సాంస్కృతిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

మహా కుంభ్ మేళా 2025: విశ్వాసం, సంస్కృతి, ఆధ్యాత్మిక వారసత్వాల పావన సంగమం

Posted On: 04 DEC 2024 5:59PM by PIB Hyderabad

జనసంద్రం ఆధ్యాత్మిక భావనల్లో ఓలలాడే, ప్రపంచంలోని అత్యంత భారీ ఉత్సవం ‘మహాకుంభ్ మేళా’. ఇది విశ్వాసం, సంస్కృతి, ఇంకా ప్రాచీన సంప్రదాయాల అపూర్వ సంగమం. హిందూ పురాణాలలో ప్రస్తావించిన ఈ పవిత్ర ఉత్సవాన్ని పన్నెండేళ్ళ కాల గతిలో నాలుగు సార్లు నిర్వహిస్తారు. ఈ ఉత్సవాన్ని భారతదేశంలో అత్యంత పవిత్ర నదులు గంగ, శిప్రా, గోదావరీల తీర ప్రాంతాల్లో నెలకొన్న హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్, ప్రయాగ్‌రాజ్ లలోనూ, గంగ, యమున,  సరస్వతి నదుల సంగమ ప్రదేశంలోనూ నిర్వహిస్తారు. 2025లో జనవరి 13 మొదలు ఫిబ్రవరి 26 వరకు ప్రయాగ్ రాజ్ మరోసారి ఈ వైభవోపేత ఉత్సవానికి కేంద్ర బిందువుగా మారి, లక్షలకొద్దీ తీర్థయాత్రికులను, సందర్శకులను తనవైపునకు తిప్పుకోనుంది. ఈ సందర్భంగా భక్తి, ఐకమత్యంలతోపాటు భారతదేశ ఆధ్యాత్మిక వారసత్వ చైతన్య కెరటాలు ఉప్పొంగనున్నాయి. 

ఈ భవ్య ఉత్సవం ధార్మిక క్రతువులను మించి, ఖగోళ శాస్త్రం, జ్యోతిష శాస్త్రం, సామాజిక-సాంస్కృతిక సంప్రదాయాలు, ఆధ్యాత్మిక జ్ఞాన బోధనల విశిష్ట కదంబం. ఇక్కడి పవిత్ర ధార్మిక సంప్రదాయాల్లో పాలుపంచుకోవడానికి భక్తజనం, తపస్వులు, జ్ఞానాన్వేషకులు లక్షల సంఖ్యలలో ఇక్కడకు తరలివస్తారు. ఆ సంప్రదాయాల్లో త్రివేణి సంగమంలో చేసే పవిత్ర స్నానం వారి పాపాలను కడిగివేసి వారికి మోక్ష మార్గానికి దారి చూపుతుందని వారు నమ్ముతారు. భారత్‌లో వేళ్ళూనుకొన్న సంప్రదాయానికి మహా కుంభ్ మేళా ప్రతీక కావడంతో పాటు మనసుకు నెమ్మదినిచ్చే తుది సత్యాన్ని కనుగొనడానికి, మనిషి తాను ఎవరో - తాను ఏమిటో తెలుసుకోవడానికి అనాది నుంచి చేస్తున్న జ్ఞానాన్వేషణకు, మానవజాతి అంతా ఒక్కటే అనే భావనకు నిదర్శనంగా నిలుస్తుంది.

ముఖ్య ఆచారాలు, సంప్రదాయాలు

షాహీ స్నాన్

మహా కుంభ్ మేళా అనేక ఆచారాల గొప్ప కూటమి. దీనిలో స్నానంచేసే కార్యక్రమమే అన్నింటికన్నా అత్యంత ముఖ్యమైన సన్నివేశం. త్రివేణీ సంగమ ప్రదేశంలో లక్షల కొద్దీ తీర్థయాత్రికులు గుమికూడి, పుణ్యస్నానాల్ని ఆచరిస్తారు. పవిత్ర జలాల్లో ఒకసారి మునక వేసినంత మాత్రాననే ఒక మనిషి తన పాపాలన్నిటినీ పరిశుద్ధం చేసుకోవచ్చన్నది నమ్మకం. ఈ పవిత్రకార్యం ఇటు ఆ వ్యక్తికీ, అటు పునర్జన్మ చక్రభ్రమణంలో చిక్కుకుపోయిన ఆ వ్యక్తి పూర్వికులకూ కూడా స్వేచ్ఛను ప్రసాదించి, చివరకు మోక్షాన్ని ప్రసాదిస్తుందని పలువురు విశ్వసిస్తారు.

 

స్నాన క్రతువులో పాల్గొనడంతోపాటు, యాత్రికులు పవిత్ర నది తీరాల వెంబడి ఆరాధన కార్యక్రమాల్లోనూ, సాధువులు, సంతులు చేసే అనుగ్రహ భాషణాది కార్యక్రమాల్లోనూ పాల్గొని, ఈ అనుభవానికి గల ఆధ్యాత్మిక గాఢతను అనుభవంలోకి తెచ్చుకొంటారు. ‘ప్రయాగ్ రాజ్ మహా కుంభ్’ జరిగినంత కాలం నిత్యం పవిత్ర జలాల్లో మునగడం పుణ్యార్జన కార్యమేనని, అయితే కొన్ని తేదీలు మాత్రం ఎంతో ప్రత్యేక ప్రాధాన్యాన్ని కలిగి ఉన్నవని భావిస్తారు. పౌష్ పూర్ణిమ (జనవరి 13), మకర సంక్రాంతి (జనవరి 14) మొదలైనవే అలాంటి తిథులు. ఆ రోజుల్లో సన్యాసులు, వారి భక్తగణం వివిధ అఖాడాల సభ్యులంతా షాహీ స్నాన్, లేదా ‘రాజయోగి స్నానం’ అని పిలిచే ఒక భవ్య ఆచారాన్ని పాటిస్తారు. ఈ ఘట్టంతో మహాకుంభ్ మేళాకు ఆధికారికంగా నాందీ ప్రస్తావన జరుగుతుందన్నమాట. మరి దీనిదే ఈ ఉత్సవంలో కేంద్రీయ భూమిక. ఈ కార్యక్రమంలో పాలుపంచుకొనేవారందరూ సాధు సంతుల ఆశీర్వాదాలను, విస్తృత జ్ఞానాన్ని అందుకోగలుగుతారన్న నమ్మకం మీద ఈ షాహీ స్నానం చేసే సంప్రదాయం ఆధారపడింది.

ఆరతి

నదీతీర ప్రాంతాల్లో నిర్వహించే గంగ ఆరతి కార్యక్రమం చూపరులను సమ్మోహితులను చేస్తుంది. మరపునకు రాని అనుభూతి. ఈ పవిత్ర కార్యక్రమంలో భాగంగా అర్చకులు అనేక చిన్నపాటి దీపస్తంభాలను నదికి ఎదురుగా చేతులతో పట్టుకొని  పైకెత్తి సవ్యదిశలో తిప్పుతూ నిర్వహించే ఆరాధన తతంగాన్ని చూడడానికి రెండు కళ్లూ చాలవు. గంగ ఆరతి వేలకొద్దీ  భక్త సందోహాన్ని ఆకట్టుకొని, వారిలో ఆ పవిత్ర నది అంటే అనంత భక్తి ప్రపత్తులను కలిగిస్తుంది.

కల్పవాస్

ఇది మహాకుంభ్ మేళాలో మరొక ఆకర్షణీయ సన్నివేశమైనప్పటికీ, చాలా మందికి దీనిని గురించి తెలిసింది తక్కువే. ఈ ఘట్టం సాధకులకు ఉన్నత చేతనను భోదిస్తుంది. సంస్కృత భాషలో ‘‘కల్ప’’ అంటే విశ్వ చరిత్రలోని ఒక యుగం, ఇక ‘‘వాస్’’ అనే పదం వసతిని సూచిస్తుంది. ఈ ప్రకారంగా చూసినప్పుడు ఉప్పొంగిన ఆధ్యాత్మిక ఆరాధన కాలానికి ఇది సంకేతంగా ఉంటుంది. కల్పవాస్‌లో పాల్గొనే యాత్రికులు సీదాసాదా జీవనాన్ని గడుపుతారు. ప్రాపంచిక సుఖాల జోలికి పోరు. ధ్యానం, ప్రార్థనలు, ధర్మగ్రంథాల పఠనం.. వంటి పనులను రోజూ ఆచరిస్తారు.  వైదిక యజ్ఞాలు, హోమాలు, దైవిక ఆశీర్వాదాలను పొందగోరడం, సత్సంగాలు, ఆధ్యాత్మిక ప్రవచనాలు వంటి అభ్యాసాలతో మేధోపరంగా, భక్తిపరంగా వారి అవగాహనను పెంచుకొనే ప్రయత్నం చేస్తారు. ఇది ఈ తీర్థయాత్ర కాలం ముగిసే లోపల సాధకులలో భక్తి గాఢతను, ఆధ్యాత్మిక పరివర్తనను పెంచి పోషించి వారితో తాదాత్మ్య స్థితి ఏర్పడడానికి  కారణమవుతుంది.

ప్రార్థనలునైవేద్యాలు

కుంభ్ కాలంలో సంగమ ప్రదేశాన్ని దేవతలు సందర్శిస్తారని భావించి, వారిని గౌరవించడానికి భక్తులు ‘దేవ పూజ’ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. పితరులకు ఆహారాన్ని అందించడంతోపాటు వారిని ప్రార్థించడం.. దీనినే ‘శ్రాద్ధ్’ అని పిలుస్తారు. గంగామాతకు తలనీలాలను అర్పించడం.. దీనినే ‘వీణీ దాన్’ అని పిలుస్తారు. ఈ రెండు కార్యక్రమాలు ఉత్సవంలో అంతర్భాగాలుగా ఉంటాయి. ఇవి మనిషి తనను తాను దైవానికి అర్పించుకొని, పరిశుద్ధం అవుతారనడానికి సంకేతాలుగా నిలుస్తాయి. ‘సత్సంగ్’.. అంటే సత్యంతో సంబంధాన్ని ఏర్పరచుకొంటూ ఉండడం; ఈ కార్యక్రమంలో భాగంగా సాధువులు, పండితులు చెప్పే మాటలను భక్తగణం శ్రద్ధగా వినడం ప్రాముఖ్యాన్ని సంతరించుకొంటుంది. ఈ జ్ఞాన ప్రసారం ఆధ్యాత్మిక విషయాలను గురించి లోతుగా తెలుసుకొని, కార్యక్రమానికి హాజరైన వారు వారి మనసు లోలోపలికి తొంగి చూసుకోవడానికి ప్రేరణను అందిస్తుంది. దానధర్మాలకూ కుంభ్ కాలంలో ఎనలేని ప్రాధాన్యం ఉంటుంది. అవతలి వ్యక్తికి ఇవ్వడం, ఉదాహరణకు ‘గోవులను దానం’గా ఇవ్వడం, ‘వస్త్రాలను’ దానంగా ఇవ్వడం, ‘డబ్బును’ దానంగా ఇవ్వడం, ‘బంగారాన్ని’ దానం చేయడం వంటివాటిని ఉత్తమ కార్యాలని భావిస్తారు.

దీపదానం

కుంభమేళా సమయంలో ప్రయాగరాజ్‌లో చేసే దీప దానం పవిత్రమైన నదులను అద్భుత దృశ్యకావ్యంగా మార్చేస్తుంది. త్రివేణీ సంగమం వద్ద ప్రవహిస్తున్న నీటిలో వేల సంఖ్యలో మట్టి దీపాలను భక్తిభావంతో వదులుతారు. సాధారణంగా గోధుమపిండితో తయారుచేసి, నూనె నింపిన ఈ దీపాలు, దైవతా భావనతో కూడిన ప్రకాశాన్ని వెలువరిస్తాయి. దైవిక తేజస్సును ప్రతిబింబిస్తూ, ఆధ్యాత్మికతకు, భక్తికి నిదర్శనంగా నిలుస్తాయి. నదిలో వెలిగే ఈ దీపాలు మేళా వాతావరణాన్ని ధార్మికతతో, ఐక్యతతో నింపి భక్తుల మనస్సులో చెరగని ముద్ర వేస్తాయి.

ప్రయాగరాజ్ పంచ్‌కోషి పరిక్రమ
ప్రాచీన సంప్రదాయాలతో భక్తులను తిరిగి అనుసంధానమయ్యేలా చేసేందుకు ప్రయాగ రాజ్ చుట్టూ చేసే చారిత్రక ప్రదక్షిణను తిరిగి పునరుద్ధరించారు. ద్వాదశ మాధవ్ సహా ఇతర ప్రధాన ఆలయాల మీదుగా సాగే ఈ ప్రదక్షిణ సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షిస్తూనే ఆధ్యాత్మిక తృప్తిని అందిస్తుంది. సుసంపన్నమైన సాంస్కృతికధార్మిక, ఆధ్యాత్మిక వారసత్వంతో అనుసంధానమయ్యే అవకాశం యువతరానికి కల్పించడమే ఈ చారిత్రక ఆచారాన్ని పునరుద్ధరించడం వెనుక ప్రధాన లక్ష్యం.

2025 కుంభమేళాలో ప్రధాన ఆకర్షణలు

2025లో జరిగే మహా కుంభమేళాలో ఆధ్యాత్మిక కార్యక్రమాలే కాకుండా ప్రయాగరాజ్‌లో ఇతర ఆకర్షణలు కూడా ఉన్నాయి. గంగా, యమున, సరస్వతి నదుల పవిత్ర సంగమ ప్రదేశంగా ప్రయాగరాజ్‌ యాత్రీకులకు ప్రముఖమైన ప్రదేశంగా ఉంది. మేళాకు హాజరయ్యే ప్రతి ఒక్కరూ త్రివేణీ సంగమ ప్రాంతాన్ని కచ్చితంగా సందర్శించాలి. ఈ పవిత్రమైన ప్రదేశం ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది భక్తులు, యాత్రికులను ఆకర్షించి ఆధ్యాత్మిక అనుభూతిని అందిస్తుంది.

మతపరమైన ఆచారాలకు అతీతమైన సాంస్కృతిక, చారిత్రక, శిల్పకళా నిర్మాణాలు ప్రయాగరాజ్‌లో ఉన్నాయి. ఈ నగరంలో హనుమాన్ దేవాలయం, అలోపీ దేవీ మందిరం, మన్‌కామేశ్వర్ గుడి సహా అనేక ప్రాచీన ఆలయాలు ఉన్నాయి. మతపరంగా ప్రాధాన్యతను కలిగి ఉన్న ఈ దేవాలయాలు, నగర ఆధ్యాత్మిక వారసత్వాన్ని యాత్రికులకు పరిచయం చేస్తాయి. అద్భుతమైన నగిషీలు, పురాణాలు చెక్కి ఉన్న ఈ పురాతన ఆలయాలు హిందూ సంప్రదాయంతో నగరానికి ఉన్న సుధీర్ఘ అనుబంధానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. చరిత్రపై ఆసక్తి ఉన్నవారు సందర్శించేందుకు అశోక స్తంభం లాంటి చారిత్రక ప్రదేశాలు ప్రయాగరాజ్‌లో ఉన్నాయి. భారతదేశ చారిత్రక వైభవాన్ని ఈ స్తూపం తెలియజేస్తుంది. అలహాబాద్ విశ్వవిద్యాలయ భవనం, స్వరాజ్ భవన్ లాంటివి వలసపాలన నాటి నిర్మాణ శైలితో నగర శోభను మరింత పెంచుతున్నాయి. ఈ భవనాలు బ్రిటిష్ పాలన కాలంలో నిర్మాణ వైభవాన్ని తెలియజేస్తాయి.

పర్యాటకులను ప్రయాగ రాజ్ సాంస్కృతిక వారసత్వం ఆకర్షిస్తుంది. సందడిగా ఉండే వీధులు, మార్కెట్లను సందర్శించడం ద్వారా స్థానిక సంస్కృతి, కళలు, ఆహారం సహా ఈ నగర జీవనం గురించి తెలుసుకునే అవకాశం యాత్రికులకు లభిస్తుంది. ఈ చారిత్రక, సాంస్కృతిక సంపదతో పాటు ‘ఆక్స్‌ఫర్డ్ ఆఫ్ ది ఈస్ట్’గా పిలిచే అలహాబాద్ విశ్వవిద్యాలయం లాంటి విద్యా సంస్థలకు సైతం ప్రయాగరాజ్ నిలయంగా ఉంది. ఈ ప్రతిష్ఠాత్మక విశ్వవిద్యాలయం అనేక సంవత్సరాలుగా భారతీయ మేధస్సును తీర్చిదిద్దడంలో గణనీయమైన కృషి చేస్తోంది.

వీటన్నింటికీ మించి కుంభమేళాలో ఏర్పాటు చేసే అఖాడా శిబిరాలు ఆధ్యాత్మిక అన్వేషకులు, సాధువులు, సన్యాసులు ఒక్క చోట చేరి తత్వ శాస్త్రంపై చర్చించడానికి, ధ్యానం చేయడానికి, వారి జ్ఞానాన్ని పంచుకునేందుకు అపురూపమైన వేదిక అందిస్తాయి. ఈ శిబిరాలు ప్రార్థనా ప్రదేశాలుగా మాత్రమే కాకుండా ఒకరితో ఒకరు ఆధ్యాత్మిక జ్ఞానం పంచుకునే వేదికలుగా ఉంటాయి. ఇవి మహా కుంభ మేళాకు హాజరయ్యేవారికి గొప్ప అనుభవాన్ని అందిస్తాయి. ఇవన్నీ 2025లో జరిగే మహా కుంభమేళాను విశ్వాసం, సంస్కృతి, చరిత్రల ఉత్సవంగా మార్చి, యాత్రికులందరికీ మరపురాని అనుభవాన్ని అందిస్తాయి.

ముగింపు

మహా కుంభమేళా ఆధ్యాత్మిక కార్యక్రమం మాత్రమే కాదు.. ఇది భారతదేశ సాంస్కృతిక, ఆధ్యాత్మిక వారసత్వ సారాంశాన్ని సంగ్రహించే నమ్మకం, ఆచారాలు, ఆధ్యాత్మిక జ్ఞానంతో ముడిపడి ఉన్న శక్తిమంతమైన వేడుక. మానవత్వం, ఆధ్యాత్మికత మధ్య సంబంధాన్ని, లోతుగా నాటుకుపోయిన జాతి విలువలను ప్రతిబింబిస్తుంది. పవిత్ర నదుల్లో ఆచరించే స్నానం, ఉపవాసం, దానం, హృదయ పూర్వకమైన భక్తి తదితర పురాతన ఆచారాలు ఈ ఉత్సవంలో పాల్గొనే వారికి మోక్ష మార్గాన్ని చూపిస్తాయి. కుంభమేళాలో పాటించే విధానాలు మిలియన్ల మందిని ఈ ప్రాంత సరిహద్దులను దాటి తమ పూర్వీకులతో, ఆధ్యాత్మిక మూలాలతో కలుపుతాయి. జన సమూహాలను ఒకదానితో ఒకటి ముడివేసే ఐక్యత, కరుణ, నమ్మకాలనే కాలాతీతమైన విలువలకు ఇది ప్రత్యక్ష ఉదాహరణ. సాధువుల ఊరేగింపు, ప్రతిధ్వనించే కీర్తనలు, నదీ సంగమం వద్ద పవిత్ర పూజల మధ్య ప్రతీ భక్తుడి ఆత్మను తాకే ఆధ్యాత్మిక అనుభూతిగా ఈ మేళా ముగుస్తుంది.

References

https://kumbh.gov.in/en/ritualofkumbh

Maha Kumbh Mela 2025:

 

***


(Release ID: 2081531) Visitor Counter : 27