కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ప్రైం మినిస్టర్ ఇంటర్న్‌షిప్ స్కీము (పీఎంఐఎస్) పైలట్ ఫేజ్ రెండో విడత ఆరంభం..

దరఖాస్తులు పెట్టుకోవడానికి మళ్లీ అవకాశం

Posted On: 20 FEB 2025 1:44PM by PIB Hyderabad

 

ప్రైం మినిస్టర్ ఇంటర్న్‌షిప్ స్కీము (పీఎంఐఎస్) పైలట్ ఫేజ్ రెండో విడత ఆరంభమవడంతోనే దరఖాస్తులు పెట్టుకోవడానికి మళ్లీ అవకాశం లభిస్తోంది. ఒకటో దఫాలో 6 లక్షలకు మించి దరఖాస్తులు వచ్చాయి. రెండో దఫాలో దేశంలోని 730కు పైగా జిల్లాల్లో అగ్రగామి కంపెనీల్లో ఒక లక్ష కన్నా ఎక్కువ ఇంటర్న్‌షిప్ అవకాశాలను కల్పించనున్నారు.

 

 

భారతీయ యువతకు వారు ఆచరణాత్మక అనుభవాన్ని సొంతం చేసుకోవడానికి, వృత్తినిపుణులతో అనుబంధాన్ని ఏర్పరచుకోవడానికి, తద్వారా వారు ఉపాధి సంబంధ అర్హతలను పెంపొందించుకోవడానికి వీలుగా ఇంటర్న్‌షిప్ అవకాశాల్ని చమురు, వాయువు, ఇంధనం, బ్యాంకింగ్-ఆర్థిక సేవలు, ప్రయాణం, ఆతిథ్యం, ఆటోమోటివ్, లోహాలు, గనుల తవ్వకం, తయారీ, పారిశ్రామిక రంగం, త్వరత్వరగా అమ్ముడయ్యే వినియోగ వస్తువులు (ఎఫ్ఎంసీజీ) రంగాలు సహా మరెన్నో రంగాలకు చెందిన 300 కన్నా ఎక్కువ అగ్రగామి కంపెనీలు ఇవ్వజూపాయి.

 

అర్హత కలిగిన యువతీయువకులు వారికి నచ్చిన జిల్లా, రాష్ట్రం, రంగం, ప్రాంతం .. వీటి ఆధారంగా ఇంటర్న్‌షిప్‌లను వెతుక్కోవచ్చు, ఎంపిక చేసుకోవచ్చు. అంతేకాక, వారు ప్రస్తుతం నివాసం ఉంటున్న చిరునామాను పేర్కొనడం ద్వారా అనుకూల యోగ్య పరిధికి లోపల ఇంటర్న్‌షిప్‌ను ఖరారు చేసుకోనూవచ్చు. రెండో రౌండులో, ప్రతి ఒక్క దరఖాస్తుదారు కూడా దరఖాస్తుల గడువు ముగిసే లోపల ఎక్కువలో ఎక్కువగా 3 ఇంటర్న్‌షిప్‌ల కోసం అర్జీ పెట్టుకోవచ్చు.  

 

రెండో రౌండు కోసం, దేశమంతటా 70 కన్నా ఎక్కువ ఐఈసీ (ఇన్ఫర్మేషన్, ఎడ్యుకేషన్, కమ్యూనికేషన్) కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. గరిష్ఠ ఇంటర్న్‌షిప్‌ల అవకాశాలున్న జిల్లాల్లో కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, ఐటీఐలు, రోజ్‌గార్ మేళాలు వంటివి భాగంగా ఉన్నాయి. వాటిని ఈ ఇంటర్న్‌షిప్‌నకు అవసరమైన యోగ్యతల ఆధారంగా దీనిలో భాగం చేసుకున్నారు. దీనికి అదనంగా, అవకాశాలను ఒకేచోటులో అందించడం, యువతకు ఇప్పటికాలానికి తగినట్లుగా ఉండడం అనే ప్రమాణాల ఆధారంగా అనేక ప్లాట్‌ఫారాల ద్వారానూ, ప్రభావాన్ని ప్రసరించగల వ్యక్తుల (ఇన్‌ఫ్లుయెన్సర్స్) ద్వారానూ జాతీయ స్థాయిలో డిజిటల్ ప్రచార ఉద్యమాలను కూడా ప్రస్తుతం నిర్వహిస్తున్నారు.

 

అర్హతలు కలిగిన యువతీయువకులు ఇక్కడ దరఖాస్తు చేయవచ్చు: https://pminternship.mca.gov.in/

 

భారత్‌లోని అగ్రగామి కంపెనీల్లో 12 నెలల పాటు పెయిడ్ ఇంటర్న్‌షిప్‌ను సమకూర్చే విధానంలో పీఎంఐఎస్‌ను కార్పొరేట్ వ్యవహారాల శాఖ ఆధ్వర్యంలో రూపొందించారు. దేశ యువజనుల సామర్థ్యాలను వినియోగించుకోవాలనేదే దీని ఉద్దేశం.

 

ఈ పథకాన్ని 21 ఏళ్లు మొదలు 24 ఏళ్ల వయస్సు కలిగిన వారిని దృష్టిలో పెట్టుకొని రూపొందించారు. వారు ప్రస్తుతం ఏ పూర్తికాల విద్య సంబంధ కార్యక్రమంలో చేరి గాని, లేదా ఉపాధితో ముడిపడి గాని ఉండకూడదు. వారికి తమ కెరియర్‌ను మొదలుపెట్టేందుకు ఒక అద్వితీయ అవకాశాన్ని ఈ పథకం అందిస్తుంది.

 

ప్రతి ఒక్క ఇంటర్న్‌కు (అనుభవం సంపాదించుకోవడానికి ఒక సంస్థలోనో, కంపెనీలోనో స్వల్ప కాలం పాటు పనిచేసే వ్యక్తి) రూ.5,000 నెలవారీ ఆర్థిక సహాయాన్ని అందిస్తారు. దీనికి తోడు, ఒకసారి ఆర్థిక సహాయంగా రూ.6,000 కూడా ఇస్తారు. సంబంధిత శిక్షణ, కనీసం 6 నెలల పాటు వృత్తిరీత్యా అనుభవం.. ఈ రెండిటి కలబోతగా ప్రతి ఒక్క ఇంటర్న్‌షిప్ ఉంటుంది. దీనివల్ల, అభ్యర్ధులు నేర్చుకోవడంతోపాటుగా వారి నైపుణ్యాలను వ్యావహారిక స్థితులలో సైతం ఉపయోగించ గలుగుతారు.


(Release ID: 2105029) Visitor Counter : 19