ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025ను ప్రారంభించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ


వికసిత్ భారత్ ప్రయాణం మొబిలిటీ రంగంలో అపూర్వ మార్పు, అసాధారణవృద్ధితో ముడిపడింది: ప్రధాన మంత్రి

నేడు ప్రయాణ సౌలభ్యమే భారత్ కు అత్యంత ప్రాధాన్యం: ప్రధాని

మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం బలం దేశ ఆటో పరిశ్రమ వృద్ధికి ఊతం ఇస్తోంది: ప్రధానమంత్రి

దేశ రవాణా పరిష్కారాలలోని ఏడు ‘సి‘ లు- కామన్ (సాధారణ),కనెక్ట్ (అనుసంధానం), కన్వీనియెంట్ (అనుకూల) , కంజేషన్ ఫ్రీ (రద్దీ లేని), ఛార్జ్డ్, క్లీన్ (శుభ్రమైన), కటింగ్ ఎడ్జ్ (అత్యాధునిక): పి ఎం

నేడు భారతదేశం గ్రీన్ టెక్నాలజీ, ఎలక్ట్రిక్ వాహనాలు, హైడ్రోజన్ ఇంధనం, జీవ ఇంధనాల అభివృద్ధిపై దృష్టి సారించింది: ప్రధాన మంత్రి

మొబిలిటీ రంగంలో తమ భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలనుకునే ప్రతి పెట్టుబడిదారుకు భారతదేశం అద్భుతమైన గమ్యస్థానంగా నిలుస్తుంది: ప్రధాని

Posted On: 17 JAN 2025 1:05PM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న్యూఢిల్లీ లోని భారత మండపంలో రవాణా కు సంబంధించి దేశంలోనే అతి పెద్ద మొబిలిటీ ఎక్స్ పో- భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్ పో 2025 ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, తమ ప్రభుత్వాన్ని వరుసగా మూడోసారి ఎన్నుకున్నందుకు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. గత ఏడాది 800 మంది ఎగ్జిబిటర్లు, 2.5 లక్షల మంది సందర్శకులతో పోలిస్తే, నేషనల్ క్యాపిటల్ రీజియన్ లోని మరో రెండు వేదికలపై ఎక్స్ పో జరగడంతో ఈ ఏడాది ఎక్స్ పో పరిమాణం బాగా పెరిగిందని ఆయన అన్నారు. వచ్చే 5 రోజుల్లో అనేక కొత్త వాహనాలను ప్రారంభిస్తారని, ఈ ప్రదర్శనకు పెద్ద సంఖ్యలో ప్రతినిధులు హాజరవుతారని శ్రీ మోదీ పేర్కొన్నారు. “ఇది భారతదేశంలో మొబిలిటీ భవిష్యత్‌పై గొప్ప సానుకూలతను చూపిస్తుంది” అని ఆయన అన్నారు. ఎగ్జిబిషన్ ను సందర్శించిన సందర్భంగా శ్రీ మోదీ మాట్లాడుతూ, "భారతదేశ ఆటోమొబైల్ పరిశ్రమ అద్భుతమైనది, భవిష్యత్తుకు సిద్ధంగా ఉంది" అని అన్నారు. ప్రతి ఒక్కరికీ తన శుభాకాంక్షలను తెలియజేశారు.

భారత ఆటోమొబైల్ రంగానికి సంబంధించిన ఈ గొప్ప కార్యక్రమంలో శ్రీ రతన్ టాటా శ్రీ ఒసాము సుజుకిలను ప్రధానమంత్రి గుర్తు చేసుకున్నారు. భారత ఆటోమొబైల్ రంగం అభివృద్ధిలోనూ, దేశంలోని మధ్యతరగతి కుటుంబాల కలలను నెరవేర్చడంలోనూ ఈ ఇద్దరు దిగ్గజాల కృషి ఎనలేనిదని ఆయన ప్రశంసించారు. వారి వారసత్వం భారతదేశంలోని మొత్తం మొబిలిటీ రంగానికి ప్రేరణగా నిలుస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

"ప్రజల ఆకాంక్షలతోను, యువశక్తితోనూ భారత ఆటోమొబైల్ రంగం అపూర్వ మార్పు దిశగా పురోగమిస్తోంది” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు. గత ఏడాది కాలంలో భారత ఆటో పరిశ్రమ దాదాపు 12 శాతం వృద్ధిని సాధించిందన్నారు. మేకిన్ ఇండియా, మేక్ ఫర్ ది వరల్డ్ నినాదంతో ఎగుమతులు పెరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. భారతదేశంలో ఏటా అమ్ముడవుతున్న కార్ల సంఖ్య అనేక దేశాల జనాభాను మించిపోతోందని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు. సంవత్సరానికి సుమారు 2.5 కోట్ల కార్ల అమ్మకాలు భారతదేశంలో నిరంతరం పెరుగుతున్న డిమాండ్ కు నిదర్శనమని ఆయన అన్నారు. మొబిలిటీ భవిష్యత్తు విషయానికి వస్తే భారతదేశాన్ని ఇంత భారీ అంచనాలతో ఎందుకు చూస్తున్నారో ఈ వృద్ధి తెలియజేస్తుందని ప్రధానమంత్రి ఉద్ఘాటించారు.

"భారతదేశం ప్రస్తుతం ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ, మూడో అతిపెద్ద ప్రయాణ వాహన మార్కెట్" అని శ్రీ మోదీ చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా మొదటి మూడు ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా భారత్ ఎదుగుతున్నందున, దేశ ఆటో మార్కెట్ అసాధారణమైన మార్పును, విస్తరణను చూస్తుందని ఆయన పేర్కొన్నారు. మేకిన్ ఇండియా కార్యక్రమం ద్వారా దేశంలోని అధిక యువ జనాభా, విస్తరిస్తున్న మధ్యతరగతి, వేగవంతమైన పట్టణీకరణ, ఆధునిక మౌలిక సదుపాయాల అభివృద్ధి, చౌకైన వాహనాలతో సహా అనేక అంశాలు భారతదేశంలో మొబిలిటీ భవిష్యత్తును నడిపిస్తాయని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. ఈ అంశాలు సమష్టిగా భారత్ లో ఆటోమొబైల్ రంగం వృద్ధికి దోహదం చేస్తాయని ఆయన అన్నారు.

ఆటోమొబైల్ పరిశ్రమ వృద్ధికి అవసరం, ఆకాంక్ష రెండూ ప్రాముఖ్యత కలిగి ఉన్నాయని భారతదేశం ఈ రెండింటినీ కలిగి ఉందని ప్రధానమంత్రి చెప్పారు. భారత్ అనేక దశాబ్దాల పాటు ప్రపంచంలోనే అత్యంత యువ జనాభా కలిగిన దేశంగా ఉంటుందని, యువత అతిపెద్ద వినియోగదారుల వ్యవస్థగా నిలుస్తుందని ప్రధానమంత్రి చెప్పారు. ఈ పెద్ద సంఖ్యలో యువత గణనీయమైన డిమాండ్ ను సృష్టిస్తుందని ఆయన పేర్కొన్నారు. మరో ప్రధాన వినియోగదారు వ్యవస్థ భారతదేశ మధ్యతరగతి అని, గత దశాబ్ద కాలంలో 25 కోట్ల మంది భారతీయులు పేదరికం నుంచి బయట పడ్డారని, వారు నయా (కొత్త) మధ్యతరగతిగా ఏర్పడి తమ మొదటి వాహనాలను కొనుగోలు చేస్తున్నారని ప్రధానమంత్రి పేర్కొన్నారు. పురోగతి కొనసాగుతున్న కొద్దీ, ఈ వర్గం తమ వాహనాలను అప్ గ్రేడ్ చేస్తుందని, ఇది ఆటో రంగానికి ప్రయోజనం చేకూరుస్తుందని ఆయన అన్నారు.

ఒకప్పుడు భారతదేశంలో కార్లు కొనుగోలు చేయకపోవడానికి మంచి, విశాలమైన రోడ్లు లేకపోవడం ఒక కారణమని పేర్కొన్న ప్రధానమంత్రి, ఇప్పుడు ఈ పరిస్థితి మారుతోందని, "ప్రయాణ సౌలభ్యం ఇప్పుడు భారతదేశానికి ప్రధాన ప్రాధాన్యత" అని అన్నారు. గత ఏడాది బడ్జెట్ లో మౌలిక సదుపాయాల కల్పనకు రూ.11 లక్షల కోట్లకు పైగా కేటాయించడాన్ని ప్రధాని గుర్తు చేశారు. భారతదేశం అంతటా బహుళ లేన్ల హైవేలు, ఎక్స్ ప్రెస్ వేలు నిర్మిస్తున్నట్టు ప్రధానమంత్రి వివరించారు. పీఎం గతిశక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్ మల్టీమోడల్ కనెక్టివిటీని వేగవంతం చేసిందని, రవాణా ఖర్చులను తగ్గించిందని ఆయన పేర్కొన్నారు. జాతీయ రవాణా విధానం వల్ల ప్రపంచవ్యాప్తంగా అత్యంత చౌకైన రవాణా వ్యయాలు కలిగిన దేశంగా భారత్ నిలుస్తుందని ప్రధానమంత్రి ఉద్ఘాటించారు. ఈ ప్రయత్నాలు ఆటో పరిశ్రమకు అనేక కొత్త అవకాశాలను తెరుస్తున్నాయని, దేశంలో వాహనాలకు డిమాండ్ పెరగడానికి ఇది ఒక ముఖ్యమైన కారణమని ఆయన పేర్కొన్నారు.

"మంచి మౌలిక సదుపాయాలతో పాటు, కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా జత చేస్తున్నారు" అని శ్రీ మోదీ అన్నారు. ఫాస్టాగ్ భారతదేశంలో డ్రైవింగ్ అనుభవాన్ని మరింత సులభతరం చేసిందని ఆయన పేర్కొన్నారు. జాతీయ ఉమ్మడి మొబిలిటీ కార్డు భారతదేశంలో అంతరాయం లేని ప్రయాణ సౌలభ్యం కోసం చేసే ప్రయత్నాలను మరింత బలోపేతం చేస్తోందని,  కనెక్టెడ్ వెహికల్స్, అటానమస్ డ్రైవింగ్ లో వేగవంతమైన పురోగతితో భారతదేశం ఇప్పుడు స్మార్ట్ మొబిలిటీ వైపు పయనిస్తోందని ఆయన పేర్కొన్నారు.

భారతదేశ ఆటోమొబైల్ పరిశ్రమ వృద్ధి సామర్థ్యంలో మేకిన్ ఇండియా కార్యక్రమం గణనీయమైన పాత్రను ప్రస్తావిస్తూ, పిఎల్ ఐ పథకాలు మేకిన్ ఇండియా ప్రచారానికి కొత్త ఊపునిచ్చాయని, రూ.2.25 లక్షల కోట్లకు పైగా అమ్మకాలకు దోహదపడ్డాయని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఈ పథకం ద్వారా ఈ రంగంలో 1.5 లక్షలకు పైగా ప్రత్యక్ష ఉద్యోగాలు లభించాయని,  ఆటోమొబైల్ రంగంలో ఉద్యోగాల కల్పన ఇతర రంగాలపై గుణాత్మక ప్రభావాన్ని చూపిందని ప్రధాని పేర్కొన్నారు. పెద్ద సంఖ్యలో ఆటో విడిభాగాలను ఎంఎస్ఎంఇ రంగం తయారు చేస్తోందన్నారు. ఆటోమొబైల్ రంగం పెరుగుతున్న కొద్దీ ఎంఎస్ఎంఇలు, టూరిజం, రవాణా రంగాల్లో కూడా కొత్త ఉద్యోగాలు వస్తున్నాయని ఆయన చెప్పారు.

ఆటోమొబైల్ రంగానికి ప్రభుత్వం ప్రతి దశలోనూ అందిస్తున్న సహకారం గురించి చెబుతూ, గత దశాబ్దకాలంలో ఎఫ్ డీఐలు, టెక్నాలజీ బదిలీ, ప్రపంచ భాగస్వామ్యాలకు పరిశ్రమలో కొత్త అవకాశాలు ఏర్పడ్డాయని శ్రీ మోదీ పేర్కొన్నారు. గడచిన నాలుగేళ్లలోనే ఈ రంగం 36 బిలియన్ డాలర్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించిందని ప్రధాని చెప్పారు. రాబోయే సంవత్సరాల్లో ఈ సంఖ్య రెట్టింపు అవుతుందని పేర్కొన్నారు. భారతదేశం లోనే ఆటోమొబైల్ తయారీకి సంబంధించి పూర్తి వనరులతో అనుకూల వ్యవస్థను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు.

కామన్ (సాధారణ), కనెక్టెడ్(అనుసంధానం), కన్వీనియెంట్ (అనుకూలమైన) , కంజేషన్ ఫ్రీ (రద్దీ లేని), ఛార్జ్డ్,  క్లీన్ (శుభ్రమైన), కటింగ్ ఎడ్జ్ (అత్యాధునిక) అనే ఏడు‘ సి‘ లతో కూడిన తన దార్శనికతను గుర్తు చేసుకున్న ప్రధానమంత్రి, హరిత ప్రయాణ సౌకర్యానికి ప్రాధాన్యం ఇవ్వడం ఈ దార్శనికతలో భాగమని చెప్పారు. శిలాజ ఇంధనాల దిగుమతి బిల్లును తగ్గించడం ద్వారా ఆర్థిక వ్యవస్థ, పర్యావరణం రెండింటికీ మద్దతు ఇచ్చే మొబిలిటీ వ్యవస్థను అందించడానికి భారత్ సిద్ధమవుతోందని ఆయన చెప్పారు. గ్రీన్ టెక్నాలజీ, ఎలక్ట్రిక్ వాహనాలు, హైడ్రోజన్ ఇంధనం, జీవ ఇంధనాల అభివృద్ధిపై ప్రధానంగా దృష్టి సారించినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ దార్శనికతను దృష్టిలో పెట్టుకొని నేషనల్ ఎలక్ట్రిక్ మొబిలిటీ మిషన్, గ్రీన్ హైడ్రోజన్ మిషన్ వంటి కార్యక్రమాలను ప్రారంభించామని ప్రధానమంత్రి వివరించారు.

గత కొన్నేళ్లలో భారతదేశంలో ఎలక్ట్రిక్ మొబిలిటీ వేగవంతమైన వృద్ధి సాధించిందని, గత దశాబ్దంలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు 640 రెట్లు పెరిగాయని ప్రధాని పేర్కొన్నారు. పదేళ్ల క్రితం ఏటా 2,600 ఎలక్ట్రిక్ వాహనాలు మాత్రమే అమ్ముడుపోగా, 2024లో 16.80 లక్షలకు పైగా ఎలక్ట్రిక్ వాహనాలు అమ్ముడయ్యాయని అన్నారు. దశాబ్దం క్రితం ఒక సంవత్సరంలో విక్రయించిన ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్య కంటే ఈ రోజు ఒక్క రోజులో విక్రయించిన ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్య రెట్టింపు అని ఆయన చెప్పారు. ఈ దశాబ్దం చివరి నాటికి భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్య ఎనిమిది రెట్లు పెరుగుతుందని ప్రధానమంత్రి అంచనా వేశారు, ఇది ఈ విభాగంలో అపారమైన సామర్థ్యాన్ని సూచిస్తుంది. దేశంలో ఎలక్ట్రిక్ మొబిలిటీ విస్తరణకు ప్రభుత్వం అందిస్తున్న నిరంతర విధాన నిర్ణయాలు, మద్దతును వివరిస్తూ, ఐదేళ్ల క్రితం ప్రారంభించిన ఫేమ్ -2 పథకం రూ .8,000 కోట్లకు పైగా ప్రోత్సాహకాలను అందించిందని పేర్కొన్నారు. ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుకు, ఛార్జింగ్ మౌలిక సదుపాయాల ఏర్పాటుకు, 5,000 కి పైగా ఎలక్ట్రిక్ బస్సులతో సహా 16 లక్షలకు పైగా ఎలక్ట్రిక్ వాహనాలకు ఈ మొత్తాన్ని ఉపయోగించామని ఆయన చెప్పారు. కేంద్ర ప్రభుత్వం అందించిన 1,200 ఎలక్ట్రిక్ బస్సులు ఢిల్లీలో నడుస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ద్విచక్ర వాహనాలు, త్రిచక్ర వాహనాలు, ఈ-అంబులెన్స్ లు, ఈ-ట్రక్కులతో సహా సుమారు 28 లక్షల ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుకు తోడ్పడే పీఎం ఈ-డ్రైవ్ పథకాన్ని తమ మూడవ పర్యాయం అధికార సమయంలో ప్రవేశపెట్టడాన్ని ప్రధానమంత్రి ప్రస్తావించారు. దేశవ్యాప్తంగా చిన్న నగరాల్లో సుమారు 38,000 ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణకు మద్దతు ఇవ్వడానికి పిఎం ఇ-బస్ సేవలను ప్రారంభించినట్లు ప్రధాన మంత్రి పేర్కొన్నారు. ఎలక్ట్రిక్ వాహనాల తయారీకి ప్రభుత్వం అందిస్తున్న నిరంతర సహకారం గురించి ప్రస్తావిస్తూ, భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల తయారీపై ఆసక్తి ఉన్న ప్రపంచ పెట్టుబడిదారులకు మార్గాలు కల్పించినట్టు చెప్పారు. ఈ ప్రయత్నాలు నాణ్యమైన ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సదుపాయాలను విస్తరించడానికి, భారతదేశంలో విలువ జోడింపునకు సహాయపడతాయని ఆయన తెలియచేశారు.
గ్లోబల్ వార్మింగ్, వాతావరణ మార్పుల సవాళ్లను ఎదుర్కోవడానికి సౌరశక్తిని, ప్రత్యామ్నాయ ఇంధనాలను నిరంతరం ప్రోత్సహించాల్సిన అవసరాన్ని చెబుతూ, భారతదేశ జి-20 అధ్యక్ష కాలంలో హరిత భవిష్యత్తుకు అధిక ప్రాధాన్యత ఇచ్చిందని చెప్పారు. ఎలక్ట్రిక్ వాహనాలు, సౌర విద్యుత్ రెండింటిపై భారత్ లో గణనీయమైన కృషి జరుగుతోందని ఆయన తెలిపారు. ఉచిత విద్యుత్ పథకం  పీఎం సూర్యగఢ్ - రూఫ్ టాప్ సోలార్ కోసం ఒక ప్రధాన మిషన్ అని ఆయన పేర్కొన్నారు. ఈ రంగంలో బ్యాటరీలు, స్టోరేజ్ సిస్టమ్ లకు పెరుగుతున్న డిమాండ్ ను ప్రధానమంత్రి ప్రస్తావించారు.  అధునాతన కెమిస్ట్రీ సెల్ బ్యాటరీ స్టోరేజీని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం రూ.18,000 కోట్లతో పీఎల్ఐ పథకాన్ని ప్రారంభించిందన్నారు. ఈ రంగంలో గణనీయమైన పెట్టుబడులకు ఇదే సరైన సమయమని శ్రీ మోదీ చెప్పారు. ఇంధన నిల్వ రంగంలో స్టార్టప్ లను ప్రారంభించాలని ఆయన దేశ యువతను కోరారు. భారతదేశంలో లభ్యమవుతున్న పదార్థాలను ఉపయోగించి బ్యాటరీలు, స్టోరేజ్ వ్యవస్థలను రూపొందించడానికి అవకాశాలు కల్పించే అవిష్కరణలపై పనిచేయాల్సిన అవసరం ఉందని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. ఇప్పటికే ఈ రంగంలో గణనీయమైన పనులు జరుగుతున్నాయని, అయితే ఒక లక్ష్యంగా దీన్ని ముందుకు తీసుకెళ్లడం అవసరమని ఆయన పేర్కొన్నారు.

కేంద్ర ప్రభుత్వానికి స్పష్టమైన ఉద్దేశం, నిబద్ధత ఉన్నాయని, కొత్త విధానాలయినా, సంస్కరణలయినా ప్రభుత్వ ప్రయత్నాలు కొనసాగుతున్నాయని అన్నారు. వాహన స్క్రాపింగ్ విధానాన్ని సద్వినియోగం చేసుకోవాలని తయారీదారులను కోరిన ఆయన, కంపెనీలు తమ పాత వాహనాలను స్క్రాప్ చేయడంలో ఎక్కువ మందిని ప్రోత్సహించడానికి తమ సొంత ప్రోత్సాహక పథకాలను ప్రవేశపెట్టవచ్చని ప్రధాని సూచించారు. ఈ ప్రోత్సాహం చాలా కీలకమైనదని, దేశ పర్యావరణానికి గణనీయమైన సేవ అవుతుందని ప్రధానమంత్రి అన్నారు.

ఆటోమొబైల్ పరిశ్రమ నూతన ఆవిష్కరణలు, సాంకేతిక పరిజ్ఞానంతో నడుస్తుందని ప్రధాన మంత్రి అన్నారు. భవిష్యత్తు తూర్పు, ఆసియా, భారత్ దేనని ఆయన ఉద్ఘాటించారు. మొబిలిటీ రంగంలో తమ భవిష్యత్తును చూడాలనుకునే ప్రతి పెట్టుబడిదారుడికి భారతదేశం ఒక అద్భుతమైన గమ్యస్థానమని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. ప్రసంగాన్ని ముగిస్తూ శ్రీ మోదీ, "మేక్ ఇన్ ఇండియా, మేక్ ఫర్ ది వరల్డ్" అనే మంత్రంతో ముందుకు సాగాలని,  ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం పూర్తి మద్దతు, ప్రోత్సాహం అందిస్తుందని హామీ ఇచ్చారు.

కేంద్ర ఉపరితల రవాణా, రహదారుల శాఖ మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ, కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రి శ్రీ మనోహర్ లాల్, కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ మంత్రి శ్రీ హెచ్ డి కుమారస్వామి, కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి శ్రీ పియూష్ గోయల్, కేంద్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల మంత్రి శ్రీ జితన్ రామ్ మాంఝీ, కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు శాఖ మంత్రి శ్రీ హర్దీప్ సింగ్ పూరి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

నేపథ్యం

భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్ పో 2025 జనవరి 17-22 వరకు న్యూఢిల్లీలోని మూడు వేదికలు- భారత్ మండపం, యశోభూమి, గ్రేటర్ నోయిడాలోని ఇండియా ఎక్స్ పో సెంటర్ అండ్ మార్ట్ లలో జరుగుతుంది. ఎక్స్ పోలో 9 సమాంతర ప్రదర్శనలు, 20 పైగా సమావేశాలు, పెవిలియన్లు  నిర్వహిస్తారు. ఇంకా, పరిశ్రమ, ప్రాంతీయ స్థాయిల మధ్య సహకారాన్ని ప్రోత్సహించడానికి మొబిలిటీ రంగంలో విధానాలు, ఆవిష్కరణలను ప్రదర్శించడానికి ఈ ఎక్స్ పో లో రాష్ట్రాల సెషన్లు కూడా ఉంటాయి.

భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్ పో 2025 మొత్తం మొబిలిటీ వ్యాల్యూ చైన్ ను ఒకే గొడుగు కిందకు తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది.  ఎగ్జిబిటర్లుగా, సందర్శకులుగా ప్రపంచం నలుమూలల నుంచి భాగస్వామ్యం కావడంతో ఈ ఏడాది ఎక్స్ పో ప్రపంచ ప్రాముఖ్యత సంతరించుకుంది. ఇది పరిశ్రమ సారథ్య, ప్రభుత్వ మద్దతు కలిగిన కార్యక్రమం. వివిధ పరిశ్రమ సంఘాలు, భాగస్వామ్య సంస్థల ఉమ్మడి మద్దతుతో ఇంజనీరింగ్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఈ ప్రదర్శనను సమన్వయం చేస్తోంది.


 

 

 

***

MJPS/SR


(Release ID: 2094123) Visitor Counter : 27