రక్షణ మంత్రిత్వ శాఖ
గణతంత్ర దినోత్సవ కవాతు - 2025లో భాగంగా ‘రక్షా కవచ్ - వివిధ రకాల అపాయాల నుంచి బహుళ స్థాయి రక్షణ’ అనే అంశాన్ని ప్రదర్శించనున్న డీఆర్‌డీవో
Posted On:
23 JAN 2025 12:56PM by PIB Hyderabad
భారత్‌ను అత్యాధునిక సాంకేతిక వ్యవస్థలతో పటిష్టం చేయడంతో పాటు, రక్షణ రంగంలో ‘ఆత్మనిర్భరత’ను సాధించడమే లక్ష్యంగా రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) జనవరి 26న న్యూఢిల్లీలోని కర్తవ్యపథ్‌లో జరిగే 76వ గణతంత్ర దినోత్సవ కవాతులో జాతీయ భద్రత నిమిత్తం రూపొందించిన సరికొత్త ఆవిష్కరణలను ప్రదర్శిస్తుంది.
‘రక్షా కవచ్ - వివిధ రకాల అపాయాల నుంచి బహుళ స్థాయి రక్షణ’ అనే అంశంలో డీఆర్‌డీవో శకటాన్ని ప్రదర్శిస్తుంది. ఈ శకటంలో త్వరితగతిన స్పందించే ఉపరితలం నుంచి గగనతలానికి ప్రయోగించే క్షిపణి; గాలిలో ముందస్తు హెచ్చరికలు, నియంత్రణా వ్యవస్థ; 155 ఎంఎం/52 క్యాలిబర్ ఆధునిక టోవ్డ్ ఆర్టిలరీ గన్ వ్యవస్థ; డ్రోన్లను గుర్తించి అడ్డగించి, నాశనం చేయడం; శాటిలైట్ ఆధారిత నిఘా వ్యవస్థ; మాధ్యమిక సామర్థ్యమున్న రాడార్ - ఆరుద్ర; అధునాతనమైన తేలికపాటి టోర్పడో; ఎలక్ట్రానిక్ యుద్ద వ్యవస్థ – ధారాశక్తి; లేజర్ బేస్డ్ డైరెక్టెడ్ ఎనర్జీ వెపన్; అత్యల్ప శ్రేణి వాయు రక్షణ వ్యవస్థ; దేశీయంగా తయారు చేసిన మానవ రహిత వైమానిక వ్యవస్థ; పదాతి బలగాల కోసం వీ/యుహెచ్ఎఫ్ మ్యాన్పాక్ సాఫ్ట్ వేర్ తో నడిచే రేడియో; స్వదేశీ సెక్యూర్ శాటిలైట్ ఫోన్, ఉగ్రమ్ అసాల్ట్ రైఫిల్ ను ప్రదర్శిస్తున్నారు.
వీటితో పాటుగా 2024లో డీఆర్‌డీవో సాధించిన ప్రధాన విజయాలైన దీర్ఘశ్రేణి హైపర్ సోనిక్ యాంటీ-షిప్ క్షిపణి; తేలికపాటి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ‘ఏబీహెచ్ఈడీ’; దివ్యాస్త్ర – బహుళ లక్ష్యాలను ఛేధించగల రీఎంట్రీ వాహనం; ‘జొరావర్’ తేలికపాటి ట్యాంకు, రాడార్‌తో నవీకరించిన డార్నియర్ మిడ్-లైఫ్, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ వ్యవస్థ, సాఫ్ట్ వేర్ ఆధారిత రేడియో, ఎలక్ట్రో ఆప్టిక్ (షేన్) పోస్టర్లను సైతం శకటంలో ప్రదర్శిస్తారు.
కచ్చితత్వం, స్వావలంబన, జాతీయ భద్రత పట్ల అంచంచలమైన అంకితభావాన్ని తెలియజేస్తూ, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన ప్రళయ్ ఆయుధ వ్యవస్థ, భూతలం నుంచి భూతలానికి ప్రయోగించే క్షిపణిని సైతం డీఆర్‌డీవో ప్రదర్శించనుంది. ఇది రక్షణ రంగ సామర్థ్యాన్ని మరింత మెరుగుపరుస్తుంది. నాగ్ క్షిపణి వ్యవస్థ, పినాక, బ్రహ్మోస్, షార్ట్ స్పాన్ బ్రిడ్జింగ్ సిస్టమ్ 10ఎం, ఆకాశ్ ఆయుధ వ్యవస్థలను సైతం వివిధ సైనిక బలగాలు కవాతులో ప్రదర్శించనున్నాయి.
‘భారత్‌లోనే తయారుచేద్దాం - ప్రపంచం కోసం తయారు చేద్దాం’ అనే లక్ష్యాన్ని సాధించేందుకుగాను అత్యాధునిక సైనిక ఆయుధ సంపత్తిని, సాంకేతికతలను నిర్వచించి, రూపకల్పన చేసి, అభివృద్ధి చేయడంపైనే డీఆర్‌డీవో ప్రాథమికంగా పనిచేస్తుంది. కీలకమైన వ్యవస్థలను అభివృద్ధి చేయడంలో రక్షణ రంగంలోని విద్యాసంస్థలు, పరిశ్రమలు, అంకుర సంస్థలు, సైన్యంతో కలసి పనిచేస్తూ, ‘ఆత్మనిర్భర భారత్’ స్ఫూర్తిని బలోపేతం చేస్తుంది.
***
(Release ID: 2095844)
Visitor Counter : 73