ఆర్థిక మంత్రిత్వ శాఖ
భావి ఆర్థిక వ్యవస్థను ముందుకు నడిపించేది యువతీయువకుల మానసిక ఆరోగ్యమే: ఆర్థిక సర్వే 2024-25
జీవనశైలి ఎంపికలు, పనిప్రదేశంలోని వాతావరణం,
కుటుంబ పరిస్థితులు.. ఇవి ఉత్పాదకతకు ఎంతో కీలకం
తీరిక సమయాల్ని సామాజిక మాధ్యమాల్లో గడపడం,
లేదా అప్పుడప్పుడు మాత్రమే వ్యాయామం చేస్తుండడం,
లేదా కుటుంబ సభ్యులతో తగినంత సమయాన్ని పంచుకోక పోవడం..
మానసిక శ్రేయానికి చేటు చేస్తాయి
మానసిక ఆరోగ్యం కోసం మన మూలాలతో తిరిగి పెనవేసుకోవడం మన మానసికంగా స్వస్థతను మరింత మెరుగుపరచగలుగుతుంది:ఆర్థిక సర్వే
Posted On:
31 JAN 2025 1:34PM by PIB Hyderabad
జీవితంలో ఎదురయ్యే సవాళ్లను సమర్థంగా ఎదుర్కోవడానికీ, సత్ఫలితాలు వచ్చే విధంగా పనిచేయడానికీ మానసిక ఆరోగ్యం తోడ్పడుతుంది. మానసిక స్వస్థతలో మన అందరి మనో-భావోద్వేగ, సామాజిక, జ్ఞానాత్మక, భౌతిక సామర్థ్యాలు ఇమిడి ఉంటాయి. దీనినే మేధస్సు ఏకీకృత స్వస్థతగా కూడా అవగాహన చేసుకోవచ్చని కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ ఈ రోజు పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వే 2024-25లో వివరించారు.
జీవన శైలి, పని ప్రదేశం, మానసిక స్వస్థత
జీవనశైలి ఎంపికలు, పనిప్రదేశంలో నెలకొనే వాతావరణం, కుటుంబంలోని పరిస్థితులు.. ఇవి ఉత్పాదకతకు ముఖ్యమైన అంశాలు అని ఆర్థిక సర్వే స్పష్టంచేసింది. భారత్ ఆర్థిక రంగంలో పెట్టుకొన్న లక్ష్యాలను సాధించడానికి బాల్యంలో, యవ్వన దశలో అవలంబించే మేలైన జీవనశైలి ఎంపికలపై తక్షణం శ్రద్ధ తీసుకోవాలని సూచించింది.
ఇంటర్‌నెట్‌ను, ముఖ్యంగా సామాజిక మాధ్యమాలను అత్యధికంగా ఉపయోగిస్తున్న కారణంగా బాలలు, యవ్వన దశలో ఉన్న వారిలో మానసిక ఆరోగ్య సమస్యలు ఎక్కువవుతున్నాయని ఆర్థిక సర్వే పేర్కొంది. జోనాథన్ హైయిట్ రాసిన ‘ద ఏంక్షస్ జెనరేషన్: హౌ ద గ్రేట్ రీవైరింగ్ ఆఫ్ చిల్డ్రన్ ఈజ్ కాజింగ్ ఏన్ ఎపిడెమిక్ ఆఫ్ మెంటల్ ఇల్‌నెస్’ అనే పుస్తకాన్ని గురించి సర్వే ఉదాహరిస్తూ, పెరిగి పెద్దయ్యే అనుభవానికి ‘ఫోన్ ఆధారిత బాల్యం’ అనే ప్రస్తావనతో ఆ పుస్తకం ఒక కొత్త భాష్యాన్ని చెప్పినట్లు తెలిపింది.
పనిచేసే చోటులో మంచి వాతావరణం మెరుగైన మానసిక ఆరోగ్యానికి దోహదపడుతుందని ఆర్థిక సర్వే స్పష్టంచేసింది. జీవనశైలి ఎంపికలు, కుటుంబ స్థితిగతులు కూడా మానసిక స్వస్థత పరంగా ముఖ్య పాత్రను పోషిస్తాయని కూడా సర్వే తేల్చిచెప్పింది.
అల్ట్రా-ప్రాసెస్డ్ ఫుడ్స్ ను గానీ, లేదా జంక్ ఫుడ్‌ను గానీ అప్పుడప్పుడు మాత్రమే తీసుకొంటూ ఉన్న వ్యక్తుల మానసిక ఆరోగ్యం వాటిని క్రమం తప్పక తీసుకొంటూ ఉన్న వ్యక్తులతో పోలిస్తే మెరుగ్గా ఉంటోందని ఆర్థిక సర్వే తెలిపింది. వ్యాయామం అప్పుడప్పుడూ మాత్రమే చేసే వారూ, తీరిక సమయంలో ఎక్కువ సేపు సామాజిక మాధ్యమాలలో గడిపే వారూ, లేదా తమ కుటుంబంతో సన్నిహితంగా మెలగకుండా ఉంటున్న వారూ, దీర్ఘకాలం పాటు కేవలం ఒకే చోటులో కూర్చొని పనిచేస్తున్న వారూ.. వీరి మానసిక ఆరోగ్యం కూడా అంత బాగుండడం లేదు.
మానసిక స్వస్థత తక్కువ స్థాయిలకు పడిపోవడం చింతించాల్సిన విషయమనీ, ఈ ప్రవృత్తులు ప్రసరిస్తున్న ఆర్థిక ప్రభావాలు సైతం అంతే కలవరపాటుకు లోను చేస్తున్నాయనీ సర్వే ప్రధానంగా చెప్పింది. పనిచేసే చోటుల్లో ప్రతికూల వాతావరణం, చాలావరకూ కూర్చొని ఉండే భంగిమలోనే పనిచేయాల్సివస్తుండడం సైతం మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తున్నాయనీ, చివరకు ఆర్థిక వృద్ధి వేగంలో అడ్డంకులు ఎదురవుతున్నాయనీ వివరించింది.
పాఠశాలల్లో, కుటుంబం స్థాయిలో ఆరోగ్యకరమైన స్థితిగతులను ప్రోత్సహించడం కోసం అనువైన వాతావరణాన్ని ఏర్పరచాల్సిన అవసరం ఉందనీ, దీనిలో బాలలనూ, యవ్వన దశలో ఉన్న వారినీ ఇంటర్‌నెట్‌కు దూరంగా ఉంచడం, స్నేహితులతో అనుబంధాన్ని పెంచుకోవడానికీ, ఇంటి బయట ఆడుకోవడానికీ, కుటుంబంతో సన్నిహితంగా మెలగడానికీ కాలాన్ని కేటాయించనివ్వాలంది. ఇలా చేస్తే వారి మానసిక స్వస్థత మెరుగుపడుతుందని పేర్కొంది.
మనం మన మూలాల్లోకి తిరిగి వెళ్తే మానసిక ఆరోగ్యం పరంగా సర్వోన్నత స్థితిని అందుకోగలుగుతామని ఆర్థిక సర్వే పేర్కొంది. మానవ సంక్షేమం, దేశ స్ఫూర్తిలను నేరుగా ప్రభావితం చేసే అంశాలను బట్టి చూస్తే, సమస్య తీవ్రత విస్తృత స్థాయికి చేరుకొందనీ, మానసిక స్వస్థతను ఆర్థిక అజెండాకు కీలకమైందిగా పరిగణించడం తెలివైన పని అవుతుందనీ ఆర్థిక సర్వే తెలిపింది.
భారతదేశంలో కష్టపడి పనిచేసే పౌరుల సంఖ్య అధికంగా ఉన్న కారణంగా నైపుణ్యాల సాధన, విద్య, శారీరక ఆరోగ్యం, అన్నిటిని మించి యువతీయువకుల మానసిక ఆరోగ్యం వంటి వాటి వల్ల లాభాలను అందుకోవలసి ఉన్నందువల్ల, యువత మానసిక ఆరోగ్యాన్ని కాపాడడానికి తగిన, ప్రభావశీల నివారక వ్యూహాలనూ, విధానాలనూ రూపొందించాల్సిన సమయం ఆసన్నం అయిందని కూడా సర్వే పత్రం తెలిపింది.
***
(Release ID: 2098395)
Visitor Counter : 39