సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖలు, విభాగాల ఆధ్వర్యంలో మహాకుంభ్ నగర్‌లో ప్రదర్శన నిర్వహణ..


భారత ప్రభుత్వ విజయాలు, ప్రణాళికలు, విధానాలతోపాటు ప్రజా సంక్షేమ కార్యక్రమాల సమాచారాన్ని గురించి తెలియజేయడానికే ఈ ప్రదర్శన

Posted On: 17 JAN 2025 9:27PM by PIB Hyderabad

ప్రయాగ్‌రాజ్‌లో మహాకుంభ్ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాలు త్రివేణి మార్గ్ లో ఒక ప్రదర్శనను నిర్వహిస్తున్నాయి. ఈ ప్రదర్శనను ఏర్పాటు చేసిన ప్రాంతంలో, భారత ప్రభుత్వ సమాచార - ప్రసార శాఖ ఒక డిజిటల్ ఎగ్జిబిషన్ స్టాల్‌ను ఏర్పాటు చేసింది. కేంద్ర ప్రభుత్వం సాధించిన విజయాలను, కేంద్ర ప్రణాళికలు, కేంద్ర విధానాలతోపాటు కేంద్రం అమలుచేస్తున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాల గురించిన సమాచారాన్ని ఈ డిజిటల్ ఎగ్జిబిషన్ మాధ్యమం ద్వారా    అందరికీ తెలియజేస్తున్నారు. వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖతోపాటు ప్రచురణల విభాగం స్టాల్స్, ఇంకా జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికరణ సంస్థ (ఎన్‌డీఎంఏ) ప్రధాన్ మంత్రీ ఇంటర్న్‌షిప్ పథకాల స్టాల్స్‌ను కూడా ఈ ప్రదర్శనలో ఏర్పాటు చేశారు.

సమాచార-ప్రసార మంత్రిత్వ శాఖ నెలకొల్పిన డిజిటల్ ఎగ్జిబిషన్‌ స్టాల్‌లో ఫోటోలను బాగా పెద్దవిగా లాగేసి (ఎనామార్ఫిక్ సాంకేతికత పద్ధతిలో) ఆ ఫోటోలో ఉన్న విషయాల్ని స్పష్టంగా ప్రదర్శించేందుకు ఉద్దేశించిన ఒక పెద్ద టెలివిజన్ సెట్‌కు ఉండేతెర లాంటి గోడ, ఎల్ఈడీ వాల్, హోలోగ్రాఫిక్ సిలిండర్.. ఈ మాధ్యమాల సాయంతో,  ప్రజల సంక్షేమం కోరి ప్రభుత్వం అమలుచేస్తున్న అనేక పథకాలకు సంబంధించిన సమాచారాన్ని ప్రదర్శిస్తున్నారు.

 

‘ప్రధాన్ మంత్రీ ఇంటర్న్‌షిప్ పథకాన్ని’ గురించి వివరించే డిజిటల్ ప్రదర్శన స్టాల్‌లో, వేరువేరు కంపెనీలలో, సంస్థలలో ప్రధాన మంత్రి ఇంటర్న్‌షిప్‌ను ఎలా సాధించవచ్చో ఆ పద్ధతిని ప్రజలకు సులభంగా అర్ధమయ్యేలా వివరిస్తున్నారు.

నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ తన ప్రదర్శన విభాగంలో వరదలను, మంటలను, భూకంపాలను, చలి వాతావరణాన్ని, అడవులలో వ్యాపించే కార్చిచ్చు, ఇతర ప్రాకృతిక, మనిషి చేసే తప్పిదాల ఫలితంగా తలెత్తే ఆపదల నివారణకు తీసుకోదగ్గ చర్యలను గురించి- డిజిటల్ మాధ్యమాన్ని ఉపయోగించుకొని మరీ- చాటిచెబుతున్నారు.

 

సమాచార-ప్రసార శాఖలో భాగంగా ఉన్న పబ్లికేషన్స్ డిపార్ట్‌మెంట్ స్టాల్ లో మన దేశ మహనీయుల జీవితాలతోపాటు ఇతర ముఖ్య విషయాలపై ప్రచురించిన పుస్తకాలను అందుబాటులో ఉంచారు.

 

వ్యవసాయం-రైతుల సంక్షేమ శాఖ స్టాళ్లలో సిరిధాన్యాలతో తయారు చేసిన ఉత్పాదనలతోపాటు కూరగాయ విత్తనాలను కూడా సందర్శకుల కోసం అందుబాటులో ఉంచారు.

 

మహాకుంభ్‌కు వేల సంఖ్యలో తరలివస్తున్న ప్రజలు ఈ స్టాళ్లను, ఇతర స్టాళ్లను పరిశీలిస్తున్నారు. చిత్రాల ద్వారా అందిస్తున్న సమాచారాన్ని, ఎగ్జిబిషన్లలో ప్రదర్శిస్తున్న సినిమాల్నీ ప్రేక్షకులు మెచ్చుకొంటూ, ఈ డిజిటల్ ఎగ్జిబిషన్ తమకు ఎన్నో అంశాల్ని తెలుసుకొనేందుకు, విషయాలను నేర్చుకొనేందుకు తోడ్పడుతోందంటున్నారు.

మహాకుంభ్ నగర్ లోని త్రివేణి మార్గ్ ప్రదర్శన భవనసముదాయంలో నిర్వహిస్తున్న ఈ ప్రదర్శనలను ప్రజలు వీటిని చూడడానికి వీలుగా 2025 ఫిబ్రవరి 26 వరకు తెరచి ఉంచుతారు. ఈ ప్రదర్శనలను చూడడానికి సందర్శకుల నుంచి ఎలాంటి రుసుం వసూలు చేయకుండా, ఉచితంగా వారిని ప్రదర్శన స్థలం లోపలికి వెళ్లనిస్తారు.

 

***


(Release ID: 2094379)