ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

డిసెంబరు 6న అష్టలక్ష్మీ మహోత్సవాన్ని ప్రారంభించనున్న ప్రధాన మంత్రి


సాంప్రదాయక కళలు, హస్త కళలు, సంస్కృతులను ఒక్కచోటకు చేర్చి ఈశాన్య భారత సాంస్కృతిక యవనికగా నిలవనున్న మహోత్సవం

సాంప్రదాయక హస్తకళలు, చేనేత వస్త్రాలు, వ్యవసాయోత్పత్తులు, పర్యాటక రంగంలో ఆర్థిక అవకాశాలను ప్రోత్సహించనున్న ఉత్సవం

Posted On: 05 DEC 2024 6:07PM by PIB Hyderabad

ఢిల్లీలోని భారత్ మండపంలో శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అష్టలక్ష్మీ మహోత్సవాన్ని ప్రారంభించనున్నారు. ఈశాన్య భారత సాంస్కృతిక చైతన్యాన్ని చాటడంపై ఆయన నిబద్ధతకు ఇది నిదర్శనం.

మొదటిసారిగా నిర్వహిస్తున్న ఈ సాంస్కృతిక ఉత్సవం డిసెంబరు 6 నుంచి 8 వరకు మూడు రోజుల పాటు జరగనుంది. సాంప్రదాయక కళలు, హస్తకళలు, సంస్కృతులను ఒక్కచోట చేర్చే ఈ ఉత్సవం ఈశాన్య భారత సాంస్కృతిక యవనికగా నిలుస్తుంది.

సాంప్రదాయక హస్తకళలు, చేనేత వస్త్రాలు, వ్యవసాయోత్పత్తులు, పర్యాటక రంగం వంటి అంశాల్లో ఆర్థిక అవకాశాలను ప్రోత్సహించడం కోసం ఈ మహోత్సవంలో వివిధ కార్యక్రమాలుంటాయి. కళాకారుల ప్రదర్శనలు, గ్రామీణ మార్కెట్లు, రాష్ట్రాలకు ప్రత్యేకంగా శిబిరాలు, ఈశాన్య ప్రాంత అభివృద్ధికి కీలకమైన రంగాలపై సాంకేతిక సదస్సులు ఈ ఉత్సవంలో ఉంటాయి. పరిచయాలు, భాగస్వామ్యాలను ఏర్పరచుకుని, బలోపేతం చేసుకోవడానికి విశేషంగా దోహదపడేలా రూపొందించిన పెట్టుబడిదారుల సమావేశం, విక్రేత-కొనుగోలుదారుల సమావేశాలు,  ఆ ప్రాంత ఆర్థిక వృద్ధికి ఊతమిచ్చే సంయుక్త కార్యక్రమాలు కీలకమైనవి.

ఈశాన్య భారత చేనేత, హస్తకళా సంప్రదాయాల ఘనతను జాతీయ వేదికపై చాటేలా సమాలోచనలు, ఫ్యాషన్ షోలు ఈ మహోత్సవంలో ఉంటాయి. ఉత్తేజకరమైన సంగీత ప్రదర్శనలతోపాటు ఈశాన్య భారతంలోని ప్రత్యేకమైన వంటకాలను ప్రదర్శిస్తూ.. ఈశాన్య భారత సుసంపన్నమైన సాంస్కృతిక వారసత్వాన్ని ఈ ఉత్సవం చాటుతుంది. 

 

***


(Release ID: 2081408) Visitor Counter : 53