వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
బెల్జియం విదేశాంగ శాఖ మంత్రి, పరిశ్రమ ప్రముఖులతో భారత్ వాణిజ్య, పరిశ్రమల మంత్రి శ్రీ పీయూష్ గోయల్ ద్వైపాక్షిక చర్చలు
Posted On:
21 JAN 2025 9:19AM by PIB Hyderabad
బెల్జియం విదేశీ వ్యవహారాలు, యూరోపియన్ వ్యవహారాలు, విదేశీ వ్యాపార శాఖ మంత్రి శ్రీ బెర్నార్డ్ క్వింటిన్‌తో భారత్ వాణిజ్య, పరిశ్రమల శాఖ కేంద్ర మంత్రి శ్రీ పీయూష్ గోయల్ ఈ రోజు బ్రస్సెల్స్‌లో సమావేశమయ్యారు. వారిద్దరూ ద్వైపాక్షిక వ్యాపారం, పెట్టుబడి అంశాలపై చర్చించారు. ప్రజాస్వామ్యం, చట్టబద్ధ పాలన, స్వతంత్ర న్యాయవ్యవస్థల ఉమ్మడి విలువలే పునాదిగా భారత్, బెల్జియంల మధ్య చాలా కాలంగా కొనసాగుతున్న ద్వైపాక్షిక సంబంధాలకు ఈ సమావేశం మరింత బలాన్నిచ్చింది. ఆర్థిక సహకారాన్ని విస్తరింపచేసుకోవడానికి అనుసరించాల్సిన పద్ధతులపై నేతలిద్దరూ చర్చించడంతోపాటు రెండు దేశాల భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకుపోవడానికి ఇంకా ఏయే కొత్త మార్గాల్లో పయనించవచ్చో పరిశీలించారు. ఇండియా, బెల్జియంల మధ్య 2023-2024లో 15.07 బిలియన్ (1507 కోట్ల) డాలర్ల పైచిలుకు వ్యాపారం సాగిందని, బెల్జియం నుంచి 3.94 బిలియన్ (394 కోట్ల) డాలర్లకు పైగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు భారత్‌లోకి వచ్చాయని ఒక అంచనా ఉంది.
విదేశీ వ్యాపారంపై బెల్జియం గణనీయంగా ఆధారపడుతోందని, భారత్ ఆర్థిక వ్యవస్థ వేగంగా వృద్ధి చెందుతోందని, అవకాశాలను సద్వినియోగపరుచుకోవడంలో రెండు దేశాలకు ఈ అంశాలు బాగా తోడ్పడగలుగుతాయని ఇద్దరు నేతలు చర్చల సందర్భంగా గుర్తించారు. ద్వైపాక్షిక భాగస్వామ్యంలో వ్యాపారావకాశాలు ఒక ముఖ్యపాత్రను పోషించగలవని వారు అభిప్రాయపడుతూ, స్థిర వృద్ధిబాటలో మరింత ముందుకు సాగిపోవడానికి వ్యాపార సంబంధాల్ని భిన్న రంగాల్లోకి విస్తరించాలని, అలాగే ఆర్థిక దౌత్యాన్ని ఇప్పటికన్నా పటిష్టంగా తీర్చిదిద్దాలన్న అంశాలను ప్రధానంగా ప్రస్తావించారు.
ఈయూ-ఇండియా స్వేచ్ఛా వ్యాపార ఒప్పందం (ఎఫ్‌టీఏ) సంప్రదింపుల్లో పురోగతి అంశంపై కూడా నేతలు చర్చించారు. సంప్రదింపుల్ని సముచిత రీతిలో కొనసాగించడానికి వ్యాపారపరమైన అంశాలకు ప్రాధాన్యాన్ని ఇవ్వాలని, ఆర్థిక సంబంధాలను బలపరుచుకోవాలని వారు స్పష్టంచేశారు.
పునరుత్పాదక ఇంధనం, లైఫ్ సైన్సెస్, మౌలిక సదుపాయాల కల్పన, డిజిటల్ టెక్నాలజీలు, ఆహార ఉత్పత్తుల వంటి రంగాల్లో సహకారాన్ని ఇచ్చిపుచ్చుకోవడానికి అవకాశాలు ఉన్నాయని అంగీకరించారు.
బెల్జియం తన వ్యాపార సంబంధాలను విస్తరించుకోవడానికి, భారత్‌కు వ్యూహాత్మక భాగస్వామిగా జతపడడానికి ప్రాముఖ్యాన్ని ఇవ్వాల్సి ఉందని గుర్తించింది. నియంత్రణపరమైన అడ్డంకుల్ని, ముఖ్యంగా ఫార్మస్యూటికల్స్, వ్యవసాయ ఉత్పత్తులకు ఆమోదం తెలిపే విషయంలో ఎదురవుతున్న ఇబ్బందుల్ని గురించి కూడా చర్చించారు. ఈ సవాళ్లను పరిష్కరించడానికి ఆయా అంశాలపై సంప్రదింపులను నిరంతరాయంగా కొనసాగించడానికి ఉభయ పక్షాలు అంగీకరించాయి.
వ్యాపార సమస్యల్ని పరిష్కరించడానికి సమర్థ యంత్రాంగాలను ఏర్పాటు చేసుకోవాలనే నిబద్ధతను చాటుతూ ఈ సమావేశాన్ని ముగించారు. దృఢమైన, ఇరు పక్షాలకూ ప్రయోజనకరంగా ఉండే వ్యాపార భాగస్వామ్యాన్ని పెంపొందింపచేసుకోవాలని ఆ దిశగా అంకితభావంతో పనిచేస్తామని నేతలిద్దరూ ఉద్ఘాటించారు.
భారత్-బెల్జియం వ్యాపార సంబంధాలు పురోగమించడానికి, ఆర్థిక వృద్ధితోపాటు స్థిరాభివృద్ధి సాధనకు ఉమ్మడి దక్పథాన్ని అనుసరించే దిశలో ఓ ముఖ్యమైన ముందడుగు పడిందని ఈ ఉన్నత స్థాయి సమావేశం సూచిస్తోంది.
వాణిజ్య, పరిశ్రమల మంత్రి శ్రీ పీయూష్ గోయల్ యూరోపునకు చెందిన వ్యాపార ప్రముఖులు, వజ్రాల పరిశ్రమ ప్రతినిధులు, సముద్ర సంబంధిత సేవలు, సౌర ఇంధనం, స్వచ్ఛ సాంకేతికత, వ్యర్థాల నిర్వహణ, గ్రీన్ హైడ్రోజన్ రంగాలకు చెందిన పెట్టుబడిదారులతో కూడా భేటీ అయ్యి వారితో చర్చించారు.
***
(Release ID: 2094879)
Visitor Counter : 12