ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ ఫర్మేశన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
సమ్మిళిత అభివృద్ధి, ఆర్థిక పరివర్తన ధ్యేయంగా కృత్రిమ మేధ సామర్థ్యాన్ని వినియోగించుకునేందుకు చేతులు కలిపిన ఇండియా ఏఐ, మైక్రోసాఫ్ట్ సంస్థలు
ఈ భాగస్వామ్యం ద్వారా 2026 సంవత్సరానికల్లా విద్యార్థులు, విద్యావేత్తలు, అభివృద్ధి కారకులు, ప్రభుత్వ అధికారులు, మహిళా పారిశ్రామికవేత్తలు సహా 5 లక్షల మందికి కృత్రిమ మేధలో శిక్షణ
“ఏఐ క్యాటలిస్ట్స్” పేరిట ఉన్నత ప్రమాణాల సంస్థ ఏర్పాటు ద్వారా 2,3వ శ్రేణి నగరాల్లో గ్రామీణ ఏఐ సృజనకు ఊతం... 1,00,000 ఏఐ సృజనకారులు, ఆవిష్కర్తలకు నైపుణ్య శిక్షణ
బాధ్యతాయుత ఏఐ సాంకేతికతను అభివృద్ధి పరిచేందుకు, దేశంలో ‘ఏఐ సేఫ్టీ ఇనిస్టిట్యూట్’ స్థాపనకు దన్నుగా నిలవనున్న భాగస్వామ్యం
Posted On:
08 JAN 2025 4:47PM by PIB Hyderabad
డిజిటల్ ఇండియా కార్పొరేషన్ లో స్వతంత్ర ప్రతిపత్తి గల వ్యాపార విభాగమైన ఇండియా ఏఐ, దేశంలో కృత్రిమ మేధ అమలు, అభివృద్ధి కోసం మైక్రోసాఫ్ట్ సంస్థతో చేతులు కలిపింది. ఈ వ్యూహాత్మక భాగస్వామ్యం ఇండియా ఏఐ మిషన్ మౌలిక లక్ష్యాలకు అనుగుణంగా ఉంది.
భాగస్వామ్యం ముఖ్యాంశాలు :
· ‘ఇండియా ఏఐ’ భాగస్వామ్యంతో మైక్రోసాఫ్ట్ సంస్థ 2026 సంవత్సరానికల్లా విద్యార్థులు, విద్యావేత్తలు, అభివృద్ధి కారకులు, ప్రభుత్వ అధికారులు, మహిళా పారిశ్రామికవేత్తలు సహా 5,00,000 మందికి కృత్రిమ మేధలో శిక్షణనిస్తుంది.
· “ఏఐ క్యాటలిస్ట్స్” పేరిట ఉన్నత ప్రమాణాల సంస్థ ఏర్పాటు ద్వారా 2,3వ శ్రేణి నగరాల్లో గ్రామీణ ఏఐ సృజనకు ఊతం... హ్యాకథాన్లు, బృందాల ఏర్పాటు, ఏఐ విపణుల ఏర్పాటు ద్వారా 1,00,000 ఏఐ సృజనకారులు, ఆవిష్కర్తలకు నైపుణ్య శిక్షణ
· 10 రాష్ట్రాల్లోని 20 జాతీయ నైపుణ్య శిక్షణ సంస్థలు – ఎన్నెస్టీఐ, ఎన్ఐఈఎల్ఐటీ ల్లో ఏఐ ప్రొడక్టివిటీ ల్యాబ్ ల ఏర్పాటు... 200 ఐటీఐ (పారిశ్రామిక శిక్షణా కేంద్రాలు) ల్లో ‘ఏఐ ప్రాథమిక కోర్సుల’ ద్వారా 20,000 మంది ఉపాధ్యాయులకు, 1,00,000 మంది విద్యార్థులకు శిక్షణ
· మైక్రోసాఫ్ట్ పరిశోధనల లబ్ధి పొందుతూ కీలక రంగాల్లో ఏఐ-ఆధారిత పరిష్కారాల అభివృద్ధి కోసం కృషి
· ఇండియా ఏఐ మిషన్ కింద 1,000 వరకు ఏఐ స్టార్టప్‌లకు మైక్రోసాఫ్ట్ ఫౌండర్స్ హబ్ ప్రోగ్రామ్ ద్వారా అజూర్ క్రెడిట్‌లు (మైక్రోసాఫ్ట్ సంస్థ అందించే కూపన్లు లేదా రుణసదుపాయం), వ్యాపార వనరులు, మెంటార్‌షిప్ ప్రయోజనాల అందజేత. దేశ అంకుర పరిశ్రమల్లో ఆవిష్కరణలకు, వృద్ధికీ ప్రోత్సాహం.
· దేశ భాషా వైవిధ్యం, ప్రత్యేక అవసరాల నేపథ్యంలో సాంస్కృతికపరంగా, సందర్భానికి అనువుగా భారతీయ భాషల్లో తగిన నమూనాల అభివృద్ధి.
· డేటాసెట్ సేకరణ (ప్రత్యేక అవసరాలకు తగినట్లు ఒకే మూలం నుంచి సమాచార సేకరణ), అందుకు సంబంధించిన సమాచారాన్ని గురించి వ్యాఖ్యానం, సింథటిక్ డేటా ఉత్పత్తి కోసం సాధనాలు సహా బలమైన, విస్తరణ అవకాశాలు గల డేటాసెట్ వేదికలను రూపొందించడంలో ఇండియా ఏఐకి మద్దతు.
· పరస్పర సహకారంతో బాధ్యతాయుతమైన కృత్రిమ మేధను అభివృద్ధి పరచడం కోసం అవసరమైన ఫ్రేమ్ వర్కులు, ప్రమాణాలు, పరీక్షలను సిద్ధం చేయడం, ఏఐ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా సంస్థ ఏర్పాటు కోసం కృషి చేయడం.
ఏఐ వినియోగంలో దేశాన్ని అగ్రగామిగా నిలపాలన్న లక్ష్యం
దేశానికి సృజనాత్మక సహకారం ఎంత కీలకమో ఇండియా ఏఐ మిషన్ సీఈఓ, శ్రీ అభిషేక్ సింగ్ తెలియజేస్తూ, “ఏఐ ని వినియోగిస్తూ తయారయ్యే అప్లికేషన్‌ల రూపకల్పనలో దేశాన్ని అగ్రస్థానంలో నిలిపే కీలక అంశాలను గుర్తించేందుకు భారత ప్రభుత్వం ఇండియా ఏఐ మిషన్‌ను అమలు చేస్తోంది. పరిశ్రమలు, విద్యాసంస్థల మధ్య భాగస్వామ్యాన్ని రూపొందించడంపై ఈ వ్యూహం దృష్టి పెడుతుంది. ఈ దిశగా మైక్రోసాఫ్ట్, ఇండియా ఏఐ మిషన్ ల మధ్య సహకారం… నైపుణ్యం, సృజనశీలత, బాధ్యతాయుతమైన ఏఐ అభివృద్ధిపై దృష్టి సారిస్తోంది. 5,00,000 మందికి శిక్షణను అందించడం, ఏఐ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ద్వారా ఆవిష్కరణలను ప్రోత్సహించడం, కీలక రంగాల్లో ఏఐ-ఆధారిత పరిష్కారాలను అందించడం ద్వారా మేం భారత ఏఐ పర్యావరణ వ్యవస్థను అభివృద్ధి పరుస్తున్నాం. ఈ భాగస్వామ్యం సేవలు అందని సమూహాలకు సాధికారతను కల్పించడం ద్వారా సమ్మిళిత స్ఫూర్తికి ప్రాధాన్యాన్ని ఇస్తుంది. నైతిక ఏఐ పద్ధతులను ప్రోత్సహించడమే కాక ఆర్థిక వృద్ధిని వేగవంతం చేసేందుకు అంకుర పరిశ్రమలకు మద్దతునిస్తుంది. భారతదేశాన్ని గ్లోబల్ ఏఐ లీడర్‌గా నిలిపేందుకు, అందరికీ సమాన అవకాశాలు లభించే నిష్పక్షపాత సుస్థిర భవిష్యత్తును సృష్టించేందుకు మేం కలిసి పనిచేస్తాం” అన్నారు.
‘ఏఐ-ఫస్ట్’ దేశంగా గుర్తింపు పొందేందుకు భారత్ కృషి
మైక్రోసాఫ్ట్ ఇండియా, సౌత్ ఏషియా ప్రాంత అధ్యక్షుడు పునీత్ చందోక్ మాట్లాడుతూ, "దేశంలో కృత్రిమ మేధను, కొత్తగా ఆవిర్భవిస్తున్న సాంకేతికతలను అభివృద్ధి చేసేందుకు ఇండియా ఏఐతో కలిసి పనిచేయడం మాకు గర్వకారణం. ఏఐ-ఫస్ట్ దేశంగా నిలవాలన్న భారత్ ఆశయానికి మైక్రోసాఫ్ట్ సంపూర్ణ మద్దతునిస్తోంది.. ఈ భాగస్వామ్యం మా నిబద్ధతకు నిదర్శనంగా నిలుస్తోంది. "5,00,000 మందికి నైపుణ్య శిక్షణ, ఏఐ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్‌ని స్థాపన, ఏఐ ప్రోడక్టివిటీ ల్యాబ్‌ల ఏర్పాటు ద్వారా కృత్రిమ మేధను అందరికీ అందుబాటులోకి తీసుకురావడం, సమూహాలకు సాధికారత కల్పించడం, గ్రామీణ, వెనుకబడిన ప్రాంతాల్లో ఆవిష్కరణలను ప్రోత్సహించడం మా లక్ష్యాలు. ఇండియా ఏఐ తో కలిసి, కృత్రిమ మేధ వినియోగాన్ని వేగవంతం చేయడం ద్వారా అందరికీ సుస్థిర భవిష్యత్తును అందించేందుకు మేం కట్టుబడి ఉన్నాం" అని అన్నారు.
సమ్మిళిత అభివృద్ధి, ఆర్థిక పరివర్తన సాధనలో ఏఐ సామర్థ్యాన్ని వినియోగించుకోవాలన్న ఇండియా ఏఐ, మైక్రోసాఫ్ట్ లక్ష్యానికి ఈ సహకారం తార్కాణంగా నిలుస్తోంది. నైపుణ్యం, ఆవిష్కరణలు, డేటాసెట్‌లు, బాధ్యతాయుతమైన ఏఐ వినియోగం వంటి అంశాలకు ప్రాధాన్యాన్ని ఇవ్వడం ద్వారా ఈ భాగస్వామ్యం పౌరుల స్థాయి సవాళ్లను పరిష్కరించడం, పారిశ్రామిక స్ఫూర్తిని ప్రోత్సహించడం, దేశంలో బలమైన ఏఐ పర్యావరణ వ్యవస్థను నిర్మించడం లక్ష్యాలుగా పెట్టుకుంది. ఏఐ సృజనాత్మకత, అమలుల ద్వారా సమ్మిళిత, సుస్థిరమైన వృద్ధిని సాధించి, ఏఐ రంగంలో భారతదేశాన్ని అగ్రగామి దేశంగా నిలపాలని ఈ రెండు సంస్థల భాగస్వామ్యం లక్ష్యంగా పెట్టుకుంది.
*****
(Release ID: 2091391)
Visitor Counter : 17