ప్రధాన మంత్రి కార్యాలయం
జీనోమ్‌ఇండియా ప్రాజెక్ట్ ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి ప్రసంగం
“దేశ జీవ సాంకేతిక రంగంలో ఒక నిర్ణయాత్మక మలుపు...ఈ ప్రాజెక్టుతో ముడిపడిన భాగస్వాములందరికీ శుభాకాంక్షలు” “ఈ 21వ శతాబ్దంలో జీవ ఆర్థిక వ్యవస్థగా వికసిత భారత్‌కు పునాది దిశగా బయో-టెక్నాలజీ.. బయోమాస్ సమ్మేళనం కీలకం”; “సుస్థిర ప్రగతి.. ఆవిష్కరణలను జీవ ఆర్థిక వ్యవస్థ వేగవంతం చేస్తుంది”; “ప్రపంచ ప్రధాన ఔషధ కూడలిగా భారత్ తెచ్చుకున్న గుర్తింపునకు దేశం నేడు కొత్త కోణం జోడిస్తోంది”; “అంతర్జాతీయ సమస్యలకు పరిష్కారాల కోసం ప్రపంచం మనవైపే చూస్తోంది... ఇది భవిష్యత్తరాలకు అవకాశం మాత్రమే కాదు... బాధ్యత కూడా”; “మన ప్రజాహిత పరిపాలన... పౌర డిజిటల్ మౌలిక సదుపాయాలు ప్రపంచానికి కొత్త నమూనాను అందించాయి... అదే తరహాలో జన్యు పరిశోధన రంగంలోనూ భారత ప్రతిష్ఠను జీనోమ్‌ఇండియా ప్రాజెక్ట్ మరింత బలోపేతం చేస్తుంది”
Posted On:
09 JAN 2025 5:53PM by PIB Hyderabad
జీనోమ్‌ఇండియా ప్రాజెక్ట్ ప్రారంభోత్సవం నేపథ్యంలో ప్రధానమంత్రి ఇవాళ వీడియో సందేశం ద్వారా ప్రసంగించారు. పరిశోధన రంగంలో భారత్ నేడు చారిత్రకంగా ముందంజ వేసిందని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. వాస్తవానికి ఈ ప్రాజెక్టుకు 5 సంవత్సరాల కిందటే ఆమోదం లభించిందని ప్రధాని గుర్తుచేశారు. అయితే, కోవిడ్ మహమ్మారి ఎన్నో సవాళ్లు విసిరినా, మన శాస్త్రవేత్తలు అత్యంత శ్రద్ధాసక్తులతో దీన్ని పూర్తి చేశారని పేర్కొన్నారు. ఈ పరిశోధనలో ‘ఐఐఎస్సీ, ఐఐటీ’, ‘సిఎస్ఐఆర్’, ‘డిబిటి-బ్రిక్’ వంటి 20కిపైగా విశిష్ట పరిశోధనా సంస్థలు ప్రధాన పాత్ర పోషించాయని శ్రీ మోదీ వివరించారు. దీని ఫలితంగా 10,000 మంది భారతీయుల జన్యు క్రమంతో కూడిన సమాచారం నేడు భారత బయోలాజికల్ డేటా సెంటర్‌లో అందుబాటులో ఉందన్నారు. జీవ సాంకేతిక పరిశోధన రంగంలో ఈ ప్రాజెక్టు ఓ కీలక మలుపుగా నిలవగలదని శ్రీ మోదీ విశ్వాసం వ్యక్తంచేస్తూ, దీనితో ముడిపడిన భాగస్వామ్య సంస్థలన్నిటికీ అభినందనలు తెలిపారు.
శ్రీ మోదీ తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ- “భారత జీవ సాంకేతిక రంగంలో జీనోమ్‌ఇండియా ప్రాజెక్టును ఒక కీలక ఘట్టం”గా అభివర్ణించారు. వివిధ జనజాతుల నుంచి 10,000 మంది వ్యక్తుల జన్యు క్రమాన్ని రూపొందించడం ద్వారా వైవిధ్య భరిత జన్యు వనరును ఈ ప్రాజెక్ట్ విజయవంతంగా సృష్టించిందని పేర్కొన్నారు. ఈ సమాచార నిధి ఇకపై శాస్త్రవేత్తలు, పరిశోధకులకు అందుబాటులో ఉంటుందని చెప్పారు. అంతేకాకుండా భారత జన్యు నేపథ్యాన్ని అవగతం చేసుకోవడంలో నిపుణులకు తోడ్పడుతుందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. దేశంలో విధాన రూపకల్పన, ప్రణాళిక రచనలో ఈ సమాచారం ఎంతగానో దోహదపడుతుందని ఆయన వివరించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా నిపుణులు, శాస్త్రవేత్తలనుద్దేశించి ఆయన మాట్లాడారు. భారత్ విస్తీర్ణం, వైవిధ్యాలను కేవలం భౌగోళిక, ఆహారం, భాషాపరమైన అంశాల ద్వారానే కాకుండా దేశ ప్రజల జన్యు నిర్మాణం ద్వారానూ ఈ పరిశోధన ఒక స్పష్టతను తెస్తుందన్నారు. ప్రపంచవ్యాప్తంగా నేడు వ్యాధుల స్వభావ, స్వరూపాలు ఎంతో మార్పు చెందుతున్నందున ప్రభావశీల చికిత్స విధానాల నిర్ణయంలో జనాభా జన్యు క్రమాన్ని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యమన్నారు. ఈ నేపథ్యంలో గిరిజన తెగలలో ప్రబలమవుతున్న ‘కొడవలి కణ రక్తహీనత’ (సికిల్ సెల్ అనీమియా) పెద్ద సవాలు విసురుతున్నదని గుర్తుచేస్తూ, ఈ సమస్య పరిష్కారాన్ని దేశం జాతీయ లక్ష్యంగా నిర్దేశించుకున్నదని స్పష్టం చేశారు. ప్రాంతాల వారీగా సమస్య స్వరూపం మారినా, భారత జనాభాలోని విశిష్ట జన్యు నమూనాలను అర్థం చేసుకోవడంలో జన్యు క్రమ అధ్యయనం పూర్తిస్థాయిలో అవసరమని ఆయన వివరించారు. నిర్దిష్ట జన సమూహాల విషయంలో నిర్దిష్ట పరిష్కారాలతోపాటు ప్రభావశీల ఔషధ రూపకల్పనకు ఈ అవగాహన తోడ్పడుతుందనీ, ఈ పరిధి చాలా విస్తృతమైనదే అయినా, సికిల్ సెల్ అనీమియా దీనికొక ఉదాహరణ మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు. ఒక తరం నుండి మరొక తరానికి జన్యుపరంగా సంక్రమించే అనేక వ్యాధులపై మన దేశంలో తగిన అవగాహన లేదనీ, ఈ నేపథ్యంలో అటువంటి వ్యాధులన్నింటికీ సమర్థ చికిత్సా విధానాలను రూపొందించడంలో జీనోమ్‌ఇండియా ప్రాజెక్ట్ ఉపయోగపడుతుందని విశదీకరించారు.
“ఈ 21వ శతాబ్దంలో జీవ ఆర్థిక వ్యవస్థగా వికసిత భారత్‌కు పునాది వేయడంలో బయో-టెక్నాలజీ, బయోమాస్ సమ్మేళనం కీలకం” అని శ్రీ మోదీ అన్నారు. సహజ వనరుల సముచిత వినియోగం, జీవ ఆధారిత ఉత్పత్తులు-సేవలకు ప్రోత్సాహం, ఈ రంగంలో కొత్త ఉపాధి అవకాశాల సృష్టి తదితరాలు జీవ ఆర్థిక వ్యవస్థ లక్ష్యమని ఆయన వ్యాఖ్యానించారు. దేశ సుస్థిర ప్రగతి, ఆవిష్కరణలను జీవ ఆర్థిక వ్యవస్థ వేగవంతం చేస్తుందని ప్రధాని అన్నారు. గడచిన దశాబ్దంలో భారత జీవ ఆర్థిక వ్యవస్థ వేగంగా వృద్ధి చెందిందని, 2014లో దీని విలువ 10 బిలియన్ డాలర్లు కాగా, నేడు 150 బిలియన్ డాలర్లకుపైగా నమోదు కావడమే ఇందుకు నిదర్శనమని ఉదాహరించారు. జీవ ఆర్థిక వ్యవస్థను మరింత ఉన్నత శిఖరాలకు చేర్చే దిశగా భారత్ కృషి చేస్తున్నదని వివరించారు. ఇటీవల ‘బయో ఇ3’ పేరిట దార్శనిక విధానానికి శ్రీకారం చుట్టడాన్ని ప్రస్తావిస్తూ- ఐటీ విప్లవం తరహాలోనే అంతర్జాతీయ జీవ సాంకేతికరంగంలో భారత్ అగ్రగామిగా ఎదిగేందుకు ఇది తోడ్పుడుతుందని శ్రీ మోదీ అన్నారు. ఈ దిశగా కృషిలో శాస్త్రవేత్తల కీలక పాత్రను ఆయన ప్రశంసిస్తూ వారికి శుభాకాంక్షలు తెలిపారు.
ప్రపంచ ప్రధాన ఔషధ కూడలిగా భారత్ తెచ్చుకున్న గుర్తింపునకు దేశం నేడు కొత్త కోణం జోడించడాన్ని ప్రధాని ప్రముఖంగా ప్రస్తావించారు. దేశ ప్రజారోగ్య సంరక్షణ వ్యవస్థ గడచిన దశాబ్దం నుంచీ విప్లవాత్మక చర్యలు చేపట్టామని గుర్తుచేశారు. లక్షలాదిగా ప్రజానీకానికి దేశం ఉచిత చికిత్స సదుపాయం కల్పించిందని, జనౌషధి కేంద్రాల ద్వారా 80 శాతం తగ్గింపుతో మందులను అందుబాటులో ఉంచిందని వివరించారు. అంతేకాకుండా ఆధునిక వైద్య మౌలిక సదుపాయాలను నిర్మించిందని ప్రధానమంత్రి తెలిపారు. కోవిడ్-19 మహమ్మారి సమయంలో భారత ఔషధావరణ వ్యవస్థ తన శక్తిసామర్థ్యాలను నిరూపించుకుందని చెప్పారు. దేశ ఔషధ తయారీ రంగంలో బలమైన సరఫరా-విలువ శ్రేణుల నిర్మాణానికి కృషి చేస్తున్నామని తెలిపారు. ఈ కృషిని జీనోమ్‌ఇండియా ప్రాజెక్ట్ శక్తిమంతం, వేగవంతం చేయగలదన్నారు.
“అనేక అంతర్జాతీయ సమస్యలకు పరిష్కారాల కోసం ప్రపంచం మన వైపే చూస్తోంది. భవిష్యత్తరాలు దీన్ని అవకాశంగానే కాకుండా బాధ్యతగానూ పరిగణించాలి” అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు. దేశవ్యాప్తంగా గత దశాబ్దంలో విద్యారంగంలోని అన్ని స్థాయులలోనూ పరిశోధన-ఆవిష్కరణలపై దేశం నిశితంగా దృష్టి సారించిందని తెలిపారు. తదనుగుణంగా ఒక విస్తృత పరిశోధనావరణ వ్యవస్థకు రూపమిస్తోందని ఆయన వెల్లడించారు.
“దేశంలోని విద్యార్థులు నిత్యం కొత్త ప్రయోగాలు చేసేవిధంగా నేడు 10,000కుపైగా అటల్ టింకరింగ్ పరిశోధన శాలలు ప్రేరణనిస్తున్నాయి” అని శ్రీ మోదీ అన్నారు. అలాగే యువ ఆవిష్కర్తలకు మద్దతుగా దేశమంతటా వందలాది ‘అటల్ఇంక్యుబేషన్ సెంటర్లు’ ఏర్పాటు చేసినట్లు గుర్తుచేశారు. విద్యార్థి పరిశోధకుల అధ్యయనం-పరిశోధనకు మద్దతుగా ‘పీఎం రీసెర్చ్ ఫెలోషిప్’ పథకాన్ని అమలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. అలాగే బహుళ రంగాల్లోనే కాకుండా అంతర్జాతీయ పరిశోధనలను ప్రోత్సహించేలా జాతీయ పరిశోధన నిధిని ఏర్పాటు చేశామని ప్రధాని తెలిపారు. ఈ మేరకు ‘అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్’ శాస్త్రవిజ్ఞాన, ఇంజినీరింగ్, పర్యావరణం, ఆరోగ్యం తదితర రంగాల్లో పరిశోధనలకు మద్దతిస్తుందని చెప్పారు. జీవ సాంకేతిక రంగం పురోగమనానికి, యువ శాస్త్రవేత్తలకు మద్దతిచ్చే భవిష్యత్తరం సాంకేతిక పరిజ్ఞానాలలో పరిశోధనలు-పెట్టుబడులు పెంచడం కోసం ప్రభుత్వం రూ.లక్ష కోట్ల మూలనిధి ఏర్పాటుకు నిర్ణయించినట్లు ప్రధాని వెల్లడించారు.
ప్రభుత్వం ఇటీవల ‘ఒన్ నేషన్-ఒన్ సబ్‌స్క్రిప్షన్” పేరిట తీసుకున్న కీలక నిర్ణయాన్ని ప్రస్తావిస్తూ- భారత విద్యార్థులు-పరిశోధకులకు ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ జర్నల్స్ సులభంగా, ఖర్చు లేకుండా లభించేందుకు ఇది దోహదం చేస్తుందన్నారు. ప్రస్తుత 21వ శతాబ్దంలో మన దేశాన్ని విజ్ఞాన, ఆవిష్కరణల కూడలిగా మార్చడంలో ఈ కృషి ఎంతగానో తోడ్పడుతుందని ప్రధాని స్పష్టం చేశారు.
“భారత ప్రజాహిత పరిపాలన, పౌర డిజిటల్ మౌలిక సదుపాయాలు ప్రపంచానికి కొత్త నమూనాను అందించాయి” అని వ్యాఖ్యానించారు. ఈ తరహాలోనే జన్యు పరిశోధన రంగంలోనూ భారత ప్రతిష్ఠను జీనోమ్‌ఇండియా ప్రాజెక్ట్ మరింత బలోపేతం చేస్తుందని ప్రగాఢంగా విశ్వసిస్తున్నానంటూ ప్రధానమంత్రి తన ప్రసంగం ముగించారు. చివరగా ఈ ప్రాజెక్టు మరింత విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.
***
MJPS/SR
(Release ID: 2091648)
|