ప్రధాన మంత్రి కార్యాలయం
మహా కుంభమేళా ముగిసింది ఏకతా మహాయజ్ఞ సమాప్తికి సూచిక
ప్రయాగరాజ్ లో 45 రోజుల పాటు సాగిన ఏకతా మహాజన సమూహం...140 కోట్ల మంది పౌరుల విశ్వాసం ఈ పండుగలో ఒక దగ్గర కలవడం అమితానందాన్నిస్తోంది: ప్రధాని
ప్రస్తుతం, భారత్, తన వారసత్వాన్ని చూసుకొని మురిసిపోతున్నది... కొత్త శక్తితో ముందుకు దూసుకుపోతోంది...
ఈ పరివర్తన యుగం.... దేశ భవితను లిఖించనున్నది: ప్రధాని
పెద్ద సంఖ్యలో భక్తులు రావడం కేవలం రికార్డు మాత్రమే కాదు…
అనేక శతాబ్దాలపాటు మన సంస్కృతీ వారసత్వాల పరిరక్షణకు పునాది: ప్రధాని
సమాజంలోని ప్రతి వర్గం, ప్రతి ప్రాంతానికీ చెందిన ప్రజలు మహాకుంభమేళాలో ఒక్కటయ్యారు: ప్రధాని
Posted On:
27 FEB 2025 11:12AM by PIB Hyderabad
మహాకుంభమేళాను ఒక ‘‘ఏకతా మహాయజ్ఞం’’గా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభివర్ణించారు. భారతదేశం తన వారసత్వాన్ని చూసుకొని గర్వపడుతోందని, ఒక కొత్త శక్తితో ముందడుగు వేస్తోందని ఆయన ఈ రోజు వ్యాఖ్యానించారు. ఇది ఒక పరివర్తన యుగానికి ప్రభాత వేళ అనీ, ఈ పర్వం దేశ నూతన భవిష్యత్తును లిఖించనుందని ఆయన అన్నారు. భారీసంఖ్యలో తరలివచ్చి మహాకుంభ్‌లో పాలుపంచుకొన్న భక్తజన సందోహం ఒక రికార్డును సృష్టించడం ఒక్కటే కాకుండా మన సంస్కృతిని, మన వారసత్వాన్ని సుదృఢంగాను, సమృద్ధమైందిగాను నిలబెట్టడానికి ఒక చాలా బలమైన పునాదిని కూడా వేసిందని ఆయన అన్నారు. ఐకమత్యానికి అద్దంపట్టిన మహాకుంభ్ విజయవంతంగా సమాప్తం అయినందుకు శ్రీ మోదీ సంతోషాన్ని వ్యక్తం చేశారు. పౌరులు వారి కఠోర శ్రమను, ప్రయత్నాలను, పట్టుదలను చాటిచెప్పినందుకు వారికి ధన్యవాదాలు తెలిపారు. శ్రీ మోదీ తన అంతరంగంలో రేకెత్తిన ఆలోచనలకు ఒక బ్లాగ్‌లో అక్షరరూపాన్నివ్వడంతోపాటు వాటిని ఎక్స్‌లో ఈ కిందివిధంగా పంచుకొన్నారు.
‘‘మహాకుంభ్ పూర్తి అయింది.. ఏకతకు సంబంధించిన ఓ మహాయజ్ఞం ముగిసింది.
ప్రయాగ్‌రాజ్‌లో నిర్వహించిన ఈ ఏకతా మహాకుంభమేళాలో 45 రోజుల పొడవునా 140 కోట్ల మంది దేశప్రజానీకం అవిశ్రాంతంగా సాగించిన ధర్మాచరణ, ఏక కాలంలో ఈ ఏకైక పర్వంతో పెనవేసుకొన్న తీరు.. మనసును ఉప్పొంగిపోయేట్లు చేస్తోంది. మహాకుంభ మేళా సంపూర్ణమైన ఘడియల్లో నా మదిలో రేకెత్తిన ఆలోచనలకు ఇదుగో ఇలా అక్షరరూపాన్నిచ్చే ప్రయత్నం చేస్తున్నాను..’’
‘‘మహాకుంభ మేళాలో భారీ సంఖ్యలో భక్తగణం పాలుపంచుకోవడం ద్వారా ఒక రికార్డును నెలకొల్పడం మాత్రమే కాకుండా మన సంస్కృతినీ, మన వారసత్వాన్నీ సుదృఢంగా, సమృద్ధంగా నిలబెట్టడానికి అనేక శతాబ్దాల పాటు చెక్కుచెదరని ఒక పునాదిని వేసింది.’’
‘‘ప్రయాగ్‌రాజ్‌లో నిర్వహించిన మహాకుంభ్ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మేనేజ్‌మెంట్ ప్రొఫెషనల్స్‌తోపాటు ప్రణాళిక రచన, విధాన రూపకల్పన రంగాల నిపుణులకు పరిశోధనకు ఉపక్రమించాల్సిన అంశంగా మారింది.’’
‘‘ప్రస్తుతం తన వారసత్వాన్ని చూసుకొని గర్వపడుతున్న భారత్ ఇప్పుడు ఒక కొత్త శక్తితో ముందుకు దూసుకుపోతోంది. ఈ కాలం మార్పు తాలూకు ఒక ధ్వని, ఇది దేశ నూతన భవిష్యత్తును లిఖించబోతోంది.’’
‘‘సమాజంలోని ప్రతి వర్గం, ప్రతి రంగానికి చెందిన వారు ఈ మహాకుంభ్‌లో ఏకమయ్యారు. ‘ఏక్ భారత్- శ్రేష్ఠ్ భారత్’ స్ఫూర్తిని చాటే చిరస్మరణీయ దృశ్యమనదగ్గ ఈ ఘట్టం దేశవాసుల్లో ఆత్మవిశ్వాసం సాక్షాత్కరించిన మహాపర్వంగా మారిపోయింది.’’
‘‘ఏకత్వ మహాకుంభ మేళాను ఫలప్రదం చేయడానికి దేశ ప్రజల పరిశ్రమ, వారి ప్రయత్నాలు, వారి సంకల్పంలతో మేను పులకరించిన వేళ... నేను, ద్వాదశ జ్యోతిర్లింగాలలో ప్రథమ జ్యోతిర్లింగం అయిన శ్రీ సోమనాథుడిని దర్శించుకోవడానికి వెళ్లబోతున్నాను. శ్రద్ధ రూపుదాల్చిన సంకల్పం అనే పుష్పాన్ని సమర్పించి, భారతదేశంలోని ప్రతి ఒక్కరి శ్రేయం కోసం నేను ప్రార్థన చేస్తాను. దేశప్రజల్లో ఐకమత్యమనే ఈ అవిరళ ధార, ఇలా ప్రవహిస్తూనే ఉండుగాక.’’
***
(Release ID: 2106546)
Read this release in:
Manipuri
,
Malayalam
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Nepali
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada