పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ
న్యూ ఢిల్లీలో గణతంత్ర దినోత్సవ పరేడ్.. ప్రత్యేక అతిథులుగా 600మందికి పైగా పంచాయతీ నాయకులు
గణతంత్ర దినోత్సవాని కన్నా ముందే పంచాయతీ నేతలకు సన్మానం..
‘గ్రామోదయ్ సంకల్ప్’ పత్రిక ఆవిష్కరణ కూడా
Posted On:
24 JAN 2025 4:02PM by PIB Hyderabad
గణతంత్ర దినోత్సవం సందర్భంగా 2025 జనవరి 26న న్యూ ఢిల్లీలోని కర్తవ్య పథ్‌లో నిర్వహించే రిపబ్లిక్ డే పరేడ్‌ను చూడడానికి ప్రత్యేక అతిథులుగా హాజరు కండి అంటూ 600కు పైగా పంచాయతీ నేతలను పంచాయతీ రాజ్ మంత్రిత్వ శాఖ (ఎంఓపీఆర్) ఆహ్వానించింది. ఈ ప్రత్యేక అతిథులను వారి వారి పంచాయతీలలో ప్రభుత్వ ప్రధాన పథకాల ఫలాలు లబ్ధిదారులందరికీ అందేటట్లు చూడడంలో కీలక సేవలను అందించినందుకుగాను ఎంపిక చేశారు. ఈ పథకాలలో హర్ ఘర్ జల్ యోజన, ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (గ్రామీణ్), మిషన్ ఇంద్రధనుష్, ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన (ఆయుష్మాన్ భారత్), ప్రధాన మంత్రి ఉజ్వల యోజన, ప్రధాన మంత్రి పోషణ్ యోజన, పీఎం ముద్ర యోజన, పీఎం విశ్వకర్మ యోజన, ప్రధాన మంత్రి మాతృ వందన యోజనలతోపాటు కిసాన్ క్రెడిట్ కార్డ్ (కేసీసీ) పథకం మొదలైనవి ఉన్నాయి. ఆహ్వానితులలో ఆరోగ్యం, విద్య, మహిళలు- బాలల పురోగతి, నీరు- పారిశుద్ధ్యం, వాతావరణ సంబంధిత కార్యాచరణ వంటి ముఖ్య అభివృద్ధి రంగాలలో గొప్ప పనితీరును కనబరచి జాతీయ స్థాయిలో, రాష్ట్రాల స్థాయిలో పురస్కారాలను పొందిన పంచాయతీ నేతలతో పాటు, అభివృద్ధి కోసం తపిస్తున్న జిల్లాలకు చెందిన పంచాయతీ నేతలు కూడా ఉన్నారు. ఎంపికలు చేసేటప్పుడు అఖిల భారత స్థాయిలో వివిధ ప్రాంతాలకు, సామాజిక-ఆర్థిక సమూహాలకు, పురుషులతో పాటు మహిళలకు ప్రాతినిధ్యం ఉండేటట్లు శ్రద్ధ తీసుకున్నారు. గణతంత్ర దినోత్సవం నాడు, ఈ విశిష్ట ఆహ్వానితులు వారి కుటుంబ సభ్యులతో కలిసి రిపబ్లిక్ డే పరేడ్ గొప్పదనాన్ని కనులారా తిలకించనున్నారు. ఇది వారు తమ కర్మక్షేత్రం నుంచి కర్తవ్య పథ్ వరకు చేసే ప్రయాణానికి ప్రతీకగా ఉండే ఒక అవకాశాన్ని అందించనుంది.
గణతంత్ర దినోత్సవాని కన్నా ముందు రోజు ప్రత్యేక అభినందన కార్యక్రమం
ఈ పంచాయతీ నేతలను గౌరవించుకోవడానికి గణతంత్ర దినోత్సవాని కన్నా ఒక రోజు ముందు, అంటే జనవరి 25న, ఒక ప్రత్యేక సన్మాన కార్యక్రమాన్ని న్యూ ఢిల్లీలోని భారత విమానాశ్రయాల ప్రాధికరణ సంస్థ (ఏఏఐ) అధికారుల సంస్థలో నిర్వహించనున్నారు. ఇదే కార్యక్రమంలో ‘గ్రామోదయ్ సంకల్ప్’ పత్రిక 15వ సంచికను ఆవిష్కరించడం, పంచాయతీ నేతల సత్కారం, మీ రాజ్యాంగాన్ని గురించి తెలుసుకోండి పేరుతో నిర్వహించిన ఒక ప్రశ్నోత్తరాల (క్విజ్) పోటీ విజేతలకు సర్టిఫికెట్లు, బహుమతుల ప్రదానం కూడా ఉంటాయి. ఈ పోటీని 2024లో రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా పంచాయతీ రాజ్ మంత్రిత్వ శాఖ నిర్వహించింది. ఈ సన్మాన కార్యక్రమంలో కేంద్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి, మత్స్య, పశుసంవర్ధక, పాడి పరిశ్రమ శాఖ మంత్రి శ్రీ రాజీవ్ రంజన్ సింగ్ అలియాస్ లలన్ సింగ్, పంచాయతీ రాజ్ శాఖ సహాయ మంత్రి ప్రొఫెసర్ ఎస్.పి. సింగ్ బఘేల్, పంచాయతీ రాజ్ శాఖ కార్యదర్శి శ్రీ వివేక్ భరద్వాజ్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొంటారు.
(Release ID: 2095890)
Visitor Counter : 71