రాష్ట్రపతి సచివాలయం
మంగళగిరి ఎయిమ్స్ తొలి స్నాతకోత్సవానికి రాష్ట్రపతి హాజరు
Posted On:
17 DEC 2024 2:14PM by PIB Hyderabad
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, మంగళగిరి ఎయిమ్స్ లో నేడు (2024, డిసెంబర్ 17న) జరిగిన సంస్థ తొలి స్నాతకోత్సవానికి రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపదీ ముర్ము హాజరయ్యారు.
ఈ సందర్భంగా రాష్ట్రపతి ప్రసంగిస్తూ, ఏ ఉన్నత విద్యాసంస్థకైనా తొలి బ్యాచ్ గుర్తింపుని తెచ్చిపెడుతుందన్నారు. మంగళగిరి ఎయిమ్స్ (అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ)లో ఎంబీబీఎస్ పూర్తి చేసిన తొలి బ్యాచ్ విద్యార్థులు వైద్య సమాజానికి, సామాన్య ప్రజలకు, దేశానికీ, ప్రపంచానికీ సంస్థను గురించి తెలియజేసే బ్రాండ్ అంబాసిడర్లని అభివర్ణించారు.
వైద్య వృత్తిని ఎంచుకున్న విద్యార్థులు, మానవాళికి సేవ చేసే మార్గాన్ని ఎంచుకున్నారని ప్రశంసించారు. తమ వృత్తిలో విజయాన్ని, గౌరవన్నీ పొందేందుకు మూడు సాధారణ విషయాలపై దృష్టి కేంద్రీకరించాలని, సేవా తాత్పరత, విజ్ఞాన సముపార్జన పట్ల తృష్ణ, పరిశోధనల పట్ల ఆసక్తి ఉండాలని సూచించారు. ఇక పేరు ప్రఖ్యాతులు, ఆర్జనల మధ్య ఎంచుకోవలసి వచ్చినప్పుడు మంచి పేరు తెచ్చుకునేందుకే మొగ్గు చూపాలని హితవు పలికారు.
కేవలం ప్రతిభ, కఠోర శ్రమ ద్వారానే భారతీయ వైద్యులు ప్రపంచంలో ముందు వరసలో నిలుస్తున్నారని చెప్పారు. మన దేశంలో లభించే మేలురకమైన వైద్య సదుపాయాల కోసం అనేక దేశాల ప్రజలు వస్తారని, తక్కువ ఖర్చుతో వైద్యం అందిస్తున్న భారత్ మెడికల్ టూరిజం రంగంలో ప్రముఖ స్థానం పొందుతోందని అన్నారు. వైద్య పర్యాటకంలో మన డాక్టర్లు కీలక పాత్ర పోషించాలని అన్నారు.
మనుషుల దీర్ఘాయుష్షు, వ్యాధులు దరి చేరని పరిపూర్ణ ఆరోగ్యం కోసం ప్రార్థించడం మన సంస్కృతిలో భాగమని, జీవితం, ఆరోగ్యం పరస్పర సంబంధం గల విషయాలని శ్రీమతి ముర్ము వ్యాఖ్యానించారు. ఈ వైఖరి సమగ్ర ఆరోగ్యానికి ప్రాధాన్యాన్నిస్తుందని చెప్పారు. ‘సకల స్వాస్థ్య సర్వదా’ అన్న మంగళగిరి ఎయిమ్స్ ఆదర్శం సమగ్ర ఆరోగ్యం, అందరికీ ఆరోగ్యం అన్న ఆదర్శాలకి అనుగుణంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు. సమగ్ర ఆరోగ్యం, అందరికీ ఆరోగ్యం అన్న లక్ష్యాలు ప్రతి వైద్య సంస్థకూ మార్గదర్శకాలు కావాలని ఆకాంక్షించారు.
కాలాన్ని బట్టి, పరిస్థితుల బట్టి వైజ్ఞానిక రంగం సరికొత్త సవాళ్ళను ఎదుర్కొంటుందని, కొత్త సమస్యలకి కొత్త పరిష్కారాలు అవసరమవుతాయని శ్రీమతి ముర్ము పేర్కొన్నారు. మంగళగిరి ఎయిమ్స్ లోని సైటోజెనెటిక్స్ పరిశోధనాశాల ఈ దిశగా మంచి యత్నమని ప్రశంసించారు. పరిశోధనాశాలలో భిన్న అంశాలపై పరిశోధనలు జరిపి నూతన చికిత్సా పద్ధతులను సంస్థ కనుగొనగలదన్న విశ్వాసాన్ని రాష్ట్రపతి వెలిబుచ్చారు.
***
(Release ID: 2085488)
Visitor Counter : 21