ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

భారత గ్రామీణ మహోత్సవ్ లో ప్రధాని ప్రసంగానికి తెలుగు అనువాదం

Posted On: 04 JAN 2025 2:04PM by PIB Hyderabad

 

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు, కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌధరీ గారు, ఈ కార్యక్రమానికి హాజరైన గౌరవనీయులైన నాబార్డ్ ఉన్నత కార్యవర్గ సభ్యులు, స్వయం సహాయక బృందాల సభ్యులు, సహకార బ్యాంకులు, రైతు ఉత్పత్తిదారుల సంఘాలు (ఎఫ్‌పీవోలు), ఇతర విశిష్ట అతిథులు, సోదర సోదరీమణులారా,

అందరికీ 2025 నూతన సంవత్సర శుభాకాంక్షలు. భారత అభివృద్ధి ప్రయాణాన్ని ప్రతిబింబించే గ్రామీణ భారత మహోత్సవాన్ని 2025 ఆరంభంలోనే నిర్వహించుకోవడం ఒక ప్రత్యేక గుర్తింపును తీసుకువస్తుంది. ఈ విశేషమైన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సందర్భంగా నాబార్డుతో పాటు, ఇతర సహకార సంఘాల వారికి నా హృదయపూర్వక అభినందనలు.

స్నేహితులారా,

మనలో పల్లెలతో అనుబంధం ఉన్నవారికి, అక్కడ పెరిగిన వారికి మాత్రమే భారత్‌లోని గ్రామీణ ప్రాంతాల అసలు శక్తి ఏమిటో తెలుస్తుంది. ఒక వ్యక్తి గ్రామంలో నివసిస్తే.. అదే వ్యక్తిలో గ్రామం ఉంటుంది. పల్లెల్లో నివసించిన వారికి మాత్రమే గ్రామీణ జీవితాన్ని ఎలా స్వీకరించాలో తెలుస్తుంది. నా బాల్యం ఒక చిన్న పట్టణంలో, సాధారణమైన వాతావరణంలో గడిచింది. ఈ విషయంలో నన్ను నేను అదృష్టవంతుడిగా భావిస్తున్నాను. నేను ఇంటి నుంచి బయటకు వచ్చేసిన తర్వాత ఎక్కువ సమయం గ్రామాలు, పల్లెల్లోనే ఎక్కువ గడిపాను. గ్రామీణ జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ప్రత్యక్షంగా అనుభవించాను. చిన్నతనం నుంచి గ్రామీణులు ఎంత కష్టపడి పనిచేస్తారో చూస్తూనే ఉన్నాను. ఆర్ధిక స్థితిగతులు అనుకూలంగా లేకపోవడం వల్ల గ్రామీణులు తమకొచ్చే అవకాశాల్ని అందిపుచ్చుకోలేక పోతున్నారు.వారిలో ఉన్న వైవిధ్యమైన ప్రతిభ, సామర్థ్యాలను నేను గమనించాను! అయినప్పటికీ, అవి దైనందిన జీవన పోరాటాల్లో కనుమరుగైపోతున్నాయి. ప్రకృతి వైపరీత్యాల కారణంగా కొన్నిసార్లు పంటలు దెబ్బతింటాయి, మరికొన్ని సార్లు సరైన మార్కెట్ లేక తమ పంటలను తామే పారేసుకుని పరిస్థితి. ఈ కష్టాలను చాలా దగ్గర నుంచి చూసిన నేను గ్రామాలకు, పేదలకు సేవ చేయాలని సంకల్పించాను. ఇది వారి సమస్యలకు పరిష్కారాన్ని చూపాలనే స్ఫూర్తిని నాలో నింపింది.

గ్రామాల నుంచి నేర్చుకున్న అనుభవాలు, పాఠాలే నేడు అక్కడ అభివృద్ధి పనులు చేపట్టేందుకు ఉసిగొల్పాయి. 2014 నుంచి ప్రతి నిమిషాన్ని గ్రామీణ భారతదేశానికి సేవ చేసేందుకే అంకితం చేశాను. గ్రామీణ ప్రజలకు గౌరవప్రదమైన జీవితం కల్పించడమే మా ప్రభుత్వ ప్రాధాన్యం. భారత్‌లోని గ్రామాలకు సాధికారత కల్పించి, మరో చోటుకి వలస వెళ్లాల్సిన అవసరం లేకుండా విస్తృత అవకాశాలతో స్వీయాభివృద్ధి సాధించేలా చేయడమే మా లక్ష్యం. పల్లెల్లో జీవితాన్ని సులభతరం చేయడమే మా ఆశయం. దీన్ని సాధించేందుకే ప్రతి గ్రామంలోనూ కనీస సౌకర్యాల ఏర్పాటుకు భరోసానిస్తూ ప్రత్యేక కార్యక్రమం ప్రారంభించాం. స్వచ్ఛభారత్ అభియాన్ ద్వారా ప్రతి ఇంట్లోనూ మరుగుదొడ్లను నిర్మించాం. ప్రధానమంత్రి ఆవాస యోజన పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో లక్షల కుటుంబాలకు పక్కా ఇళ్లను అందించాం. జల్ జీవన్ కార్యక్రమం ద్వారా వేలాది గ్రామాల్లో ఇంటింటికీ శుద్ధమైన తాగునీరు సరఫరా చేస్తున్నాం.

మిత్రులారా,

ప్రస్తుతం 1.5 లక్షల ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాల ద్వారా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు లభిస్తున్నాయి. డిజిటల్ టెక్నాలజీ సాయంతో టెలిమెడిసన్ ప్రయోజనాలను ఉపయోగించుకుంటూ, గ్రామాలను ఉత్తమ వైద్యులు, ఆసుపత్రులతో అనుసంధానిస్తున్నాం. ఈ-సంజీవని వేదిక ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో లక్షల మంది ప్రజలు టెలి మెడిసిన్ సేవలను ఉఫయోగించుకున్నారు. కొవిడ్ - 19 మహమ్మారి సమయంలో దేశంలోని గ్రామాలు సంక్షోభంలో కూరుకుపోతాయని ప్రపంచం అనుమానించింది. కానీ ప్రతి గ్రామంలోనూ చివరి వ్యక్తి వరకు వ్యాక్సీన్ చేరేలా చర్యలు తీసుకున్నాం.

స్నేహితులారా,

గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి గ్రామీణ జనాభాలో ప్రతి వర్గాన్ని పరిగణనలోకి తీసుకొని ఆర్థిక విధానాలు రూపొందించడం కీలకం. గత పదేళ్లలో మా ప్రభుత్వం గ్రామాల్లోని ప్రతి వర్గం కోసం ప్రత్యేక విధానాలను రూపొందించి, నిర్ణయాలు తీసుకున్నందుకు నేను సంతోషిస్తున్నాను. కొన్ని రోజుల క్రితమే పీఎం ఫసల్ బీమా యోజనను మరో ఏడాది పొడిగించాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయంగా డీఏపీ (డై-అమ్మోనియం ఫాస్ఫేట్) ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఆ ధరలకు కొనాల్సి వస్తే మన రైతులపై ఎప్పటికీ కోలుకోలేని విధంగా భారంగా పడుతుంది. అంతర్జాతీయంగా పరిస్థితులు ఎలా ఉన్నా, మాపై భారం పడినా, ఆ ప్రభావం రైతులపై పడనివ్వకూడదని నిర్ణయించుకున్నాం. రైతులకు అందించే ధరను స్థిరీకరించేందుకే డీఏపీపై రాయితీలు ఇచ్చాం. మా ప్రభుత్వ ఉద్దేశం, విధానాలు, నిర్ణయాలు గ్రామీణ భారత్‌లో కొత్త శక్తిని నింపుతున్నాయి. గ్రామీణ ప్రజలకు వీలైనంత వరకు ఆర్థిక సాయం అందించడమే మా ప్రభుత్వ లక్ష్యం. తద్వారా వ్యవసాయం మాత్రమే కాకుండా నూతన ఉద్యోగ, ఉపాధి అవకాశాలను పొందుతారు. ఈ ఆలోచనతోనే పీఎం-కిసాన్ నిధి ద్వారా రైతులకు సుమారుగా 3 లక్షల కోట్ల రూపాయల ఆర్థిక సాయం అందించాం. గత పదేళ్లలో వ్యవసాయ రుణాలకు ఇచ్చే మొత్తం 3.5 రెట్లు పెరిగింది. ఇప్పుడు పాడి, మత్స్య రైతులకు సైతం కిసాన్ క్రెడిట్ కార్డులు జారీ అవుతున్నాయి. దేశ వ్యాప్తంగా ఉన్న 9,000 కు పైగా రైతు, ఉత్పత్తిదారు సంఘాలు (ఎఫ్‌పీవోలు) ఆర్థికసాయం పొందుతున్నాయి. వీటికి అదనంగా, గత పదేళ్లుగా, అనేక పంటలకు కనీస మద్ధతు ధర (ఎంఎస్‌పీ)ను నిలకడగా పెంచుతున్నాం.

మిత్రులారా,

స్వామిత్వ యోజన తరహా పథకాలను ప్రారంభించడం ద్వారా గ్రామీణులకు ఆస్తి యాజమాన్య పత్రాలను అందజేస్తున్నాం. గత పదేళ్లలో ఎంఎస్ఎంఈ (మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్ప్రైజెస్)లను ప్రోత్సహించేందుకు అనేక విధానాలను అమలు చేశాం. క్రెడిట్ గ్యారంటీ పథకం నుంచి ఈ వ్యాపారాలు ప్రయోజనం పొందాయి. ఫలితంగా కోటికి పైగా ఎంఎస్ఎంఈలకు నేరుగా సాయం లభించింది. ఇప్పుడు ముద్ర యోజన, స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియా తదితర పథకాల ద్వారా గ్రామీణ యువత లబ్ధి పొందుతున్నారు.

స్నేహితులారా,

గ్రామీణ ప్రాంతాల రూపురేఖలను మార్చడంలో సహకార సంఘాలు కీలకపాత్రను పోషిస్తాయి. ఈ సహకార సంఘాల ద్వారానే ప్రస్తుతం భారత్ సమృద్ధి దిశగా నడుస్తోంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని, 2021లో కొత్తగా సహకార మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేశాం. దేశవ్యాప్తంగా ఉన్న దాదాపు 70,000 ప్రాథమిక వ్యవసాయ రుణ సంఘా (పీఏసీఎస్‌ల)లను కంప్యూటరీకరణ చేస్తున్నాం. తద్వారా రైతులు, గ్రామీణులకు వారి ఉత్పత్తులకు మెరుగైన ధరలు లభించేలా చేసి గ్రామీణ ఆర్థికాభివృద్ధిని బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నాం.

మిత్రులారా,

మన గ్రామాల్లో వ్యవసాయం కాకుండా ఇతర సంప్రదాయ కళలు, నైపుణ్యాల్లో నిమగ్నమైనవారు చాలామందే ఉంటారు. ఉదాహరణకు కమ్మరి, వడ్రంగి, కుమ్మరి - వీరిలో చాలామంది పల్లెటూర్లలోనే నివసిస్తూ అక్కడే పని చేస్తూ ఉంటారు. ఈ కళాకారులు గ్రామీణ, ప్రాంతీయ ఆర్థికవ్యవస్థకు గణనీయమైన సహకారాన్ని అందించారు. అయితే గతంలో వారిని తరచూ విస్మరించేవారు. ఈ సమస్యను పరిష్కరించి, వారిని ప్రోత్సహించడానికే విశ్వకర్మ యోజన పథకాన్ని ప్రారంభించాం. వారిలో కొత్త నైపుణ్యాలు పెంపొందించేందుకు, వినూత్న ఉత్పత్తులను తయారు చేయడానికి, వారి సామర్థ్యాలను మెగరుగుపరడానికి ఈ పథకం సహాయపడుతుంది. దేశవ్యాప్తంగా లక్షలాది సంప్రదాయ కళాకారులు తమ వ్యాపారాల్లో పురోగతి సాధించేందుకు విశ్వకర్మ యోజన అవకాశాలను కల్పిస్తోంది.

స్నేహితులారా,

మన ఆలోచనలు గొప్పవైతే, ఫలితాలు సంతృప్తికరంగా ఉంటాయి. గత పదేళ్లుగా దేశం కోసం చేస్తున్న శ్రమ ఇప్పుడిప్పుడే ఫలితాలను ఇవ్వడం ప్రారంభించింది. కొన్ని రోజుల క్రితం దేశంలో చేపట్టిన ఓ ప్రధాన సర్వే ఎన్నో విషయాలను వెల్లడించింది. 2011 నాటితో పోలిస్తే, గ్రామీణ భారతంలో వినియోగ సామర్థ్యం లేదా కొనుగోలు శక్తి మూడింతలు పెరిగింది. అంటే తమకు నచ్చిన వాటిని కొనుగోలు చేసేందుకు గ్రామీణులు ఎక్కువ ఖర్చుపెడుతున్నారు. గతంలో తమ సంపాదనలో 50 శాతం కంటే ఎక్కువ మొత్తాన్ని ఆహారం, ఇతర కనీస అవసరాలకే వెచ్చించేవారు. స్వాతంత్య్రం తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో ఆహారానికి చేసే ఖర్చు మొదటిసారి 50 శాతం కంటే దిగువకు చేరుకుంది. అవసరానికి అనుగుణంగా ఇతర వస్తువులపై చేస్తున్న ఖర్చు పెరిగింది. తమ సౌకర్యాలు, కోరికలు, అవసరాలకు అనుగుణంగా వస్తువులు కొనుగోలు చేస్తున్నారని, వారి జీవన నాణ్యతను మెరుగుపరుచుకొనేందుకు ఎక్కువ ఖర్చు చేస్తున్నారని తెలిపింది.

మిత్రులారా,

పట్టణ, గ్రామీణ ప్రాంతాల మధ్య వినియోగంలో అంతరం బాగా తగ్గినట్టు ఈ సర్వేలో ప్రధానంగా వెల్లడైంది. గతంలో, పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని కుటుంబాలు, వ్యక్తులు చేసే ఖర్చు మధ్య గణనీయమైన వ్యత్యాసం ఉండేది. ఈ విషయంలో క్రమంగా గ్రామీణులు పట్టణ ప్రాంతాలకు చెందిన వారిని అందుకొంటున్నారు. మేం చేస్తున్న నిరంతర ప్రయత్నాల ద్వారా గ్రామీణ, పట్టణ ప్రాంతాల మధ్య అంతరం తగ్గుతోంది. గ్రామీణ భారతమంతా విజయగాథలతో నిండిపోయి మనకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది.

స్నేహితులారా,

ఈ విజయాల వైపు నేను చూసినప్పుడు గత ప్రభుత్వాలు వీటిని ఎందుకు చేయలేకపోయాయి అని ఆశ్చర్యపోతూ ఉంటాను - మనమెందుకు మోదీ కోసమే ఎదురుచూడాలి? స్వాతంత్య్రం వచ్చిన దశాబ్దాల అనంతరం కూడా దేశంలోని లక్షలాది గ్రామాలు కనీస వసతులు లేక అల్లాడిపోయాయి. నాకో విషయం చెప్పండి, పెద్ద సంఖ్యలో షెడ్యూలు కులాలు (ఎస్సీ), షెడ్యూలు తెగలు (ఎస్టీ) ఇతర వెనకబడిన తరగతులు (ఓబీసీ) ఎక్కడ నివసిస్తున్నారు? వీరంతా ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లోనే నివసిస్తారు. వీరి సమూహాలు కూడా అంతే. వీరి అవసరాలను గత ప్రభుత్వాలు తగినవిధంగా తీర్చలేదు. ఫలితంగా, గ్రామాల నుంచి వలసలు పెరిగాయి, పేదరికం పెరిగింది, గ్రామీణ-పట్టణ ప్రాంతాల మధ్య అంతరం పెరిగిపోయింది. మీకు మరో ఉదాహరణ చెబుతాను. మీకు తెలుసు, సరిహద్దు గ్రామాలపై గతంలో ఉన్న అభిప్రాయం ఏంటి? వాటిని దేశంలో చివరి గ్రామాలుగా పిలిచేవారు. మేము వాటిని అలా పిలవడం మానేశాం. ‘‘సూర్యోదయం వేళ  తొలికిరణాలు ఈ గ్రామాలపై ప్రసరించినప్పుడు అవి చివరి గ్రామాలు ఎలా అవుతాయి. అలాగే సూర్యుడు అస్తమించినప్పుడు చివరి కిరణం పడేది ఆ దిశలో ఉన్న మొదటి గ్రామం పైనే’’ కాబట్టి మాకు ఇవి చివరివి కావు - మొదటివి. అందుకే వాటికి ‘‘మొదటి గ్రామం’’ అనే హోదాను ఇచ్చాం. ఈ సరిహద్దు గ్రామాలను అభివృద్ధి చేసేందుకే మేం వైబ్రంట్ విలేజెస్ పథకాన్ని ప్రారంభించాం. ఈ గ్రామాల అభివృద్ధితో అక్కడి ప్రజల ఆదాయం కూడా పెరుగుతోంది. తమ అవసరాల గురించి ఎన్నడూ అడగని వారిని మోదీ సత్కరించారని దీని అర్థం. గిరిజన ప్రాంతాలను అభివృద్ధి చేయడానికి పీఎం జన్మన్ యోజను ప్రారంభించాం. దశాబ్దాలుగా వెనకబడి ఉన్న ప్రాంతాలు నేడు సమాన హక్కులను పొందుతున్నాయి. గడచిన పదేళ్లలో గత ప్రభుత్వాలు చేసిన ఎన్నో పొరపాట్లను మా ప్రభుత్వం సరిదిద్దింది. ప్రసుతం అభివృద్ధి చెందిన గ్రామాలే దేశ పురోగతికి దారి తీస్తాయనే మంత్రంతో మేం ముందుకు సాగుతున్నాం. ఈ ప్రయత్నాల ద్వారా గత పదేళ్లలో దాదాపుగా 25 కోట్ల మంది ప్రజలు పేదరికం నుంచి బయటపడ్డారు, వీరిలో ఎక్కువ మంది గ్రామీణ ప్రాంతాలకు చెందినవారే ఉన్నారు.

నిన్ననే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఓ అధ్యయనాన్ని విడుదల చేసింది. దీనిలో 2012 నాటికి భారత్‌లో పేదరికం 26 శాతంగా ఉంది. 2024 నాటికి ఇది 26 నుంచి 5 శాతానికి తగ్గింది. ‘పేదరికాన్ని నిర్మూలించాలి’ అంటూ దశాబ్దాలుగా కొందరు నినదిస్తూనే ఉన్నారు. పల్లెల్లో 70-80 ఏళ్ల వయసున్నవారిని అడిగితే ‘‘పేదరికాన్ని నిర్మూలించాలి’’ అనే నినాదం వారికి 15-20 ఏళ్ల వయసు ఉన్నప్పటి నుంచి వింటూనే ఉన్నామని మీకు చెబుతారు. ఇప్పుడు వారే 80 ఏళ్లకు చేరుకున్నారు. ఇఫ్పుడు పరిస్థితి మొత్తం మారిపోయింది. దేశంలో పేదరికం తగ్గుతూ వస్తోంది.

మిత్రులారా,

భారత గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో మహిళలు కీలకపాత్ర పోషిస్తున్నారు, దానిని మా ప్రభుత్వం మరింత ప్రోత్సహిస్తోంది. నేడు మహిళలు బ్యాంకు సఖి, బీమా సఖిగా గ్రామీణ జీవితాన్ని పునర్నిర్వచించడాన్ని మనం చూస్తున్నాం. నేను ఒకసారి బ్యాంకు సఖిలతో సమావేశమయ్యారు. వారితో సంభాషిస్తున్న సమయంలో రోజుకి 50-60-70 లక్షల రూపాయల లావాదేవీలను నిర్వహిస్తున్నానని ఒక బ్యాంకు సఖి నాకు తెలిపింది. అదెలా అని ఆమెను ప్రశ్నిస్తే.. ‘‘నేను 50 లక్షల రూపాయలతో ఉదయం బయలుదేరతాను’’ అని చెప్పింది. నా దేశంలో, ఒక యువతి తన బ్యాగులో 50 లక్షల రూపాయలతో తిరుగుతూ ఉండటమే భారతదేశపు కొత్త కోణం. గ్రామాల్లో స్వయం సహాయక బృందాలతో మహిళలు విప్లవాన్ని సృష్టిస్తున్నారు. మేము 1.15 కోట్ల మంది లఖ్‌పతి దీదీలను తయారుచేయగలిగాం. లఖ్‌పతి దీదీ అంటే ఒక్కసారి లక్ష రూపాయలు సంపాదించడం కాదు. ఏటా లక్ష రూపాయల కంటే ఎక్కువ ఆర్జించడం. 3 కోట్ల మంది లఖ్‌పతి దీదీలను తయారుచేయాలనేది మా లక్ష్యం. దళితులు, వెనబడిన, గిరిజన వర్గాలకు చెందిన మహిళల సాధికారత కోసం ప్రత్యేకంగా పథకాలు తీసుకొచ్చాం.

స్నేహితులారా,

దేశంలో గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతులపై గతంలో ఎన్నడూ లేనంతగా దృష్టి సారించాం. దేశంలో చాలా గ్రామాలు ఇప్పుడు జాతీయ రహదారులు, ఎక్స్‌ప్రెస్ మార్గాలు, రైలు మార్గాలతో అనుసంధానమయ్యాయి. గ్రామీణ ప్రాంతాల్లో ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన ద్వారా గత పదేళ్లలో దాదాపుగా 4 లక్షల కి.మీ.ల రోడ్లు నిర్మితమయ్యాయి. డిజిటల్ మౌలిక సదుపాయాల విషయానికి వస్తే, 21వ శతాబ్ధపు ఆధునిక హబ్‌లుగా మారుతున్నాయి. గ్రామీణ ప్రజలు డిజిటల్ టెక్నాలజీని అందుకోలేరన్న వ్యాఖ్యలను వారు తిప్పి కొడుతున్నారు. ఇక్కడ ఉన్నవారందరూ తమ మొబైల్ ఫోన్లలో వీడియో రికార్డు చేయడం నేను ఇఫ్పుడు చూస్తున్నాను. వీరంతా గ్రామీణులే. 94 శాతానికి పైగా గ్రామీణ కుటుంబాలకు టెలిఫోన్ లేదా మొబైల్ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. బ్యాంకింగ్ సేవలు, యూపీఐ తరహా ప్రపంచ స్థాయి సాంకేతికతలు ప్రస్తుతం గ్రామాల్లో అందుబాటులో ఉన్నాయి. 2014కి ముందు మన దేశంలో లక్ష కంటే తక్కువ సాధారణ సేవా కేంద్రాలు (సీఎస్‌సీలు) ఉండేవి. ఇప్పుడు వాటి సంఖ్య 5 లక్షలకు పైనే ఉంది. ఈ కేంద్రాలు డజన్ల సంఖ్యలో ప్రభుత్వ సేవలను ఒకే చోట అందిస్తున్నాయి. ఈ మౌలిక సదుపాయాలే గ్రామాలను అభివృద్ధి దిశగా నడిపిస్తూ, ఉపాధి అవకాశాలను సృష్టిస్తున్నాయి. అంతే కాకుండా దేశాభివృద్ధిలో గ్రామీణ ప్రాంతాలను సైతం భాగం చేస్తున్నాయి.

మిత్రులారా,

ఇక్కడ నాబార్డు ఉన్నత కార్యవర్గం ఉంది. స్వయం సహాయక బృందాల నుంచి కిసాన్ క్రెడిట్ కార్డుల వరకు ఎన్నో కార్యక్రమాలు విజయవంతం కావడంలో మీరు కీలకపాత్ర పోషించారు. దేశ లక్ష్యాలను సాధించే క్రమంలో ముందుకు వెళ్లే కొద్దీ మీ పాత్ర మరింత కీలకం కానుంది. ఎఫ్‌పీవో (రైతులు, ఉత్పత్తిదారుల సంఘం)ల సామర్థ్యం గురించి మీ అందరికీ తెలుసు. ఎఫ్‌పీఓలు ఏర్పాటుతో మన రైతులు పండించిన పంటకు మెరుగైన ధరలు లభిస్తున్నాయి. మరిన్ని ఎఫ్‌పీవోలను ఏర్పాటు చేసి ఇంకా ముందుకు వెళ్లాలి. ప్రస్తుతం రైతులకు పాల ఉత్పత్తి ద్వారా ఎక్కువ ఆదాయం లభిస్తోంది. అమూల్ తరహాలో దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందేలా 5 నుంచి 6 సహకార సంఘాలను ఏర్పాటు చేసేందుకు మనం కృషి చేయాలి. దేశం ఇప్పడు సహజ వ్యవసాయాన్ని ఉద్యమంగా ముందుకు తీసుకువెళుతోంది. ఈ సేద్యాన్ని ప్రోత్సహించేందుకు ఎక్కువ మంది రైతులను ఈ కార్యక్రమంలో భాగం చేయాలి. అలాగే స్వయం సహాయక బృందాలను చిన్న, సూక్ష్మ తరహా పరిశ్రమ (ఎంఎస్ఎంఈ)లకు అనుసంధానించాలి. వారు తయారుచేసిన ఉత్పత్తులకు దేశవ్యాప్తంగా డిమాండ్ ఉంది, వాటి బ్రాండింగ్, మార్కెటింగ్‌పై మనం దృష్టి సారించాలి. వీటితో పాటు మన జీఐ ఉత్పత్తుల నాణ్యత, ప్యాకేజింగ్, బ్రాండింగ్‌పై శ్రద్ధ వహించాలి.

స్నేహితులారా,

గ్రామీణ ఆదాయాన్ని వైవిధ్యపరిచే మార్గాలపై మనం కృషి చేయాలి. పల్లెల్లో నీటి పారుదలను చౌకగా ఎలా అందించగలం? సూక్ష్మ నీటిపారుదల వ్యవస్థలను విస్తరించేందుకు, ‘ఒక నీటిబొట్టుతో ఎక్కువ పంట’ అనే మంత్రాన్ని వాస్తవరూపంలోకి తీసుకువచ్చేందుకు మనం కృషి చేయాలి. సరళమైన గ్రామీణ సహకార సంఘాలను మరిన్ని ఏర్పాటు చేయాలి. వీటికి తోడు సహజ వ్యవసాయం వల్ల వచ్చే అవకాశాల ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వీలైనంత లబ్ధి చేకూరేలా చేయాలి. సమయానుకూలంగా ఈ లక్ష్యాల కోసం పనిచేయాలని మిమ్మల్ని కోరుతున్నాను.

స్నేహితులారా,

మీ గ్రామంలో నిర్మించిన అమృత సరోవరాల బాధ్యతను మొత్తం సమాజమంతా సమష్టిగా చూసుకోవాలి. అదే సమయంలో జాతీయ స్థాయిలో ‘‘ఏక్ పేడ్ మా కే నామ్’’ (అమ్మ కోసం ఒక చెట్టు) అనే కార్యక్రమం జరుగుతోంది. ఈ కార్యక్రమంలో గ్రామంలోని ప్రతి ఒక్కరూ పాలు పంచుకొనేలా స్ఫూర్తి కలిగించి, వీలైనన్ని చెట్లు నాటేలా చేయడం చాలా ముఖ్యం. మరో ముఖ్యమైన అంశం ఏంటంటే, ఐక్యత, సామరస్యం, ప్రేమతో మన గ్రామ గుర్తింపు ముడిపడి ఉంది. దురదృష్టవశాత్తూ కులం పేరుతో సమాజంలో విషం నింపి, బలహీన పరిచేందుకు కొందరు వ్యక్తులు ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి కుట్రలను మనం అడ్డుకొని, సంఝీ విరాసత్ (భాగస్వామ్య వారసత్వం), సంఝీ సంస్కృతి (భాగస్వామ్య సంస్కృతి)లను బలోపేతం చేయాలి.

సోదర సోదరీమణులారా,

మన తీర్మానాలు ప్రతి గ్రామానికీ చేరాలి. ఈ గ్రామీణ భారత వేడుకలు అన్ని గ్రామాలకూ చేరుకోవాలి. మన గ్రామాలు మరింత పటిష్టమయ్యేలా, సాధికారత సాధించే దిశగా మనం సమష్టిగా పనిచేయడం కొనసాగించాలి. గ్రామాభివృద్ధికై మన అంకిత భావమే ‘వికసిత్ భారత్’ లక్ష్యాన్ని చేరుకొనేందుకు సహకరిస్తుందని నేను విశ్వసిస్తున్నాను. ఈ రోజు గ్రామీణులు ఇక్కడ ప్రదర్శిస్తున్న జీఐ -ట్యాగ్ ఉత్పత్తులను చూసే అవకాశం నాకు లభించింది. గ్రామాలను సందర్శించే అవకాశం లేని ఢిల్లీ ప్రజలు ఈ కార్యక్రమానికి కనీసం ఒక్కసారి వచ్చి పల్లెల సామార్థ్యాన్ని తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను. మన గ్రామాల్లో ఎంతో వైవిధ్యం, సామర్థ్యం ఉన్నాయి. ఎప్పుడూ గ్రామాలను సందర్శించని వారు ఇక్కడున్న వాటిని చూసి ఆశ్చర్యపోతారు. ఈ పని మీరు చేస్తారు, మీ అందరికీ నా అభినందనలు. మీ అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు, ధన్యవాదాలు

సూచన: ఇది ప్రధాని హిందీలో చేసిన ప్రసంగానికి ఇంచుమించు తెలుగు అనువాదం.

 

***


(Release ID: 2091054) Visitor Counter : 13