయాన్ని కలిగి ఉన్న రెండో విమానాశ్రయం ఇదే
Posted On:
27 FEB 2025 2:04PM by PIB Hyderabad
చెన్నై విమానాశ్రయంలో ఉడాన్ యాత్రి కెఫేను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి శ్రీ రామ్మోహన్ నాయుడు ఈ రోజు ప్రారంభించారు దేశంలో మొదటి ఉడాన్ యాత్రి కెఫేను కోల్‌కతాలోని నేతాజీ సుభాస్ చంద్ర బోస్ అంతర్జాతీయ విమానాశ్రయం 100వ వార్షికోత్సవ సందర్భంలో- కిందటి ఏడాది డిసెంబరు 19న- ప్రారంభించారు. అది మొదలు కోల్‌కతా విమానాశ్రయంలోని ఈ కెఫేకు ప్రయాణికుల్లో మంచి ఆదరణ లభించింది. ఆ కెఫేలో అందిస్తున్న ఆహార, పానీయాల నాణ్యత, చౌకగా వాటిని అందించడంతో వారు చాలా సంతోషంగా ఉంటున్నారు. ప్రయాణికులు కోరిన మేరకు ఈ కార్యక్రమాన్ని ఇప్పుడిక దేశమంతటా విస్తరిస్తున్నారు.
చెన్నై విమానాశ్రయంలో, దేశీయ టర్మినల్-1లో చెక్-ఇన్ కన్నా ముందు ప్రాంతంలో తెరిచిన ఉడాన్ యాత్రి కెఫే ప్రయాణికులకు ఈ కింది ధరలకు స్వచ్ఛమైన ఆహార పానీయాలను అందించనుంది:
వరుస సంఖ్య
|
వస్తువు
|
ధర (రూపాయల్లో)
|
1.
|
నీళ్ల సీసా
|
10
|
2.
|
చాయ్
|
10
|
3.
|
కాఫీ
|
20
|
4.
|
సమోసా
|
20
|
5.
|
ఆ రోజు అందుబాటులో ఉండే మిఠాయి
|
20
|
శ్రీ రామ్మోహన్ నాయుడు ప్రసార మాధ్యమాల ప్రతినిధులను ఉద్దేశించి మాట్లాడుతూ, ‘‘విమాన ప్రయాణాన్ని అందరికీ మరింత అధిక సౌకర్యవంతంగాను, సులభమైందిగాను, తక్కువ ఖర్చుతో కూడుకొన్నదిగాను తీర్చిదిద్దాలనే ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ దృష్టికోణానికి సరిపోలే ఒక ఉదాహరణగా ఉడాన్ యాత్రి కెఫే ను రూపొందించారు. కోల్‌కతా విమానాశ్రయంలో ఇలాంటి చిన్న రెస్టారెంటును తెరిచిన తరువాత ప్రయాణికులు ఇతర విమానాశ్రయాల్లో కూడా అదే తరహా సౌకర్యాన్ని మొదలుపెట్టాలని కోరారు. దేశ తూర్పు ప్రవేశద్వారం కోల్‌కతాకు తరువాయిగా, దేశ దక్షిణ ప్రవేశద్వారమైన చెన్నై విమానాశ్రయంలో ఉడాన్ యాత్రి కెఫేను ఏర్పాటు చేసినందుకు సంతోషంగా ఉంది. చెన్నై విమానాశ్రయం దేశంలో అన్నిటికన్నా పాతదే కాక, ప్రస్తుతం దేశంలో అయిదో అతి పెద్ద విమానాశ్రయంగా ఉంది. ఇక్కడి నుంచి ఏడాదిలో 2 కోట్ల 20 లక్షల మంది కన్నా పైచిలుకు ప్రయాణికులు రాకపోకలు సాగిస్తూ ఉన్నారు. ఇక్కడ ప్రయాణికుల సౌకర్యాలను పెంచాలనే నిబద్ధత మాకుంది. డిజి యాత్ర, విశ్వసనీయ ప్రయాణికుల కార్యక్రమం ఈ-గేట్స్ వంటి వాటి దన్నుతో సహజమైన, ఎండ్-టు-ఎండ్ డిజిటల్ ప్రయాణానుభూతిని అందిస్తున్నాం’’ అన్నారు.
అంతర్జాతీయ కార్యకలాపాలను పెంచడం కోసం రెండో టర్మినల్‌ను 86,135 చదరపు మీటర్ల మేర విస్తరించే పనులు జరుగుతూ ఉన్నాయని మంత్రి వెల్లడించారు. దీనికి అదనంగా, రూ.75 కోట్ల కన్నా ఎక్కువ పెట్టుబడితో ఒకటో టర్మినల్, నాలుగో టర్మినల్‌లలో నవీకరణ పనులు సాగుతున్నాయి. విమానాశ్రయం నుంచి నగరం వైపు రద్దీని తగ్గించే దృష్టితో రూ.19 కోట్ల వ్యయంతో వాహనాల రాకపోకలు సాఫీగా సాగిపోయే ప్రణాళికను కూడా అమలుచేస్తున్నారు.
మౌలిక సదుపాయాలకు మించి, ప్రయాణికులకు సౌకర్యాలు కల్పించడానికి చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం అంకితభావంతో పనిచేస్తోంది. దీనిలో భాగంగా వయోవృద్ధులకు, గర్భవతులకు ఉచిత బగ్గీ సేవలు, బాలలకు సంరక్షణ వసతి, చికిత్స సదుపాయాలు, ఆధునిక విశ్రాంతి మందిరాలు.. ఇవన్నీ హాయైన యాత్రానుభూతిని అందించడానికి ఉద్దేశించినవే. ప్రసార మాధ్యమాల ప్రతినిధులతో మంత్రి మాట్లాడుతూ, చెన్నై విమానాశ్రయం పూర్తిగా హరిత ఇంధనంతో నడుస్తోందని, పర్యావరణ నిబద్ధతలో భాగంగా 1.5 మెగావాట్ సామర్థ్యం కలిగిన విద్యుత్తు ప్లాంటు కూడా ఇక్కడ ఉందని వివరించారు.
ఈ రోజు ప్రారంభించిన ఉడాన్ యాత్రి కెఫే, ‘ఉడాన్’ (ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్) పథకం స్ఫూర్తికి అనుగుణంగా ఉంది. విమానాలలో ప్రయాణించే అవకాశాన్ని చాలా మందికి కల్పించడంతోపాటు విమానాశ్రయ సంబంధిత మౌలిక సదుపాయాలను ఆధునికీకరించడం కూడా ఈ పథకం ఉద్దేశం. ఈ కార్యక్రమంలో తమిళ నాడు పరిశ్రమల శాఖ మంత్రి డాక్టర్ టి.ఆర్.బి. రాజా, పౌర విమానయాన శాఖ, ఏఏఐ, చెన్నై విమానాశ్రయంల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ప్రయాణికులకు మెరుగైన అనుభూతులను అందించడంతోపాటు సంధానాన్ని పెంచాలని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ చేస్తున్న ప్రయాణంలో మరో ముఖ్య ఘట్టంగా నిలుస్తుంది.
***
(Release ID: 2106894)
Visitor Counter : 28