ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

బీహార్ లోని జముయి లో జన్ జాతీయ గౌరవ్ దివస్ కార్యక్రమం; ఆ కార్యక్రమంలో ప్రధాన మంత్రి ప్రసంగం

Posted On: 15 NOV 2024 3:18PM by PIB Hyderabad

భారత్ మాతా కీ జై.

భారత్ మాతా కీ జై.

భారత్ మాతా కీ జై.

నేను భగవాన్ బిర్సా ముండా అంటాను, మీరు అమర్ రహే, అమర్ రహే అని అనండి.

భగవాన్ బిర్సా ముండా అమర్ రహే, అమర్ రహే.

భగవాన్ బిర్సా ముండా అమర్ రహే, అమర్ రహే.

భగవాన్ బిర్సా ముండా అమర్ రహే, అమర్ రహే.

బీహార్ గవర్నరు గౌరవనీయులు శ్రీ రాజేంద్ర అర్లేకర్ జీ, బీహార్ జనప్రియ ముఖ్యమంత్రి శ్రీ నీతీశ్ కుమార్ జీ, కేంద్ర మంత్రిమండలిలో నా సహచరులు జుయెల్ ఓరామ్ జీ, జీతన్ రాం మాంఝీ జీ, గిరిరాజ్ సింగ్ జీ, చిరాగ్ పాస్ వాన్ జీ తోపాటు దుర్గాదాస్ ఉయికే జీ. బిర్సా ముండా జీ వంశీకులు ఈ రోజున మన మధ్య ఉండడం మన భాగ్యం.  ఈ రోజున వారి ఇంట్లో ధార్మిక కార్యక్రమం ఉంది. కుటుంబంలోని ఇతర సభ్యులు ఆరాధనలో నిమగ్నమయ్యారు. ఇంత జరుగుతున్నప్పటికీ కూడా బుద్ధ్ రాం ముండా జీ వచ్చి మన మధ్యలో నిలిచారు.  సిద్ధూ కాన్హూ జీ వంశీకుడు మండల్ ముర్మూ జీ కూడా మనతో ఉండడం అంతే గౌరవప్రదం.  ప్రస్తుతం భారతీయ జనతా పార్టీలో అత్యంత వరిష్ఠ నేత ఎవరైనా ఉన్నారంటే అది కరియా ముండా జీ;  లోక్ సభలో ఉప సభాపతిగా సేవలను అందించిన ఈ పద్మ విభూషణ్ పురస్కార స్వీకర్త మనకు ఇప్పటికీ ఇంకా మార్గదర్శనాన్ని అందిస్తూ ఉన్నారని చెప్పడం కూడా నాకు సంతోషాన్నిస్తున్న విషయం.  జుయెల్ ఓరామ్ జీ ప్రస్తావించినట్లుగా ఆయన నాకు పితృ సమానులు.  కరియా ముండా గారు ఝార్ఖండ్ నుంచి ప్రత్యేకంగా ఇక్కడికి విచ్చేశారు.  బీహార్ ఉప ముఖ్యమంత్రులు, నా స్నేహితులు విజయ్ కుమార్ సిన్హా జీ, సమ్రాట్ చౌధరీ జీ, బీహార్ ప్రభుత్వంలోని మంత్రులు, పార్లమెంటు సభ్యులు, విధాన సభలో సభ్యులు, ఇతర ప్రజా ప్రతినిధులు, దేశం నలుమూలల నుంచి వచ్చిన విశిష్ట అతిథులు, జముయి లోని నా ప్రియ సోదరులు, నా సోదరీమణులారా,

ఈ రోజు చాలా మంది ముఖ్యమంత్రులు, గవర్నర్లు, రాష్ట్రాల మంత్రులు, కేంద్ర ప్రభుత్వంలోని మంత్రులు, భారత్‌కు చెందిన వివిధ జిల్లాల్లో ముఖ్య కార్యక్రమాల్లో పాలుపంచుకొంటున్నారు.  నేను వారందరికీ స్వాగతం పలుకుతున్నాను.  దృశ్య మాధ్యమం ద్వారా మనతో కలిసిన లక్షల కొద్దీ నా ఆదివాసీ సోదరులకు, ఆదివాసీ సోదరీమణులకు కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నాను.  గీత్ గౌర్ దుర్గా మాతను, బాబా ధనేశ్వర్ నాథ్‌ను ఆరాధించే నేలకు నేను ప్రణామాన్ని ఆచరిస్తున్నాను.  భగవాన్ మహావీరుని జన్మస్థలానికి వందనం చేస్తున్నాను.  ఈ రోజు ఎంతో మంచి రోజు.  ఇది కార్తీక పూర్ణిమ, దేవ్ దీపావళి, గురు నానక్ దేవ్ జీ 555వ జయంతిలు కలసి వచ్చిన రోజు.  ఈ పండుగల సందర్భంగా దేశ పౌరులందరికీ నా అభినందనలు.  మరో కారణం రీత్యా కూడా ఈ రోజు దేశంలో ప్రతి ఒక్కరికి చరిత్రాత్మకమైనటువంటి రోజు.  ఈ రోజు భగవాన్ బిర్సా ముండా జయంతి; దీనిని ‘రాష్ట్రీయ జన్‌జాతీయ గౌరవ్ దివస్’ (జాతీయ గిరిజన గౌరవ దినోత్సవం)గా పాటించుకొంటున్నాం.  ఈ సందర్భంగా నేను నా గిరిజన సోదరులతోపాటు, సోదరీమణులకు, దేశ పౌరులందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను.  ఈ పండుగల కన్నా ముందు గత రెండు మూడు రోజుల్లో జముయిలో ఒక పెద్ద స్వచ్ఛతా కార్యక్రమాన్ని నిర్వహించారని నా దృష్టికి వచ్చింది.  ఈ ప్రచార ఉద్యమానికి పాలనా యంత్రాంగం సారథ్యం వహించింది.  మన విజయ్ గారు ఇక్కడ బసచేశారు.  బీజేపీ కార్యకర్తలు సైతం ఒక సార్థక స్వచ్ఛతా కార్యక్రమాన్ని నిర్వహించారు.  ఈ కార్యక్రమంలో పౌరులు, యువత, మాతృమూర్తులు, సోదరీమణులు చాలా ఉత్సాహంగా పాలుపంచుకొన్నారు.  ఈ ప్రత్యేక ప్రయత్నానికిగాను జముయి వాసులను నేను ఎంతగానో ప్రశంసిస్తున్నాను.

మిత్రులారా,

కిందటి ఏడాదిలో ఇదే రోజు నేను ఉలిహాతులో ఉన్నాను.  ఉలిహాతు ధర్తీ ఆబా బిర్సా ముండా స్వగ్రామం.  ఈ రోజు నేను అమరవీరుడు తిల్కా మాంఝీ పరాక్రమాన్ని ప్రదర్శించిన గడ్డ మీద నిలబడి ఉన్నాను.  ఈ సంవత్సరంలో ఈ కార్యక్రమం మరెంతో ప్రత్యేకతను సంతరించుకొంది.  ఈ రోజు మొదలు దేశ ప్రజలు భగవాన్ బిర్సా ముండా 150వ జయంతిని నిర్వహించుకోనున్నారు.  ఈ కార్యక్రమాలు ఏడాది పొడవునా జరుగనున్నాయి.  వందల కొద్దీ జిల్లాల్లో  దాదాపు ఒక కోటి మంది ప్రజలు టెక్నాలజీ మాధ్యమం ద్వారా ఈ కార్యక్రమంతో జతపడి దీనిని జముయి ప్రజలకొక గర్వకారణంగా నిలిచే సందర్భంగా మార్చివేస్తున్నందుకు నేను సంతోషంగా ఉన్నాను.  వారందరికీ నేను నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.  ఇంతకుముందు భగవాన్ బిర్సా ముండా వంశీకుడు, బుద్ధ్ రామ్ ముండా జీకి స్వాగతం పలికే గౌరవం నాకు దక్కింది.  కొన్ని రోజుల కిందట శ్రీ సిద్ధు కాన్హూ జీ వంశీకుడు శ్రీ మండల్ ముర్మూ జీని సత్కరించే భాగ్యం కూడా నాకు లభించింది.  వారు ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఈ కార్యక్రమం శోభను మరింత పెంచేసింది.

మిత్రులారా,

ధర్తీ ఆబా బిర్సా ముండాను ఈ రోజు ఘనంగా స్మరించుకొంటూ రూ. 6,000 కోట్ల కన్నా విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరిగాయి.  వీటిలో నా గిరిజన సోదరులు, సోదరీమణుల కోసం ఉద్దేశించిన సుమారు ఒకటిన్నర లక్షల పక్కా ఇళ్ళు, గిరిజన బాలల భవిష్యత్తును తీర్చిదిద్దడానికి ఉద్దేశించిన పాఠశాలలు, వసతి గృహాలు, గిరిజన మహిళలకు ఉద్దేశించిన ఆరోగ్య కేంద్రాలు, ఆదివాసీ ప్రాంతాలను కలిపే వందల కి.మీ.ల మేర సాగిపోయే రహదారి ప్రాజెక్టులు, ఆదివాసీ సంస్కృతికి నిలయాలుగా ఉండే వస్తు ప్రదర్శన శాలలు, పరిశోధన కేంద్రాలు భాగంగా ఉన్నాయి.  ఈ రోజున 11,000కన్నా ఎక్కువ గిరిజన కుటుంబాలు దేవ్ దీపావళి సందర్భంగా వారి కొత్త ఇళ్ళలోకి అడుగుపెడుతున్నారు.  దీనికి గాను ఆయా కుటుంబాలన్నింటికీ నేను మనసారా నా అభినందనలను తెలియజేస్తున్నాను.

మిత్రులారా,

గిరిజన గౌరవ దినోత్సవాన్ని మనం నిర్వహించుకుంటూ, గిరిజన గౌరవ సంవత్సరాన్ని ఆరంభించుకుంటున్న సందర్భంగా  కార్యక్రమాన్ని అసలు ఎందుకు జరుపుకోవాలో అర్థం చేసుకోవడం ముఖ్యం.  చరిత్రలో జరిగిన ఒక పెద్ద అన్యాయాన్ని సరిదిద్దేందుకు చిత్తశుద్ధితో చేస్తున్న ప్రయత్నమే ఇది.  స్వాతంత్య్రం వచ్చాక ఆ పోరాటంలో గిరిజన సముదాయం అందించిన తోడ్పాటుకు చరిత్రలో దక్కాల్సిన గుర్తింపు దక్కలేదు.  యువరాజు రాముడిని భగవాన్ రామునిగా మార్చివేసిందే గిరిజన సముదాయం.  భారత్ సంస్కృతిని, స్వాతంత్య్రాన్ని పరిరక్షించడానికి వందల సంవత్సరాల పాటు జరిగిన పోరాటానికి నాయకత్వం వహించిందీ గిరిజన సముదాయమే.  ఏమైనా, స్వాతంత్య్రం వచ్చిన తరువాతి దశాబ్దాల్లో గిరిజనుల ఈ అమూల్యమైన తోడ్పాటుకు సంబంధించిన అధ్యాయాన్ని చరిత్రలో నుంచి చెరిపివేసే యత్నాలు సాగాయి.  భారత్‌కు స్వాతంత్య్రం రావడానికి సంబంధించిన ఖ్యాతిని ఒకే పార్టీకి కట్టబెట్టడానికి స్వార్థపూరిత రాజకీయాలు నడిచాయి.  అయితే, ఒకే ఒక పార్టీ గానీ, లేదా కుటుంబం గానీ స్వాతంత్య్రాన్ని సంపాదించిందన్నప్పుడు, మరి బిర్సా ముండా నాయకత్వంలో ఎందుకు ఉల్ గులాన్ ఉద్యమం జరిగింది? సంథాల్ తిరుగుబాటు మాటేమిటి?  కోల్ క్రాంతిని ఎందుకు నిర్వహించారు?  మహారాణా ప్రతాప్‌నకు సైదోడుగా శూర భిల్లులు సలిపిన పోరాటాన్ని మనం మరచిపో గలమా? సహ్యాద్రి లో దట్టమైన అడవుల్లో ఛత్రపతి శివాజీ మహారాజ్‌కు వెన్నుదన్నుగా నిలచిన గిరిజన సోదరులను, గిరిజన సోదరీమణులను ఎవరు విస్మరించ గలుగుతారు?  అల్లూరి సీతారామ రాజూ జీ నాయకత్వంలో భరత మాతకు సేవ చేయడానికి గిరిజనులు ముందుకు రావడాన్ని గానీ, లేదా తిల్కా మాంఝీ, సిద్ధూ కాన్హూ, బుధూ భగత్, ధీరజ్ సింగ్, తెలంగా ఖడియా, గోవింద్ గురు, తెలంగాణాలో రామ్ జీ గోండ్, మధ్య ప్రదేశ్ లో బాదల్ భోయీ, రాజా శకంర్ షా, కుమార్ రఘునాథ్ షా, టంట్ యా భీల్, నీలాంబర్ - పీతాంబర్, వీర్ నారాయణ్ సింగ్, దివా కిషన్ సొరేన్, జాత్రా భగత్, లక్ష్మణ్ నాయిక్, మిజోరంలోని మహా స్వాతంత్య్ర సేనాని, రోపుయీలియానీ జీ, రాజ్ మోహినీ దేవి, రాణీ గైదిన్‌లియూ, వీర బాలిక కాళీబాయి, ఇంకా గోండ్‌వానాలో రాణి దుర్గావతి.. ఎన్నెన్ని పేర్లని నేను ప్రస్తావించను! చాటిన శౌర్యాన్ని ఎవరైనా లెక్కచేయకుండా ఉండగలరా?  ఈ ప్రకారంగా లెక్కలేనంత మంది గిరిజన వీరులను ఎవరైనా మరచిపోవడం సాధ్యపడుతుందా? మాన్ గఢ్ లో బ్రిటిషువారు ఊచకోతకు తెగబడలేదా; వేల కొద్దీ నా గిరిజన సోదరులు, సోదరీమణులు అమరులయ్యారే! మాన్‌గఢ్ ఉదంతాన్ని మరవ తరమా?

మిత్రులారా,

అది సంస్కృతి కావచ్చు, లేదా సామాజిక న్యాయం కావచ్చు.. ప్రస్తుత ఎన్‌డీఏ ప్రభుత్వ దృక్పథం సాటి లేనిది.    ద్రౌపదీ ముర్మూ గారిని రాష్ట్రపతిని చేసే అవకాశం లభించడం ఒక్క బీజేపీకో, పూర్తి ఎన్‌డీఏకో దక్కిన భాగ్యం కాదు, అది మనందరికీ లభించిన భాగ్యం అని నేను భావిస్తున్నాను.  రాష్ట్రపతి పదవికి అభ్యర్థినిగా ద్రౌపది ముర్ము గారిని నామినేట్ చేయాలని ఎన్‌డీఏ నిర్ణయం తీసుకొన్నప్పుడు ఆమెకు చాలా పెద్ద సంఖ్యాధిక్యం లభించేటట్లుగా చూడాలంటూ మన నీతీష్ భాయ్  దేశప్రజలకు పిలుపునిచ్చిన సంగతి నాకు జ్ఞాపకం ఉంది.  చాలా కార్యక్రమాలను పీఎమ్ జన్‌మన్ యోజనలో భాగంగా ఆరంభించడమైంది.  దీనికి ఘనత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారికి ఇవ్వడమైంది.  ఆమె ఝార్ఖండ్‌కు గవర్నరుగా సేవ చేసినప్పుడు, ఆ తరువాతి కాలంలో రాష్ట్రపతిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నప్పుడూ సమాజంలో ఆదరణకు దూరమైన గిరిజన సముదాయాలను గురించి నాతో తరచు చర్చించారు.  అత్యంత వెనుకబడిన గిరిజన సముదాయాలను ఇదివరకటి ప్రభుత్వాలు పట్టించుకొన్న దాఖలాలు లేవు.  వారి జీవనంలో ఇబ్బందులను తీర్చడానికి రూ.24,000 కోట్ల పెట్టుబడితో పీఎమ్ జన్‌మన్ యోజనను ప్రారంభించడమైంది.  పీఎమ్ జన్‌మన్ యోజన దేశంలో అత్యంత వెనుకబడిన గిరిజన ఆవాసాలను అభివృద్ధిపరచాలని కంకణం కట్టుకొంది.  ఈ రోజుతో ఈ పథకానికి ఒక సంవత్సరం పూర్తయింది.  ఇంత కాలంలో మేం గిరిజన సముదాయాల కోసం వేలాది శాశ్వత గృహాలను అందజేశాం.  ఈ సముదాయాల చెంతకు చేరేటట్లుగా వందలాది కిలోమీటర్ల మేర రహదారులను నిర్మించడంతోపాటు వందల పల్లెల్లో ప్రతి ఇంటికి నీటి సరఫరా సమకూర్చాం.

మిత్రులారా,

ఎవ్వరూ పట్టించుకోనివారిని మోదీ పట్టించుకొని సేవ చేస్తాడు.  మునుపటి ప్రభుత్వాలు అవలంబించిన వైఖరి కారణంగా గిరిజన సముదాయం మౌలిక సదుపాయాలకు నోచుకోకుండా దశాబ్దాల తరబడి ఉండిపోయింది.  గిరిజన జనాభా చెప్పుకోదగ్గ స్థాయిలో ఉన్న జిల్లాలెన్నో అభివృద్ధిలో వెనుకపట్టునే ఉండిపోయాయి.  ఏ అధికారినైనా శిక్షించాలని గానీ, లేదా దండనకు గురి చేయవలసి వచ్చినా గానీ వారికి పోస్టింగు ఇవ్వడానికి ఈ జిల్లాలకేసి చూసేవారు.  పాత ప్రభుత్వాలు అనుసరించిన ఈ రకం మనస్తత్వాన్ని ఎన్‌డీఏ ప్రభుత్వం మార్చివేసింది.  మేం ఈ జిల్లాలను ఆకాంక్షాత్మక జిల్లాలు (యాస్పైరేషనల్ డిస్ట్రిక్ట్ స్)గా ప్రకటించడంతోపాటు, ఉత్సాహవంతులైన అధికారులను అక్కడకు పంపించాం.  ప్రస్తుతం వేరు వేరు అభివృద్ధి కొలమానాలను పట్టి చూస్తే, ఇతర జిల్లాలను ఈ ఆకాంక్షాత్మక జిల్లాలనేకం దాటి ముందుకు ముందుకు పోతుండడం నాకు సంతోషాన్ని కలిగిస్తోంది.  ఈ చర్య ద్వారా నా గిరిజన సోదరులు, సోదరీమణులే ఎంతో మిన్నగా లాభపడ్డారు.

మిత్రులారా,

గిరిజనుల సంక్షేమం ఎన్‌డీఏ ప్రభుత్వ ప్రాధాన్యాల్లో ఒకటిగా ఎప్పటికీ ఉంటూ వచ్చింది.  గిరిజనుల సంక్షేమానికంటూ విడిగా ఒక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసింది అటల్ బిహారీ వాజ్‌పేయీ గారు నేతృత్వం వహించిన ఎన్‌డీఏ ప్రభుత్వం.  పదేళ్ళ కిందట, గిరిజన ప్రాంతాల, కుటుంబాల అభివృద్ధికి కేటాయించే బడ్జెట్ రూ.25,000 కోట్ల లోపే.  దీనిని మా ప్రభుత్వం అయిదింతలు పెంచి, రూ. 1.25 లక్షల కోట్లుగా చేసింది.  కొద్ది రోజుల కిందటే మేం దేశంలోని అరవై వేలకు పైగా గిరిజన గ్రామాల అభివృద్ధికంటూ ఒక ప్రత్యేక ప్రణాళికను ప్రవేశపెట్టాం.  ధర్తీ ఆబా జన్‌జాతీయ  గ్రామ్ ఉత్కర్ష్ అభియాన్‌లో భాగంగా దాదాపు రూ.80,000 కోట్లను గిరిజన గ్రామాల అభివృద్ధికి వినియోగించనున్నారు.  గిరిజన సముదాయానికి అవసరమైన సౌకర్యాలను అందించడం ఒక్కటే కాకుండా, యువతకు శిక్షణను ఇచ్చి, ఉద్యోగ అవకాశాలను కూడా కల్పించడం ఈ అభియాన్ ధ్యేయం.  ఇది వేరు వేరు చోట్ల గిరిజనుల ఆధ్వర్యంలో మార్కెటింగ్ సెంటర్లను ఏర్పాటు చేస్తూ,  వారికి ఆవాసాలను, శిక్షణను సమకూర్చుతుంది.  ఇది గిరిజన ప్రాంతాల్లో పర్యటనకు ఊతాన్నిచ్చి, అడవుల్లో గిరిజన కుటుంబాల సారథ్యంలో ఇకో-టూరిజమ్‌ను ప్రోత్సహిస్తుంది.  వలసలకు అడ్డుకట్ట వేసి, పర్యటన రంగం వృద్ధికి తోడ్పడుతుంది.

మిత్రులారా,

గిరిజనుల సంప్రదాయాలను కాపాడడానికి ఎన్నో నిర్ణయాలను కూడా మా ప్రభుత్వం తీసుకుంది.  గిరిజన సంస్కృతికి, గిరిజనుల కళా రూపాలకు అంకితం అయిపోయిన చాలా మందిని పద్మ పురస్కారాలతో సన్మానించడమైంది.  రాంచిలో ఒక గొప్ప వస్తు ప్రదర్శనశాలను మేం ఏర్పాటుచేసి, దానికి భగవాన్ బిర్సా ముండా పేరు పెట్టాం.  ఈ మ్యూజియాన్ని భగవన్ బిర్సా ముండాకు అంకితం చేశాం.  ఈ మ్యూజియాన్ని చూసి, అక్కడున్న వస్తువులను గురించి తెలుసుకోవాల్సిందిగా బడిపిల్లలందరిని నేను కోరుతున్నాను. మధ్య ప్రదేశ్ లోని ఛిం ద్‌వారాలో  బాదల్ భోయీ మ్యూజియమ్, జబల్‌పూర్‌లో రాజా శంకర్ షా, కుంవర్ రఘునాథ్ షా మ్యూజియమ్.. ఈ రెండిటినీ ఈ రోజు ప్రారంభించడం నాకు సంతోషాన్ని కలిగించింది. ఈ రోజే శ్రీనగర్‌లో, సిక్కింలో రెండు గిరిజన పరిశోధన కేంద్రాలు కూడా ప్రారంభమయ్యాయి.  భగవాన్ బిర్సా ముండా స్మారక నాణేలను, తపాలా బిళ్ళలను విడుదల చేసాం.  గిరిజన సముదాయం పరాక్రమాన్ని, ఆత్మ గౌరవాన్ని దేశ ప్రజలకు ఈ చర్యలన్నీ గుర్తు చేస్తుంటాయి.

మిత్రులారా,

భారతదేశం అనుసరిస్తూ వస్తున్న ప్రాచీన వైద్య విధానాలలో గిరిజన సముదాయం పోషించిన పాత్ర ఎంతో ఉంది.  ఈ వారసత్వాన్ని నిలబెడుతూ, భావి తరాలవారిని దృష్టిలో పెట్టుకొని కొత్త కొత్త కోణాలను కూడా జతచేస్తూ ముందుకు పోతున్నాం.  లేహ్‌లో సోవా రిగ్పా జాతీయ సంస్థను ఏర్పాటు చేసిందీ, అరుణాచల్ ప్రదేశ్ లో నార్త్ ఈస్టర్న్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద & ఫోక్ మెడిసిన్ రిసర్చ్‌ను ఉన్నతీకరించిందీ ఎన్‌డీఏ ప్రభుత్వమే.  భారత్‌లో సాంప్రదాయక మందులు ప్రధానంగా ఉండే డబ్ల్యూహెచ్ఓ గ్లోబల్ సెంటరును కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న, భారత్‌కు చెందిన గిరిజన సముదాయాల వారి కోసం సాంప్రదాయక వైద్య విధానాలను విస్తరింపజేయడంలో సాయపడనుంది.

మిత్రులారా,

గిరిజనులకు విద్య, ఉద్యోగాలు, ఆరోగ్య సంరక్షణ సేవలను అందించడానికి మా ప్రభుత్వం అమిత శ్రద్ధ వహిస్తున్నది.  ప్రస్తుతం వైద్యులుగా, ఇంజినీర్లుగా, సైనికులుగా, విమాన పైలెట్లుగా.. ప్రతి వృత్తిలో గిరిజన పుత్రులు, పుత్రికలు రాణిస్తున్నారు.  గత పదేళ్ళలో గిరిజన ప్రాంతాలలో పాఠశాలలు మొదలు ఉన్నత విద్య దాకా మెరుగైన విద్యా బోధన అవకాశాలను కల్పించినందువల్లనే ఇదంతా సాధ్యమైంది.  స్వాతంత్య్రం వచ్చాక ఆరేడు దశాబ్దాలు గడిచినా దేశంలో ఉన్న కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం ఒక్కటంటే ఒక్కటే.  గత పది సంవత్సరాల్లో ఎన్‌డీఏ ప్రభుత్వం దేశ ప్రజలకు కొత్తగా రెండు కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయాలను ఏర్పాటుచేసింది.  గిరిజనులు పెద్ద సంఖ్యలో ఉన్న జిల్లాల్లో డిగ్రీ కళాశాలలను, ఇంజినీరింగు కళాశాలలను, ఐటీఐలను అనేకంగా ఏర్పాటు చేశాం.  అంతేకాకుండా కొత్తగా 30 మెడికల్ కాలేజీలను గిరిజన జిల్లాలలో స్థాపించడంతోపాటు ఈ తరహాలోనే అనేక కళాశాలలను ఏర్పాటు చేసే పనులు పురోగమిస్తున్నాయి.   ఇక్కడ జముయలోనూ ఒక వైద్య కళాశాల తర్వలో ఏర్పాటు కానుంది.  మేం 700కన్నా ఎక్కువ ఏకలవ్య పాఠశాలలతో దేశమంతటా ఓ పటిష్ట నెట్‌వర్క్‌ను సిద్ధం చేస్తున్నాం.

మిత్రులారా,

వైద్య విద్య, ఇంజినీరింగ్, సాంకేతిక విద్య.. ఈ విభాగాల్లో గిరిజనులు విద్యను అభ్యసించడానికి భాష ఒక పెద్ద అడ్డంకిగా నిలుస్తోంది.  పరీక్షల్లో జవాబులను మాతృభాషలోనే రాసేందుకు మా ప్రభుత్వం అవకాశాన్నిచ్చింది.  ఈ నిర్ణయాలు గిరిజన బాలల్లో కొత్త ఆత్మవిశ్వాసాన్ని రేకెత్తించి, వారు కంటున్న కలలను నెరవేర్చుకొనేందుకు ధైర్యాన్ని ప్రసాదించింది.

మిత్రులారా,

వెనుకటి పదేళ్ళలో, గిరిజన యువత క్రీడలలో సైతం మంచి పేరు సంపాదించింది.  అంతర్జాతీయ ఆటల పోటీలలో భారత్‌కు పతకాలను గెలుచుకోవడంలో గిరిజన క్రీడాకారులది ముఖ్యపాత్ర అని చెప్పాలి.  వారిలో ఉన్న ఈ ప్రతిభను గుర్తిస్తూ, గిరిజన ప్రాంతాలలో క్రీడా సదుపాయాల విస్తరణ ప్రణాళికలు అమలవుతున్నాయి.  గిరిజనుల సంఖ్యాధిక్యత ఉన్న జిల్లాలలో ఖేలో ఇండియా అభియాన్‌లో భాగంగా ఆధునిక క్రీడా భవన సముదాయాలు వెలుస్తున్నాయి.  భారత్‌లో మొదటి జాతీయ క్రీడా విశ్వవిద్యాలయాన్ని కూడా మణిపూర్‌లో స్థాపించాం.

మిత్రులారా,

స్వాతంత్య్రం వచ్చిన తరువాత 70 సంవత్సరాలపాటు వెదురుకు సంబంధించిన చట్టాలు కఠినమైనవిగా ఉండి, గిరిజన సముదాయాన్ని ఇక్కట్ల పాలుజేశాయి.  వెదురును నరికివేసేందుకుకు సంబంధించిన చట్టాలను మా ప్రభుత్వం సరళతరం చేసింది.  మునుపటి ప్రభుత్వంలో 8-10 అటవీ ఉత్పత్తులకు మాత్రమే ఎమ్ఎస్‌పీ వెసులుబాటు ఉంటే,  సుమారు 90 అటవీ ఉత్పత్తులను ఎమ్ఎస్‌పీ పరిధిలోకి తెచ్చింది ఎన్‌డీఏ ప్రభుత్వం.  ప్రస్తుతం దేశమంతటా 4,000కు పైగా వన్ ధన్ కేంద్రాలు పని చేస్తున్నాయి. వీటి ప్రయోజనం 12 లక్షల గిరిజన సోదరులకు, సోదరీమణులకు లభిస్తోంది.  మెరుగైన జీవనోపాధి సాధనం వారికి చేతికందింది.

మిత్రులారా,

లఖ్‌పతీ దీదీ (లక్షాధికారి సోదరీమణులు) ఉద్యమాన్ని మొదలుపెట్టినప్పటి నుంచీ దాదాపు 20 లక్షల మంది గిరిజన సోదరీమణులు లఖ్‌పతీ దీదీలుగా వృద్ధిలోకి వచ్చారు.  దీనికి అర్థం వారు కేవలం ఒకసారే ఒక లక్ష రూపాయలు సంపాదించారు అని కాదు;  వారు ఏటా ఒక లక్ష రూపాయలకు పైగా సంపాదించారు అని.  అనేక గిరిజన కుటుంబాలు దుస్తులు, ఆటబొమ్మలు, అలంకరణ వస్తువుల వంటి సుందర సామగ్రిని తయారు చేస్తున్నాయి.  ఆ తరహా ఉత్పాదనల విక్రయానికిగాను ప్రధాన నగరాలలో హాట్ బజార్‌లను మేం ఏర్పాటుచేస్తూ, వారికి అండగా ఉంటున్నాం.  ఇక్కడ కూడా ఒక పెద్ద హాట్‌ను ఏర్పాటు చేశారు.  దానిని చూసి తీరవలసిందే. నేను అక్కడకు వెళ్ళి ఒక అరగంట సేపు పరిశీలించాను.  భారత్‌లో వేరు వేరు జిల్లాలకు చెందిన మన గిరిజన సోదరులు, సోదరీమణులు తీర్చిదిద్దిన ప్రశంసనీయమైన వస్తువులను చూసి నేను ఆశ్చర్యపోయాను.  మీరంతా ఆ హాట్‌ను చూడాలని, మీకు నచ్చిన వస్తువులను కొనాలని మిమ్మల్ని నేను కోరుతున్నాను.  ఈ ఉత్పాదనల కోసం మేం ఒక ఆన్‌లైన్ మార్కెట్‌ను కూడా సిద్ధం చేస్తున్నాం.  నేను విదేశీ నేతలకు బహుమతులను ఇచ్చినప్పుడల్లా తరచుగా మన గిరిజన సోదరులు, సోదరీమణులు తయారుచేసిన వస్తువులను కూడా వారికి ఇస్తుంటా.  ఇటీవలే ఝార్ఖండ్‌కు చెందిన సోహ్‌రాయీ పెయింటింగ్‌లను, మధ్య ప్రదేశ్‌కు చెందిన గోండ్ పెయింటింగ్‌లను, మహారాష్ట్రకు చెందిన వార్లీ పెయింటింగ్‌లను ప్రముఖ విదేశీ నేతలకు నేను బహుమతిగా ఇచ్చాను.  ఇక, ఈ కళారూపాలు వారి కార్యాలయాలలో గోడలకు అలంకారాలుగా ఉంటాయి.  అంటే మీలోని ప్రతిభకు మీ మీ చిత్రలేఖన కళా పాటవానికి ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు దక్కుతాయన్నమాట.

మిత్రులారా,

విద్య, సంపాదనల ఫలితాలను కుటుంబ సభ్యులు ఆరోగ్యంగా ఉంటేనే అందుకోవచ్చు.  సికిల్ సెల్ అనీమియా గిరిజనులకు పెనుసవాలు విసరుతోంది.  దీనితో పోరాడడానికి మా ప్రభుత్వం ఒక జాతీయ ప్రచారోద్యమాన్ని మొదలుపెట్టింది.  ఇది మొదలై ఇప్పటికి  సంవత్సరం కావస్తోంది.  ఇప్పటి వరకు దాదాపుగా నాలుగున్నర కోట్ల మందికి పరీక్షలను పూర్తి చేశారు.  గిరిజన కుటుంబాలు వేరే వైద్య పరీక్షల కోసం దూర ప్రాంతాలకు వెళ్ళనక్కర లేకుండా చూడడానికి అనేక ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలను ఏర్పాటు చేస్తున్నారు.  అనేక సుదూర ప్రాంతాలకు సంచార వైద్య యూనిట్‌లను పంపిస్తున్నారు.

మిత్రులారా,

వాతావరణ మార్పు, పర్యావరణ పరిరక్షణ.. ఈ విషయాలలో ప్రస్తుతం తగిన చర్యలు తీసుకోవడంలో భారత్ ప్రపంచంలోనే ఒక ప్రధాన దేశంగా ఉంది.  దీనికి కారణం ప్రకృతితో సామరస్యంగా జీవించాలని గిరిజన సముదాయం మనకు నేర్పుతూ రావడమే.  ప్రకృతిని ప్రేమిస్తున్న మన గిరిజన సమాజం బోధనలను ప్రపంచానికి తెలియజేయాలనేదే నా తపన.  గిరిజనులు సూర్యుడిని, వాయువును, వృక్షాలను ఆరాధిస్తున్నారు.  ఈ శుభ దినాన నేను మీకు చెప్పదలచుకున్నది ఏమిటంటే, దేశంలో గిరిజనుల ప్రాబల్యం గల జిల్లాలలో బిర్సా ముండా జన్‌జాతీయ గౌరవ్ ఉపవనాలను (గిరిజన గౌరవ ఉద్యానాలు) ఆయన 150వ జయంతి ఉత్సవాల సందర్భంగా ఏర్పాటుచేయనున్నామనేదే.   ప్రతి ఉపవనంలోనూ 500 మొదలుకొని 1000 వరకు మొక్కలను నాటి, వాటిని నీరు పోసి పెంచి పోషించడమే ఈ ఉపవనాల ఏర్పాటు లక్ష్యం.  ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ అండగా నిలబడి, వారి వంతు ప్రయత్నాన్ని చేస్తారని నేను నమ్ముతున్నాను.

మిత్రులారా,

ప్రముఖ లక్ష్యాలను పెట్టుకోవడానికి మనకు భగవాన్ బిర్సా ముండా జయంతి ప్రేరణను ఇస్తోంది.  మనమంతా కలసికట్టుగా గిరిజన నాగరికత మర్యాదలను ఒక నవ భారత్‌కు పునాదిగా మలచుకొందాం.  గిరిజన సముదాయం పారంపర్యాన్ని మనం పరిరక్షిస్తూ, వందల సంవత్సరాల నుంచీ వారు కాపాడుకొంటూ వస్తున్న సంప్రదాయాల నుంచి మంచి పద్ధతులను స్వీకరించుదాం.  ఈ పనిని చేయడం ద్వారా మనం నిజంగా బలమైన, సమృద్ధమైన, సమర్థమైన భారత్‌ను ఆవిష్కరించుదాం.  గిరిజన గౌరవ దినోత్సవం సందర్భంగా మీకందరికీ నేను మరోసారి నా హృదయపూర్వక శుభాకాంక్షలను తెలియజేస్తున్నాను.  మీరు మళ్ళీ ఒకసారి నాతో కలిసి ఇలా పలకండి..

నేను భగవాన్ బిర్సా ముండా అంటాను, మీరు అమర్ రహే, అమర్ రహే అని అనండి.

భగవాన్ బిర్సా ముండా - అమర్ రహే, అమర్ రహే.

భగవాన్ బిర్సా ముండా - అమర్ రహే, అమర్ రహే.

భగవాన్ బిర్సా ముండా - అమర్ రహే, అమర్ రహే.

 

మీకు అనేకానేక ధన్యవాదాలు.

***


(Release ID: 2078604)