రైల్వే మంత్రిత్వ శాఖ
భవిష్యత్తు అవసరాలకు తగినట్టు సంసిద్ధమవుతున్న రైల్వేలు...
ప్రయాణికులకు మరింత సురక్షితమైన, వేగవంతమైన, అంతర్జాతీయ స్థాయిసేవలను అందించే లక్ష్యంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సర బడ్జెట్ కేటాయింపుల్లో 76 శాతం సామర్థ్య పెంపు కోసం వినియోగం
అత్యున్నత ప్రమాణాల ప్రాజెక్టులపై ఖర్చు ద్వారా దూరదృష్టితో కూడిన వికసిత్ భారత్ లక్ష్యాల అమలుకు రైల్వే ప్రాధాన్యం
Posted On:
08 JAN 2025 2:05PM by PIB Hyderabad
కోట్లాది భారతీయులకు అతి తక్కువ ఖర్చుతో సురక్షితమైన, వేగవంతమైన, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడిన సేవలను అందించడమంటే మాటలు కాదు. అయినప్పటికీ, భౌగోళిక, సాంస్కృతిక, సామాజిక, ఆర్థికపరంగా వైవిధ్యమైన భారత దేశ ప్రజలకు అత్యుత్తమ సేవలందించేందుకు రైల్వే వ్యవస్థ అకుంఠిత దీక్షతో భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా సంసిద్ధమవుతోంది. తదనుగుణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సర తొలి తొమ్మిది నెలల, 4 రోజుల కాలంలో బడ్జెట్ కేటాయింపుల్లో 76 శాతాన్ని ఈ దిశగా ఖర్చు చేసింది. జనవరి 5వ తేదీ వరకూ సిద్ధమైన వ్యయ నివేదికను పరిశీలిస్తే సామర్థ్య పెంపు ప్రాజెక్టులపై సంస్థ భారీ పెట్టుబడులు పెట్టిందని, తద్వారా దేశంలో అంతర్జాతీయ స్థాయి సేవలను అందించాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతోందని స్పష్టమవుతోంది.
గత దశాబ్దంగా చేపట్టిన నియమానుసార మూలధన వ్యయం ఫలితాలను 136 వందే భారత్ రైళ్ళు, 97 శాతం మేర బ్రాడ్ గేజ్ విద్యుదీకరణ, కొత్త లైన్ల ఏర్పాటు, గేజ్ మార్పిడి, పట్టాల డబ్లింగ్, రవాణా సౌకర్యాల కల్పన, ప్రభుత్వరంగ సంస్థలు, మెట్రో సేవల్లో పెట్టుబడులు తదితరాల్లో గమనించవచ్చు. దాంతో కోట్లాది భారతీయులకు అతి తక్కువ ఖర్చుతో మరింత వేగవంతమైన, సురక్షితమైన, ప్రపంచస్థాయి సేవలు అందుబాటులోకి వచ్చాయి. వందే భారత్ స్లీపర్ రైళ్ళు వేగం, భద్రతాపరమైన పరీక్షల అంకానికి చేరుకోవడంతో, ప్రయాణికులకు అతి త్వరలో దూర ప్రయాణాల్లో కూడా ప్రపంచ స్థాయి సేవలు అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది ప్రయాణికులకు మునుపెన్నడూ ఎరుగని అత్యున్నత ప్రమాణాల సేవలను అందుబాటులోకి తెస్తుంది. ఆధునికీకరణ దిశగా భారతీయ రైల్వేల్లో చోటుచేసుకున్న ఈ మార్పును గమనిస్తే వికసిత్ భారత్ దార్శనిక లక్ష్యాలు, ఆ లక్ష్యాల శీఘ్రతర అమలు కారణాలుగా కనిపిస్తాయి.
భౌగోళిక, సాంస్కృతిక, భాషాపరమైన వ్యత్యాసాలు కలిగిన సువిశాలమైన దేశానికి అనువైన సేవలను అందించడంలో ఎన్నో సవాళ్ళు ఎదురైనప్పటికీ, మెరుగైన అనుసంధానంతో కూడిన నవీన భారతదేశం దిశగా రైల్వేలు పరివార్తనాత్మక పాలన లక్ష్యాన్ని అమల్లో పెడుతున్నాయి. ఈ దిశగా మౌలిక సదుపాయాలు, ఆధునిక సాంకేతికత, అనుకూల పద్ధతులపై వ్యయం చేస్తూ సమ్మిళిత భారత దేశం దిశగా రైల్వేలు కృషి చేస్తున్నాయి. నేడు నాటిన విత్తనాలు రేపటి తరానికి ఫలాలను అందించగలవన్న ఆదర్శంతో రైల్వేలు అడుగులు వేస్తున్నాయి. అయితే ఎన్నో సంక్లిష్టతలకు ఆలవాలమైన దేశానికి ప్రస్తుత సేవల భారమే కాక, భవిష్యత్తు అవసరాల కోసం కూడా పెట్టుబడులు పెట్టడం సామాన్యమైన విషయం కాదు. కాగా, నూతన సంవత్సరం తొలి నాలుగు రోజుల్లో రూ.1198 కోట్ల రూపాయలను మూలధన వ్యయానికై ఖర్చు చేసిన రైల్వేలు, మరో మూడు మాసాలు మిగిలి ఉండగానే ఈ ఆర్థిక సంవత్సరంలోని కేటాయింపుల్లో 76 శాతాన్ని ఖర్చు చేసింది.
2024-25 బడ్జెట్ అంచనాల్లో రైల్వేల మూలధన వ్యయం 2,65,200 కోట్లుగా ఉండగా, స్థూల బడ్జెట్ మద్దతు రూ.2,52,200 కోట్లుగా ఉంది. అందులో ఇప్పటికే రూ.1,92,446 కోట్లను ఖర్చు చేశారు. రోలింగ్ స్టాక్ (వివిధ రకాలైన రైల్వే వాహనాలు) కోసం, బడ్జెట్ కేటాయింపు రూ. 50,903 కోట్లగా నిర్ధారించారు.
రోలింగ్ స్టాక్ కోసం కేటాయించిన సొమ్ములో రూ.40,367 కోట్లను- అనగా 79 శాతం వ్యయమయ్యింది. ఇక భద్రతాపరమైన పనులకు కేటాయించిన రూ. 34,412 కోట్లలో, రూ. 28,281 కోట్లు, అనగా 82 శాతం ఖర్చు చేశారు. దేశంలోని ఒక మూల నుంచీ మరో మూలకు రోజుకి సగటున 2.3 కోట్ల మందిని, తక్కువ ఖర్చుతో చేరవేసే భారతీయ రైల్వే సంస్థను ప్రపంచస్థాయి సంస్థగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం సంకల్పించింది. అభివృద్ధి పథంలో ముందుకు సాగుతున్న రైల్వే సంస్థ, పౌరులు చెల్లించిన పన్నులను మూలధన వ్యయానికై వెచ్చిస్తూ, అత్యాధునిక సౌకర్యాలతో సంస్థను పరిపుష్ఠం చేస్తోంది. భవిష్యత్తు తరాలకు ప్రయోజనకరంగా ఉండే ఈ సౌకర్యాలు రైల్వేలను భవిష్యత్తు అవసరాలకు సిద్ధం చేస్తున్నాయి. వికసిత్ భారత్ లక్ష్యాలను అందుకునే దిశగా రైల్వేల నిబద్ధతను చాటుతాయి.
***
(Release ID: 2091313)
Visitor Counter : 55