రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌
azadi ka amrit mahotsav

గణతంత్ర వేడుకలు 2025: 1.76 కోట్ల మంది విద్యార్థులు పాల్గొన్న వీర గాథ 4.0 కు దేశవ్యాప్తంగా అపూర్వ స్పందన


జాతీయ స్థాయిలో గెలుపొందిన 100 మంది విజేతలకు విశిష్ట అతిథులుగా కర్తవ్యపథ్‌లో సంప్రదాయ కవాతు చూసే అవకాశం

Posted On: 10 JAN 2025 2:24PM by PIB Hyderabad

 

గణతంత్ర దినోత్సవాల్లో భాగంగా రక్షణ మంత్రిత్వ శాఖ, విద్యా మంత్రిత్వ శాఖ సంయుుక్తంగా నిర్వహిస్తున్న నాలుగో విడత ‘వీర్ గాథ 4.0’ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ ఏడాది దాదాపుగా 2.31 లక్షల పాఠశాలల నుంచి సుమారు 1.76 కోట్ల మంది విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొన్నారు

జాతీయ స్థాయిలో 100 మంది విజేతలను ఎంపిక చేశారు. ఒక్కో విభాగానికి 25 మంది చొప్పున నాలుగు విభాగాలుగా విజేతలను ఎంపిక చేశారు. విభాగాలు: ప్రాథమిక స్థాయి (3-5 గ్రేడ్లు), మాధ్యమిక స్థాయి (6-8 గ్రేడ్లు), సెకండరీ స్థాయి (9-10 గ్రేడ్లు), సీనియర్ సెకండరీ స్థాయి (11-12 గ్రేడ్లు)

వీర్ గాథ 4.0 సూపర్ - 100 విజేతలు

సెప్టెంబర్ 5, 2024న ప్రారంభమైన వీర్ గాథ 4.0 కార్యక్రమంలో స్ఫూర్తి రగిలించే అంశాలపై వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఎంపిక చేసుకున్న స్ఫూర్తిదాయక వ్యక్తుల గురించి ముఖ్యంగా గ్యాలంటరీ పురస్కార గ్రహీతల గురించి రాసే అవకాశం విద్యార్థులకు ఇచ్చారు.రాణీ లక్ష్మీబాయి లాంటి స్వాతంత్య్ర  సమరయోధులు, 1857 మొదటి స్వాతంత్య్ర  సంగ్రామం, భారతీయ స్వాతంత్య్ర  ఉద్యమంలో గిరిజన తిరుగుబాట్ల పాత్ర గురించి తెలుసుకొనేలా వారిని ప్రోత్సహించారు.

వైవిధ్యమైన అంశాలను ఎంపిక చేయడం ద్వారా ఈ పోటీల్లో పాల్గొన్న విద్యార్థులు మెరుగైన రీతిలో వ్యాసరచన చేశారు. అలాగే భారతదేశ చరిత్ర, సాంస్కృతిక వారసత్వం గురించి వారికి తెలుసుకొనే అవకాశం వారికి లభించింది.

ఈ కార్యక్రమంలో భాగంగా స్థానికంగా పోటీలు నిర్వహించడం, జాతీయ స్థాయిలో గ్యాలంటరీ పురస్కార గ్రహీతలతో చర్చా కార్యక్రమాలు (ఆఫ్ లైన్, ఆన్ లైన్ రెండింటిలోనూ) ఏర్పాటు చేయడం, అత్యుత్తమ ఎంట్రీలను మైగవ్ పోర్టల్ ద్వారా సమర్పించడం తదితర కార్యక్రమాల్లో పాఠశాలలు భాగం పంచుకున్నాయి.

పాఠశాల స్థాయి కార్యక్రమాలు అక్టోబర్ 31, 2024తో ముగిశాయి. జాతీయ స్థాయి పోటీలకు సమర్పించిన 4,029 ఎంట్రీలను జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో మూల్యాంకనం చేసి 100 ఎంట్రీలను సూపర్ - 100 విజేతలుగా ప్రకటించారు. వీరిని రక్షణ మంత్రిత్వ శాఖ, విద్యా శాఖ సంయుక్తంగా న్యూఢిల్లీలో సత్కరించనున్నాయి. విజేతలందరికీ రూ.10,000 చొప్పున నగదు బహుమతి అందించడంతో పాటుగా కర్తవ్య పథ్ లో జరిగే గణతంత్ర దినోత్సవ కవాతు - 2025ను ప్రత్యేక అతిథులుగా వీక్షించే అవకాశం దక్కుతుంది.

ఈ వంద మంది విజేతలతో పాటుగా రాష్ట్ర/కేంద్రపాలిత ప్రాంతాల స్థాయిలో 8 మందిని (ప్రతి విభాగం నుంచి ఇద్దరు చొప్పున), జిల్లా స్థాయిలో నలుగురిని (విభాగానికి ఒకరు చొప్పున) ఎంపిక చేసి రాష్ట్ర/కేంద్రపాలిత/జిల్లా అధికారులు సత్కరిస్తారు.

75 ఏళ్ల స్వతంత్రానికి  గుర్తుగా నిర్వహించిన ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’లో భాగంగా ప్రాజెక్ట్ వీర్ గాథ కార్యక్రమాన్ని 2021లో ప్రారంభించారు. గ్యాలంటరీ పురస్కార గ్రహీతలు చేసిన సాహసాలు, వారి జీవిత కథల గురించి అవగాహన కల్పించడమే ప్రధానోద్దేశంగా ఈ కార్యక్రమం ప్రారంభమైంది. విద్యార్థుల్లో దేశభక్తి, పౌర విలువలు పెంపొందించేందుకు ఈ కార్యక్రమం తోడ్పడుతుంది. మొదటి విడత నుంచి నాలుగో విడత వరకు ప్రాజెక్టు వీర గాథ ప్రయాణం స్ఫూర్తిదాయకంగా సాగింది. అలాగే దేశ వ్యాప్తంగా ఈ పోటీల్లో పాల్గొనే వారి సంఖ్య పెరిగింది.

మొదటి రెండు విడతల ప్రాజెక్టు వీర గాథ పోటీల్లో  జాతీయ స్థాయిలో 25 మంది విజేతలు ఎంపికయ్యారు. దాదాపుగా 8 లక్షల మంది విద్యార్థులు మొదటి విడతలోనూ, 19 లక్షల మంది విద్యార్థులు రెండో విడతలోనూ పాల్గొన్నారు. మూడో ఎడిషన్లో ఈ కార్యక్రమం కీలకమైన మైలు రాయిని చేరుకుంది. ఈ పోటీల్లో పాల్గొన్న విద్యార్థుల సంఖ్య 1.36 కోట్లకు పెరగ్గా, 100 మంది విజేతలను ఎంపిక చేశారు. ఈ ఉత్సాహం వీర గాథ 4.0లోనూ కొనసాగి, ఈ కార్యక్రమ ప్రభావాన్ని మరింత పెంచింది.


 

***


(Release ID: 2092264) Visitor Counter : 21