ఉక్కు మంత్రిత్వ శాఖ
రూ.11,440 కోట్లతో రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (ఆర్‌ఐఎన్‌ఎల్) పునరుద్ధరణ ప్రణాళికకు కేబినెట్ కమిటీ ఆమోదం
Posted On:
17 JAN 2025 6:30PM by PIB Hyderabad
గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీఈఏ) రూ. 11,440 కోట్లతో ఆర్ఐఎన్ఎల్ పునరుద్ధరణ ప్రణాళికను ఆమోదించింది. ఇందులో రూ. 10,300 కోట్లు రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (ఆర్ఐఎన్ఎల్)లోకి ఈక్విటీ మూలధనంగా, రూ. 1,140 కోట్ల నిర్వహణ మూలధనం 7 శాతం సంచితం కాని ప్రాధాన్య వాటా మూలధనంగా ఉంటుంది. పదేళ్ల తర్వాత వీటిని విడిపించుకుని ఆర్ఐఎన్ఎల్ ను గతిశీల సంస్థగా నిలపవచ్చు.
ఆర్ఐఎన్ఎల్ ఉక్కు మంత్రిత్వ శాఖ పరిపాలన నియంత్రణలో ఉన్న షెడ్యూలు-ఎ సీపీఎస్ఈ. 100% భారత ప్రభుత్వ యాజమాన్యంలో ఉంది. విశాఖపట్నం ఉక్కు కర్మాగారాన్ని (వీఎస్పీ) ఆర్ఐఎన్ఎల్ నిర్వహిస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ రంగంలో ఉన్న ఏకైక తీర ప్రాంత ఉక్కు కర్మాగారం వీఎస్పీ. ఏడాదికి 7.3 మిలియన్ టన్నుల ద్రవ రూప ఉక్కు దీని స్థాపిత సామర్థ్యం.
ఆర్ఐఎన్ఎల్ ఆర్థిక పరిస్థితి క్లిష్టంగా ఉంది (గతేడాది మార్చి 31 నాటికి ఆర్ఐఎన్ఎల్ నికర విలువ రూ. (-) 4538.00 కోట్లు, ప్రస్తుత ఆస్తులు రూ. 7,686.24 కోట్లు, ప్రస్తుత అప్పులు రూ. 26,114.92 కోట్లు). ఆర్ఐఎన్ఎల్ కు సంబంధించి నిర్వహణ మూలధనం కోసం బ్యాంకులు మంజూరు చేసే రుణ పరిమితులు ముగిశాయి. బ్యాంకుల నుంచి తదుపరి రుణాలు పొందే పరిస్థితి లేదు. గతేడాది జూన్ లో కాపెక్స్ రుణ చెల్లింపులు, వడ్డీ చెల్లింపులను కూడా ఆర్ఐఎన్ఎల్ చేయలేకపోయింది.
ఆర్ఐఎన్ఎల్ కు రూ. 10,300 కోట్ల ఈక్విటీని అందించడం నిర్వహణ మూలధనాన్ని పెంచడంలో సమస్యలను అధిగమించడానికి సహాయపడుతుంది. మరింత ఉత్పాదక పద్ధతుల్లో కార్యకలాపాలను ప్రారంభించడానికి ఇది దోహదం చేస్తుంది. దాంతో కంపెనీ క్రమంగా కీలకమైన తన పూర్తి ఉత్పత్తి సామర్థ్యాన్ని చేరుకోగలదు. ఉక్కు ఉత్పత్తిని పెంపొందించడం ద్వారా భారత ఉక్కు మార్కెట్‌లో స్థిరత్వాన్ని నెలకొల్పడం జాతీయ ప్రయోజనం. అంతేకాకుండా ఉద్యోగుల, ఉక్కు కర్మాగార కార్యకలాపాలపై ఆధారపడి ఉన్న వారి జీవనోపాధులనూ ఇది రక్షిస్తుంది. ఈ నెలలో రెండు, ఈ ఏడాది ఆగష్టులో మూడు బ్లాస్ట్ ఫర్నేస్ తో పూర్తి స్థాయి ఉత్పత్తిని ప్రారంభిస్తుందని పునరుద్ధరణ ప్రణాళిక అంచనా.
ఉక్కు ఉత్పత్తి ఆర్థిక వ్యవస్థలో ప్రధాన రంగం. ఏ దేశానికైనా ఆర్థికాభివృద్ధి సూచికలలో అది ఒకటి. విశాఖపట్నం ఉక్కు కర్మాగారం పునరుద్ధరణ, పూర్తి సామర్థ్యంతో కార్యకలాపాల కొనసాగింపు ప్రజా వనరులను సమర్ధవంతంగా వినియోగించడంలో భరోసా ఇస్తుంది. అంతేకాకుండా 2017 జాతీయ ఉక్కు విధానం లక్ష్యాలను సాధించడంలో దోహదపడుతుంది.
ఆత్మనిర్భర భారత్ కోసం దేశీయ పరిశ్రమలకు చేయూత ఇవ్వడంలో ప్రభుత్వ స్థిరమైన నిబద్ధతకు ఈ వ్యూహాత్మక నిర్ణయం నిదర్శనం.
(Release ID: 2093949)
Visitor Counter : 57