హోం మంత్రిత్వ శాఖ
హైదరాబాద్‌లోని నేషనల్ పోలీస్ అకాడమీ (ఎన్‌పీఏ)లో ఐపీఎస్ ప్రొబేషనర్లకు తుపాకులు ఉపయోగించటం(ఫైరింగ్) విషయంలో శిక్షణ ఇచ్చే ఇంటిగ్రేటెడ్ ఇండోర్ షూటింగ్ రేంజ్‌కు శంకుస్థాపన చేయనున్న కేంద్ర హోం, సహకార శాఖల మంత్రి శ్రీ అమిత్ షా
ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో రేపు జరగనున్న ఎన్డీఆర్‌ఎఫ్ 20వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొననున్న శ్రీ అమిత్ షా
ఎన్ఐడీఎం దక్షిణ భారత క్యాంపస్, ఎన్డీఆర్ఎఫ్ 10వ బెటాలియన్ క్యాంపస్, రీజినల్ రెస్పాన్స్ సెంటర్‌కు చెందిన సుపౌల్ క్యాంపస్ సహా సుమారు రూ. 220 కోట్ల విలువైన వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేయనున్న హోం మంత్రి
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని విపత్తు నిర్వహణ విషయంలో ఇప్పుడు సహాయ-కేంద్రీకృత విధానానికి బదులుగా ఎలాంటి మరణాలు ఉండకూడదన్న విధానాన్ని అవలంబిస్తోన్న భారత్.
ఎలాంటి విపత్తునైనా తట్టుకునే విధంగా వాటి ప్రభావాన్ని తగ్గించే వ్యవస్థను మరింత బలోపేతం చేయాలన్న ప్రధాని మోదీ దార్శనితకు అనుగుణంగా కీలక పాత్రను పోషిస్తోన్న ఎన్డీఆర్‌ఎఫ్, ఎన్ఐడీఎం
తిరుపతిలో రాష్ట్ర ప్రభుత్వ ప్రాంతీయ ఫోరెన్సిక్ సైన్స్ ప్రయోగశాల భవనాన్ని ప్రారంభించనున్న కేంద్ర హోంమంత్రి
Posted On:
18 JAN 2025 5:23PM by PIB Hyderabad
19 జనవరి 2025 ఆదివారం నాడు ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం(ఎన్డీఆర్ఎఫ్) 20వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో కేంద్ర హోం, సహకార శాఖల మంత్రి శ్రీ అమిత్ షా ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. ఈ సందర్భంగా ఆయన సుమారు 220 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేయనున్నారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో విపత్తు నిర్వహణ విషయంలో సహాయ- కేంద్రీకృత విధానానికి బదులుగా ఇప్పుడు ఎలాంటి మరణాలు ఉండకూడదన్న విధానాన్ని భారతదేశం అవలంబిస్తోంది. విపత్తుల సమయంలో సున్నా మరణాలు ఉండేలా చూసుకోవటమే లక్ష్యంగా ఈ విధానాన్ని తీసుకొచ్చారు.
జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ(ఎన్‌ఐడీఎం) దక్షిణ భారత క్యాంపస్, ఎన్డీఆర్ఎఫ్ 10వ బెటాలియన్, సుపౌల్(9వ బెటాలియన్)లోని రీజనల్ రెస్పాన్స్ సెంటర్ (ఆర్‌ఆర్‌సీ)లకు చెందిన మూడు ముఖ్యమైన క్యాంపస్‌లను కేంద్ర హోం, సహకార శాఖల మంత్రి ప్రారంభించనున్నారు. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2047 దార్శనికత కింద ఎన్‌ఐడీఎం, ఎన్డీఆర్‌ఎఫ్.. రెండూ భారతదేశాన్ని విపత్తు నిరోధక దేశంగా మార్చడంలో, దేశంలో విపత్తులకు సంబంధించిన ప్రమాదాలను తగ్గించే వ్యవస్థను బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. విపత్తు ప్రతిస్పందనలో ఎన్డీఆర్ఎఫ్ ప్రముఖ పాత్ర పోషిస్తుండగా… మానవ వనరుల అభివృద్ధి, సామర్థ్యం పెంపు, శిక్షణ, పరిశోధన, సమాచారాన్ని నిల్వ చేయటం, విధాన రూపకల్పనలో ఎన్‌ఐడీఎం కీలక పాత్రను పోషిస్తోంది.
హైదరాబాద్‌లోని నేషనల్ పోలీస్ అకాడమీ (ఎన్‌పీఏ)లో ఐపీఎస్ ప్రొబేషనరీ అధికారులకు తుపాకులను ఉపయోగించటం (ఫైరింగ్)పై శిక్షణ ఇచ్చే ఇంటిగ్రేటెడ్ ఇండోర్ షూటింగ్ రేంజ్‌కు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. ఇది 50 మీటర్ల పొడవు, 10 వరుసలను కలిగి ఉంటుంది. ఇక్కడ పది మంది వ్యక్తులు ఒకేసారి తుపాకులను ఉపయోగించటంపై ప్రాక్టీస్ చేయడానికి వీలు ఉంటుంది. ఇది అన్ని వాతావరణ పరిస్థితుల్లో పనిచేయటమే కాకుండా పూర్తిగా ఆటోమేటెడ్ పద్ధతితో అధునాతన సాంకేతికతో కూడుకున్నది. 27 కోట్ల వ్యయంతో దీన్ని నిర్మిస్తున్నారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా నిర్మిస్తోన్న ఈ షూటింగ్ రేంజ్ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఉంటుంది. దేశంలోని అన్ని పోలీసు సంస్థలతో పోల్చితే ఇది ఒక ప్రత్యేకమైన సదుపాయంగా ఉండనుంది.
అంకితభావం, సమర్థత, వృత్తి నైపుణ్యంతో ఎన్డీఆర్ఎఫ్ 10వ బెటాలియన్ విపత్తు నిర్వహణ రంగంలో అసాధారణ ఉదాహరణగా నిలిచింది. ఈ బెటాలియన్ ఏర్పడినప్పటి నుంచి 800 మిషన్లలో పాల్గొంది.. 15 వేల మందికి పైగా ప్రజల ప్రాణాలను కాపాడింది. లక్ష మందికి పైగా పౌరులను సురక్షిత ప్రాంతాలకు తరలించింది.
2016లో విపత్తు ప్రమాదాల తగ్గింపునకు సంబంధించి జరిగిన ఆసియా మంత్రిత్వ స్థాయి సదస్సు (ఆసియా మినిస్టీరియల్ కాన్ఫరెన్స్ ఆన్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్-ఏఎంసీడీఆర్‌ఆర్)లో విపత్తులు సంబంవించే ప్రమాదాన్ని తగ్గించేందుకు 10 సూత్రాల ఎజెండాను ప్రధాన మంత్రి మోదీ వివరించారు. దీనికి అనుగుణంగా జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (ఎన్‌ఐడీఎం) ఆధ్వర్యంలో విపత్తు ప్రమాదాల తగ్గింపు కోసం భారత విశ్వవిద్యాలయాలు, సంస్థల నెట్‌వర్క్‌ను (ఐయుఐఎన్‌డీఆర్‌ఆర్-ఎన్‌ఐడీఎం)నుఏర్పాటు చేశారు. విపత్తులను తట్టుకోవటంలో విద్య, పరిశోధన, శిక్షణకు సంబంధించిన పాత్రను తెలియజేయటం, వివిధ స్థాయిలలో విపత్తు ప్రమాదాన్ని తగ్గించే అంశాన్ని సమీకృతం చేసేందుకు ప్రామాణిక పాఠ్యాంశాల అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ఈ నెట్‌వర్క్ పని చేస్తోంది.
దేశంలోని దక్షిణ ప్రాంత అవసరాలను తీర్చడానికి 2014 ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టానికి అనుగుణంగా కృష్ణా జిల్లాలో ఎన్‌ఐడీఎం దక్షిణ భారత క్యాంపస్‌ను ఏర్పాటు చేసింది. ఈ క్యాంపస్ మే 2023 నుంచి పాక్షికంగా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. స్వల్ప వ్యవధిలోనే 44కి పైగా శిక్షణ కార్యక్రమాలను నిర్వహించింది. విపత్తు నిర్వహణకు సంబంధించి వివిధ అంశాలలో 2,130 మందికి పైగా శిక్షణను అందించింది.
***
(Release ID: 2094141)
Visitor Counter : 17