కార్మిక, ఉపాధికల్పన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

సభ్యుల ప్రొఫైల్‌ను అప్‌డేట్ చేయడానికి అనుసరించాల్సిన ఆన్‌లైన్‌ ప్రక్రియను సరళతరం చేసిన ఈపీఎఫ్ఓ

Posted On: 19 JAN 2025 11:36AM by PIB Hyderabad

సభ్యులకు అందిస్తున్న సేవలను ఎప్పటికప్పుడు మెరుగుపరచడంతోపాటు సభ్యుల సమాచారం (డేటా)లో కచ్చితత్వాన్ని నిలబెట్టుకొంటూ ఉండాలన్న తన నిబద్ధతను చాటుకోవడానికి సభ్యుల ప్రొఫైల్‌ను తాజాపరచడానికి (అప్‌డేషన్) అనుసరించే ప్రక్రియను మరింత సరళం చేసే పనిని ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్ఓ) మొదలుపెట్టింది. సవరించిన విధానంలో భాగంగా, ఇప్పటికే ఆధార్ ద్వారా యూనివర్సల్ అకౌంట్ నంబర్లు (యూఏఎన్) చెల్లుబాటై ఉన్న సభ్యులు వారి ప్రొఫైల్‌ను అంటే.. పేరు, పుట్టిన తేదీ, పురుషుడా లేక మహిళా లేక తృతీయ ప్రకృతికి చెందిన వారా, జాతీయత, తల్లి పేరు, తండ్రి పేరు, పెళ్లి అయింది, పెళ్లి కాలేదు, భర్త పేరు గానీ లేక భార్య పేరు గానీ, చేరిన తేదీ, విడిచిపెట్టిన తేదీ వంటి వివరాలను ఎలాంటి డాక్యుమెంటునూ- అప్‌లోడ్ చేయాల్సిన అవసరం లేకుండానే- స్వయంగా ఆధునికీకరించవచ్చు.    

2017 అక్టోబరు 1వ తేదీ కన్నా వెనుకటి రోజుల్లో యూఏఎన్‌ను అందుకొన్న కొన్ని కేసుల్లో మాత్రమే, వ్యక్తిగత వివరాలను ఆధునికీకరించడానికి ఆ ఉద్యోగి యాజమాన్య సంస్థ (ఎంప్లాయర్) ధ్రువీకరణ (సర్టిఫికేషన్)  అవసరమవుతుంది.

ఈపీఎఫ్ఓ సమాచార నిధి (డేటాబేస్)లో ఈపీఎఫ్ సభ్యుల వ్యక్తిగత సమాచారంలో సరిపోలే వివరాలకూ, ప్రామాణికత్వానికీ అత్యంత ప్రాధాన్యాన్నిస్తున్నారు. ఎందుకంటే, అంతరాయం లేకుండా సేవలను అందించాలన్నా, ఫండ్ నుంచి తప్పయిన చెల్లింపులనూ, దగాకోరు తరహా చెల్లింపులనూ నివారించాలన్నా సభ్యుల సమాచారం పక్కాగా ఉండాలికదా. సభ్యుల వివరాల్లో మార్పు చేయాల్సిన లేదా సరిచేయాల్సిన అవసరమేదైనా ఎదురైన సందర్భంలో, సభ్యులు పొసగే డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయగలిగేలాగానూ, వారి అభ్యర్థనలను ఆన్‌లైన్‌లో దాఖలు చేసేటట్లుగానూ వారికి ఒక వెసులుబాటును ఇప్పటికే అందుబాటులోకి తీసుకువచ్చారు.

ఈ రకం అభ్యర్థనలకు యాజమాన్య సంస్థ ఆన్‌లైన్ మాధ్యమం ద్వారా ఆమోదం తెలియజేసిన తరువాత తుది ఆమోదం కోసం ఈపీఎఫ్ఓకు పంపుతూ వచ్చేవారు.

2024-25 ఆర్థిక సంవత్సరంలో యాజమాన్య సంస్థల నుంచి దిద్దుబాటు కోసం ఈపీఎఫ్ఓకు అందిన మొత్తం 8 లక్షల అభ్యర్థనలలో దాదాపు 45 శాతం అభ్యర్థనలను యాజమాన్య సంస్థ సరిచూడడం (వెరిఫికేషన్) లేదా ఈపీఎఫ్‌ఓలో సమ్మతిని తెలియజేయడం అక్కర్లేకుండానే సభ్యులే వారంతట వారు ఆమోదాన్ని వ్యక్తంచేయడానికి ఆస్కారం ఉన్నవే. సగటున ఇది జాయింట్ డిక్లరేషన్ల (జేడీస్)కు మంజూరునివ్వడంలో యాజమాన్య సంస్థ స్థాయిలో జరిగే సుమారు 28 రోజుల జాప్యాన్ని నివారించ గలుగుతుంది. పూర్తి స్థాయి ఎలక్ట్రానిక్ నోయువర్ కస్టమర్ (ఈ-కేవైసీ) లేని ఈపీఎఫ్ ఖాతాదారులు మార్పునకు గానీ, సవరణకు గానీ అభ్యర్ధనలను దాఖలు చేస్తే ఈపీఎఫ్ఓలో ఎలాంటి ఆమోదం అక్కరలేకుండా యాజమాన్య సంస్థ స్థాయిలో ఆమోదముద్ర వేసే కేసులు మరో 50 శాతం వరకు ఉంటాయి.

ఈ దిద్దుబాటు (రివిజన్)తో, వేరు వేరు దశల్లో పెండింగ్ పడ్డ దాదాపు 3.9 లక్షల సభ్యుల అభ్యర్థనలకు వెనువెంటనే ప్రయోజనం కలగనుంది. సభ్యులు ఎవరైనా వారే స్వయంగా ఆమోదాన్ని తెలియజేసే వీలున్నవారు.. ఇప్పటికే వారు పెట్టుకొన్న అభ్యర్థన యాజమాన్య సంస్థ వద్ద పెండింగులో ఉంటే.. ఆ సభ్యులు అప్పటికే దాఖలు చేసిన వారి అభ్యర్థనలను తీసివేసి, సరళతరం చేసిన ప్రక్రియ ప్రకారం తాము కూడా ఆమోదాన్ని తెలియజేసేందుకు వీలు ఉంది. చాలావరకు కేసుల్లో సభ్యులు వారంతట వారే నేరుగానూ, కొన్ని ఎంపిక చేసిన కేసుల్లో యాజమాన్య సంస్థ ద్వారానూ ఆమోదం తెలియజేయవచ్చు,  

ప్రస్తుతం, సభ్యులు దాఖలు చేసిన ఫిర్యాదుల్లో దాదాపుగా 27 శాతం ఫిర్యాదులు సభ్యుల ప్రొఫైల్, కేవైసీ అంశాలకు సంబంధించినవి; సవరించిన జేడీ వెసులుబాటును ప్రవేశపెట్టినందువల్ల సభ్యులు సమర్పించే ఫిర్యాదుల సంఖ్య బాగా తగ్గిపోవచ్చన్న అంచనా ఏర్పడింది.

ఆన్‌లైన్ ప్రక్రియను సరళతరం చేయడం వల్ల సభ్యుల అభ్యర్థనలను వెంటవెంటనే పరిష్కరించడానికి మార్గం సుగమం అవుతుంది. ఫలితంగా, డేటాలో ఏకరూపతకు బాట పడుతుంది. తప్పులు దొర్లే భయం చాలావరకు తొలగిపోతుంది. అంతేకాక సభ్యులకు సేవలను మరింత సమర్థంగా అందించేందుకూ అవకాశం లభిస్తుంది. ఫలితంగా వారికి జీవన సౌలభ్యాన్ని పెంచొచ్చు. అదే సమయంలో, యాజమాన్య సంస్థలకు అనేక వివరాలను సరిచూడవలసిన అదనపు పనిభారాన్ని తప్పించనూవచ్చు; సరళీకరించిన ప్రక్రియ వ్యాపారం చేయడంలో సౌలభ్యాన్ని సైతం చెప్పుకోదగ్గ స్థాయిలో మెరుగుపరచగలుగుతుంది.


 

***


(Release ID: 2094369) Visitor Counter : 60