పర్యావరణం, అడవులు, మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ
పార్లమెంట్ ప్రశ్న: నానో బబుల్ టెక్నాలజీ
Posted On:
03 FEB 2025 3:41PM by PIB Hyderabad
సూక్ష్మ పరిమాణంలోని నీటి బుడగలను ఉపయోగించి నీటి నాణ్యతను పెంపొందించే పద్ధతే నానో బబుల్ టెక్నాలజీ. దీని ద్వారా కలిగే పర్యావరణ ప్రయోజనాలు - నీటిలో కలుషితాలను తొలగించడం ఆక్సిజన్ శాతాన్ని పెంపొందించడం, ఫైటోప్లాంక్టన్ (నాచు)ను తొలగించడం, బయోఫిల్మ్ (బ్యాక్టీరియా, సూక్ష్మజీవుల కారణంగా నీటి ఉపరితలంపై ఏర్పడే పొర)ను తగ్గించడం ద్వారా జలచరాల జీవనానికి అనువుగా ఉండేలా నీటి నాణ్యతను మెరుగుపరుస్తుంది. అతి సూక్ష్మ పరిమాణంలో, నిలకడగా ఉండే ఈ బుడగలు నీటిలో సమరూపంగా విస్తరించేలా ఈ నానో బబుల్ టెక్నాలజీ చేస్తుంది. సంప్రదాయ పద్దతుల్లో ఈ విస్తరణ ఏకరూపంగా లేకపోవడం వల్ల నీటిలో ఆక్సీకరణ, క్రిమినాశనంలో హెచ్చుతగ్గులు కనిపిస్తాయి.
వన్యప్రాణి (సంరక్షణ) చట్టం, 1972 ప్రకారం రూపొందించిన నిర్వహణా ప్రణాళిక ప్రకారమే జలచరాలున్న రక్షిత ప్రాంతాలతో సహా జాతీయ పార్కులు, అభయారణ్యాల నిర్వహణ చేపడతారు.
నీటి స్థాయి నిర్వహణ, నీటి సరఫరా, గాఢత తగ్గించడం, పూడిక తీయడం, వాయు ప్రసరణ, నీటివనరుల వెంబడి ఎస్టీపీలను ఏర్పాటు చేయడం, యంత్రాలు లేదా మానవుల సాయంతో నీటిలో పెరిగే కలుపు తొలగించడం తదితరమైనవి దీనిలో భాగంగా ఉన్నాయి. 2009 లో వన్యప్రాణి (సంరక్షణ) చట్టం, 1972లోని సెక్షన్ 63 కింద జూ నిబంధనల గుర్తింపును కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసింది. దీని ద్వారా జూలోని జంతువులు, జలచరాల ఆరోగ్యం, పరిశుభ్రతతో సహా ఇతర విధి విధానాలను సెంట్రల్ జూ అథారిటీ అమలు చేస్తుంది. అలాగే జూలోని జంతువుల ఆరోగ్యం, పరిశుభ్రతకు సంబంధించిన మార్గనిర్దేశాలను సమయానుగుణంగా ఈ సంస్థ జారీ చేస్తుంది.
భారత్‌లో నీటిని శుద్ధి చేయడానికి నానో బబుల్ టెక్నాలజీని ప్రయోగాత్మకంగా మాత్రమే అమలు చేస్తున్నారు. నీటి నాణ్యత, జంతువుల ఆరోగ్యంపై ఈ సాంకేతికత చూపించే దీర్ఘకాలిక ప్రభావాన్ని నిర్దేశిత సమయంలో తెలుసుకోవచ్చు.
లోక్ సభలో అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా కేంద్ర పర్యావరణం, అటవీ, వాతావరణ మార్పుల సహాయ మంత్రి శ్రీ కీర్తి వర్ధన్ సింగ్ ఈ సమాచారాన్ని లిఖితపూర్వకంగా అందించారు.
****
(Release ID: 2099326)
Visitor Counter : 79