హోం మంత్రిత్వ శాఖ
భారత జాతీయ సముద్ర సమాచార సేవా కేంద్రం (ఇన్కోయిస్)కు సుభాష్ చంద్రబోస్ ఆపద ప్రబంధన్ పురస్కారం
విపత్తు నిర్వహణ రంగంలో వ్యక్తులు, సంస్థల అమూల్యమైన సేవలను గుర్తించి గౌరవించేందుకు ఈ పురస్కారాన్ని ఏర్పాటు చేసిన భారత ప్రభుత్వం
కేంద్ర హోం మంత్రి శ్రీ అమిత్ షా మార్గదర్శకత్వంలో దేశంలో మెరుగైన విపత్తు నిర్వహణ వ్యవస్థ: ఫలితంగా ప్రకృతి వైపరీత్యాల సమయంలో గణనీయంగా తగ్గిన మరణాలు
Posted On:
23 JAN 2025 9:18AM by PIB Hyderabad
విపత్తు నిర్వహణలో అత్యున్నత కృషికిగాను భారత జాతీయ సముద్ర సమాచార సేవా కేంద్రం (ఇన్కోయిస్) ఈ ఏడాది సంస్థాగత విభాగంలో సుభాష్ చంద్రబోస్ ఆపద ప్రబంధన్ పురస్కారానికి ఎంపికైంది.
విపత్తు నిర్వహణ రంగంలో అమూల్యమైన కృషి చేసి నిస్వార్థ సేవలను అందించిన దేశంలోని వ్యక్తులు, సంస్థలను గుర్తించి గౌరవించడం కోసం ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేతృత్వంలో భారత ప్రభుత్వం సుభాష్ చంద్రబోస్ ఆపద ప్రబంధన్ పురస్కార్ పేరిట వార్షిక పురస్కారాన్ని ఏర్పాటు చేసింది. ఏటా సుభాష్ చంద్రబోస్ జయంతి జనవరి 23న ఈ పురస్కారాన్ని ప్రకటిస్తారు. ఈ పురస్కారం ద్వారా సంస్థలకైతే రూ. 51 లక్షల నగదు బహుమతి, ధ్రువీకరణ పత్రాన్ని.. వ్యక్తులకైతే రూ. 5 లక్షల నగదు, ధ్రువీకరణ పత్రాన్నీ అందజేస్తారు.
కేంద్ర హోం, సహకార శాఖల మంత్రి శ్రీ అమిత్ షా మార్గదర్శకత్వంలో విపత్త నిర్వహణ పద్ధతులు, సన్నద్ధత, మితీకరణ, ప్రతిస్పందన విభాగాల్లో దేశం గణనీయంగా మెరుగుపడింది. ఫలితంగా ప్రకృతి వైపరీత్యాల సమయంలో ప్రాణనష్టం గణనీయంగా తగ్గింది.
ఈ ఏడాది పురస్కారం కోసం గతేడాది జూలై 1 నుంచి నామినేషన్లను స్వీకరించారు. పురస్కార విధివిధానాలకు ముద్రణ, ఎలక్ట్రానిక్ ప్రసార, సామాజిక మాధ్యమాల ద్వారా విస్తృత ప్రాచుర్యం కల్పించారు. దీంతో వివిధ సంస్థలు, వ్యక్తుల నుంచి 297 నామినేషన్లు వచ్చాయి.
విపత్తు నిర్వహణ రంగంలో పురస్కార విజేత అద్భుత కృషిపై సంగ్రహ వివరణ:
భారత జాతీయ సముద్ర సమాచార సేవా కేంద్రాన్ని (ఇన్కోయిస్) 1999లో హైదరాబాదులో నెలకొల్పారు. భారత విపత్తు నిర్వహణ వ్యూహంలో ఇన్కోయిస్ అంతర్భాగం. సముద్ర సంబంధిత విపత్తులపై ముందస్తు హెచ్చరికలు జారీచేయడం దీని ప్రత్యేకత. 10 నిమిషాల్లో సునామీ హెచ్చరికలను జారీ చేసే భారత సునామీ ముందస్తు హెచ్చరికల కేంద్రాన్ని (ఐటీఈడబ్ల్యూసీ) ఈ సంస్థ నెలకొల్పింది. అది భారత్ తోపాటు 28 హిందూ మహాసముద్ర దేశాలకు సేవలందిస్తోంది. సునామీ సేవలందించే సంస్థల్లో అగ్రగామిగా యునెస్కో దీనిని గుర్తించింది. వివిధ భూకంప కేంద్రాలు, అలల పరిమాణాలు, ఇతర మహాసముద్ర సెన్సార్ల సహాయంతో తరంగ ఉధృతి, తుపాను, ఉప్పెనల అంచనాలను కూడా ఇది అందిస్తుంది. ఇది తీరప్రాంతాలు, సముద్ర కార్యకలాపాల రక్షణలో సహాయపడుతుంది. 2013 ఫైలిన్, 2014 హుద్ హుద్ తుపానుల సమయంలో సలహాలనందిస్తూ ఇన్కోయిస్ సహాయం చేసింది. తీరప్రాంత ప్రజలను సకాలంలో తరలించి నష్టాన్ని తగ్గించడానికి ఇది దోహదపడింది. సముద్రంలో వ్యక్తులను, కోల్పోయిన వ్యక్తులను గుర్తించడంలో భారత తీర రక్షక దళం, నౌకా దళం, తీరప్రాంత భద్రత పోలీసులకు సహాయపడేలా సెర్చ్ - రెస్క్యూ ఆధారిత టూల్ (సరత్)ను ఇన్కోయిస్ రూపొందించింది. వాస్తవిక సమాచారాన్ని ఏకీకృతం చేసి అత్యవసర సంఘటనల సమయంలో ప్రతిస్పందన సమన్వయాన్ని బలోపేతం చేయడం కోసం సినోప్స్ విజువలైజేషన్ వేదికను కూడా ఇన్కోయిస్ ఏర్పాటు చేసింది. 2024లో జియోస్పేషియల్ వరల్డ్ ఎక్సలెన్స్ ఇన్ మారిటైం సర్వీసెస్ పురస్కారాన్ని, 2021లో డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ ఎక్సలెన్స్ పురస్కారాన్ని ఇన్కోయిస్ స్వీకరించింది.
***
(Release ID: 2095466)
Visitor Counter : 22