హోం మంత్రిత్వ శాఖ
ముంబయి, చెన్నై, కోల్‌కతా, బెంగళూరు, హైదరాబాద్, కొచ్చిన్, అహ్మదాబాద్ లలో ‘ఫాస్ట్ ట్రాక్ ఇమిగ్రేషన్ - ట్రస్టెడ్ ట్రావెలర్ ప్రోగ్రాం’ (ఎఫ్‌టిఐ - టీటీపీ)ను అహ్మదాబాద్ నుంచి ప్రారంభించనున్న కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో 2047 కల్లా ‘వికసిత్ భారత్’ లక్ష్య సాధనలో భాగంగా తీసుకున్న ఓ ముఖ్య నిర్ణయం... ఎఫ్‌టిఐ - టీటీపీ
ఇమిగ్రేషన్ ప్రక్రియ సరళతరం... ప్రయాణికులకు భద్రత, ప్రపంచ శ్రేణి సౌకర్యాలు
మొదట్లో భారతదేశ పౌరులకూ, ఓసీఐ కార్డుదారులకూ ఈ సౌకర్యం ఉచితం
దేశమంతటా 21 ప్రధాన విమానాశ్రయాల్లో ఎఫ్‌టిఐ - టీటీపీ సేవలు
Posted On:
15 JAN 2025 12:48PM by PIB Hyderabad
‘ఫాస్ట్ ట్రాక్ ఇమిగ్రేషన్ - ట్రస్టెడ్ ట్రావెలర్ ప్రోగ్రాం’ (ఎఫ్‌టిఐ - టీటీపీ)నికేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా రేపు, అంటే 2025 జనవరి 16న, అహ్మదాబాద్ నుంచి ప్రారంభించనున్నారు. ఈ ఎఫ్‌టీఐ - టీటీపీ సేవలు అహ్మదాబాద్, ముంబయి, చెన్నై, కోల్‌కతా, బెంగళూరు, కొచ్చిన్లతోపాటు హైదరాబాద్‌లోనూ అమలులోకి రానున్నాయి. హోం మంత్రి ఇప్పటికే కిందటి ఏడాది జూన్ 22న ఈ ఎఫ్‌టీఐ - టీటీపీ సేవలను న్యూఢిల్లీ ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (ఐజీఐ) లో మూడో టెర్మినల్ నుంచి ప్రారంభించారు.
2047కల్లా వికసిత్ భారత్‌ను ఆవిష్కరించాలన్న లక్ష్యాన్ని సాధించడంలో ‘ఫాస్ట్ ట్రాక్ ఇమిగ్రేషన్ - ట్రస్టెడ్ ట్రావెలర్ ప్రోగ్రాం’ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో తీసుకున్న ఒక ముఖ్య నిర్ణయం. ఇమిగ్రేషన్ విషయంలో ప్రయాణికులకు ప్రపంచ స్థాయి సేవల్ని అందించడం, వారికి అంతర్జాతీయ ప్రయాణాల్ని ఇబ్బందులూ లేనివిగా తీర్చిదిద్దడం ఎఫ్‌టిఐ - టీటీపీ లక్ష్యాలు. మొదట్లో ఈ సదుపాయాన్ని భారతదేశ పౌరులకు, ఓవర్సీస్ సిటిజన్‌షిప్ ఆఫ్ ఇండియా (ఓసీఐ) కార్డును కలిగి ఉన్న వ్యక్తులకు ఉచితంగానే అందిస్తారు.
ఎఫ్‌టీఐ - టీటీపీని ఆన్‌లైన్ పోర్టల్ https://ftittp.mha.gov.in ద్వారా అమలులోకి తెచ్చారు. ఈ ప్రోగ్రాంలో పేరు నమోదు చేసుకోవడానికి దరఖాస్తుదారులు వారి వివరాలను నింపి, అవసరమైన కాగితాలను పోర్టల్‌లో అప్‌లోడ్ చేసి ఆన్‌లైన్ నమోదు ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. నమోదు పూర్తి అయిన దరఖాస్తుదారుల బయోమెట్రిక్ డేటాను ఫారినర్స్ రీజనల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ (ఎఫ్ఆర్ఆర్ఓ) లో గాని, లేదా విమానాశ్రయం నుంచి వెళ్లేటప్పుడు గాని సేకరిస్తారు.
విమాన సంస్థ జారీ చేసిన బోర్డింగ్ పాసును నమోదిత ప్రయాణికులు ఈ-గేట్ వద్ద స్కాన్ చేయాల్సి ఉంటుంది. తరువాత వారి పాస్‌పోర్టును కూడా స్కాన్ చేయాలి. ప్రవేశ, నిష్క్రమణ స్థలాల్లోనూ ప్రయాణికుల బయోమెట్రిక్స్‌ను ఈ-గేట్ల వద్ద ధ్రువీకరిస్తారు. ఈ రూఢిపరచుకొనే ప్రక్రియ విజయవంతంగా ముగిస్తే ఈ-గేట్ తనంతట తాను తెరచుకొంటుంది. దీనివల్ల ఇమిగ్రేషన్ క్లియరెన్సు తేలిగ్గా పూర్తవుతుంది.
ఎఫ్‌టీఐ - టీటీపీని దేశవ్యాప్తంగా 21 ప్రధాన విమానాశ్రయాల్లో అమలులోకి తెస్తారు. మొదటి దశలో ఢిల్లీకి అదనంగా ఈ సదుపాయాన్ని ఏడు ప్రధాన విమానాశ్రయాల్లో ప్రవేశపెడుతున్నారు. ఆ ఏడు ప్రధాన నగరాల పేర్లు: ముంబయి, చెన్నై, కోల్‌కతా, బెంగళూరు, హైదరాబాద్, కొచ్చిన్, అహ్మదాబాద్.
***
(Release ID: 2093187)
Visitor Counter : 6