చట్ట, న్యాయ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఫాస్ట్ ట్రాక్ కోర్టులు

Posted On: 05 DEC 2024 4:11PM by PIB Hyderabad

ఫాస్ట్ ట్రాక్ కోర్టులు సహా సబార్డినేట్ కోర్టుల ఏర్పాటు, వాటి విధి నిర్వహణ అంశాలు ఆయా హైకోర్టులతో సంప్రదింపుల ద్వారా రాష్ట్ర/ కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాల పరిధిలోకి వస్తాయి. తమ అవసరాన్ని, వనరులను బట్టి రాష్ట్ర ప్రభుత్వాలు ఈ న్యాయ స్థానాలకు నిధులు కేటాయించాల్సి ఉంటుంది. హేయమైన నేరాలు, మహిళలు- పిల్లలు- వృద్ధులు- వికలాంగులు- ప్రాణాంతక వ్యాధుల బారిన పడిన వ్యక్తులు మొదలైన అంశాలకు సంబంధించిన సివిల్ కేసులు, 5 సంవత్సరాల కన్నా ఎక్కువగా అపరిష్కృతంగా ఉన్న ఆస్తి సంబంధిత కేసుల పరిష్కారం కోసం నిర్దిష్ట కేసుల విచారణ సత్వరం జరిగేలా 2015-2020 మధ్య కాలంలో 1800 ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాలని 14వ ఆర్థిక సంఘం సిఫార్సు చేసింది. పన్ను బదలాయింపు ద్వారా అందుబాటులోకి వచ్చిన, పెరిగిన ఆర్థిక వనరులను ఇందుకోసం వినియోగించుకోవాలని ఆర్థిక సంఘం రాష్ట్ర ప్రభుత్వాలను కోరింది. 2015-16 ఆర్థిక సంవత్సరం నుంచి ఫాస్ట్ ట్రాక్ ఏర్పాటుకు నిధులు కేటాయించాలని కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్ర ప్రభుత్వాలు/ కేంద్రపాలిత ప్రాంతాలను కోరింది. ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాలు/ కేంద్రపాలిత ప్రాంతాలు ఈ ఏడాది అక్టోబరు 31 నాటికి 863 ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేశాయి. రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల వారీగా ఏర్పాటు చేయాల్సిన, విధి నిర్వహణ ప్రారంభం కావాల్సిన ఫాస్ట్ ట్రాక్ కోర్టుల సంఖ్య వివరాలను కింది అనుబంధంలో చూడొచ్చు. లక్ష్యాన్ని సాధించడం కోసం ఎక్కువ సంఖ్యలో ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాలని 2015-16 నుంచి రాష్ట్ర/ కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలను కేంద్ర ప్రభుత్వం పదేపదే కోరుతోంది. ముఖ్యమంత్రులు, ప్రధాన న్యాయమూర్తుల సంయుక్త సదస్సులోని ఎజెండా అంశాల్లో కూడా మరిన్ని ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటు ఒకటిగా ఉంది.

నేర న్యాయ (సవరణ) చట్టం-2018 అమలు కోసం, పోక్సో చట్టం కేసులను విచారించడం కోసం ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేయాలన్న సుప్రీంకోర్టు నిర్దేశాలకు అనుగుణంగా 2019 ఆగస్టులో ప్రభుత్వం కేంద్ర ప్రాయోజిత పథకాన్ని రూపొందించింది. అత్యాచారం, పోక్సో చట్టం సంబంధిత కేసుల సత్వర పరిష్కారం కోసం దేశవ్యాప్తంగా ప్రత్యేక పోక్సో కోర్టులు సహా ఫాస్ట్ ట్రాక్ ప్రత్యేక కోర్టుల (ఎఫ్ టీఎస్ సీ) ఏర్పాటు ఈ పథకం లక్ష్యం.

2019 అక్టోబరు 2 నుంచి అమలయ్యేలా.. మొదట ఒక సంవత్సర కాలానికి ఎఫ్ టీఎస్ సీ పథకాన్ని ప్రారంభించారు. అనంతరం 2019-20, 2020-21 రెండు ఆర్థిక సంవత్సరాలకు పొడిగించారు. మొత్తం వ్యయం రూ.767.25 కోట్లు కాగా, కేంద్ర వాటా రూ. 474 కోట్లు. 2021 ఆగస్టు 4న జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ పథకాన్ని మరో రెండు ఆర్థిక సంవత్సరాలకు (2021-22, 2022-23 ఆర్థిక సంవత్సరం) విస్తరిస్తూ, 2023 మార్చి 31 వరకు కొనసాగించడానికి ఆమోదం తెలిపారు. ఇందుకోసం మొత్తం వ్యయం రూ. 1572.86 కోట్లు. అందులో కేంద్ర వాటా రూ. 971.70 కోట్లు. ఈ పథకాన్ని కేంద్ర కేబినెట్ మరో మూడేళ్లు అంటే 2023 ఏప్రిల్ 1 నుంచి 2026 మార్చి 31 వరకూ పొడిగించింది. ఇందుకోసం మొత్తం వ్యయం రూ.1952.23 కోట్లు. ఇందులో కేంద్ర వాటా 1207.24 కోట్లు.

నిర్భయ నిధి నుంచి కేంద్ర వాటా చెల్లించాల్సి ఉంటుంది. ఈ పథకానికి సంబంధించి నిధుల వాటా సరళి 60:40 (కేంద్రం: రాష్ట్రం)గా ఉంది. ఇది ఈశాన్య రాష్ట్రాలు, 3 హిమాలయ రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో 90:10 గా ఉంటుంది. చట్టసభలు లేని కేంద్రపాలిత ప్రాంతాలకు 100% కేంద్ర నిధులను అందిస్తారు. హైకోర్టుల నుంచి అందిన సమాచారం ప్రకారం ఈ ఏడాది అక్టోబరు 31 నాటికి.. 30 రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల్లో 408 ప్రత్యేక పోక్సో కోర్టులు సహా 750 ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఉన్నాయి. అక్టోబరు 31 నాటికి ఈ కోర్టులు 2,87,000కు పైగా కేసులను పరిష్కరించాయి.

న్యాయ శాఖ సహాయ (స్వతంత్ర హోదా) మంత్రి శ్రీ అర్జున్ రామ్ మేఘ్వాల్ రాజ్యసభలో ఇచ్చిన ఓ లిఖితపూర్వక సమాధానంలో ఈ సమాచారాన్ని అందించారు.  

 

***


(Release ID: 2081410) Visitor Counter : 50