ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

డిసెంబరు 13న ఉత్తరప్రదేశ్‌లో ప్రధానమంత్రి పర్యటన

మహాకుంభ్ మేళా 2025 అభివృద్ధి పనులను పరిశీలించనున్న ప్రధానమంత్రి


ప్రయాగ్‌రాజ్‌లో రూ.6670 కోట్లకు పైగా విలువైన అనేక అభివృద్ధి ప్రాజెక్టులను ఆయన ప్రారంభిస్తారు


‘కుంభ్ సహాయక్’ (Kumbh Sah’AI’yak) చాట్‌బాట్‌ను ప్రారంభించనున్న ప్రధానమంత్రి

Posted On: 12 DEC 2024 2:10PM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ డిసెంబరు 13న ఉత్తరప్రదేశ్‌ను సందర్శించనున్నారు.  ఆయన ప్రయాగ్‌రాజ్‌కు వెళ్ళి, మధ్యాహ్నం సుమారు 12 గంటల 15 నిమిషాలకు సంగమ్ స్థలానికి చేరుకొని పూజ, దర్శనం కార్యక్రమాల్లో పాలుపంచుకొంటారు.  మధ్యాహ్నం దాదాపు 12 గంటల 40 నిమిషాలకు అక్షయ వట వృక్షానికి పూజచేసి, ఆ తరువాత హనుమాన్ మందిర్, సరస్వతీ కూప్‌లో దర్శనం, పూజాది కార్యక్రమాల్లో పాల్గొంటారు.  మధ్యాహ్నం ఇంచుమించు ఒంటిగంటన్నరకు ఆయన మహాకుంభ్ ప్రదర్శన స్థలాన్ని చేరుకొని, ఆ ప్రదేశమంతా కలియతిరుగుతారు.  ఈ కార్యక్రమం పూర్తయిన తరువాత, మధ్యాహ్నం సుమారు 2 గంటలకు రూ. 5500 కోట్లకు పైగా విలువైన అనేక అభివృద్ధి ప్రాజెక్టులను  ప్రయాగ్‌రాజ్‌లో ప్రారంభిస్తారు.

మహాకుంభ్ 2025ను దృష్టిలో పెట్టుకొని పూర్తి చేసిన వివిధ ప్రాజెక్టులను ప్రధాని ప్రారంభించనున్నారు.  వీటిలో 10 కొత్త రోడ్ ఓవర్ బ్రిడ్జ్‌లు (ఆర్ఓబీస్) లేదా ఫ్లైఓవర్లు, శాశ్వత స్నాన ఘట్టాలు, నదీముఖానికి చేర్చే రహదారులు, తదితర ప్రాజెక్టులు భాగంగా ఉన్నాయి.  ప్రయాగ్‌రాజ్‌కు చేరుకోవడానికి ఎలాంటి ఇబ్బంది ఎదురవకూడదనే ఉద్దేశంతో అక్కడ మౌలిక సదుపాయాలను పెంచడానికి ఉద్దేశించిన వివిధ రహదారి ప్రాజెక్టులివి.

‘స్వచ్ఛ గంగ’, ‘నిర్మల గంగ’ భావనకు కట్టుబడ్డ ప్రధానమంత్రి, ఆ దృక్పథంలో భాగంగా గంగానదికి దారితీస్తున్న చిన్న కాలవలను వేరే చోట్లకు మళ్ళించేందుకు, ఆ కాలవల నీటిని శుద్ధి చేసేందుకు  ఉద్దేశించిన ప్రాజెక్టుల్ని కూడా ప్రారంభించనున్నారు.  దీనితో, ఇక కలుషిత జలాన్ని నదిలోకి పంపించడానికి ఆస్కారమంటూ ఉండదు.  తాగునీటికి, విద్యుత్తుకు సంబంధించిన వివిధ మౌలిక సదుపాయాల కల్పన ప్రాజెక్టులను కూడా ప్రధాని ప్రారంభిస్తారు.

భరద్వాజ్ ఆశ్రమ్ కారిడార్, శృంగ్‌వేర్పూర్ ధామ్ కారిడార్‌లతోపాటు ఇతర ప్రధాన దేవాలయ కారిడార్లను ప్రధాని ప్రారంభించనున్నారు.  ఈ ప్రాజెక్టులు భక్తులకు మెరుగైన సంధాన సదుపాయాన్ని సమకూర్చడంతోపాటు ఆధ్యాత్మిక ప్రధాన పర్యటనకు ఊతాన్ని ఇస్తాయి.

కుంభ్ సహాయక్ (Kumbh Sah’AI’yak)అనే చాట్‌బాట్ ను కూడా ప్రధానమంత్రి ప్రారంభించనున్నారు.  ఇది మహాకుంభ్ మేళా 2025కు సంబంధించి భక్తులకు మార్గదర్శనం చేయడంతో పాటు కార్యక్రమాలకు సంబంధించిన తాజా సమాచారాన్ని అందిస్తుంటుంది.


(Release ID: 2083775) Visitor Counter : 50